రింగ్‌టైల్డ్ లెమూర్‌కు ఆహారం తినిపిస్తున్న యానిమల్ కీపర్ (ఫైల్)..
వన్యప్రాణులకు గాయమైతే వీరి గుండె చలిస్తుంది. అవి హుషారుగా ఎన్‌క్లోజర్లలో తిరిగితే వీరు పట్టరాని సంతోషంతో ఉంటారు. వాటి ఆకలి, కోపం, బాధ అన్నీ వీరికి తెలిసిపోతాయి. పగలంతా వాటితో గడిపే వీరికి ఇంటికెళ్లినా.. వాటి ధ్యాసే. ప్రాణాలతో చెలగాటమని తెలిసినా.. వన్య ప్రాణులను తమ కన్న బిడ్డల్లా సాకుతూ.. వాటి సంరక్షణలో కీలకపాత్ర పోషిస్తున్నారు. వారే జూ కీపర్లు. జంతువుల మనసెరిగి.. వాటి ఆలనాపాలన చూసుకుంటున్న యానిమల్ కీపర్ల దినోత్సవం ఈ రోజు..
ఆరిలోవ(విశాఖతూర్పు): జాతీయ రహదారి పక్కన 625 ఎకరాల విస్తీర్ణంలో 1972లో ఇందిరాగాంధీ జంతు ప్రదర్శన శాల ఏర్పాటు చేశారు. మొదట్లో ఇక్కడ 25 ఎన్‌క్లోజర్లు ఉండేవి. వాటిలో 100 వన్యప్రాణులు సందర్శకులను అలరించేవి. ఇప్పుడు జంతువుల సంఖ్య 880కు పైగా చేరింది. వాటి ఎన్‌క్లోజర్లు 65 ఉన్నాయి. పులులు, ఏనుగులు, సింహాలు, చిరుతలు, చింపాంజీలు, నీటి ఏనుగులు, జింకలు, జిరాఫీలు, ఖడ్గమృగం, కణుజులు, పాములు, మొసళ్లు, తాబేళ్లు, నెమళ్లు, ఆస్ట్రిచ్‌లు, హంసలు, వివిధ రకాల పక్షులున్నాయి. వాటి సంరక్షణకు సిబ్బంది, వైద్య సేవలందించడానికి ఆస్పత్రి, వైద్య సిబ్బంది, ఆహారశాల అన్నీ అందుబాటులో ఉన్నాయి.
కన్న బిడ్డల్లా సాకుతూ..
జూ ఏర్పడిన తర్వాత జంతువులను సంరక్షించడానికి 25 మంది యానిమల్ కీపర్లుగా ఎన్.ఎం.ఆర్ విధానంలో ఉద్యోగాల్లో చేరారు. తర్వాత వారు శాశ్వత ఉద్యోగులుగా మారారు. వీరిలో 19 మంది ఉద్యోగ విరమణ చేయగా.. ప్రస్తుతం ఆరుగురు ఉన్నారు. వీరికి సహాయకులుగా మరో ఏడుగురు ఉన్నారు. వీరంతా ఇక్కడ జంతువులు, పక్షులు, పాములకు స్నేహితులయ్యారు. దళపతి అని ఓ కీపర్ పిలవగానే నీటి ఏనుగు నోరు చాపుకుంటూ వస్తుంది. కృష్ణ అనగానే తొండం పైకెత్తి ఆశగా ఏనుగు చూస్తుంది. చీపా అంటే గెంతులేస్తూ చింపాంజీ అతని దగ్గరకు చేరుకుంటుంది. ఇలా జంతు సంరక్షకుల గొంతు వినగానే దగ్గరకు చేరిపోతుంటాయి. క్రూర మృగాలు కూడా వీరికి నేస్తాలుగా మారిపోయాయి. సమయానికి ఆహారం అందించడం, నైట్‌క్రాల్స్‌లో ఉన్న వాటికి ఉదయం స్నానం చేయించడం, ఆ తర్వాత వాటిని సందర్శకుల కోసం ఎన్‌క్లోజర్లలోకి విడిచిపెట్టడం, ఆ సమయంలో వాటి నైట్‌క్రాల్స్‌ను శుభ్రం చేయడం, అందులోని జంతువుల మలమూత్రాలను తొలగించడం వీరి విధులు. రోజంతా వన్యప్రాణులతో గడిపే వీరు.. ఇంటికి వెళ్లినా వీటి ధ్యాసలోనే ఉంటారంట. కన్న పిల్లల కంటే ప్రేమగా వీటిని చూసుకుంటామని వారు చెబుతున్నారు.
ఇంటికెళ్లినా వాటి ధ్యాసే..
నేను 1993లో జూలో ఎన్.ఎం.ఆర్‌గా చేరాను. ప్రస్తుతం ప్రస్తుతం చింపాంజీలతో సావాసం చేస్తున్నాను. చింపాంజీలతో నేను మాట్లాడతాను. నా మాటలు వాటికి అర్థమవుతాయి. చీకో, చీపా అని పేర్లతో పిలవగానే అవి వస్తాయి. అయితే చింపాంజీలు మనిషి కంటే చాలా తెలివైనవి. ఎక్కువగా మారాం చేస్తాయి. వేళకు ఆహారం ఇవ్వకపోతే తలుపులు బద్దలు గొట్టేస్తాయి. గేట్లు విరగ్గొంటేందుకు చూస్తాయి. ఆ సమయంలో నేను ఏమి పెట్టినా తినవు. అందుకే సమయానికి భోజనం పెడతాను. వాటితో ఉన్న అనుబంధం వల్ల నేను ఇంటికి వెళ్లినా అవే గుర్తొస్తాయి. మొదట నేను అడవి కోళ్లు, కొంగలు, జింకలు, పులులు, చిరుతలు, ఎలుగుబంట్ల ఎన్‌క్లోజర్ల వద్ద పనిచేశాను.
– వై.అప్పారావు, యానిమల్ కీపర్
జూలో పులులకు పైపుతో స్నానం చేయిస్తున్న యానిమల్ కీపర్ (ఫైల్)..
మన ప్రవర్తన బట్టే..
నేను 1980లో ఎన్.ఎం.ఆర్‌గా చేరాను. 1991లో పర్మినెంట్ అయింది. ఐదేళ్లుగా తెల్ల పులుల ఎన్‌క్లోజర్ వద్ద విధులు నిర్వర్తిస్తున్నాను. మన ప్రవర్తనను బట్టి జంతువులు మనతో సరదాగా ఉంటాయి. మనం కోపం, చిరాకుతో ఉంటే అవి గ్రహిస్తాయి. అలాంటప్పుడు అవి కూడా మన మీదకు దూకడానికి ప్రయతి్నస్తాయి. చిరుతలు, పెద్ద పులులు కూడా అలాగే ప్రవర్తిస్తాయి. గతంలో రేచు కుక్కలు, పాంథర్, పెద్ద పులులు, ఆఫ్రికన్ పక్షులు, సింహాల ఎన్‌క్లోజర్ల వద్ద పనిచేశాను. రేచుకుక్కలు మాత్రం వాటి ఎన్‌క్లోజర్‌ను చెత్త చేస్తాయి. అన్ని వైపులా మూత్ర విసర్జన చేస్తాయి.
– వై.రాంబాబు, యానిమల్ కీపర్
జూలో వేధిస్తున్న సిబ్బంది కొరత
జూలో సిబ్బంది కొరత ప్రధాన సమస్యగా ఉంది. వన్యప్రాణుల బాగోగులను చూసుకునే సంరక్షలు సరిపడినంతగా లేరు. జూలో ఉన్న జంతువులు, పక్షుల సంరక్షణ కోసం యానిమల్ కీపర్లను కొన్ని దశాబ్దాలుగా నియమించకపోవడంపై విమర్శలు ఉన్నాయి. జూ ప్రారంభంలో 25 ఎన్‌క్లోజర్లలో సుమారు 100 వన్యప్రాణులను సంరక్షించడానికి 25 మంది సంరక్షకులను నియమించారు. ఇప్పుడు వాటి సంఖ్య తొమ్మిది రెట్లు పెరిగింది. కానీ వాటి సంరక్షకుల సంఖ్య మాత్రం అదే స్థాయిలో తగ్గిపోయింది. ప్రస్తుతం ఆరుగురు కీపర్లు, మరో 7 మంది వర్క్ చార్జ్‌డ్ ఉద్యోగులు(కీపర్లకు సహాయకులు), మరో 35 మంది ఎన్‌ఎంఆర్‌లు ఉన్నారు. నిజానికి జూలో ఎన్‌క్లోజర్లు, వాటిలో ఉన్న సంఖ్య ప్రకారం సుమారు 212 మంది యానిమల్ కీపర్లు ఉండాలి. వీరిని శాశ్వత ప్రాతిపదికన నియమిస్తే.. వన్యప్రాణులకు మరింత సంరక్షణ ఉంటుందని జంతు ప్రేమికులు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment