ఐక్యరాజ్యసమితి: నేటి ఆధునిక యుగంలోనూ విద్యుత్ వెలుగులు చూడనివారు, వంటగ్యాస్ అందుబాటులో లేనివారు ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది ఉన్నారు. ఈ మేరకు ఐదు అంతర్జాతీయ సంస్థలు.. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ, ఇంటర్నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఎజెన్సీ, ఐక్యరాజ్యసమితి గణాంక విభాగం, ప్రపంచ బ్యాంకు, ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) తాజాగా ఒక నివేదిక విడుదల చేశాయి.
ప్రపంచంలో దాదాపు 230 కోట్ల మంది వంటచెరుకుగా కట్టెలు, పిడకల వంటివి ఉపయోగిస్తున్నారని వెల్లడించాయి. 67.50 కోట్ల మందికి ఇప్పటికీ విద్యుత్ సౌకర్యం లేదని తెలియజేశాయి.
♦ 2030 నాటికి కరెంటు లేని వారి సంఖ్య 66 కోట్లకు, వంట గ్యాస్ లేని వారి సంఖ్య 190 కోట్లకు తగ్గిపోతుంది.
♦ 2010లో ప్రపంచంలో 84 శాతం మందికి విద్యుత్ సౌకర్యం ఉంది. 2021 నాటికి ఇది 91 శాతానికి చేరింది. కోవిడ్–19 మహమ్మారి వ్యాప్తి వల్ల 2019–21లో ఈ వృద్ది కొంత మందగించింది.
♦ కరెంటు సౌకర్యం లేనివారిలో 80 శాతం మంది (56.7 కోట్లు) సబ్ సహారన్ ఆఫ్రికాలో నివసిస్తున్నారు.
♦ ఇంధన వనరుల విషయంలో ప్రపంచ దేశాలు అనుసరిస్తున్న విధానాలు ప్రజలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి.
♦ వంట గ్యాస్ లేకపోవడంతో కట్టెలు, పిడకలు వంటి కాలుష్యకారక ఇంధనాల వాడకం, దానివల్ల వాయు కాలుష్యం కారణంగా ప్రపంచంలో ప్రతిఏటా దాదాపు 32 లక్షల మంది చనిపోతున్నారని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment