వేట | Shooting | Sakshi
Sakshi News home page

వేట

Published Mon, Jan 5 2015 4:15 AM | Last Updated on Sat, Sep 2 2017 7:13 PM

వేట

వేట

ఎక్కడో అడవిలో తలదాచుకుంటున్న వన్యప్రాణులు పలువురు మానవ మృగాల చేతిలో ప్రాణాలు వదులుతున్నాయి. జల్సాలకు అలవాటుపడ్డ వారు అటవీ జంతువులను హతమారుస్తున్నారు. తమ సరదాల కోసం మూగజీవాలను బలితీసుకుంటున్నారు.

ఇందుకు జన్నారం పరిధిలోని టైగర్‌జోన్‌ను ఎంచుకుంటున్నారు. నిత్యం ఏదో ఒక జీవి ప్రాణాలు తీస్తూ.. ఎంజాయ్ చేస్తున్నారు. అటవీ అధికారులేమో పలుచోట్ల బాధితులను పట్టుకుంటున్నా.. వారిపై కఠిన చర్యలు తీసుకోవడం లేదు. ఫలితంగా వన్యప్రాణుల వేట మాత్రం ఆగడం లేదు.

 
ఉట్నూర్ : జన్నారం వైల్డ్‌లైఫ్ అటవీ డివిజన్ (వన్యప్రాణి సంరక్షణ విభాగం) పులుల సంరక్షణ కేంద్రం వేటగాళ్లకు నిలయంగా మారింది. కేంద్ర ప్రభుత్వం కవ్వాల్ అటవీ ప్రాంతాన్ని 42వ టైగర్ జోన్‌గా గుర్తించింది. కవ్వాల్ అభయారణ్యం వన్యప్రాణి విభాగంలో అధికారిక లెక్కల ప్రకారం 673 రకాల మొక్కలు, పది రకాల ఉభయచర జంతువులు, 34 రకాల సరిసృపాలు, 270 రకాల పక్షి జాతులు, 75 రకాల క్షీరజాతులు మనుగడ సాగిస్తున్నాయి.

అడవులు వేగంగా అంతరిస్తుండడంతో వాటికి మనుగడ లేకుండాపోతోంది. పదుల సంఖ్యలో వేటగాళ్ల ఉచ్చుకు బలవుతున్నాయి. కవ్వాల్ అభయారణ్యంలో వన్యప్రాణుల రక్షణకు అటవీ అధికారుల నిఘా అంతంత మాత్రంగానే ఉండడంతో నిత్యం ఏదో ఒక చోట అటవీ జంతువుల బలవుతున్నాయి. మామూళ్లకు కక్కుర్తి పడి కొంత మంది కిందిస్థాయి అటవీ సిబ్బంది వేటగాళ్లకు సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

రాత్రిళ్లు బ్యాటరీలు, బరిసెలు, వలలు, విద్యుత్ వైర్లు, బైండింగ్ తీగలు తదితర సామగ్రితో వేటగాళ్లు అడవుల్లోకి వెళ్లి వాటిని వెంటాడుతున్నారు. రాత్రి వేళ జంతువులు దాహార్తి తీర్చుకోడానికి సాసర్‌వెల్స్, గ్రామాల సమీపంలో ఉండే చెరువులు, ఇతర నీటి వనరుల ప్రాంతాలకు వస్తుంటారు.

ఆ సమయంలో వేటగాళ్లు మాటువేసి వాటిని వేటాడుతున్నారు. జంతువులకు తాగునీరందించేందుకు అటవి శాఖ వారు ఏర్పాటు చేసిన సాసర్‌వెల్స్‌ను వేటగాళ్లు వేటకు అనుకూలంగా మలచుకుంటున్నారు. అభయారణ్యంలోని బీర్సాయిపేట, తాళ్లపేట, జన్నారం, ఇందన్‌పల్లి అటవీ రేంజ్‌ల్లోని పలు బీట్లలో జంతువుల వేట ముమ్మరంగా సాగుతోంది.

 ఆదివారం వచ్చిందంటే..
 వీకెండ్ అయిన ఆదివారం వచ్చిందంటే చాలు ఉట్నూర్, జన్నారం పట్టణ ప్రాంతాలతోపాటు ఇందన్‌పల్లి, ఖానాపూర్, బీర్సాయిపేట తదితర గ్రామాలు వన్యప్రాణుల మాంసంతో నిండిపోతున్నాయి. వేటగాళ్లు నేరుగా ఇళ్లలోకి మాంసాన్ని సరఫరా చేస్తున్నారు. ఇందుకోసం పలువురిని ఏజెంట్లుగా కూడా పెట్టుకుంటున్నారు. ముందుగానే ఎవరెవరికి ఏ మాంసం ఎంత కావాలో వివరాలు తీసుకుంటూ.. లేదా గ్రామానికి చెందిన వారే పలువురు వేటగాళ్లతో నేరుగా ఫోన్‌లో కోడ్ భాషలో మాట్లాడుతూ మాంసాన్ని తెప్పించుకుంటున్నారు.

ఇదంతా ఉదయం నాలుగు గంటల నుంచి 6 గంటలలోపే జరిగిపోతోంది. మరికొందరేమో ఆడవారిని రంగంలోకి దింపి వన్యప్రాణుల మాంసాన్ని ఆటో, జీప్ ప్రయాణాల ద్వారా మంచిర్యాల, లక్సెట్టిపేట, నిర్మల్, ధర్మపురి, జగిత్యాల, కరీంనగర్, గోదావరిఖని ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ముచేసుకుంటున్నారు. పలు వ్యాధులున్న వారికి ఫలానా జంతువు మాంసం తింటే తగ్గిపోతుందని ప్రచారంలో ఉండడంతో వాటికి సంబంధించి ఆర్డర్లు ఇచ్చేస్తున్నారు.

ఒక్కో వన్యప్రాణి మాంసం కిలో ధర రూ.400 నుంచి రూ.1200 వరకు పలుకుతోంది. దీంతో ఈ అక్రమ దందా రూ.లక్షల్లోనే జరుగుతోంది. ఈ వ్యవహారంలో సంబంధిత శాఖకు చెందిన పలువురు అధికారులకు హస్తం ఉండడంతో దందా గుట్టుచప్పుడు కాకుండా మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది.

 నిఘా అంతంతే..
 1965లో కవ్వాల్‌ను అటవి ప్రాంతంగా గుర్తించిన ప్రభుత్వాలు 1972లో వన్యప్రాణి సంరక్షణ విభాగంగా గుర్తింపునిచ్చింది. ఆ తర్వాత 2011లో కవ్వాల్ అభయారణ్యంలో 892.23 చదరపు కిలోమీటర్లు కోర్ ఏరియాగా.. 1,119.68 చదరపు కిలోమీటర్లు బఫర్ ఏరియాగా గుర్తిస్తూ 42వ పులుల సంరక్షణ కేంద్రంగా ప్రకటించింది. దీంతో వన్యప్రాణులను అన్నిరకాలు రక్షించేందుకు వేట నిరోధక దళాలు అటవీ సెక్షన్ అధికారి పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలనూ నియమించింది.

ఈ బృందాలు నిరంతరం అడవుల్లో తిరుగుతూ వన్యప్రాణులను సంరక్షించాలి. కానీ.. వన్యప్రాణులను కాపాడడంలో వారు విఫలమవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న వారిలో కొంత మంది ఎనిమల్ ట్రాకర్స్, బేస్ క్యాంపుల్లోని వారు వేటగాళ్లకు సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఉన్నత స్థాయి అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నా.. కింది స్థాయి సిబ్బంది నిఘా లోపంతో అడవుల్లో యథేచ్ఛగా వేటా సాగుతోంది. దీనికితోడు అడవులు వేగంగా అంతరిస్తుండడంతో వన్యప్రాణుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది..!!

 కేసులు సరే.. చర్యలేవీ..?
 జన్నారం వైల్డ్‌లైఫ్ డివిజన్‌లోని ఇందన్‌పల్లి, తాళ్లపేట, బీర్సాయిపేట, జన్నారం అటవీ రేంజ్‌ల పరిధిలో జనవరి 2011 నుంచి ఇప్పటివరకు ఏడు నీలుగాయిలు, మూడు దుప్పిలు, ఐదు అడవి పందులు, ఒక కొండగొర్రె, రెండు సాంబర్లు, ఒక చిరుత, ఐదు చుక్కల దుప్పిలు, ఒక సింగోళి, నాలుగు జింకలు వేటగాళ్ల ఉచ్చుకు బలయ్యాయి. ఇందుకు దాదాపు 86 మంది వేటగాళ్లపై కేసులు నమోదైనట్లు సమాచారం.

గత నెల ఐదో తేదీన జన్నారం అటవీ రేంజ్ పరిధిలోని అడవిలో నీలుగాయిని వే టాడి మాంసం విక్రయిస్తున్న వారిని అటవీ అధికారులు పట్టుకున్నారు. అల్లినగర్‌కు చెందిన 19 మందిపై కేసులు నమోదు చేశారు. అదీకాక వెలుగులోకి రాకుండా మరెన్నో వన్యప్రాణులు బలి అవుతూనే ఉన్నాయి. అయితే.. వేటగాళ్లపై కేసులు నమోదు చేస్తున్న అధికారులు ఆ తదుపరి చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు వేటగాళ్లపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement