క్వారీ.. స్వారీ
♦ రాతి నేలలపై కన్ను కర్ణాటక నుంచి వలస
♦ పుట్టగొడుగుల్లా వెలుస్తున్న మిషన్లు
♦ రాత్రంతా బ్లాస్టింగ్‌లు, రోజంతా క్వారీ
♦ విలవిల్లాడుతున్న వన్యప్రాణులు
♦ కళ్లప్పగించి చూస్తున్న అధికారులు
మనూరు: జిల్లాలోనే అతిపెద్ద మండలమైన మనూరులో ఇబ్బడిముబ్బడిగా కంకర క్వారీలు వెలుస్తున్నాయి. పచ్చని పంటపొలాలు రాతి నేలలుగా మారుతున్నాయి. రాతి పొడి కాలుష్యం వల్ల పంటలు ఎదగడంలేదు. ఫలితంగా రైతులే కాక వన్యప్రాణులు సైతం విలవిల్లాడుతున్నాయి. కర్ణాటకలోని బీదర్ జిల్లాకు సరిహద్దున ఉన్న మనూరు మండలంలోని రాతి నేలలపై ఆ రాష్ట్రానికి చెందిన అక్రమార్కులు కన్ను వేశారు. ఇక్కడి భూములను తక్కవ ధరకే కొనుగోలు చేసి క్వారీలు ఏర్పాటుచేస్తున్నారు. స్థానిక చోటామోటా రాజకీయ నాయకులను ఆశ్రయించి, రెవెన్యూ, మైనింగ్ అధికారులకు అమ్యామ్యాలు ఇచ్చి అనుమతులు పొందుతున్నారన్న ఆరోపణలున్నాయి. అలాగే క్వారీకోసం దరఖాస్తు చేసుకున్నదే తడువుగా క్రషింగ్ ప్రారంభిస్తుండటం గమనార్హం.
ఎదగని పంటలు
కంకర క్వారీల చుట్టూ ఉన్న సాగు భూముల్లో రెండు, మూడేళ్లుగా పంటలు ఎదగడంలేదని ఆయా గ్రామాల రైతులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా క్వారీలు ఏర్పాటు కావడంతో పంటలు ఎదగక జీవనాధారం కోల్పోతున్నామన్నారు. అంతేకాక రాత్రి వేళల్లో భయంభయంగా గడపాల్సి వస్తోందన్నారు. పెద్ద పెద్ద శబ్ధాలతో, పెలుళ్లు సృష్టించడం వల్ల కంటిమీద కునుకులేకుండా పోతుందన్నారు. ఇళ్లకు సైతం బీటలు వారుతున్నాయన్నారు. అలాగే తమ ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని ఆందోళన చెందుతున్నారు. వీటికి తోడు శివారు వెంట ఎక్కడ చూసినా భారీ గోతులు కనిపిస్తున్నాయన్నారు. భారీ గోతుల వల్ల వర్షాకాలంలో ప్రాణనష్టం సైతం జరిగే ప్రమాదం ఉందని వారు చెబుతున్నారు.
వన్యప్రాణులు విలవిల
జిల్లాలో ఎక్కడా లేనివిధంగా మండలంలోని బీడు భూములో వందల సంఖ్యలో కృష్ణజింకలు, లేళ్లు ఉన్నాయి. ఇవి బోరంచ శివారు నుంచి ఔదత్‌పూర్, శిఖార్‌ఖాన వరకు సంచరిస్తుంటాయి. కాగా మోర్గి, గోందేగాం, నాగల్‌గిద్ద, గుడూర్, ఔదత్‌పూర్ శివారులో వందల సంఖ్యలో జికంలు ఉన్నాయి. కంకర మిషన్ల బ్లాస్టింగ్ వల్ల అవి పంటచేలలు, గ్రామాల్లోకి వస్తున్నాయని స్థానికులు తెలిపారు.
క్వారీల అనుమతులు రద్దు చేయాలి
రోజురోజుకు పుట్టుకొస్తున్న క్వారీల అనుమతులను సంబంధిత అధికారులు రద్దుచేయాలని మండలంలోని రైతులు, వన్యప్రాణుల ప్రేమికులు, ఆయా గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. క్వారీల కారణంగా పచ్చని పంటపొలాలు దెబ్బతింటున్నాయన్నారు.
మూసివేతకు సిఫార్స్ చేస్తాం
అక్రమంగా వెలుస్తున్న కంకర మిషన్లపై చర్యలు తీసుకునేందుకు మైనింగ్ అధికారులకు నివేదిస్తాం. రైతుల ఇబ్బందులను, వారి విన్నపాలను జిల్లా అధికారులకు నివేదించి చర్యలు తీసుకుంటాం. -తారాసింగ్, తహశీల్దార్, మనూరు