పెద్దదోర్నాల, న్యూస్‌లైన్ : అడవుల్లో చెట్లను విచక్షణ లేకుండా నరికేయడంతో వన్యప్రాణులకు రక్షణ కరువవుతోంది. అడవుల్లో నీరు, ఆహారం దొరక్కపోవడంతో కొన్ని ప్రాంతాల్లో జంతువులు జనవాసాల్లోకి చొరబడుతున్నాయి. ఇలా వచ్చిన జంతువులు మానవ మృగాల ఉచ్చులో చిక్కి బలవుతున్నాయి.
రోడ్లను దాటే క్రమంలో అతి వేగంగా వెళ్లే వాహనాల కింద పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నాయి. సృష్టిలో ప్రతి ప్రాణికి జీవించే హక్కు ఉంది. మనుషుల్లా పశుపక్ష్యాదులకూ అది వర్తిస్తుంది. వన్యప్రాణులు, అటవీ చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి బాధ్యతగా అధికారులకు సహకరించాలి. లేదంటే జీవవైవిధ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది.
అతివేగానికి బలవుతున్న జంతువులు
ఘాట్ రోడ్లలో వాహనాలపై వేగ నియంత్రణ ఉన్నా.. కొందరు వాహనదారులు నిర్లక్ష్యంగా వాహనాలను నడిపి వన్యప్రాణుల ప్రశాంతతకు భంగం కలిగిస్తున్నారు. రోడ్లపై అటూఇటూ స్వేచ్ఛగా తిరిగే ప్రాణుల మరణానికి కారకులవుతున్నారు. అభయారణ్యంలో ఇటువంటి సంఘటనలు తరచూ చోటుచేసుకుంటుండటంతో వన్యప్రాణుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది.
ఈ ఏడాది జనవరి 23వ తేదీన తల్లితో పాటు రోడ్డును దాటుతున్న ఓ చిరుతను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో చిరుత తీవ్రంగా గాయపడింది. చిరుతకు ప్రథమ చికిత్స చేసి హైదరాబాద్‌లోని నెహ్రూ జువాలజికల్ పార్క్‌కు తరలించారు.
2012 ఫిబ్రవరి 16వ తేదీన కర్నూలు రోడ్డులోని పెద్ద మంతనాల సమీపంలో జరిగిన ఓ ప్రమాదంలో జింక మృత్యువాత పడింది. మృతిచెందిన జింక మాంసాన్ని సేకరించిన నల్లగుంట్ల, అయ్యన్నకుంటకు చెందిన కొందరు వ్యక్తులపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
2012 ఫిబ్రవరి 20వ తేదీన శ్రీశైలం ఘాట్ రోడ్డులోని ఫారెస్ట్ చెక్ పోస్ట్ సమీపంలో రోడ్డు దాటుతున్న చారల దుప్పిని వేగంగా వస్తున్న ఓ వాహనం ఢీకొనడంతో దుప్పి రెండు కాళ్లు నలిగిపోయాయి.
2013 నవంబర్ 28వ తేదీన శ్రీశైలం ఘాట్ రోడ్డులోని పెద్దచేమ బీట్ పరిధిలో రోడ్డు దాటుతున్న ఓ జింకను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో కడుపులోని బిడ్డతో సహా జింక మృత్యువాతపడింది.
కొన్నేళ్ల క్రితం హర్యానాకు చెందిన ఓ ముఠా అభయారణ్యంలోని ఓ పెద్దపులిని, ఎలుగుబంటిని హతమార్చింది. ఈ కేసుపై విచారణ కొనసాగుతోంది.
చెంచు కుంట సమీపంలో చిరుత తమ మేకలను చంపుతోందంటూ కొందరు గొర్రెల కాపరులు చనిపోయిన మేక కళేబరంలో విషం పెట్టడంతో.. దాన్ని తిన్న ఓ చిరుత మృత్యువాతపడింది. సంచలనం సృష్టించిన ఈ సంఘటనపై ఎటువంటి సాక్ష్యాలు లభించకపోవడంతో ఎవరిపైనా కేసులు నమోదు చేయలేదు.
విషం తిని మరణించిన చిరుత సంఘటన మరవక ముందే ల క్ష్మీపురం వద్ద సాగర్ కాలువ నీటిలో ఓ చిరుత మృతదేహం కొట్టుకొచ్చింది. ఇవే కాకుండా ఘాట్ రోడ్లలో జరిగిన ప్రమాదాల్లో ఎన్నో జంతువులు ప్రాణాలు కోల్పోయాయి.
సాక్ష్యాలను సమర్పించడంలో అధికారుల వైపల్యం..
వణ్యప్రాణులు, అటవీ చట్టాలను ఉల్లంఘించిన వారికి కఠిన శిక్షలు పడాలంటే నిజ నిర్ధారణకు అవసరమయ్యే సాక్ష్యాలను న్యాయస్థానాలకు సమర్పించాల్చిన అవసరం ఉంది. వైల్డ్ లైఫ్ యాక్ట్, అటవీ చట్టాల ఉల్లంఘన, అక్రమార్కులకు విధించే శిక్షలు, సిబ్బంది ప్రాథమిక విధులు, తదిత ర అంశాలపై అటవీ శాఖ సిబ్బందికి పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలి.
అటవీ చట్టాలను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తున్న అధికారులు.. నేరపరిశోధనలో మాత్రం వెనుకబడుతున్నారు. దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేయకపోవడం, నేరారోపణకు సంబంధించి సరైన సాక్ష్యాలను కోర్టు ఎదుట ప్రవేశపెట్టకపోవడం వల్ల కొన్ని సందర్భాల్లో కేసులు బలహీనపడుతున్నాయన్నది జగమెరిగిన సత్యం. దీంతో నేర ప్రవృత్తి ఉన్న దుండగులు బరితె గించి విలువైన వనసంపదను తరలించడంతో పాటు, వన్యప్రాణులపై దాడులకు తెగబడుతున్నారు. అటవీ సిబ్బంది విధి నిర్వహణలో తగిన జాగ్రత్తలు తీసుకుని దోషులను గుర్తించి శిక్షలుపడేలా చేయగలిగితే వనాలను, వణ్యప్రాణాలన కాపాడుకోగలం.
అభయారణ్యంలో.. భయం భయంగా..
Published Wed, Feb 12 2014 5:35 AM | Last Updated on Sat, Sep 2 2017 3:38 AM
Advertisement