
సాక్షి సెంట్రల్ డెస్క్: జూ.. పిల్లలకు, పెద్దలకు అందరికీ ఒక ఇంటరెస్టింగ్ ప్లేస్.. రకరకాల జంతువులు, పక్షులు ఉండే ప్లేస్.. జూ సంగతి సరే.. అందులోని జంతువులకు ఈ భూమ్మీద ప్లేస్ కరువవుతోంది.. ఆ విషయం మీకు తెలుసా? అందుకే నేడు(ఏప్రిల్ 8) ‘నేషనల్ జూ లవర్స్ డే’ సందర్భంగా వాటి పరిస్థితి ఏంటో ఓసారి తెలుసుకుందాం..
భూమ్మీద పది లక్షల రకాల జంతువులు, వృక్షాలు, ఇతర జీవజాలం అంతరించేపోయే దశలో ఉన్నట్టు ఐక్యరాజ్యసమితి గుర్తించింది. 1900వ సంవత్సరం నుంచీ గమనిస్తే అంతరించిపోయే దశలో ఉన్నట్టుగా గుర్తించిన జీవుల శాతం
►భూమి మీద బతికే జీవుల్లో 20 శాతం
►ఇదే సమయంలో మొసళ్లు, కప్పలు, కొన్నిరకాల పాముల వంటి ఉభయచర జీవుల్లో 40 శాతానికిపైగా
►సముద్రాల్లో పగడపు దిబ్బలను ఏర్పాటు చేసే కోరల్స్‌లో 33 శాతం
►నీటిలోనే జీవించే జలచరాల్లో 30 శాతానికిపైగా
మనమే చంపేస్తున్నాం..
ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో వన్యప్రాణుల హననం విచ్చలవిడిగా సాగుతోంది. అడవి జం తువుల చర్మం, దంతాలు, కొమ్ములు, గోర్లు, మాంసం కోసం చంపడం బాగా పెరిగిపోయింది.
►ప్రపంచంలోనే ఆఫ్రికా ఖండంలో ఏనుగుల సంఖ్య ఎక్కువ. స్మగ్లర్లు దంతాల కోసం ఇక్కడి అడవి ఏనుగుల్లో 65 శాతం ఏనుగులను గత పదేళ్లలోనే వధించారు.
► సౌతాఫ్రికాలో 2007 నుంచి 2013 మధ్య ఖడ్గ మృగాల వేట 7,700 శాతం పెరిగింది.
►ప్రపంచవ్యాప్తంగా జంతువుల అక్రమ వ్యాపారం విలువ ఏటా రూ.52 వేల కోట్ల నుంచి రూ. లక్షా 72 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా
ప్లాస్టిక్.. భూతమే..
మనం నిత్యం వినియోగిస్తున్న ప్లాస్టిక్ సంచులు, బాటిళ్లు, వస్తువుల్లో చాలా వరకు సముద్రాల్లోనే డంప్ అవుతున్నాయి.
ఇవి భారీ ఎత్తున జీవజాలం చనిపోవడానికి కారణమవుతున్నాయి.
►ప్రపంచవ్యాప్తంగా ఏటా సముద్రాల్లో కలుస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాలు 80 లక్షల టన్నులు.
►ఈ ప్లాస్టిక్ వేస్ట్ ప్రభావం వల్ల అంతరించేపోయే దశకు చేరుకున్న సముద్ర జీవజాతులు.. సుమారు 600 జాతులు.. సముద్రాల్లో చేరిన మైక్రో ప్లాస్టిక్ ముక్కల (ఒక మిల్లీమీటర్ కంటే తక్కువ పరిమాణం ఉన్నవి) సంఖ్య మన పాలపుంతలో ఉన్న కోట్ల నక్షత్రాల కన్నా 500 రెట్లు ఎక్కువ.
పచ్చదనం పెరగట్లే..
పెరిగిపోతున్న జనాభాకు అనుగుణంగా ప్రపంచవ్యాప్తంగా అడవులు వేగంగా తగ్గిపోతున్నాయి. అంతేస్థాయిలో జీవులూ అంతరించిపోతున్నాయి.
►ప్రపంచంలోనే అతిపెద్ద అడవి అమెజాన్‌లో గత 50 ఏళ్లలోనే 17 శాతం తరిగిపోయింది.
►ప్రపంచవ్యాప్తంగా 2019లో ప్రతి నిమిషానికి 25–30 క్రికెట్ స్టేడియాల పరిమాణంలో అడవులను నరికేశారు.
►మొత్తంగా ఉష్ణమండల అడవుల్లోనే ప్రపంచంలోని సగం జీవజాలం బతుకుతోంది. అలాంటి ఉష్ణ మండల అడవుల విస్తీర్ణం ఏటా ఏకంగా 1.7 లక్షల కిలోమీటర్ల మేర తరిగిపోతోంది.
మనమేం చేద్దాం..
భూమ్మీద జీవజాలం సంరక్షణ కోసం ఐక్యరాజ్యసమితి పలు సూచనలు చేసింది. అందరూ కూడా వ్యక్తిగతంగా వీటిని అనుసరిస్తే.. అడవులను, జంతువులను కాపాడుకోవచ్చని పేర్కొంది.
ఒక లక్ష్యంగా..
పర్యావరణంపై అతితక్కువ ప్రభావం పడేలా మన జీవన విధానాన్ని మార్చుకోవాలి. పర్యావరణానికి హాని చేసే ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం, విద్యుత్, పెట్రోలియం ఉత్పత్తుల వృథాను అరికట్టడం వంటివి..
అందరికీ అవగాహన కల్పించి..
అడవి జంతువులు, పర్యావరణ పరిరక్షణపై ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, కాలేజీలు,
స్కూళ్లు, ఇతర చోట్ల అవగాహన కల్పించాలి.
వినియోగంలో బాధ్యత..
అడవుల నుంచి అక్రమంగా తరలించే ఉత్పత్తులు, వస్తువులు, ఆహార పదార్థాలను కొనుగోలు చేయవద్దు. అలాంటి వాటి వినియోగానికి దూరంగా ఉండాలి.
సమాచారం ఇవ్వాలి..
అడవి జంతువుల అక్రమ రవాణా, వాటి మాంసం, ఇతర ఉత్పత్తుల విక్రయాలు వంటివాటి గురించి తెలిస్తే.. వెంటనే ప్రభుత్వాధికారులకు సమాచారం ఇవ్వాలి.
అడవి జంతువులు తగ్గిపోయిన తీరు...
చదవండి:
సెకండ్ వేవ్: సర్జరీలకు కరోనా బ్రేక్!
ఆ ఒక్కటీ పాయె
Comments
Please login to add a commentAdd a comment