జీవ మనుగడకు జలం కీలకం | Interconnected Disaster Risk Report 2023 released | Sakshi
Sakshi News home page

జీవ మనుగడకు జలం కీలకం

Published Sun, Mar 24 2024 12:22 AM | Last Updated on Sun, Mar 24 2024 12:22 AM

Interconnected Disaster Risk Report 2023 released  - Sakshi

భూగర్భ జలాలు క్షీణించే దిశగా భారత్‌ వేగంగా పురోగ మిస్తుందని ఐక్యరాజ్యసమితి నివేదిక హెచ్చరించింది.‘ఇంటర్‌ కనెక్టెడ్‌ డిజాస్టర్‌ రిస్క్‌ రిపోర్ట్‌ 2023’ నివేదిక ప్రకారం, ప్రపంచంలోని 31 ప్రధాన జలాశయాల్లో 27 తిరిగి నింపగలిగే స్థాయి కంటే వేగంగా క్షీణిస్తున్నాయి. భారత దేశం భూగర్భజలాలు క్షీణ దశకు చేరుకున్నాయని ‘యునైటెడ్‌ నేషన్స్‌ యూనివర్సిటీ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ ఎన్విరాన్మెంట్‌ అండ్‌ హ్యూమన్‌ సెక్యూరిటీ’ (యూఎన్‌ఐ ఈహెచ్‌ఎస్‌) ప్రచురించిన కొత్త నివేదిక కూడా హెచ్చరించింది. ఇంటర్‌ కనెక్టెడ్‌ డిజాస్టర్‌ రిస్క్‌ రిపోర్ట్‌ –2023 నివేదిక ఆరు పర్యావరణ పాయింట్లను పరిశీలిస్తుంది. అవి 1. వేగ వంతమయిన విలుప్తాలు 2. భూగర్భ జలాల  క్షీణత. 3. పర్వత హిమానీనదం. 4 ద్రవీభవనం. 5. అంతరిక్ష శిథి లాలు 6. భరించలేని వేడి– బీమా చేయలేని భవిష్యత్తు. 

నివేదిక ప్రకారం పంజాబ్‌లోని 78 శాతం బావులను అతిగా ఉపయోగించినట్లు పరిగణిస్తున్నారు. మొత్తం వాయవ్య ప్రాంతంలో 2025 నాటికి భూగర్భజలాల లభ్యత బాగా తగ్గిపోతుందని నివేదిక అంచనావేసింది. ‘జలాశ యాలు’ అని పిలువబడే భూగర్భ జలాశయాలలో నిల్వ చేయబడిన ముఖ్యమయిన వనరు మంచినీరు. ఈ జలాశ యాలు 200 కోట్లకు పైగా ప్రజలకు తాగునీటి సరఫరా చేస్తాయి. ఇందులో దాదాపు 70 శాతం వ్యవసాయం కోసం ఉపయోగిస్తారు. భూగర్భజలాలు వేలాది సంవత్సరాలుగా ‘పునరుత్పాదక వనరుగా’ ఉంటున్నాయి అని నివేదిక పేర్కొంది. కానీ ఇప్పటికే ఉన్న బావుల్లో నీటిని అందించగల స్థాయికంటే నిల్వలు కిందికి పడిపోతే విపత్తులు ప్రారంభమైనట్లే. వ్యవసాయానికి నీరు అందక ఆహార కొరత ఏర్పడుతుంది.

భూగర్భ జలాల క్షీణత అత్యంత తీవ్రంగా ఉన్న ప్రాంతాలలో భారతదేశం, ఈశాన్య చైనా, పశ్చిమ యునైటెడ్‌ స్టేట్స్, మెక్సికో, ఇరాక్, సౌదీ అరేబియా, ఉత్తర ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఎక్కువ నీరు అవసరమైన వరి, గోధుమలను పండించడం వల్ల జలవనరులు తొందరగా అడుగంటుతున్నాయని నివేదిక తెలిపింది. గోదుమ, వరి పంటలకు భారత్‌ అధికంగా భూగర్భ జలాలను వినియో గిస్తోంది. పంజాబ్, హరియాణా రాష్ట్రాలు దేశంబియ్యం సరఫరాలో 60 శాతం, గోధుమల ఉత్పత్తిలో 85 శాతం ఉత్పత్తి చేస్తున్నాయి. అందుకే పంజాబ్‌లో 78 శాతం బావులు అతిగా వాడకానికి గురవుతున్నాయనేది నివేదిక సారాంశం.

‘2023 అంచనా నివేదిక’ ప్రకారం దేశం మొత్తం వార్షిక భూగర్భ జలాల రీచార్జ్‌ 4,49,087 బిలియన్‌ క్యూబిక్‌ మీట ర్లుగా ఉంది. ఇది మునుపటి సంవత్సరంతో పోలిస్తే 11.48 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల పెరుగుదలను సూచిస్తుంది. దేశం మొత్తం వార్షిక భూగర్భజలాల వెలికితీత 241.34 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్లుగా ఉంది. 
భూగర్భ జలాలు అడుగంటిపోతే తాగునీటి సమస్య మరింత పెరుగుతుంది. ఇప్పటికే ప్రపంచంలోని 220 కోట్ల మంది ప్రజలు సురక్షితమయిన నీరు అందుబాటులోలేకుండా జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో 2030 నాటికి ప్రతీ ఒక్కరికీ పరిశుభ్రమయిన నీటిని అందజేయాలని ఐక్యరాజ్య సమితి లక్ష్యం నిర్దేశిస్తోంది. భూగోళం మీద ఉన్న నీటిలో 97 శాతం ఉప్పు నీరే. తాగడానికి ఉపయోగపడే జలాలు కేవలం 1 శాతం మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

అందులో 0.86 శాతం చెరువులు, 0.02 శాతం నదులలో, మిగతా 0.12 శాతం భూగర్భజలాల రూపంలో ఉంది. ఈ వనరులే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 760 కోట్ల మందికి పైగా ఆహారాన్నీ, ఇతర అవసరాలనూ తీరుస్తున్నాయి. ‘2050 నాటికి ఈ భూమ్మీద తాగడానికి పుష్కలమయిన జలంఉండనే వుండదు. జనం స్నానాలు చేయడం మానేసి శరీరా నికి లేపనాలు పూసుకోవలసి ఉంటుంది. సరిహద్దులో వుండాల్సిన సైన్యం నీటి వనరుల చుట్టూ కాపలాకాస్తుంది...’ అంటూ దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం వ్యాఖ్యానించారంటే పరిస్థితి ఎలా ఉంటుందోఅంచనా వేయవచ్చు!

– ప్రొ‘‘ గనబోయిన మచ్చేందర్, జియాలజీ విభాగ అధిపతి, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం, నల్లగొండ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement