మట్టిలో కలిపిన ఉప్పును చప్పరిస్తున్న జింకలు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: వేసవి మండిపోతుండటంతో జంతువుల ఆరోగ్య పరిరక్షణపై అటవీ అధికారులు దృష్టి సారిస్తున్నారు. మనుషుల్లాగే వన్యప్రాణులు కూడా శరీరంలో ఖనిజాల (మినరల్స్) శాతం తగ్గిపోతే అనారోగ్యం బారిన పడతాయి. రోజువారీ ఆహారంలో భాగంగా ఖనిజాలు.. కూడా సరిగా అందితేనే జీవ క్రియలు సజావు గా సాగుతాయి. అయితే అడవుల్లో బతికే జంతువులు సహజ సిద్ధంగా తినే మేత ద్వారా ఉప్పు (సోడియం)ను తీసుకుంటాయి. బండలు, కర్రల్ని, నీటి మడుగుల వద్ద మట్టిని నాకుతూ శరీర సమతాస్థితిని కాపాడుకుంటాయి.
అయితే గతంలో కంటే ప్రస్తుతం సహజసిద్ధ ఉప్పు లభ్యత తగ్గిపోయింది. మరోవైపు వేసవిలో డీహైడ్రేషన్ కారణంగా మరింత ఎక్కువగా మినరల్స్ అవసరం అవుతాయి. ఈ నేపథ్యంలో తగినంత ఉప్పు అందకపోతే వన్యప్రాణులు అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. దీని ని దృష్టిలో ఉంచుకుని వాటి ఆవాసాల్లోనే నీటి కుంటల వద్ద అధికారులు ఉప్పు గడ్డలు ఏర్పాటు చేస్తున్నారు. గత రెండేళ్లుగా కవ్వాల్ టైగర్ రిజర్వు పరిధిలో ఈ పద్ధతిలో జంతువుల ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు.
మట్టి, ఉప్పును కలిపి..
సహజమైన ఉప్పు, చెరువు మట్టి రెండింటినీ కలిపి (70 శాతం ఉప్పు, 30 శాతం చెరువు పూడిక మట్టి) కుప్పలా తయారు చేస్తారు. ఒక అడుగు లేదా అడున్నర ఎత్తులో నీటి కుంటలకు సమీపంలో జంతువులకు కనిపించేలా ఉంచుతారు. దాహం తీర్చుకోవడానికి వచ్చే జంతువులు కాళ్లు, కొమ్ములతో కుప్పల్ని గీరుతూ, మట్టిలో ఉన్న ఉప్పును నాలుకతో చప్పరిస్తుంటాయి. ఒక దాన్ని చూసి మరొకటి అలా నాకుతూ ఉంటాయి. ఒక్కోసారి గుంపులుగా కూడా వస్తుంటాయి. అలా పదే పదే నాకడం వల్ల వాటికి అవసరమైనంత ఉప్పు లభిస్తుంది.
ఇప్పటికీ గ్రామాల్లో పశువులు, మేకలు, గొర్రెలకు ప్రత్యేకంగా ఉప్పును నాకిస్తుంటారు. ఈ విధానాన్నే అధికారులు అడవిలో ఉపయోగిస్తున్నారు. మొదట మార్కెట్‌లో దొరికే రెడీమేడ్ ఉప్పు గడ్డలను వాడేవారు. అయితే వాటి గడువు తేదీ, ప్రాసెస్ కారణంగా జంతువులకు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉండటాన్ని దృష్టిలో పెట్టుకుని అటవీ సిబ్బందే సాధారణ ఉప్పును మట్టితో కలిపి జంతువులకు అందుబాటులో ఉంచుతున్నారు.
ఖనిజ లోపం ఏర్పడకుండా..
వన్యప్రాణుల్లో ఖనిజ లోపం రాకుండా నీటికుంటల వద్ద ఉప్పు గడ్డలను ఏర్పాటు చేస్తున్నాం. దాహం తీర్చుకోవడానికి వచ్చినప్పుడు మట్టిలో ఉన్న ఉప్పును అవి చప్పరిస్తున్నాయి. ఇది వాటి ఆరోగ్యాన్ని కాపాడుతోంది.
– ఎస్.మాధవరావు ఎఫ్‌డీవో, జన్నారం, మంచిర్యాల జిల్లా
Comments
Please login to add a commentAdd a comment