పెద్దదోర్నాల: నల్లమల..అపార వన్యప్రాణి సంపదకు నిలయం. పులుల అభయారణ్యంగా ప్రభుత్వం ప్రకటించిన ఈ అటవీ ప్రాంతంలో 70 వరకు పెద్దపులులు, వందల సంఖ్యలో చిరుతలున్నాయి. పులుల చర్మాలకు, గోళ్లకు దేశీయంగా, అంతర్జాతీయంగా డిమాండ్ ఉండటంతో స్మగ్లర్ల కన్ను వన్యప్రాణులపై పడింది.
ఈ ప్రాంతంలో పులులను వేటాడి వాటి చర్మాలను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు కొందరు స్మగ్లర్లు ప్రయత్నిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో శనివారం అటవీ అధికారులు మండలంలోని ఐనముక్కలలో ఓ ఇంట్లో సోదాలు చేయగా..రెండు పెద్దపులుల చర్మాలు ఒకేచోట లభించడం విస్మయానికి గురిచేసింది. పటిష్టమైన భద్రత, నిఘా వ్యవస్థలతో బాధ్యతలు నిర్వర్తిస్తున్నా యథేచ్ఛగా వేట కొనసాగడం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ ఘటన అత్యంత తీవ్రమైనదిగా భావిస్తున్న అటవీ అధికారులు దీనిపై పూర్తిస్థాయిలో విచారణ సాగిస్తున్నారు.
గతంలోనూ ఘటనలు...
అడవి అంటే ఒకప్పుడు భయం..అడవిలో స్వేచ్ఛగా, రాజసం ఉట్టిపడేలా సంచరించే పులి అంటే వెన్నులోంచి వణుకు పుడుతుంది. అటువంటి పులి పాలిట కొందరు కాల యముళ్లలా మారారు. మూగజీవాలను నిర్దాక్షిణ్యంగా మట్టు పెడుతున్నారు. కుందేళ్లు, దుప్పులు, కణితులు, జింకలు, కొండగొర్రెలు, అడవి పందులు, అడవి కోళ్లు వేటగాళ్లకు ఆహారంగా మారుతుండగా పులులు, చిరుతలు కొందరు స్వార్థపరుల ధనదాహానికి బలవుతున్నాయి. ఇటువంటి సంఘటనలు నల్లమలలో గతంలో అనేకం చోటు చేసుకున్నాయి.
కొన్నేళ్ల కిందట బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ నుంచి కట్ని, బహిలియా జాతివారు పులులను వేటాడేందుకు నల్లమలలో ప్రవేశించారు. తుమ్మలబయ లు సమీపంలో 2002లో బహిలియా జాతికి చెందిన వారు పులిని చంపి గోళ్లు, చర్మాలను తీసుకెళ్లారు.
2009 నవంబర్‌లో దోర్నాల మండలంలోని చెంచుకుంట, కొర్రపోలు గూడెం ప్రాంతంలో చిరుత మృతదేహం లభించింది. దొనకొండ మండలం సాగర్ కాలువలో చిరుత మృతదేహం లభ్యమైంది.
రెండేళ్ల క్రితం బీహార్ రాష్ట్రం పాట్నా నుంచి వచ్చిన స్మగ్లర్ల ముఠా అటవీ ప్రాంతంలోకి ప్రవేశించగా, ముఠాలోని సభ్యుడైన పరమేశ్వరముండా యర్రగొండపాలెం మండలం దద్దనాల అటవీ ప్రాం తంలో అనుమానాస్పదంగా సంచరిస్తుండటంతో అటవీశాఖాధికారులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో పాట్నాలోని సునీల్ కుమార్ అనే స్మగ్లర్ 40 మంది సభ్యులను పులుల కోసం అటవీ ప్రాంతంలో వదలి వెళ్లినట్లు అతను తెలపడంతో అప్పట్లో అటవీ శాఖాధికారులు అప్రమత్తయ్యారు.
నిరంతర నిఘా..కఠిన చట్టాలున్నా...
వన్యప్రాణులు, అటవీ సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం 1973 నుంచి ప్రత్యేక చట్టాన్ని అమలులోకి తెచ్చింది. వన్యప్రాణులను వేటాడితే నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేస్తారు. అభయారణ్యంలో అనుమతి లేకుండా ప్రవేశిస్తే క్రిమినల్ కేసులు పెడతారు.
పులుల అభయారణ్యంలోని వన్య ప్రాణులను వేటాడితే 2006-యాక్టు ప్రకారం శిక్షలు కఠినంగానే ఉంటాయి. దీంతో పాటు అక్రమంగా ఆయుధాలను కలిగి అరణ్యంలోకి ప్రవేశించడం, వన్యప్రాణుల ప్రశాంతతకు విఘాతం కలిగించినా కేసులు నమో దు చేసి శిక్షలు విధిస్తారు. మొదటిసారి అరణ్యంలోకి ప్రవేశించి వన్యప్రాణులను వేటాడితే ఏడేళ్లలోపు జైలు శిక్ష, రూ.50 వేల నుంచి రూ.2 లక్షల దాకా జరిమానా ఉంటుంది. రెండోసారి అదే ముద్దాయి వన్యప్రాణులకు వేటాడితే ఏడేళ్ల జైలుశిక్ష, రూ.5 లక్షల నుంచి రూ.50 లక్షల జరిమానా విధిస్తారు.
2002 జీవవైవిధ్య పరిరక్షణ చట్టం ప్రకారం అరుదైన, సంరక్షక వృక్ష, జంతుజాలం సంచరించే ప్రాంతాల్లోకి అనుమతులు లేకుండా వెళ్లినా, వాటికి హాని కలిగించినా శిక్షలు తప్పవు. నాన్‌బెయిలబుల్ వారెంట్‌తోపాటు రూ.10 లక్షల వరకు జరిమానా ఉంటుంది. ఇంతటి కఠిన చట్టాలు అమలులో ఉన్నా వన్య ప్రాణులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. దీంతో పాటు ఘాట్ రోడ్లలో వాహనాలపై వేగ నియంత్రణ ఉన్నా, కొందరు వాహనదారులు అతివేగంగా, నిర్లక్ష్యంగా వాహనాలను నడిపి వన్యప్రాణుల ప్రశాంతతకు భంగం కలిగించడంతో పాటు రోడ్లపై స్వేచ్ఛగా తిరిగే ప్రాణుల మరణాలకు కారకులవుతున్నారు.
నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తాం: మార్కాపురం డీఎఫ్‌ఓ శరవణన్
మండల పరిధి ఐనముక్కల ఎస్సీ కాలనీలో పులుల చర్మాలు దొరకడంపై పూర్తిస్థాయిలో విచారణ చేసి త్వరలోనే నిందితులను అరెస్టు చేస్తామని మార్కాపురం డీఎఫ్‌ఓ శరవణన్, ఫ్లయింగ్ స్క్వాడ్ ఏసీఎఫ్ ఖాదర్‌వలి తెలిపారు. స్థానిక ఫారెస్టు రేంజి కార్యాలయంలో ఆదివారం వారు విలేకరులతో మాట్లాడారు. ఆత్మకూరు డివిజన్ పరిధిలోని సిద్ధాపురంతో పాటు పలు ప్రాంతాల్లో అటవీశాఖ, పోలీసుల సహకారంతో గాలింపు చర్యలు చేపట్టామని చెప్పారు. పులిచర్మాలతో పట్టుబడిన గంగమాల విజయ్‌బాబు, గంగమాల చిట్టిబాబులను కోర్టుకు హాజరుపరుస్తామన్నారు.
ఈ కేసుకు సంబంధించి అనుమానితులుగా ఉన్న కొందరు వ్యక్తులు ఈ నెల 19వ తేదీ నుంచి శ్రీశైలం రోడ్డులో ఉన్న ఏపీ టూరిజం రిసార్ట్సులో బస చేశారని శనివారం చర్మాలు స్వాధీనం చేసుకునేందుకు తాము దాడులు జరిపిన నేపథ్యంలో వారు అక్కడ నుంచి పరారైనట్లు తెలిపారు. ఈ కోణంలోనూ దర్యాప్తు వేగవంతం చేసి నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు.
అభయమేదీ..?
Published Mon, Aug 25 2014 3:12 AM | Last Updated on Sat, Sep 2 2017 12:23 PM
Advertisement
Advertisement