- ఈ వారంలో కేంద్ర బృందంతో సమావేశం
- కందకాలతో ఏనుగుల దాడుల నివారణ
- సోలార్ ఫెన్సింగ్ పనులు త్వరలో ప్రారంభిస్తాం
- చిత్తూరు పశ్చిమ డీఎఫ్‌వో చక్రపాణి
చిత్తూరు(అర్బన్): వన్యప్రాణాలు జనావాసాల్లోకి రాకుండా ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక సరిహద్దుల్లోని అడవుల్లో కారిడార్ ఏర్పాటు చేయనున్నట్లు చిత్తూరు పశ్చిమ అటవీశాఖ అధికారి చక్రపాణి తెలిపారు. ఇందుకోసం మూడు రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులతో భారత ప్రభుత్వ వన్యప్రాణి సంరక్షణ అధికారులు సమావేశం కానున్నారన్నారు. ఇటీవల పలమనే రు, కుప్పం, మామండూరు తదితర ప్రాంతాల్లో ఏనుగులు పంట పొలాల పై దాడులు చేయడం, తాజాగా రామకుప్పంలో ఓ ఏనుగు విద్యుత్ షాక్‌తో మృతి చెందడం తదితర అంశాలపై డీఎఫ్‌వో చక్రపాణి శనివారం చిత్తూరులో విలేకరులతో మాట్లాడారు. ఆ విషయాలు ఆయన మాటల్లోనే....
ఏనుగులు పంట పొలాలపై దాడు లు చేయకుండా మన రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని అడవులతో కలిపి వన్యప్రాణుల రక్షణకు ప్రత్యేక కారిడార్ ఏర్పాటు చేయనున్నాం. ఇందుకోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వైల్డ్ అనిమల్ ప్రొటెక్ట్ అధికారులకు నివేదిక పంపాం. ఈనెల తొలి వారంలో మన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యకార్యదర్శితో పాటు ఆ రెండు రాష్ట్రాల సీఎస్‌లతో కేంద్ర అధికారుల బృందం సమావేశవుతుంది. కుప్పం, క్రిష్ణగిరి, హోసూరు, బన్నేరుగట్టు తదితర అటవీ ప్రాంతాల మీదుగా కారిడార్ ఏర్పాటవుతుంది. పనులు, నిధులు అన్నీ కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది.
కుప్పం సమీపంలోని పెద్దకుర్తిగుంట నుంచి మోట్లచెరువు వరకు 50 కిలో మీటర్ల దూరంలో సోలార్ ఫె న్సింగ్ వేశాం. ఇంకా పది కిలో మీటర్ల దూరం వరకు గ్యాప్ ఉంది. ఈ ప్రాం తంలో బండలు, కొండలు ఎక్కువగా ఉండటంతో కాస్త ఆలస్యమైంది. త్వరలోనే పనులు ప్రారంభిస్తాం. అంతేగాకుండా ఈ అటవీ ప్రాంతాల నుంచి ఏనుగులు పంట పొలాల్లోకి రాకుండా ఉండటానికి కందకాలు నిర్మిస్తున్నాం. రూ.25 లక్షలు నిధులు కూడా వచ్చాయి. 12 అడుగుల ఎత్తులో గుంతలు తవ్వడాన్నే కందంకం అంటాం. ఈ గుంతల్ని చూడగానే ఏనుగులు దాటడానికి సాహసించవు. అడవుల్లోనే ఏనుగుల సంరక్షణ కోసం నీటి గుంటలు త వ్వుతాం, పచ్చిక వేయడానికి షెల్టర్ నిర్మిస్తాం.
జిల్లాలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఏనుగుల దాడుల్లో 219 ఎకరాల్లో పాక్షికంగా పంట పొలాలు ధ్వంసమయ్యాయి. వరి, చెరకు పంటలకు ఎకరాకు రూ.6 వేలు, మామిడి, కొబ్బరి ఒక్కో చెట్టుకు రూ.15వేలు చొప్పున ఇప్పటి వరకు రూ.25.20 లక్షలు పరిహారాన్ని సంబంధిత రైతులకు చెల్లించాం. ఇతర కూరగాయలు, ఆకుకూరల తోటలకు ఉద్యానవశాఖ అధికారులు ఇచ్చే నివేదిక ఆధారంగా పరిహారం ఇస్తున్నాం’.