రుచిగా ఉంటే తినేయడమే! | 38 percent people in the country prefer processed food | Sakshi
Sakshi News home page

రుచిగా ఉంటే తినేయడమే!

Published Mon, Jun 3 2024 4:32 AM | Last Updated on Mon, Jun 3 2024 4:32 AM

38 percent people in the country prefer processed food

దేశంలో 38 శాతం మంది ప్రాసెస్డ్‌ ఫుడ్‌ వైపే మొగ్గు 

28 శాతం మందికే ఆరోగ్యకరమైన ఆహారంపై ఆసక్తి 

ప్రజల్లో పెరుగుతున్న ఉప్పు వినియోగం  

16.6 శాతం మందిలో పోషకాహార లోపం 

అనూహ్యంగా పెరుగుతున్న ప్యాకేజ్డ్‌ ఫుడ్‌ వినియోగం 

గ్లోబల్‌ ఫుడ్‌ పాలసీ రిపోర్టు–2024 తాజా నివేదికలో వెల్లడి 

సాక్షి, అమరావతి: భారతీయుల ఆహార అలవాట్లు వేగంగా మారుతున్నాయి. ప్రపంచానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని పరిచయం చేసిన వేద భూమి.. అనారోగ్యకర వంటకాల వైపు పరుగులు పెడుతోంది. దేశంలో 38 శాతం మంది వేయించిన, ప్రాసెస్‌ చేసిన పదార్థాలను అధికంగా ఆరగించేస్తున్నారు. కేవలం 28 శాతం మంది మాత్రమే ఆరోగ్యకరమైన పిండి ప్రధాన ఆహారం, కూరగాయలు, పండు, పప్పు, గింజ, మాంసాన్ని ఆహారంగా తీసుకుంటున్నారు. 

దేశ జనాభాలో 16.6 శాతం మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారని ఇంటర్నేషనల్‌ ఫుడ్‌ పాలసీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఐఎఫ్‌పీఆర్‌ఐ) తాజాగా ప్రపంచ దేశాల్లోని ఆహార అలవాట్లపై సర్వే చేసి విడుదల చేసిన ‘గ్లోబల్‌ ఫుడ్‌ పాలసీ రిపోర్టు–2024’ పేర్కొంది. భారతదేశంలో ఆహారపు అలవాట్లపై ఈ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. 

పోషకాహారంతో పోలిస్తే అనారోగ్యకరమైన ఆహార వినియోగంలో గణనీయమైన పెరుగుదల నమోదైందని పేర్కొంది. కూరగాయలు, పండ్లు, ఇతర సూక్ష్మపోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకునే వారితో పోలిస్తే భారతదేశంలో ఎక్కువ మంది ఉప్పు లేదా వేయించిన స్నాక్స్‌ వంటి అనారోగ్యకరమైన ఆహారాన్నే ఇష్టపడుతున్నారని ప్రకటించింది.   

ప్రపంచంలో పెరుగుతున్న పోషకాహార లోపం 
చాలా దేశాలు రెట్టింపు పోషకాహార లోప భారాన్ని ఎదుర్కొంటున్నాయని గ్లోబల్‌ ఫుడ్‌ పాలసీ నివేదిక నొక్కి చెప్పింది. ఆఫ్రికా, దక్షిణాసియాలో చాలామంది ఆరోగ్యకరమైన ఆహారాన్ని పొందలేకపోతున్నారని.. రెండు బిలియన్ల కంటే ఎక్కువ మంది ప్రజలపై చేసిన పరిశోధన ద్వారా అంచనా వేసింది. ఐదేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లల్లో సగానికి పైగా, వయోజన మహిళల్లో మూడింట రెండొంతుల మంది సూక్ష్మ పోషకాల లోపంతో బాధపడుతున్నట్టు ఐక్యరాజ్య సమితి ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ తేల్చింది. 

భారత్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌ వంటి దక్షిణాసియా దేశాల్లో పోషకాహార లోపంతో అధిక బరువు, ఊబకాయంతో పాటు సంబంధిత నాన్‌ కమ్యూనల్‌ డిసీజెస్‌ (ఎన్‌సీడీ) ప్రాబల్యం పెరుగుతున్నట్టు వెల్లడించింది. దక్షిణాసియాలో సూక్ష్మ పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు ఖరీదైనవి కాగా.. ధాన్యాలు, కొవ్వులు, నూనె, చక్కెర, స్వీట్‌ అండ్‌ సాల్ట్‌ ఉండే చిరుతిళ్లు చౌకగా లభిస్తున్నట్టు నివేదిక పేర్కొంది. 

దాంతో ప్రజలు ఈ తరహా ఆహార వినియోగంపై మక్కువ చూపుతున్నట్టు తేల్చింది. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) ఇటీవల విడుదల చేసిన ఆహార మార్గదర్శకాల ప్రకారం ప్యాకేజ్డ్‌ ఫుడ్‌పై అందించిన సమాచారం కూడా ప్రజలు పట్టించుకోవడం లేదని హెచ్చరించింది. సంస్థ అందించిన 17 ఆహార మార్గదర్శకాలలో సమా­చారం, ఆరోగ్యకరమైన ఆహార ఎంపిక చేయ­డానికి ఆహార లేబుల్స్‌పై సమాచారాన్ని చదవమని ఐసీఎంఆర్‌ వినియోగదారులకు విజ్ఞప్తి చేసింది. 

అధిక కొవ్వు, చక్కెర, ఉప్పు, అ్రల్టా–ప్రాసెస్డ్‌ ఫుడ్స్‌ వినియోగాన్ని తగ్గించాలని కూడా సూచించింది. రోజువారీగా ఆరోగ్యకరమైన ఆహా­రం తీసుకోకపోతే సమీప భవిష్యత్‌లో అనారోగ్య భారతదేశాన్ని చూడా­­ల్సి ఉంటుందని ఇంటర్నేష­నల్‌ ఫుడ్‌ పాలసీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ తన నివేదికలో హెచ్చరించింది.  

నాలుగేళ్లలో ప్యాకేజ్డ్‌ ఫుడ్‌ వినియోగం రెట్టింపు  
నిత్యం తీసుకుంటున్న ఆహారంలో అధిక కేలరీలు గలవి, తక్కువ పోషకాలు గలవి ఎక్కువగా ఉంటున్నాయని నివేదిక పేర్కొంది. అంతేకాకుండా కూరగాయలు, ఇతర సూక్ష్మపోషకాలు అధికంగా ఉండే ఆహారాల వినియోగం తగ్గిపోతున్నట్టు కూడా హెచ్చరించింది. భారతదేశం, ఇతర దక్షిణాసియా దేశాల్లో ప్రాసెస్‌ చేసిన ఆహారాలు (చాక్లెట్లు, చక్కెర మిఠాయిలు, ఉప్పగా ఉండే స్నాక్స్, పానీయాలు, రెడీమేడ్‌ ఫుడ్‌) వినియోగం పెరుగుతోంది. 

ఆహార బడ్జెట్‌లో ఎక్కువ భాగం ప్యాకేజ్డ్‌ పాలు, స్నాక్స్‌ రెడీమేడ్‌ ఫుడ్‌కే ప్రాధాన్యం ఇస్తున్నట్టు తేల్చింది. భారతదేశంలో పోషకాహార లోపంతో బాధపడుతున్న వారు పెరుగుతున్నట్టు నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. పెద్దవారిలో అధిక బరువు పెరుగుదల 2006లో 12.9 శాతం నుంచి 2016 నాటికి 16.4 శాతానికి పెరిగింది.  

పోషకాహార లోపంతో బాధపడే వారి సంఖ్య పెరుగుతోంది 
పోషకాహార లోపంతో బాధపడే వారు 2011లో 15.4 శాతం ఉంటే.. 2021 నాటికి 16.6 శాతానికి పెరిగింది. జనాభాలో దాదాపు 17 శాతం మందికి జీవించేందుకు అవసరమైన ఆహారం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఇంటికి దూరంగా ఉంటున్నవారు ఆహారం, గృహావసరాల కోసం చేస్తున్న వార్షిక ఖర్చు 2015లో రూ.619 బిలియన్స్‌ ఉంటే, 2019లో అది రూ.820 బిలియన్లకు పెరిగింది. 

అంటే నాలుగేళ్లలో రూ.201 బిలియన్ల మేర పెరిగింది. అలాగే గృహ ఆహార బడ్జెట్‌లో ప్యాకేజ్డ్‌ (అత్యధికంగా ప్రాసెస్‌ చేసిన, అత్యధిక క్యాలరీలు ఉండేవి) ఆహార పదార్థాల వాటా 6.5 శాతం నుంచి 12 శాతానికి పెరిగింది. అంటే నాలుగేళ్లలో దాదాపు రెండింతలు పెరిగింది. సంపన్న కుటుంబాలు తమ ఆహార బడ్జెట్‌లో ఎక్కువ భాగం ప్రాసెస్‌ ఫుడ్‌పైనే ఖర్చు చేస్తున్నట్టు నివేదిక పేర్కొంది.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement