పెద్దదోర్నాల : నల్లమల అటవీ ప్రాంతం పరిధిలోని చెంచు గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి చంద్రయ్య తెలిపారు. మండల కేంద్రంలోని 30 పడకల వైద్యశాలను ఆయన శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్యశాలలోని పలు విభాగాలను పరిశీలించి అక్కడ నెలకొన్న సమస్యలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వర్షాకాల పరిస్థితుల నేపథ్యంలో నల్లమల అటవీ ప్రాంతం పరిధిలోని గిరిజన గూడేల్లో డయేరియా, మలేరియాతో పాటు విషజ్వరాలు, అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు.
వ్యాధులు, పరిసరాల పరిశుభ్రతతో పాటు, వ్యక్తిగత పరిశుభ్రత తదితర అంశాలపై గిరిజనులకు అవగాహన కల్పించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. గిరిజన గూడేల్లో చర్మవ్యాధుల నివారణకు అవసరమైన మందులు అందిస్తామన్నారు. గిరిజన గూడేల్లో ఎటువంటి వ్యాధులు ప్రబలుతున్నాయో గుర్తించి, వ్యాధులు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, డయోరియా, మలేరియా వంటి వ్యాధులకు సంబంధించి జ్వర పీడీతుల వద్ద రక్తపూత నమూనాలు సేకరించాలని స్థానిక వైద్యాధికారులను డీఎంహెచ్‌ఓ ఆదేశించారు. వైద్యశాలలోనే ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
చెంచు గిరిజనులకు సంబంధించి ఆస్పత్రిలో గర్భిణులు వేచి ఉండే గదుల్లో సౌకర్యాలు మెరుగు పర్చాలని వైద్యాధికారులను డీఎంహెచ్‌ఓ ఆదేశించారు. వైద్యశాలలో వైద్యులు, సిబ్బంది కొరత ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా విలేకరులు ఆయన దృష్టికి తీసుకురాగా త్వరలో కౌన్సెలింగ్ జరగనుందని, కొందరు వైద్యులు, సిబ్బంది ఇక్కడికి బదిలీపై వచ్చే అవకాశం ఉందని డీఎంహెచ్‌ఓ తెలిపారు. ఆయనతో పాటు త్రిపురాంతకం ఎస్‌పీహెచ్‌ఓ శ్రీనివాసరావు, వైద్యులు విక్టర్, డెంటల్ సర్జన్ ఉమానందిని, ఇతర సిబ్బంది ఉన్నారు.
గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు
Published Sun, Sep 7 2014 1:37 AM | Last Updated on Sat, Sep 2 2017 12:58 PM
Advertisement