peddadornala
-
సర్పాలతో మేలే.. ఏపీలో విషపూరిత సర్ప జాతులు నాలుగే
నల్లమల అభయారణ్యం ఎన్నో జీవజాతులకు ఆలవాలం. వందల రకాల పక్షులు, జంతువులతో పాటు పాములు కూడా ఎక్కువగా సంచరిస్తుంటాయి. విషపూరితమైన వాటితో పాటు విష రహిత పాములూ ఎక్కువే. ఈ నేపథ్యంలో సర్పాలపై ప్రత్యేకంగా డాక్యుమెంటరీ తయారు చేసి రైతులకు అవగాహన కల్పించేందుకు అటవీ శాఖ చర్యలు చేపడుతోంది. పెద్దదోర్నాల: సర్పాలంటే ప్రతి ఒక్కరికీ అంతు లేని భయం. విష పూరితమైన సర్పాలంటే గుండెల్లో దడ. పాము కనబడగానే దాన్ని మట్టుబెట్టడమో లేదా దానిని పట్టుకోవటానికి శిక్షణ పొందిన వారిని ప్రేరేపించటమో చేస్తుంటాం. అయితే మనకు ఎదురు పడిన పాములన్నీ మానవాళికి కీడు చేసేవి కావన్న నిజాన్ని గ్రహించాలని జీవశాస్త్ర నిపుణులు పేర్కొంటున్నారు. పాములలో ఎన్నో రకాల జాతులు విషం లేనివే. వాటికి కోరలే ఉండవు. కాటు వేస్తే గాయమవడమే తప్ప ప్రాణాలకు ఎటువంటి ముప్పు ఉండదు. దీంతో పాటు కొన్ని పాముల వల్ల మానవాళికి ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. పాము కాటుకు విరుగుడుగా ఉపయోగపడే యాంటీ వీనమ్‌ను తయారు చేయాలంటే దానికి పాము విషమే కావాలి. పర్యావరణ పరిరక్షణలో ఎన్నో రకాల సర్పాలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. రైతులకు పరోక్షంగా సర్పరాజులు చేసే మేలు అంతా ఇంతా కాదు. వరి, గోధుమ లాంటి పంటలను నాశనం చేయటంలో మూషికాలదే ప్రధాన పాత్ర. అటువంటి మూషికాలను పాములు వేటాడి, వెంటాడి భక్షించటం వల్లనే పంటలకు మేలు జరుగుతుంది. దేశ వ్యాప్తంగా సుమారు 300 రకాలకు పైగా సర్పాలుంటే, వాటిలో కొన్ని రకాల పాములు మాత్రమే ప్రమాదభరితమైనవిగా గుర్తించినట్లు శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. వాటిల్లో కూడా ఎక్కువగా సముద్ర జలాల్లోనే జీవిస్తుంటాయి. చదవండి: (AP: అర్ధరాత్రి వరకు హోటళ్లు, రెస్టారెంట్లకు అనుమతి) విషపూరితమైన పాములతో అప్రమత్తంగా ఉండాలి నల్లమలలో సంచరించే విషపూరితమైన పాముల్లో ప్రధానంగా చెప్పుకునే సర్పజాతులు నాలుగు రకాలు ఉన్నాయి. వాటిలో నాగుపాము, రక్త పింజర, కట్లపాము, చిన్న పింజర పాములు ఉన్నాయి. నాగుపాము పడగ విప్పుకొని మనుషులను భయపెట్టేందుకు ప్రయత్నిస్తుంది. నాగుపాములకు ఎలుకలు మంచి ఆహారం. ఎలుకల కోసమే నాగుపాములు పొలాల్లో ఎక్కువగా సంచరిస్తుంటాయి. దీంతో పాటు ఆకారంలో ఎంతో చిన్నదిగా ఉండేవి చిన్న పింజర పాములు. ఎంత ఆకారంలో చిన్నదైనా దీని విషం మాత్రం చాలా భయంకరమైంది. అది మనుషులపై మెరుపు వేగంతో దాడి చేస్తుంది. ఖాళీ ప్రాంతాలు, బీడు ప్రాంతాల్లో ఎక్కువగా ఇది కనబడుతుంది. గడ్డి లోపల, కాలిన ఆకుల మధ్య ఎక్కువగా ఉంటుంది. కట్లపాము రాత్రి పూట మాత్రమే ఆహారాన్ని వెతికే పనిలో ఉంటుంది. ఈ క్రమంలో నేల మీద పడుకుని ఉన్న వారిని కాటు వేసే ప్రమాదం ఉంది. రాత్రి వేళల్లో తిరిగేటప్పుడు ఎక్కువగా దీని వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. దాని పెద్ద ఆకారం, పెద్ద కోరలు, భయంకరమైన విషం. పాము కాట్ల మరణాలకు ఎక్కువ కారణం రక్తపింజరే. రాలిపోయిన ఆకుల మధ్య ఎక్కువగా దాక్కుని ఉంటుంది. చదవండి: (టీఎస్ఆర్టీసీ చార్జీల పెంపు.. ఏపీఎస్ఆర్టీసీకి రాబడి) విషరహితమైన పాములతో ప్రమాదమే లేదు నల్లమల అభయారణ్యంలో సంచరించే విషరహిత పాముల్లో పసిరిక పాము, జెర్రిపోతు, రెండు తలల పాములు, మట్టిపాములు లాంటివి ఎక్కువగా ఉంటాయి. వాటిలో చెట్లపై ఉండే పసిరిక పాములు ఆకుల రంగులో ఉండి పక్షుల గుడ్లు, చిన్న చిన్న పురుగులను తిని జీవిస్తుంటాయి. జెర్రిపోతు పాములకు భయం ఎక్కువగా ఉంటుంది. మానవాళికి వీటి వల్ల ఎటువంటి ప్రమాదం లేదు. భూమి లోపల ఉండే పాముల్లో రెండు తలల పాములు ఒకటి. దాని వల్ల ఏ ప్రమాదం ఉండదు. అవి వేగంగా పరిగెత్తలేవు. దగ్గరలో ఉన్న బొరియల్లో ఎక్కువగా ఉంటాయి. మరో పాము మట్టిపాము. దీని వల్ల కూడా ఎవరికీ ప్రమాదం ఉండదు. ఇవి ఎక్కువగా ఎలుకలను తిని జీవిస్తుంటాయి. -
అదిగో దయ్యాల మలుపు..!
♦ పెద్ద దోర్నాల మండలంలో భారీగా ప్రమాదాలు ♦ మూడు నెలల్లో అనంత వాయువుల్లో కలిసిన 9 మంది ప్రాణాలు ప్రయాణం ఎక్కడ ప్రారంభమైనా.. సమయం ఏదైనా.. ముహూర్తం ఎలాగున్నా.. పెద్దదోర్నాల మండలంలోకి ప్రవేశించాక ఒళ్లు గగుర్పాటుకు గురవుతుంది.. దయ్యూల మలుపు సమీపిస్తే స్టీరింగ్ అదుపు తప్పుతుంది జస్ట్ మూడు నెలలల్లో 9 మంది పరలోకాలకు వెళ్లారు 8 మంది మృత్యువును అతి దగ్గరగా చూసొచ్చారు పదుల కొద్దీ మూగజీవాలు బలయ్యూరుు.. ఈ మండలంలో ఏం జరుగుతోంది..? -పెద్దదోర్నాల పెద్దదోర్నాల మండలం పేరు వింటేనే వాహనదారులు హడలెత్తిపోతున్నారు. వరుసగా జరుగుతున్న ప్రమాదాల్లో ప్రాణాలు పోతుండటంతో ఆయూ మార్గాల్లో వెళ్లేందుకు జంకుతున్నారు. మండల పరిధిలోని కర్నూల్-గుంటూర్ రోడ్డుతో పాటు శ్రీశైలం ఘాట్ రోడ్లు (దయ్యూల మలుపు) ఘోర ప్రమాదాలకు నిలయంగా మారారుు. కనీసం హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయకపోవడంతో ప్రమాదాల నివారణ అసాధ్యంగా మారింది. అలాగే అధిక వేగం, నిద్రలేమి, అనుభవరాహిత్యంతో పాటు మద్యం మత్తు, ఆందోళన వంటివి ప్రతికూల అంశాలుగా మారారుు. జనవరి నుండి ఇప్పటి వరకు 3 నెలల కాలంలో 9 రోడ్డు ప్రమాదాలు జరగ్గా.. 9 మంది మృత్యువాత పడ్డారు. మరో 8 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. ఇలా.. ♦ కర్నూలు- గుంటూరు రోడ్డులోని గంటవానిపల్లి వద్ద జనవరిలో 21న లారీ ఢీకొన్న సంఘటనలో మహిళ మృతి చెందగా, అదే నెల 29న శ్రీశైలం రోడ్డులోని అయ్యప్ప స్వామిగుడి వద్ద ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో ఒకరు మృతి చెందారు. ♦ ఇదే నెల 31న జమ్మిదోర్నాల వద్ద ఓ వాహనం ఢీ కొని మహిళ మృతి చెందింది. ♦ ఫిబ్రవరి 12న వెలుగొండ ప్రాజెక్టు వద్ద జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మార్చి 2న జమ్మిదోర్నాల వద్ద లారీ, డీసీఎంలు ఢీకొనడంతో డీసీఎం క్లీనర్ మృతి చెందాడు. ♦ ఇదే నెల 5వ తేదీన శ్రీశైలం ఘాట్ రోడ్‌లోని తుమ్మలబైలు వద్ద బైక్‌ను ఆర్టీసీ బస్ ఢీకొన్న ప్రమాదంలో కర్నూల్ జిల్లాకు చెందిన యువకుడు దుర్మరణం పాలయ్యాడు. ♦ ఫిబ్రవరి 11న చిన్నగుడిపాడు వద్ద ఇన్నోవా కారు అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీ కొన్న ప్రమాదంలో కృష్ణా జిల్లా గుడివాడ తహసీల్దార్ తల్లి మృత్యువాత పడగా మరో ముగ్గురు తీవ్రంగా గాయాల పాలయ్యారు. ♦ 17న శ్రీశైలం ఘాట్ రోడ్‌లోని దయ్యాల మలుపులో సిమెంటు లారీ లోయలోకి దూసుకు పోయిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ♦ కర్నూల్ రోడ్డులోని రోళ్లపెంట వద్ద మంగళవారం రాత్రి ఓ కార్గో లారీ బోల్తా పడటంతో 20 ఆవులు మృతి చెందగా, మరో ఆరు ఆవులు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాయి. నివారణ సాధ్యం కాదా? ♦ అత్యంత దారుణంగా జరుగుతున్న సంఘటనలు ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని మిగుల్చుతున్నారుు. ♦ ద్విచక్రవాహణదారులు లెసైన్సులు లేకుండా ప్రయాణిస్తున్నారు. అలాంటి వారిపై ఆర్టీఏ, పోలీస్ శాఖాధికారులు తనిఖీలు నిర్వహించాలి. అనుమతి, ధ్రువీకరణ పత్రాలు లేకుండా వాహనాన్ని నడిపితే కఠిన చర్యలు తీసుకోవాలి. ♦ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలి. ♦ మద్యం సేవించి వాహనాన్ని నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. మితిమీరిన వేగంతో వాహనాన్ని నడిపే వారిని గుర్తించి భారీగా జరిమానాలను విధించాలి. ♦ హెచ్చరిక బోర్డులు.. ఏర్పాటు చేయూలి. డ్రైవింగ్‌పై అవగాహన సదస్సులు కల్పించాలి. -
గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు
పెద్దదోర్నాల : నల్లమల అటవీ ప్రాంతం పరిధిలోని చెంచు గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి చంద్రయ్య తెలిపారు. మండల కేంద్రంలోని 30 పడకల వైద్యశాలను ఆయన శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్యశాలలోని పలు విభాగాలను పరిశీలించి అక్కడ నెలకొన్న సమస్యలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వర్షాకాల పరిస్థితుల నేపథ్యంలో నల్లమల అటవీ ప్రాంతం పరిధిలోని గిరిజన గూడేల్లో డయేరియా, మలేరియాతో పాటు విషజ్వరాలు, అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. వ్యాధులు, పరిసరాల పరిశుభ్రతతో పాటు, వ్యక్తిగత పరిశుభ్రత తదితర అంశాలపై గిరిజనులకు అవగాహన కల్పించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. గిరిజన గూడేల్లో చర్మవ్యాధుల నివారణకు అవసరమైన మందులు అందిస్తామన్నారు. గిరిజన గూడేల్లో ఎటువంటి వ్యాధులు ప్రబలుతున్నాయో గుర్తించి, వ్యాధులు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, డయోరియా, మలేరియా వంటి వ్యాధులకు సంబంధించి జ్వర పీడీతుల వద్ద రక్తపూత నమూనాలు సేకరించాలని స్థానిక వైద్యాధికారులను డీఎంహెచ్ఓ ఆదేశించారు. వైద్యశాలలోనే ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చెంచు గిరిజనులకు సంబంధించి ఆస్పత్రిలో గర్భిణులు వేచి ఉండే గదుల్లో సౌకర్యాలు మెరుగు పర్చాలని వైద్యాధికారులను డీఎంహెచ్ఓ ఆదేశించారు. వైద్యశాలలో వైద్యులు, సిబ్బంది కొరత ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా విలేకరులు ఆయన దృష్టికి తీసుకురాగా త్వరలో కౌన్సెలింగ్ జరగనుందని, కొందరు వైద్యులు, సిబ్బంది ఇక్కడికి బదిలీపై వచ్చే అవకాశం ఉందని డీఎంహెచ్ఓ తెలిపారు. ఆయనతో పాటు త్రిపురాంతకం ఎస్పీహెచ్ఓ శ్రీనివాసరావు, వైద్యులు విక్టర్, డెంటల్ సర్జన్ ఉమానందిని, ఇతర సిబ్బంది ఉన్నారు. -
అభయమేదీ..?
పెద్దదోర్నాల: నల్లమల..అపార వన్యప్రాణి సంపదకు నిలయం. పులుల అభయారణ్యంగా ప్రభుత్వం ప్రకటించిన ఈ అటవీ ప్రాంతంలో 70 వరకు పెద్దపులులు, వందల సంఖ్యలో చిరుతలున్నాయి. పులుల చర్మాలకు, గోళ్లకు దేశీయంగా, అంతర్జాతీయంగా డిమాండ్ ఉండటంతో స్మగ్లర్ల కన్ను వన్యప్రాణులపై పడింది. ఈ ప్రాంతంలో పులులను వేటాడి వాటి చర్మాలను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు కొందరు స్మగ్లర్లు ప్రయత్నిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో శనివారం అటవీ అధికారులు మండలంలోని ఐనముక్కలలో ఓ ఇంట్లో సోదాలు చేయగా..రెండు పెద్దపులుల చర్మాలు ఒకేచోట లభించడం విస్మయానికి గురిచేసింది. పటిష్టమైన భద్రత, నిఘా వ్యవస్థలతో బాధ్యతలు నిర్వర్తిస్తున్నా యథేచ్ఛగా వేట కొనసాగడం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ ఘటన అత్యంత తీవ్రమైనదిగా భావిస్తున్న అటవీ అధికారులు దీనిపై పూర్తిస్థాయిలో విచారణ సాగిస్తున్నారు. గతంలోనూ ఘటనలు... అడవి అంటే ఒకప్పుడు భయం..అడవిలో స్వేచ్ఛగా, రాజసం ఉట్టిపడేలా సంచరించే పులి అంటే వెన్నులోంచి వణుకు పుడుతుంది. అటువంటి పులి పాలిట కొందరు కాల యముళ్లలా మారారు. మూగజీవాలను నిర్దాక్షిణ్యంగా మట్టు పెడుతున్నారు. కుందేళ్లు, దుప్పులు, కణితులు, జింకలు, కొండగొర్రెలు, అడవి పందులు, అడవి కోళ్లు వేటగాళ్లకు ఆహారంగా మారుతుండగా పులులు, చిరుతలు కొందరు స్వార్థపరుల ధనదాహానికి బలవుతున్నాయి. ఇటువంటి సంఘటనలు నల్లమలలో గతంలో అనేకం చోటు చేసుకున్నాయి. కొన్నేళ్ల కిందట బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ నుంచి కట్ని, బహిలియా జాతివారు పులులను వేటాడేందుకు నల్లమలలో ప్రవేశించారు. తుమ్మలబయ లు సమీపంలో 2002లో బహిలియా జాతికి చెందిన వారు పులిని చంపి గోళ్లు, చర్మాలను తీసుకెళ్లారు. 2009 నవంబర్‌లో దోర్నాల మండలంలోని చెంచుకుంట, కొర్రపోలు గూడెం ప్రాంతంలో చిరుత మృతదేహం లభించింది. దొనకొండ మండలం సాగర్ కాలువలో చిరుత మృతదేహం లభ్యమైంది. రెండేళ్ల క్రితం బీహార్ రాష్ట్రం పాట్నా నుంచి వచ్చిన స్మగ్లర్ల ముఠా అటవీ ప్రాంతంలోకి ప్రవేశించగా, ముఠాలోని సభ్యుడైన పరమేశ్వరముండా యర్రగొండపాలెం మండలం దద్దనాల అటవీ ప్రాం తంలో అనుమానాస్పదంగా సంచరిస్తుండటంతో అటవీశాఖాధికారులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో పాట్నాలోని సునీల్ కుమార్ అనే స్మగ్లర్ 40 మంది సభ్యులను పులుల కోసం అటవీ ప్రాంతంలో వదలి వెళ్లినట్లు అతను తెలపడంతో అప్పట్లో అటవీ శాఖాధికారులు అప్రమత్తయ్యారు. నిరంతర నిఘా..కఠిన చట్టాలున్నా... వన్యప్రాణులు, అటవీ సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం 1973 నుంచి ప్రత్యేక చట్టాన్ని అమలులోకి తెచ్చింది. వన్యప్రాణులను వేటాడితే నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేస్తారు. అభయారణ్యంలో అనుమతి లేకుండా ప్రవేశిస్తే క్రిమినల్ కేసులు పెడతారు. పులుల అభయారణ్యంలోని వన్య ప్రాణులను వేటాడితే 2006-యాక్టు ప్రకారం శిక్షలు కఠినంగానే ఉంటాయి. దీంతో పాటు అక్రమంగా ఆయుధాలను కలిగి అరణ్యంలోకి ప్రవేశించడం, వన్యప్రాణుల ప్రశాంతతకు విఘాతం కలిగించినా కేసులు నమో దు చేసి శిక్షలు విధిస్తారు. మొదటిసారి అరణ్యంలోకి ప్రవేశించి వన్యప్రాణులను వేటాడితే ఏడేళ్లలోపు జైలు శిక్ష, రూ.50 వేల నుంచి రూ.2 లక్షల దాకా జరిమానా ఉంటుంది. రెండోసారి అదే ముద్దాయి వన్యప్రాణులకు వేటాడితే ఏడేళ్ల జైలుశిక్ష, రూ.5 లక్షల నుంచి రూ.50 లక్షల జరిమానా విధిస్తారు. 2002 జీవవైవిధ్య పరిరక్షణ చట్టం ప్రకారం అరుదైన, సంరక్షక వృక్ష, జంతుజాలం సంచరించే ప్రాంతాల్లోకి అనుమతులు లేకుండా వెళ్లినా, వాటికి హాని కలిగించినా శిక్షలు తప్పవు. నాన్‌బెయిలబుల్ వారెంట్‌తోపాటు రూ.10 లక్షల వరకు జరిమానా ఉంటుంది. ఇంతటి కఠిన చట్టాలు అమలులో ఉన్నా వన్య ప్రాణులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. దీంతో పాటు ఘాట్ రోడ్లలో వాహనాలపై వేగ నియంత్రణ ఉన్నా, కొందరు వాహనదారులు అతివేగంగా, నిర్లక్ష్యంగా వాహనాలను నడిపి వన్యప్రాణుల ప్రశాంతతకు భంగం కలిగించడంతో పాటు రోడ్లపై స్వేచ్ఛగా తిరిగే ప్రాణుల మరణాలకు కారకులవుతున్నారు. నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తాం: మార్కాపురం డీఎఫ్ఓ శరవణన్ మండల పరిధి ఐనముక్కల ఎస్సీ కాలనీలో పులుల చర్మాలు దొరకడంపై పూర్తిస్థాయిలో విచారణ చేసి త్వరలోనే నిందితులను అరెస్టు చేస్తామని మార్కాపురం డీఎఫ్ఓ శరవణన్, ఫ్లయింగ్ స్క్వాడ్ ఏసీఎఫ్ ఖాదర్‌వలి తెలిపారు. స్థానిక ఫారెస్టు రేంజి కార్యాలయంలో ఆదివారం వారు విలేకరులతో మాట్లాడారు. ఆత్మకూరు డివిజన్ పరిధిలోని సిద్ధాపురంతో పాటు పలు ప్రాంతాల్లో అటవీశాఖ, పోలీసుల సహకారంతో గాలింపు చర్యలు చేపట్టామని చెప్పారు. పులిచర్మాలతో పట్టుబడిన గంగమాల విజయ్‌బాబు, గంగమాల చిట్టిబాబులను కోర్టుకు హాజరుపరుస్తామన్నారు. ఈ కేసుకు సంబంధించి అనుమానితులుగా ఉన్న కొందరు వ్యక్తులు ఈ నెల 19వ తేదీ నుంచి శ్రీశైలం రోడ్డులో ఉన్న ఏపీ టూరిజం రిసార్ట్సులో బస చేశారని శనివారం చర్మాలు స్వాధీనం చేసుకునేందుకు తాము దాడులు జరిపిన నేపథ్యంలో వారు అక్కడ నుంచి పరారైనట్లు తెలిపారు. ఈ కోణంలోనూ దర్యాప్తు వేగవంతం చేసి నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. -
గిరిజనుల విద్యాభివృద్ధికి కృషి
పెద్దదోర్నాల, న్యూస్‌లైన్ : గిరిజనులందరినీ సంపూర్ణ అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు విశేష కృషి చేస్తున్నట్లు గిరిజన సంక్షేమశాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ జీఎస్‌వీవీ ప్రసాద్ తెలిపారు. దానిలో భాగంగానే అధునాతన హంగులతో గిరిజన ఆశ్రమ పాఠశాలలు నిర్మిస్తున్నట్లు చెప్పారు. మండల కేంద్రమైన పెద్దదోర్నాలలో గిరిజన బాలికల వసతి గృహం ఆవరణలో నిర్మిస్తున్న గిరిజనుల ఆశ్రమ పాఠశాల పనులను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నల్లమల అటవీ ప్రాంతంలోని పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న గిరిజన విద్యార్థుల సంక్షేమం కోసం గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు అమలుచేస్తున్నామన్నారు. ప్రధానంగా వారి విద్యాభివృద్ధిపై దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. అందుకోసమే గిరిజన సంక్షేమ వసతి గృహాల స్థానంలో అధునాతన సదుపాయాలతో కూడిన ఆశ్రమ పాఠశాలలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. వాటిలో విద్యార్థుల సౌకర్యార్థం గార్మెంటరీ, డైనింగ్ హాల్, టాయిలెట్లతో పాటు నీటి అవసరాలు తీర్చేందుకు ఓవర్ హెడ్‌ట్యాంకులు నిర్మిస్తున్నట్లు వివరించారు. ఆశ్రమ పాఠశాలల నిర్మాణాలు పూర్తై ప్రాంతాల్లో 15 నుంచి 20 లక్షల రూపాయల నిధులతో ఇప్పటికే ఓవర్‌హెడ్ ట్యాంకులు నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలోనే అత్యంత అధునాతన సదుపాయాలతో పెద్దదోర్నాలలో నిర్మిస్తున్న ఏకలవ్య మోడల్ పాఠశాలను ఏప్రిల్‌లోపు పూర్తిచేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రసాద్ పేర్కొన్నారు. దాంతోపాటు జిల్లాలోని వై.పాలెం, మార్కాపురం తదితర ప్రాంతాల్లో నిర్మిస్తున్న గిరిజన ఆశ్రమ పాఠశాలలను కూడా త్వరలో పూర్తిచేస్తామన్నారు. అనంతరం వాటి నిర్మాణ పనులను కూడా ఆయన పరిశీలించారు. ఆయన వెంట గిరిజన సంక్షేమశాఖ ఈఈ జగజ్యోతి, డీఈ లత, ఏఈ జయరాజ్, తదితరులు ఉన్నారు. -
అభయారణ్యంలో.. భయం భయంగా..
పెద్దదోర్నాల, న్యూస్‌లైన్ : అడవుల్లో చెట్లను విచక్షణ లేకుండా నరికేయడంతో వన్యప్రాణులకు రక్షణ కరువవుతోంది. అడవుల్లో నీరు, ఆహారం దొరక్కపోవడంతో కొన్ని ప్రాంతాల్లో జంతువులు జనవాసాల్లోకి చొరబడుతున్నాయి. ఇలా వచ్చిన జంతువులు మానవ మృగాల ఉచ్చులో చిక్కి బలవుతున్నాయి. రోడ్లను దాటే క్రమంలో అతి వేగంగా వెళ్లే వాహనాల కింద పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నాయి. సృష్టిలో ప్రతి ప్రాణికి జీవించే హక్కు ఉంది. మనుషుల్లా పశుపక్ష్యాదులకూ అది వర్తిస్తుంది. వన్యప్రాణులు, అటవీ చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి బాధ్యతగా అధికారులకు సహకరించాలి. లేదంటే జీవవైవిధ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. అతివేగానికి బలవుతున్న జంతువులు ఘాట్ రోడ్లలో వాహనాలపై వేగ నియంత్రణ ఉన్నా.. కొందరు వాహనదారులు నిర్లక్ష్యంగా వాహనాలను నడిపి వన్యప్రాణుల ప్రశాంతతకు భంగం కలిగిస్తున్నారు. రోడ్లపై అటూఇటూ స్వేచ్ఛగా తిరిగే ప్రాణుల మరణానికి కారకులవుతున్నారు. అభయారణ్యంలో ఇటువంటి సంఘటనలు తరచూ చోటుచేసుకుంటుండటంతో వన్యప్రాణుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఏడాది జనవరి 23వ తేదీన తల్లితో పాటు రోడ్డును దాటుతున్న ఓ చిరుతను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో చిరుత తీవ్రంగా గాయపడింది. చిరుతకు ప్రథమ చికిత్స చేసి హైదరాబాద్‌లోని నెహ్రూ జువాలజికల్ పార్క్‌కు తరలించారు. 2012 ఫిబ్రవరి 16వ తేదీన కర్నూలు రోడ్డులోని పెద్ద మంతనాల సమీపంలో జరిగిన ఓ ప్రమాదంలో జింక మృత్యువాత పడింది. మృతిచెందిన జింక మాంసాన్ని సేకరించిన నల్లగుంట్ల, అయ్యన్నకుంటకు చెందిన కొందరు వ్యక్తులపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 2012 ఫిబ్రవరి 20వ తేదీన శ్రీశైలం ఘాట్ రోడ్డులోని ఫారెస్ట్ చెక్ పోస్ట్ సమీపంలో రోడ్డు దాటుతున్న చారల దుప్పిని వేగంగా వస్తున్న ఓ వాహనం ఢీకొనడంతో దుప్పి రెండు కాళ్లు నలిగిపోయాయి. 2013 నవంబర్ 28వ తేదీన శ్రీశైలం ఘాట్ రోడ్డులోని పెద్దచేమ బీట్ పరిధిలో రోడ్డు దాటుతున్న ఓ జింకను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో కడుపులోని బిడ్డతో సహా జింక మృత్యువాతపడింది. కొన్నేళ్ల క్రితం హర్యానాకు చెందిన ఓ ముఠా అభయారణ్యంలోని ఓ పెద్దపులిని, ఎలుగుబంటిని హతమార్చింది. ఈ కేసుపై విచారణ కొనసాగుతోంది. చెంచు కుంట సమీపంలో చిరుత తమ మేకలను చంపుతోందంటూ కొందరు గొర్రెల కాపరులు చనిపోయిన మేక కళేబరంలో విషం పెట్టడంతో.. దాన్ని తిన్న ఓ చిరుత మృత్యువాతపడింది. సంచలనం సృష్టించిన ఈ సంఘటనపై ఎటువంటి సాక్ష్యాలు లభించకపోవడంతో ఎవరిపైనా కేసులు నమోదు చేయలేదు. విషం తిని మరణించిన చిరుత సంఘటన మరవక ముందే ల క్ష్మీపురం వద్ద సాగర్ కాలువ నీటిలో ఓ చిరుత మృతదేహం కొట్టుకొచ్చింది. ఇవే కాకుండా ఘాట్ రోడ్లలో జరిగిన ప్రమాదాల్లో ఎన్నో జంతువులు ప్రాణాలు కోల్పోయాయి. సాక్ష్యాలను సమర్పించడంలో అధికారుల వైపల్యం.. వణ్యప్రాణులు, అటవీ చట్టాలను ఉల్లంఘించిన వారికి కఠిన శిక్షలు పడాలంటే నిజ నిర్ధారణకు అవసరమయ్యే సాక్ష్యాలను న్యాయస్థానాలకు సమర్పించాల్చిన అవసరం ఉంది. వైల్డ్ లైఫ్ యాక్ట్, అటవీ చట్టాల ఉల్లంఘన, అక్రమార్కులకు విధించే శిక్షలు, సిబ్బంది ప్రాథమిక విధులు, తదిత ర అంశాలపై అటవీ శాఖ సిబ్బందికి పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలి. అటవీ చట్టాలను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తున్న అధికారులు.. నేరపరిశోధనలో మాత్రం వెనుకబడుతున్నారు. దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేయకపోవడం, నేరారోపణకు సంబంధించి సరైన సాక్ష్యాలను కోర్టు ఎదుట ప్రవేశపెట్టకపోవడం వల్ల కొన్ని సందర్భాల్లో కేసులు బలహీనపడుతున్నాయన్నది జగమెరిగిన సత్యం. దీంతో నేర ప్రవృత్తి ఉన్న దుండగులు బరితె గించి విలువైన వనసంపదను తరలించడంతో పాటు, వన్యప్రాణులపై దాడులకు తెగబడుతున్నారు. అటవీ సిబ్బంది విధి నిర్వహణలో తగిన జాగ్రత్తలు తీసుకుని దోషులను గుర్తించి శిక్షలుపడేలా చేయగలిగితే వనాలను, వణ్యప్రాణాలన కాపాడుకోగలం.