నగ్నంగా మార్చి వారిపై చిత్రాలు గీసి..
బెర్లిన్: సాధారణంగా కాన్వాస్ పెయింట్స్ చూసేందుకు చాలా అద్భుతంగా ఉంటాయి. అది అందరికీ అబ్బని ఓ చక్కటి కళ. ఈ పెయింటింగ్తో ఎన్నో అద్భుతాలు, వింతలు సృష్టించి ఆకర్షించవచ్చు. సాధరణంగా ఈ పెయింట్స్ను ఏ పేపర్పైనో గోడపైనో వేస్తే పెద్దగా ఆసక్తి అనిపించకపోవచ్చేమోగానీ.. మనుషులనే పెయింటింగ్ చిత్రాలుగా మారిస్తే.. అది కూడా అరే.. నిజంగానే అటవీ జంతువులు దర్శనం ఇస్తున్నాయే అనేంత భ్రమపడేలా ఆ చిత్రాలు ఉంటే.. ! జర్మనీకి చెందిన ఓ పెయింటర్ అచ్చం ఇలాంటి పేయింట్స్ వేశారు.
జిసైన్ మార్ వెడెల్ అనే ఓ చిత్రకారురాలు నగ్నంగా ఉన్న మనుషులను ఆయా జంతువులు, పక్షులు, కీటకాలు, సముద్ర ప్రాణిలా ఆకారంలో మలచడంతోపాటు ఆ మేరకు వారిపై రంగులు వేసి అబ్బురపరిచింది. ఇలా పురుషులు, స్త్రీలపైన దాదాపు పన్నెండు గంటలపాటు ఆమె కష్టపడి పెయింట్స్ వేసి అనంతరం ఆ పెయింట్స్ ను ఓ చక్కటి ఫొటోగ్రాఫర్ తో క్లిక్ మనిపించింది. ఆ ఫొటోలు చూసిన వారంత ఆశ్చర్యపోయారు. ఒక కళను ఇలా కూడా ప్రదర్శించడం సాధ్యమా అని అనుకుంటున్నారు.
తాను ఇలా మనుషులపైనే పెయింటింగ్ వేయాలని ఆలోచించడమే ఆశ్చర్యంకాగా.. అది కూడా అత్యంత అరుదైన అటవీ జంతువుల బొమ్మలే చిత్రించి వాటిపట్ల మనుషులు కాస్తంత ఉదారంగా ఆలోచించేలా చిత్రాలు వేయడం గొప్ప విషయం. కాగా ఈ పెయింటింగ్స్ వేస్తున్నంత సేపు వారు తమకు మసాజ్ చేస్తున్నట్లుగా ఫీలయ్యారంట.