మణికొండ జాగీర్.. పేలుళ్లతో బేజార్
- పరిమితికి మించి బ్లాస్టింగ్స్
- బీటలువారుతున్న ఇళ్లు
- చెల్లాచెదురవుతున్న వన్యప్రాణులు
గచ్చిబౌలి: మణికొండ జాగీరు పేలుళ్లతో దద్దరిల్లుతోంది. భీకర శబ్దాలతో ఆ ప్రాంతవాసులకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. ఓ నిర్మాణ సంస్థ పరిమితికి మించి పేలుళ్లు జరపడంతో సమీపంలో ఇళ్లు బీటలువారుతున్నాయి. వన్య ప్రాణులు చెల్లాచెదురవుతున్నాయి. అనుమతుల మాటున రెండున్నరేళ్లుగా సాగుతున్న మితిమీరిన పేలుళ్లను పోలీసులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి.
రెండున్నరేళ్లుగా బ్లాస్టింగ్
తెలుగు సినీ వర్కర్స్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి మణికొండ జాగీరులోని గుట్టల్లో స్థలం ఇచ్చారు. చిత్రపురి కాలనీగా పిలిచే ఈ వెంచర్‌లో బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపడుతున్నారు. ఐవీఆర్‌సీఎల్ నిర్మాణ సంస్థ నిర్మాణపు పనులు చేస్తోంది. ఇప్పటికే కొన్ని బ్లాకుల నిర్మాణం తుది దశలో ఉంది. రెండున్నరేళ్లుగా గుట్టను దాదాపు 70 శాతం బ్లాస్టింగ్ చేసి చదును చేశారు. ప్రశాంత్ హిల్స్ వైపు గుట్ట కొంత భాగం ఉంది. కొద్ది రోజులు గడిస్తే అదీ కనుమరుగయ్యే అవకాశం ఉంది.
బీటలువారుతున్న ఇళ్లు
రాయదుర్గంలోని ప్రశాంత్‌హిల్స్‌ను ఆనుకొని ఉన్న గుట్టను బ్లాస్టింగ్ చేసి మరో బ్లాక్‌కు పునాదులు వేస్తున్నారు. ఓపెన్ బ్లాస్టింగ్స్‌తో ప్రశాంత్‌హిల్స్ వాసులు ఆందోళనకుగురవుతున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ వెంకటరమణ ఇల్లుతో పాటు మరికొందరి ఇళ్ల గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి.
వన్య ప్రాణులకు ప్రాణ సంకటం
మూడేళ్ల క్రితం మణికొండ జాగీరులో నెమళ్లతో పాటు కుందేళ్లు కనిపించేవి. భవనాల సంఖ్య పె రగడం, నిరంతర పేలుళ్లతో అవన్నీ చెదిరిపోయాయని స్థానికులు చెబుతున్నారు. ఇక, ఈ ప్రాంతంలో ప్రకృతిసిద్ధంగా ఏర్పడిన శిలలు కనుమరుగువుతున్నాయి. గతంలో ప్రభుత్వం రాయదుర్గం, గచ్చిబౌలి, ఖాజాగూడ, మణికొం డ ప్రాంతాలలోని గుట్టలపై రాతి శిలలను కాపాడేందు రాక్ పార్క్ ఏర్పాటు చేస్తామని ప్రకటిం చింది. ఈ ప్రతిపాదనలు రూపుదాల్చడానికి ముందే రాతి శిలలు కనుమరుగవుతున్నాయని ప్రకృతి ప్రేమికులు ఆందోళనవ్యక్తం చేస్తున్నారు.
అనుమతులున్నాయి: సీఐ శ్రీకాంత్
మణికొండ జాగీరులో ఐవీఆర్‌సీఎల్ నిర్మాణ సంస్థ చేపడుతున్న బ్లాస్టింగ్‌లకు అనుమతి ఉందని రాయదుర్గం సీఐ శ్రీకాంత్ తెలిపారు. ఫిర్యాదు అందితే పరిశీలిస్తామని, ఇళ్లకు పగుళ్లు వచ్చినట్లు తమ దృష్టికి రాలేదన్నారు.