Hunter attacks
-
వేటగాడి విషపు ఎరకు 30 నెమళ్లు బలి
కొత్తగూడ: వేటగాడు వేసిన విషపు ఎరకు 30 నెమళ్లు మృతి చెందాయి. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం చెరువుముందు తండా అటవీ ప్రాంతం నుంచి నెమళ్లు నెల రోజులుగా గ్రామ శివారులోని పొలాల్లో ఉన్న ధాన్యం గింజలను ఆహారంగా తీసుకుంటున్నాయి. వేలుబెల్లి గ్రామానికి చెందిన ఓ వేటగాడు నెమళ్లను చంపేందుకు విషపు ఎరలు తయారు చేసుకుని లక్ష్మీనర్సుకుంట సమీప అటవీ ప్రాంతంలో వెదజల్లాడు. ఇవి తిన్న నెమళ్లు మృతి చెందాయి. వాటి కాళ్లు, ఈకలు, తల తీసేసి మాంసం కిలో రూ.200లకు విక్రయిస్తున్నట్లు తెలిసింది. ఎఫ్ఆర్వో లక్ష్మీనారాయణను వివరణ కోరగా.. ఈ విషయం ఇప్పుడే తెలిసిందని, విచారణ కోసం సిబ్బందిని పంపించామని చెప్పారు. -
వేటగాళ్ల ఉచ్చుకు బలైన పులి
మంచిర్యాలఅర్బన్(చెన్నూర్): జాతీయ జంతువు, అత్యంత అరుదైన జాతికి చెందిన రాయల్ బెంగాల్ టైగర్ వేటగాళ్ల ఉచ్చుకు బలైంది. వన్యప్రాణుల వేట కోసం అమర్చిన ఉచ్చుకు తగిలి నేలకొరిగింది. మందమర్రిలో స్వాధీనం చేసుకున్న పులి చర్మానికి సంబంధించిన చిక్కుముడి వీడింది. చెన్నూర్ అటవీ డివిజన్ శివ్వారం గ్రామ శివారు అటవీ ప్రాంతంలో కుళ్లిపోయిన పులి అవశేషాల(కళేబరం)ను శుక్రవారం కనుగొన్నారు. గత మూడు రోజులుగా మహారాష్ట్రలోని చంద్రపూర్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ, అటవీశాఖ సంయుక్తంగా దాడి నిర్వహించి మందమర్రి రామన్‌కాలనీలో గురువారం పులిచర్మాన్ని స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. పులి చర్మం విక్రయించే ముఠాకు చెందిన పెద్దపల్లి జిల్లా రామరావుపేట్కు చెందిన నర్సయ్యతోపాటు ముగ్గురిని, చర్మం, ఓ వాహనాన్ని స్వాధీనం చేసుకుని మంచిర్యాల అటవీశాఖ కార్యాలయానికి తరలించి విచారణ చేపట్టారు. శుక్రవారం పోలీసు టాస్క్‌పోర్సు, అటవీశాఖ అధికారులు శివ్వారం గ్రామానికి చెందిన సాయిలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించడంతో పులి మృతి విషయం వెలుగుచూసింది. పులి చనిపోయిన సంఘటన స్థలానికి వెళ్లి చూడగా కళేబరం పూర్తిగా కుళ్లిపోయి కనిపించింది. పక్షం రోజుల క్రితం అటవీ జంతువుల కోసం విద్యుత్ తీగలు అమర్చగా మరో వన్యప్రాణిని తరుముకుంటూ వచ్చి పులి విద్యుత్ షాక్‌తో మృతిచెందినట్లు నిందితుడు చెబుతున్నాడని అటవీ అధికారులు తెలిపారు. దుండగులు విలువైన పెద్దపులి చర్మాన్ని, గోళ్లను తీసుకుని అటవీ ప్రాంతంలో కళేబరాన్ని వదిలి వెళ్లారు. ఇదే కేసులో శివ్వారం గ్రామానికి చెందిన మల్లయ్య, బుచ్చిరాజయ్యలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. గోదావరిఖనికి చెందిన టాక్సీ డ్రైవర్‌తోపాటు మొత్తం ఎనిమిది మంది పాత్ర ఉన్నట్లు అటవీ అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ప్రస్తుతం అటవీశాఖ అదుపులో నలుగురు వ్యక్తులు ఉన్నట్లు తెలుస్తోంది. సంఘటన స్థలాన్ని పరిశీలించిన సీపీ పులి చనిపోయిన సంఘటన స్థలాన్ని రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ, డీసీపీ వేణుగోపాల్, అడిషనల్ డీసీపీ రవికుమార్, మంచిర్యాల జిల్లా అటవీశాఖ అధికారి రామలింగం, మంచిర్యాల ఎఫ్‌డీవో వెంకటేశ్వరావు శుక్రవారం రాత్రి పరిశీలించారు. పదిహేను రోజుల క్రితం పులి చనిపోయిందని భావిస్తున్నట్లు మంచిర్యాల ఎఫ్‌డీవో వెంకటేశ్వరావు తెలిపారు. నాలుగేళ్ల వయస్సు కలిగి ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. పశువైద్యులతో పులి కొంత భాగాన్ని కత్తిరించి పులికి సంబం«ధించిన పూర్తి వివరాల సేకరణకు ఫోరెనిక్స్ ల్యాబ్, సీసీఎంబీలకు పంపిస్తామని తెలిపారు. ఇంకా కేసుపై విచారణ సాగుతోందని, రెండు మూడు రోజుల్లో అన్ని వివరాలు తెలుస్తాయని తెలిపారు. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీస్, అటవీశాఖ సంయుక్తంగా పెద్దపులి మరణంపై విచారణ చేపడుతున్నట్లు సీపీ సత్యనారాయణ తెలిపారు. పెద్దపులి ఎక్కడి నుంచి వచ్చింది, ఈ అటవీ ప్రాంతంలో ఉందా లేదా అన్న అంశాలపై విచారణ చేపట్టి కీలకమైన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. నాలుగేళ్ల వయస్సు గల పెద్దపులి 12నుంచి 13 ఫీట్ల పొడవు ఉందని, దీనికి మార్కెట్లో విలువ ఉంటుందని భావించిన దుండగులు చర్మం, గోళ్లు తీసుకున్నారని తెలిపారు. విద్యుత్ ఉచ్చులతో చనిపోతే హత్య కేసులుగా నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కేసులో తొమ్మిది మంది దుండగులను గుర్తించగా నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన వివరించారు. -
పులి సంరక్షణకు చర్యలు ముమ్మరం
చెన్నూర్ ఆదిలాబాద్ : జాతీయ జంతువు పులి సంరక్షణకు చర్యలు ముమ్మరం చేశామని, పులి ఆరోగ్య పరిస్థితిని గమనించేందుకు ఢిల్లీ నుంచి ప్రత్యేక నిపుణులు వచ్చినట్లు మంచిర్యాల జిల్లా అటవీ శాఖ అ ధికారి రామలింగం తెలిపారు. స్థానిక ఫారెస్ట్ కా ర్యాలయంలో గురువారం ఢిల్లీ నుంచి వచ్చిన టైగ ర్ ట్రాకర్ నిపుణులు వాషీక్ జంషాద్తో కలసి వి లేకరుల సమావేశంలో మాట్లాడారు. చెన్నూర్ ప్రాంతంలోని పులి ఆరోగ్య పరిస్థితిపై ‘సాక్షి’లో వ చ్చిన కరుస కథనాలు కేంద్ర ప్రభుత్వం దృష్టికి వె ళ్లాయని, కేంద్రమంత్రి మేనకాగాంధీ ఢిల్లీ నుంచి టైగర్ ట్రాకర్‌ను చెన్నూర్ డివిజన్‌కు పంపించా రని చెప్పారు. టైగర్ ట్రాకర్‌తో కలిసి చెన్నూర్ మండలంలోని బుద్దారం అటవీ ప్రాంతంలో పర్యటించినట్లు తెలిపారు. 2016 జనవరిలో కాగజ్‌నగ ర్ ప్రాంతంలో ఫాల్గుణ ఆడపులికి నాలుగు పిల్లలు జన్మించాయని, నవంబర్‌లో అక్కడి నుంచి కే–4 అనే ఆడపులి చెన్నూర్ డివిజన్ ప్రాంతానికి వచ్చిందని అన్నారు. ఆ సమయంలో నడుము ప్రాంతంలో ఇనుప ఉచ్చు బిగిసి ఉన్నట్లు సీసీ కెమెరాలో కనిపించిందని తెలిపారు. పులి సంరక్షణ కోసం బేస్‌క్యాంప్, ఇతర సిబ్బందిని ఏర్పాటు చేశామని అన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పులికి గాయం తగ్గుముఖం పట్టినట్లు సీసీ కెమెరాలో కనిపించిందని, ఫిబ్రవరి నుంచి నేటి వరకు ఎక్కడా సీసీ కెమెరాకు చిక్కలేదని వివరించారు. పులి ఆరోగ్య కోసం ప్రత్యే కమిటీ.. పులి ఆరోగ్య పరిరక్షణ కోసం జిల్లాలో కమిటీ ఏ ర్పాటు చేశామని, ఈ కమిటీ ప్రతి నెల పర్యవేక్షణ నిర్వహిస్తుందని రామలింగం తెలిపారు. పులి అ నారోగ్యంగా ఉంటే ఆహారం తీసుకోదని పశువైద్యులు చెబుతున్నారని, గత నాలుగు నెలల నుం చి సుమారు 27కు పైగా పశువులను హతమార్చిం దని అన్నారు. పులి గాయాన్ని పరిశీలించేందుకు ప్రయత్నం చేస్తే పులి ప్రవర్తనలో మార్పులు వస్తాయని వైద్యులు సూచనల మేరకు పులిని ట్రాప్ చేసేందుకు ప్రయత్నించలేదని పేర్కొన్నారు. ఉచ్చు ఉందా అనే విషయంపై... ఢిల్లీ నుంచి వచ్చిన టైగర్ ట్రాకర్ వాషీక్ జంషాద్ మూడు రోజులపాటు చెన్నూర్ డివిజన్లోని అటవీ ప్రాంతంలో పర్యటిస్తారని రామలింగం తెలిపారు. ముఖ్యంగా పులికి గాయం తగ్గిందా, ఉచ్చు ఉందా అనే విషయాలను పరిశీలిస్తారని పేర్కొన్నారు. పులికి బిగుసుకున్న ఉచ్చు ఉండిపోయి, గాయం తగ్గినట్లయితే పులిని ట్రాప్ చేయాల్సిన పని లేదన్నారు. గాయం తగ్గిన పులికి ఉచ్చు ఉంటే టైగర్ మానిటరింగ్ కమిటీ ప్రత్యేక నిపుణుల సలహాలతో పులిని పట్టుకొని వైద్యసేవలు అందిస్తామని అన్నారు. వేటగాళ్లపై ఉక్కుపాదం... రెండేళ్ల క్రితం నెస్ట్ అనే పులి వేటగాళ్లు అమర్చిన విద్యుత్ వైర్లు తగిలి మృతిచెందిందని రామలింగం తెలిపారు. వన్యప్రాణుల వేటగాళ్లపై ఉక్కుపాదం మోపుతామని, ఇప్పటికే వేటగాళ్లను గుర్తించి హెచ్చరికలు జారీ చేశామని చెప్పారు. చెన్నూర్ ఫారెస్ట్ డివిజన్ పరిధిలోని చెన్నూర్, కోటపల్లి, నీల్వాయి రేంజ్‌ల పరిధిలోని వన్యప్రాణుల వేటగాళ్లపై ప్రతేక నిఘా ఏర్పాటు చేశామని, పిచ్చుకను చంపినా అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఎఫ్‌డీవో రాజారావు, చెన్నూర్, కోటపల్లి, నీల్వాయి రేంజ్ అధికారులు అనిత, రవి, అరవింద్, ఫారెస్ట్ సిబ్బంది పాల్గొన్నారు. -
వేటగాళ్ల బారిన పడి పది నెమళ్లు మృతి
చేగుంట: వేటగాళ్ల బారిన పడి పది నెమళ్లు మృతి చెందాయి. ఈ సంఘటన మండల పరిధిలోని పోతాన్‌పల్లి మదిరా పోతాన్‌శెట్టిపల్లి గ్రామశివారులో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామ శివారులో ఓ చనిపోయిన నెమలిని గ్రామస్తులు గుర్తించారు. దీంతో వారు రెవెన్యూ, అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అటవీ అధికారులు గ్రామానికి చేరుకున్న చనిపోయిన నెమలిని పరిశీలించారు. అనుమానంతో పరిసరాల్లో వెతికి చూడగా మరో చోట్ల నెమలి ఈకలను వేరు చేసి గడ్డి కప్పేశారు. వాటిని పరిశీలించిన ఫారెస్టు అధికారులు సుమారు పది నెమళ్లు మృతి చెందినట్లు నిర్ధారించారు. గ్రామ శివారులో లభించిన ఆధారాల ప్రకారం ఇది వేటగాళ్లు చేసిన పనే అని అనుమానం వ్యక్తం చేశారు. చనిపోయిన నెమలికి చేగుంట పశువైద్యశాలలో పోస్టుమార్టం నిర్వహించారు. నెమళ్లను వేటాడిన విషయమై స్థానిక తహశీల్దార్ నిర్మలతో పాటు రెవెన్యూ అధికారులు పంచనామా నిర్వహించారు. -
అభయమేదీ..?
పెద్దదోర్నాల: నల్లమల..అపార వన్యప్రాణి సంపదకు నిలయం. పులుల అభయారణ్యంగా ప్రభుత్వం ప్రకటించిన ఈ అటవీ ప్రాంతంలో 70 వరకు పెద్దపులులు, వందల సంఖ్యలో చిరుతలున్నాయి. పులుల చర్మాలకు, గోళ్లకు దేశీయంగా, అంతర్జాతీయంగా డిమాండ్ ఉండటంతో స్మగ్లర్ల కన్ను వన్యప్రాణులపై పడింది. ఈ ప్రాంతంలో పులులను వేటాడి వాటి చర్మాలను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు కొందరు స్మగ్లర్లు ప్రయత్నిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో శనివారం అటవీ అధికారులు మండలంలోని ఐనముక్కలలో ఓ ఇంట్లో సోదాలు చేయగా..రెండు పెద్దపులుల చర్మాలు ఒకేచోట లభించడం విస్మయానికి గురిచేసింది. పటిష్టమైన భద్రత, నిఘా వ్యవస్థలతో బాధ్యతలు నిర్వర్తిస్తున్నా యథేచ్ఛగా వేట కొనసాగడం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ ఘటన అత్యంత తీవ్రమైనదిగా భావిస్తున్న అటవీ అధికారులు దీనిపై పూర్తిస్థాయిలో విచారణ సాగిస్తున్నారు. గతంలోనూ ఘటనలు... అడవి అంటే ఒకప్పుడు భయం..అడవిలో స్వేచ్ఛగా, రాజసం ఉట్టిపడేలా సంచరించే పులి అంటే వెన్నులోంచి వణుకు పుడుతుంది. అటువంటి పులి పాలిట కొందరు కాల యముళ్లలా మారారు. మూగజీవాలను నిర్దాక్షిణ్యంగా మట్టు పెడుతున్నారు. కుందేళ్లు, దుప్పులు, కణితులు, జింకలు, కొండగొర్రెలు, అడవి పందులు, అడవి కోళ్లు వేటగాళ్లకు ఆహారంగా మారుతుండగా పులులు, చిరుతలు కొందరు స్వార్థపరుల ధనదాహానికి బలవుతున్నాయి. ఇటువంటి సంఘటనలు నల్లమలలో గతంలో అనేకం చోటు చేసుకున్నాయి. కొన్నేళ్ల కిందట బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ నుంచి కట్ని, బహిలియా జాతివారు పులులను వేటాడేందుకు నల్లమలలో ప్రవేశించారు. తుమ్మలబయ లు సమీపంలో 2002లో బహిలియా జాతికి చెందిన వారు పులిని చంపి గోళ్లు, చర్మాలను తీసుకెళ్లారు. 2009 నవంబర్‌లో దోర్నాల మండలంలోని చెంచుకుంట, కొర్రపోలు గూడెం ప్రాంతంలో చిరుత మృతదేహం లభించింది. దొనకొండ మండలం సాగర్ కాలువలో చిరుత మృతదేహం లభ్యమైంది. రెండేళ్ల క్రితం బీహార్ రాష్ట్రం పాట్నా నుంచి వచ్చిన స్మగ్లర్ల ముఠా అటవీ ప్రాంతంలోకి ప్రవేశించగా, ముఠాలోని సభ్యుడైన పరమేశ్వరముండా యర్రగొండపాలెం మండలం దద్దనాల అటవీ ప్రాం తంలో అనుమానాస్పదంగా సంచరిస్తుండటంతో అటవీశాఖాధికారులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో పాట్నాలోని సునీల్ కుమార్ అనే స్మగ్లర్ 40 మంది సభ్యులను పులుల కోసం అటవీ ప్రాంతంలో వదలి వెళ్లినట్లు అతను తెలపడంతో అప్పట్లో అటవీ శాఖాధికారులు అప్రమత్తయ్యారు. నిరంతర నిఘా..కఠిన చట్టాలున్నా... వన్యప్రాణులు, అటవీ సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం 1973 నుంచి ప్రత్యేక చట్టాన్ని అమలులోకి తెచ్చింది. వన్యప్రాణులను వేటాడితే నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేస్తారు. అభయారణ్యంలో అనుమతి లేకుండా ప్రవేశిస్తే క్రిమినల్ కేసులు పెడతారు. పులుల అభయారణ్యంలోని వన్య ప్రాణులను వేటాడితే 2006-యాక్టు ప్రకారం శిక్షలు కఠినంగానే ఉంటాయి. దీంతో పాటు అక్రమంగా ఆయుధాలను కలిగి అరణ్యంలోకి ప్రవేశించడం, వన్యప్రాణుల ప్రశాంతతకు విఘాతం కలిగించినా కేసులు నమో దు చేసి శిక్షలు విధిస్తారు. మొదటిసారి అరణ్యంలోకి ప్రవేశించి వన్యప్రాణులను వేటాడితే ఏడేళ్లలోపు జైలు శిక్ష, రూ.50 వేల నుంచి రూ.2 లక్షల దాకా జరిమానా ఉంటుంది. రెండోసారి అదే ముద్దాయి వన్యప్రాణులకు వేటాడితే ఏడేళ్ల జైలుశిక్ష, రూ.5 లక్షల నుంచి రూ.50 లక్షల జరిమానా విధిస్తారు. 2002 జీవవైవిధ్య పరిరక్షణ చట్టం ప్రకారం అరుదైన, సంరక్షక వృక్ష, జంతుజాలం సంచరించే ప్రాంతాల్లోకి అనుమతులు లేకుండా వెళ్లినా, వాటికి హాని కలిగించినా శిక్షలు తప్పవు. నాన్‌బెయిలబుల్ వారెంట్‌తోపాటు రూ.10 లక్షల వరకు జరిమానా ఉంటుంది. ఇంతటి కఠిన చట్టాలు అమలులో ఉన్నా వన్య ప్రాణులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. దీంతో పాటు ఘాట్ రోడ్లలో వాహనాలపై వేగ నియంత్రణ ఉన్నా, కొందరు వాహనదారులు అతివేగంగా, నిర్లక్ష్యంగా వాహనాలను నడిపి వన్యప్రాణుల ప్రశాంతతకు భంగం కలిగించడంతో పాటు రోడ్లపై స్వేచ్ఛగా తిరిగే ప్రాణుల మరణాలకు కారకులవుతున్నారు. నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తాం: మార్కాపురం డీఎఫ్ఓ శరవణన్ మండల పరిధి ఐనముక్కల ఎస్సీ కాలనీలో పులుల చర్మాలు దొరకడంపై పూర్తిస్థాయిలో విచారణ చేసి త్వరలోనే నిందితులను అరెస్టు చేస్తామని మార్కాపురం డీఎఫ్ఓ శరవణన్, ఫ్లయింగ్ స్క్వాడ్ ఏసీఎఫ్ ఖాదర్‌వలి తెలిపారు. స్థానిక ఫారెస్టు రేంజి కార్యాలయంలో ఆదివారం వారు విలేకరులతో మాట్లాడారు. ఆత్మకూరు డివిజన్ పరిధిలోని సిద్ధాపురంతో పాటు పలు ప్రాంతాల్లో అటవీశాఖ, పోలీసుల సహకారంతో గాలింపు చర్యలు చేపట్టామని చెప్పారు. పులిచర్మాలతో పట్టుబడిన గంగమాల విజయ్‌బాబు, గంగమాల చిట్టిబాబులను కోర్టుకు హాజరుపరుస్తామన్నారు. ఈ కేసుకు సంబంధించి అనుమానితులుగా ఉన్న కొందరు వ్యక్తులు ఈ నెల 19వ తేదీ నుంచి శ్రీశైలం రోడ్డులో ఉన్న ఏపీ టూరిజం రిసార్ట్సులో బస చేశారని శనివారం చర్మాలు స్వాధీనం చేసుకునేందుకు తాము దాడులు జరిపిన నేపథ్యంలో వారు అక్కడ నుంచి పరారైనట్లు తెలిపారు. ఈ కోణంలోనూ దర్యాప్తు వేగవంతం చేసి నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు.