ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల, వృక్ష జాతుల అక్రమ రవాణా
80 శాతానికి పైగా దేశాల్లో వన్య ప్రాణుల అక్రమ వాణిజ్యం
నాలుగు వేలకు పైగా జంతు, వృక్షజాతుల అక్రమ రవాణా
వరల్డ్ వైల్డ్ లైఫ్ క్రైమ్ రిపోర్ట్ 2024 నివేదికలో వెల్లడి
సాక్షి, అమరావతి: ప్రకృతికి మనిషి హాని తలపెడుతున్నాడు. తద్వారా తన ఉనికిని తానే దెబ్బతీసుకుంటున్నాడు. జంతుజాలాన్ని బతకనివ్వడం లేదు. మనిషి స్వార్థం వృక్షజాలాన్నీ వదలడం లేదు. తత్ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా వన్యప్రాణులు అంతరించిపోతున్నాయి. వృక్షజాలమూ బోసిపోతోంది. అక్రమ వ్యాపారుల దుశ్చర్యలకు పర్యావరణం సమతౌల్యాన్ని కోల్పోతోంది. 2015–2021 మధ్య కాలంలో 162 దేశాల్లో యథేచ్ఛగా జంతు, వృక్షజాతుల అక్రమ వాణిజ్యం జరిగినట్టు ఐక్యరాజ్య సమితి నివేదిక చెబుతోంది.
దాదాపు 4 వేలకు పైగా జంతు, వృక్షజాతులు నిత్యం అక్రమ రవాణాలో పట్టుబడుతున్నట్టు ఇటీవల ఐక్యరాజ్యసమితి ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ విడుదల చేసిన వరల్డ్ వైల్డ్ లైఫ్ క్రైమ్ రిపోర్ట్–2024లో పేర్కొంది. వీటిల్లో సుమారు 3,250 రకాలు అంతరించిపోతున్న జాతుల్లో ఉండటం కలవరపెడుతోంది. ఫ్యాషన్ ఉత్పత్తులు, గృహోపకరణాలు, అలంకరణ వస్తువుల తయారీ, ఔషధాల కోసం చట్ట విరుద్ధంగా అడవుల్లోని జీవజాలాన్ని మట్టుబెడుతున్నట్టు నివేదిక స్పష్టం చేసింది.
ఖడ్గమృగం, దేవదారు వృక్షాలు అక్రమ వ్యాపారానికి ఎక్కువగా అంతరించిపోయినట్లు తేల్చింది. బ్లాక్ మార్కెట్‌లో ఖడ్గమృగం కొమ్ము 29 శాతం డిమాండ్‌తో అగ్ర స్థానంలో నిలిచింది. ఆ తర్వాత పాంగోలిన్ స్కేల్స్ 28 శాతం, ఏనుగు దంతాలు 15 శాతంగా ఉన్నాయి.
అక్రమ రవాణాకు తెగటారిపోతున్న జంతు, వృక్షజాలం
అక్రమ వ్యాపారానికి బలవుతున్న జంతు జాతుల్లో ఏనుగులు (6 శాతం), ఈల్స్ (5 శాతం), మొసళ్లు (5 శాతం), చిలుకలు, కాకాటూలు (2 శాతం), సింహాలు, పులుల వంటి ఇతర మాంసాహార జంతువులు (2 శాతం), తాబేళ్లు (2 శాతం), పాములు (2 శాతం), సీహార్స్ చేపలు (2 శాతం) ఉన్నాయి. అక్రమ రవాణాలో ధూపం, పరిమళ ద్రవ్యాలు, కలప, ఔషధాల వినియోగానికి దేవదారు, మహోగని, హోలీ వుడ్, గుయాకం వృక్ష జాతులు యథేచ్ఛగా నరికి వేస్తున్నారు.
మార్కెట్‌లో వీటి వాటా 47 శాతంగా ఉంది. ఇంకా రోజ్‌వుడ్ 35 శాతం, ఔషధ మొక్కలు అగర్వుడ్ , రామిన్, యూకలిప్టస్ 13 శాతంగా ఉన్నాయి. సముద్ర జీవులకు ఆవాసాన్ని కల్పించడంతో పాటు తీరప్రాంతాన్ని కోత నుంచి రక్షించడంలో కీలక పాత్ర పోషించే పగడపు దిబ్బలనూ అక్రమ వ్యాపారులు తొలిచేస్తున్నారు.
అక్రమ రవాణాలో ఈ పగడాల వాటా 16 శాతంగా ఉంటోంది. గత దశాబ్దంలో ఏనుగు దంతాలు, ఖడ్గమృగం కొమ్ముల వేట తగ్గినట్టు నివేదిక చెబుతోంది. మార్కెట్‌లోనూ ధరలు క్షీణించినట్టు తెలిపింది. కరోనా కాలంగా చైనా మార్కెట్లు మూసివేయడంతో ఇది జరిగి ఉండవచ్చని భావిస్తోంది.
దేశ సరిహద్దుల్లో అక్రమ రవాణా గుర్తింపు
భారత్‌లోనూ విమానాశ్రయాలు, ఓడరేవులు, దేశ సరిహద్దు రాష్ట్రాలైన మిజోరం, మణిపూర్‌లలో ఎక్కువగా వన్యప్రాణుల అక్రమ రవాణాను గుర్తించారు. స్మగ్లింగ్ ఇన్ ఇండియా రిపోర్టు 2022–23 ప్రకారం 1,652 క్షీరదాలు, పక్షులు, సరీసృపాలు, ఉభయచర జాతులను స్వా«దీనం చేసుకున్నట్టు డిపార్ట్‌మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ పేర్కొంది.
వీటిల్లో 40 శాతానికి పైగా అత్యంత ప్రమాదంలో ఉన్న జాతులుగా పేర్కొంది. సజీవంగా ఉన్న జంతువులు ముఖ్యంగా పెంపుడు జంతువులకు విదేశాల్లో డిమాండ్ పెరుగుతున్నందుకు దేశంలో అక్రమ వ్యాపారం పెరిగినట్టు వన్య ప్రాణుల నేర నియంత్రణ నిపుణులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment