సాక్షి, హైదరాబాద్: ప్రొటీన్లు, విటమిన్లు, ఫైబర్ తక్కువగా ఉండి.. కొవ్వులు, చక్కెర, ఉప్పుశాతం అధికంగా ఉండే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ భారతదేశాన్ని ముంచెత్తుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఆందోళన వ్యక్తం చేసింది. అధిక కొవ్వు, చక్కెర, ఉప్పులతో కూడిన స్నాక్స్ (హెచ్‌ఎఫ్‌ఎస్‌ఎస్)తో మధుమేహం, అధిక రక్తపోటు సహా పలురకాల దీర్ఘకాలిక వ్యాధులు చుట్టుముడుతున్నాయని హెచ్చరించింది.
ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యకరమైన ఆహార పదార్థాల వినియోగం పెరుగుతుంటే.. అందుకు విరుద్ధంగా భారత్‌లో హెచ్‌ఎఫ్‌ఎస్‌ఎస్ పెరుగుతుండటం మంచిది కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు ‘ది గ్రోత్ ఆఫ్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇన్ ఇండియా’అనే పేరుతో ప్రపంచ ఆరోగ్య సంస్థ గురువారం ఒక నివేదిక విడుదల చేసింది.
అధిక కొవ్వు, కేలరీలతో..
♦ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తినడంతోపాటు శారీరక శ్రమ తక్కువగా ఉండటం వల్ల గుండె జబ్బులు వస్తాయని డబ్ల్యూహెచ్‌ఓ నివేదిక స్పష్టం చేసింది. రోజుకు సగటున 1,580 కేలరీలుపైగా శక్తిని అందించే ఆహారం తీసుకోవడం సరికాదని.. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్‌తో ఎక్కువ కేలరీలు వస్తాయని పేర్కొంది.
రోజూ ప్రొటీన్లు 41 నుంచి 57 గ్రాములకు మించి, కొవ్వు 19–32 గ్రాములకు మించి తీసుకుంటే అధిక బరువు సమస్య వస్తుందని తెలిపింది. భారత్‌లోని ఏడు పెద్ద నగరాల్లో ప్రజలు రోజుకు సగటున 33 గ్రాముల కంటే ఎక్కువ కొవ్వు తీసుకుంటున్నారని.. వాస్తవంగా రోజుకు 20 గ్రాముల లోపే తీసుకోవాలని వెల్లడించింది.
కిరాణా షాపులే కొంప ముంచుతున్నాయి
ప్రస్తుతం దేశంలో అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ మార్కెట్ విలువ రూ.3 లక్షల కోట్లు అని.. ఇందులో ఉప్పుతో కూడిన సాల్టీ స్నాక్స్ వ్యాపారమే రూ.60 వేల కోట్లు ఉంటుందని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది. ధాన్యాలు, పప్పులు, నూనెలు, పాల వంటి నిత్యావసరాల మార్కెట్ విలువ రూ.5లక్షల కోట్లు మాత్రమేనని తెలిపింది.
2038 నాటికి అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ మార్కెట్ రూ.6 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. చిన్న ప్యాకెట్లలో, తక్కువ ధరకు అందుబాటులో ఉంచడం.. ఇలాంటి వాటిలో 70% కిరాణా షాపుల్లోనే దొరుకుతుండటంతో వినియోగం బాగా పెరుగుతోందని పేర్కొంది. గతంలో కంటే కూల్‌డ్రింక్స్ వాడకం తగ్గినా.. రెడీమేడ్ జ్యూస్, పాల ఆధారిత డ్రింక్‌ల మార్కెట్ పెరిగిందని తెలిపింది.
♦ పోర్చుగల్‌లో స్వీట్లు, బేవరేజెస్‌లపై ప్రత్యేక వినియోగ ట్యాక్స్ పెట్టడంతో 7% విక్రయాలు తగ్గాయని డబ్ల్యూహెచ్ ఓ తెలిపింది. అదే భారత్‌లో హానికరమైనవైనా, మంచివైనా అన్నింటికీ ఒకే రకంగా జీఎస్టీ ఉంటోందని.. దీనివల్ల హానికరమైన వాటి విక్రయాలు తగ్గడంలేదని పేర్కొంది.
♦భారత్‌లో చక్కెర తక్కువ ధరలో దొరుకుతుందని, దీనికి ప్రత్యామ్నాయాలను వాడాలంటే పన్నులు ఎక్కువగా ఉంటుండటంతో.. వ్యాపారస్థులు, ప్రజలు చక్కెరనే ఎక్కువగా వాడుతున్నారని వివరించింది.
హెచ్‌ఎఫ్‌ఎస్‌ఎస్‌లో 5 రకాలు
1) చక్కెర సంబంధిత పదార్థాలు: చాక్లెట్స్, బబుల్‌గమ్స్, లాలిపాప్స్, ఐస్‌క్రీమ్స్, స్వీట్లు, బిస్కెట్లు, కేక్స్ వంటివి.
2) అధిక ఉప్పుతో కూడినవి: నట్స్, ఆలూ చిప్స్, పాప్‌కార్న్, పాపడ్ తదితరాలు
3) బేవరేజెస్: సాఫ్ట్ డ్రింక్స్, రెడీమేడ్ జ్యూసులు, రెడీమేడ్ కొబ్బరి నీళ్లు, ఎనర్జీ డ్రింక్స్, ఫ్లేవర్డ్ మిల్క్ వంటివి.
4) రెడీమేడ్ బ్రేక్ ఫాస్ట్: ఓట్స్, కార్న్‌ఫ్లేక్స్, గ్రనోలా వంటివి
5) మిగతా రెడీమేడ్ ఫుడ్ ఐటమ్స్: డీప్ ప్రాసెస్డ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, చిల్డ్ర్ ఫ్రాజెన్ మీట్, ఫ్రాజెన్ సీఫుడ్, రెడీమేడ్ సూప్‌లు, కండెన్స్‌డ్ మిల్క్, లస్సీ, ఇన్‌స్టంట్ నూడుల్స్, పిజ్జాలు, బర్గర్లు, రెడీమేడ్ రైస్, సాస్‌లు, కెచప్‌లు, టేబుల్ సాల్ట్, టమాటా, సోయా డ్రింగ్స్, పెరుగు వంటివి.
అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి
అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ వల్ల కొవ్వులు, ప్రొటీన్లు, చక్కెర, ఉప్పు అధికంగా శరీరంలోకి వెళతాయి. అధిక కొవ్వుతో ఊబకాయం, గుండె జబ్బులు.. అధిక ఉప్పుతో పక్షవాతం, బీపీ వస్తాయి. అధిక ప్రొటీన్లతో కిడ్నీ వ్యాధులు తలెత్తుతాయి. దేశంలో జాతీయ స్థాయిలో ప్రాసెస్డ్ ఫుడ్‌పై ఎలాంటి విధానం లేదు.
ఆరోగ్యకర, అనారోగ్యకర ఆహార పదార్థాలకు సంబంధించి విధివిధానాలు లేవు. ప్రపంచమంతా చక్కెర, ఉప్పు, కొవ్వులు తక్కువగా ఉన్న ఆహారంవైపు మళ్లుతుంటే.. భారత్‌లో వాటి వినియోగం పెరుగుతోంది. ఈ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్‌కు దూరంగా ఉండటం మంచిది. – డాక్టర్ కిరణ్ మాదల, సైంటిఫిక్ కమిటీ కన్వినర్, ఐఎంఏ, తెలంగాణ
Comments
Please login to add a commentAdd a comment