Godawari
-
గోదారమ్మ పుట్టింటికి వెళ్లొద్దామా?
నాసిక్ త్రయంబకం ఈ రెండింటినీ కలిపి పలుకుతారు. కానీ ఈ రెండింటికీ మధ్య 30 కిలోమీటర్ల దూరం ఉంది. త్రయంబకం జ్యోతిర్లింగం. ఇక్కడ పానవట్టం మీద మూడు చిన్న చిన్న శివలింగాలుంటాయి. నీరు ఊరుతూ ఉంటుంది. ఆ నీటిని చేత్తో తీసి బయట ΄ోస్తుంటారు పూజారులు. ఆ నీరు బ్రహ్మగిరి కొండల్లో నుంచి ఉబికి వస్తున్న గోదావరి నీరని చెబుతారు. త్రయంబకం ఆలయ నిర్మాణం ఒక అద్భుతం. గ్రానైట్ రాయిలో చెక్కిన గోపురం, ఆ గోపురంలో చెక్కిన శిల్పాల సౌందర్యం కనువిందు చేస్తుంది. శిల్పకారులకు చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది. ఆలయంలో నాలుగు వైపులా ద్వారాలుంటాయి. స్పెషల్ దర్శనం కోసం ఆలయ సంస్థానం నిర్వహిస్తున్న దర్శనం కౌంటర్ ఉంటుంది. కానీ సమాంతరంగా స్థానికులు అవినీతిని ప్రోత్సహిస్తుంటారు. టికెట్ తీసుకోకుండా వాళ్ల చేతికి డబ్బిస్తే మరో ద్వారం నుంచి ఆలయంలో ప్రవేశపెడతారు. ఈ అవినీతిపరులు పర్యాటకులను మిస్లీడ్ చేస్తూ కౌంటర్ దగ్గరకు వెళ్లనివ్వకుండా దారి మళ్లిస్తుంటారు. ఆలయ కౌంటర్ నిడివి పెంచితే అవినీతి తగ్గుతుంది, ఆలయ గౌరవం పెరుగుతుంది. ఆలయం లోపల మాత్రం గంభీరమైన వాతావరణం, మనసును శివుడి మీద లగ్నం చేస్తుంది. త్రయంబకేశ్వరుడి దర్శనం తర్వాత ఎదురుగా కనిపిస్తున్న గుట్ట మీద అమ్మవారి ఆలయం ఉంది. త్రయంబకేశ్వరుడి ఆలయం పూర్తిగా నల్లగా ఉంటే అమ్మవారి విగ్రహంతోపాటు ఆలయం నేల నుంచి శిఖరం వరకు మొత్తం పాలరాతి నిర్మాణం. కొండ మీద గోదావరి త్రయంబకం తర్వాత బ్రహ్మగిరి కొండల వైపు సాగాలి. గోదావరి నది పుట్టిన ప్రదేశాన్ని చూడాలంటే నిట్టనిలువుగా ఉన్న కొండను నడిచి ఎక్కాల్సిందే. రెండు కొండల మధ్య ఇరుకు మెట్ల మీద పైకి వెళ్తుంటే నది పాయలు పర్యాటకులను పలకరించడానికి ఎదురు వచ్చినట్లు తల మీదకు జాలువారుతుంటాయి. కర్రసాయంతో కొండ ఎక్కడమే మంచిది. మెట్లెక్కి కొండ మీదకు చేరిన తర్వాత తెలుస్తుంది అది ఒక కొండ కాదని. విశాలంగా విస్తరించిన పశ్చిమ కనుమల శిఖరాల నుంచి ధారలు జలజలమని శబ్దం చేస్తూ కొండల మధ్య విశాలమైన ప్రదేశంలోకి చేరతాయి. అదే గోదావరి కుండ్. భక్తులు ఆ నీటిలో పుణ్యస్నానాలు చేస్తుంటారు. గోదావరి పుట్టిన ప్రదేశాన్ని చూసిన తర్వాత తిరుగు ప్రయాణంలో నాసిక్‌లో ఆగాలి. పంచవటి, సీతాగుహ, కాలారామ్ మందిర్ ప్రధానమైనవి. సీతాగుహలోకి వెళ్లి రావడం ఆసక్తిగా ఉంటుంది. కానీ రద్దీ చాలా ఎక్కువ. క్యూలైన్లోనే ఎక్కువ టైమ్ అయిపోతుంది. కాలారామ్ ఆలయంలో రాముడి విగ్రహం అందంగా ఉంటుంది. ఆలయ నిర్మాణం ఉత్తర దక్షిణాది శైలి సమ్మేళనంగా ఉంటుంది. నాసిక్‌లో నాణేల ముద్రణాలయం ఉంది. ఎత్తైన కాంపౌండ్ వాల్‌ను మాత్రమే చూడగలం. టూర్ ఆపరేటర్ని అడిగితే ఆ రోడ్డులో తీసుకువెళ్తారు. షిరిడీ ప్రయాణంలో నాసిక్, త్రయంబకాలను కలుపుకోవచ్చు. షిరిడీ నుంచి బయలుదేరిన తర్వాత మొదట ముక్తిధామ్ వస్తుంది. ఈ పాలరాతి ఆలయంలో కృష్ణుడితోపాటు శివుడు... ఇంకా చాలామంది దేవతల రాజస్థాన్ మార్బుల్ విగ్రహాలుంటాయి. పన్నెండు జ్యోతిర్లింగాల నమూనాలుంటాయి. త్రయంబకేశ్వరుడిని కూడా చూడవచ్చు. షిరిడీ టూర్ ఆపరేటర్లు నిర్వహించే కంబైండ్ ప్యాకేజ్‌లలో బ్రహ్మగిరి ఉండదు. విడిగా వాహనం మాట్లాడుకోవాలి. కొండ మీదకు ట్రెకింగ్ కూడా ఉంటుంది. కాబట్టి ఫ్రీ టైమ్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇక నాసిక్‌లో సీతాగుహలోకి వెళ్లడం కంటే క్యూలో మనవంతు కోసం వెయిట్ చేయడమే కష్టం. ఇక్కడ టోకెన్ సిస్టమ్ పెడితే బాగుంటుంది. పర్యాటకులు టోకెన్ తీసుకుని తమ వంతు వచ్చే వరకు ఎదరుగా ఉన్న ఇతర ఆలయాలు, పంచవటి వృక్షాలను చూస్తూ, తినుబండారాలతో కాలక్షేపం చేయవచ్చు. ఇంత సిస్టమాటిక్‌గా ఏమీ ఉండకపోవడంతో పర్యాటకులే స్వయంగా తమ వెనుక వారికి చెప్పి క్యూ లైన్ నుంచి బయటకు వచ్చి టీ స్టాల్లో టీ తాగి, స్నాక్స్ తిని మళ్లీ క్యూలో చేరుతుంటారు.– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
గోదా‘వర్రీ’.. పవిత్ర జలాలు అపవిత్రం
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం : పవిత్ర గోదావరి జలాలు కలుషితమవుతున్నాయి. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే నీళ్లు మురుగును తలపిస్తున్నాయి. పరీవాహకం వెంట ఉన్న ఫ్యాక్టరీలు.. నగర శివారు ప్రాంతాల్లోని వ్యర్థాలన్నీ గోదావరిలో సమ్మిళితం కావడంతో నదీ పవిత్రతను కోల్పోతోంది. రాష్ట్రంలో నిర్మల్ జిల్లా బాసర పుణ్యక్షేత్రం వద్ద మహారాష్ట్ర నుంచి తెలంగాణలో ప్రవేశించే గోదావరి.. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన దివ్యక్షేత్రం భద్రాచలం వద్ద ఏపీలోకి వెళ్తోంది. ఈ మధ్య ప్రాంతంలో 465 కిలోమీటర్ల మేర ప్రవహించే గోదావరిలోకి పలు చోట్ల భారీగా చెత్తా చెదారం చేరుతోంది. మురుగు నీటిని నేరుగా గోదావరిలోకి వదులుతుండటంతో పవిత్ర జలాలు అపవిత్రం అవుతున్నాయి. గోదావరిలో కలిసే అన్ని ఉపనదులు దట్టమైన అటవీ ప్రాంతాల నుంచి ప్రవహిస్తూ వస్తుండటంతో ఔషధ విలువలు ఉండాల్సిన జలాలు కాస్తా కాలుష్యమయం అవుతున్నాయి. దీంతో పర్యా వరణానికి హాని కలుగుతుండటంతో పాటు జం తువులు, వన్యప్రాణులు సైతం ఆ నీరు తాగి మృత్యువాత పడుతున్నాయి. బాసర, ధర్మపురి, మంచిర్యాల, రామగుండం, మంథని, భద్రాచలం పట్టణాల నుంచి ప్రతిరోజూ మురుగునీటిని శుద్ధి చేయకుండానే నేరుగా గోదావరిలోకి వదులుతున్నారు. మారని పరిస్థితి.. గోదావరి జలాల్లోకి నేరుగా ఒక్క చుక్క మురుగు నీరు వదలొద్దని.. ఎన్ని కోట్లు ఖర్చయినా మురుగునీటి శుద్ధి ప్లాంట్లు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ గతంలో ఆదేశించారు. అయినప్పటికీ పరిస్థితి మారకపోగా మరింత అధ్వానంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తిపోతల పథకాలు నిర్మించి రివర్స్ పంపింగ్ చేస్తోంది. దీంతో కలుషిత నీరు బ్యారేజీల్లోకి చేరి నీటిలోని జలచరాలు అంతరించిపోయే పరిస్థితి నెలకొంది. అలాగే ఈ నీటిని తాగేందుకు ఉపయోగిస్తే ప్రమాదకరమైన జబ్బుల బారిన పడే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు. ఇటువంటి పరిíస్థితుల్లో ఎస్టీపీల (మురుగునీటి శుద్ధి ప్రక్రియ ప్లాంట్లు) ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. పని చేయని ప్లాంట్లు.. రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ల తర్వాత అతిపెద్ద రామగుండం కార్పొరేషన్ నుంచి ప్రతిరోజూ 32 మిలియన్ లీటర్ల మురుగునీరు గోదావరిలో కలుస్తోంది. ఈ నీటిని ఏమాత్రం శుద్ధి చేయకుండా వదిలిపెడుతుండటంతో గోదావరి మురికికూపంగా మారుతోంది. రామగుండం శివారులో నిర్మించిన ఎస్టీపీ ప్లాంట్‌లో 4 ఎంఎల్డీ (మిలియన్ లీటర్స్ ఫర్ డే) వ్యర్థ జలాలను శుద్ధి చేయాలి. అయితే అది పనిచేయడం లేదు. అలాగే 8 ఎకరాల్లో నిర్మించిన మల్కాపూర్ ఎస్టీపీ ప్లాంట్ ద్వారా ప్రతిరోజూ 14 మిలియన్ లీటర్ల వ్యర్థ జలాలను శుద్ధి చేయాలి.. ప్రస్తుతం అది కూడా పనిచేయడం లేదు. అలాగే కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన 14 ఎంఎల్డీ సామర్థ్యం కలిగిన సుందిళ్ల ఎస్టీపీ ప్లాంట్ నిర్మాణం మధ్యలోనే నిలిచింది. దీంతో ఇందుకు కేటాయించిన నిధులూ వృథా అయ్యాయి. రామగుండం కార్పొరేషన్ నుంచి వచ్చే వ్యర్థ జలాలతో పాటు ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇతర హానికరమైన రసాయన వ్యర్థాలు గోదావరిలో 18 మిలియన్ లీటర్లు కలుస్తున్నాయి. కాగా.. రూ.90 కోట్లతో 21 ఎంఎల్డీ సామర్థ్యం కలిగిన మురుగునీటి శుద్ధి ప్లాంట్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. దీని ద్వారా శుద్ధి చేసిన నీటిని ఎన్టీపీసీకి అందించాలని ప్రతిపాదనలో పేర్కొన్నారు. అయితే దీనికి ఇంకా అనుమతులు లభించలేదు. ఇక కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు నుంచి నీటి రివర్స్ పంపింగ్ కారణంగా ముంపునకు గురవుతున్న మల్కాపూర్ ఎస్టీపీ ప్లాంట్ స్థానంలో రూ.15.80 కోట్లతో మరో ప్లాంట్ నిర్మించాలని రామగుండం కార్పొరేషన్ అధికారులు కాళేశ్వరం ప్రాజెక్టు అధికారులకు ప్రతిపాదించారు. దీనిపై ఎలాంటి ముందడుగు పడలేదు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు.. రామగుండంలో 8 ఎంఎల్డీ, మల్కాపూర్ శివార్లలో 21 ఎంఎల్డీ సామర్థ్యం కలిగిన 2 ఎస్టీపీ ప్లాంట్లకు ప్రతిపాదనలు పంపాం. లేటెస్ట్ టెక్నాలజీ వాడేందుకు రంగం సిద్ధం చేస్తున్నాం. టెండర్ల ప్రక్రియ నడుస్తోంది. – పి.ఉదయ్‌కుమార్, కమిషనర్, రామగుండం కార్పొరేషన్ రోజూ 11 టన్నుల చెత్త నదిలోనే.. భద్రాచలంలోని 64 కాలనీల నుంచి ప్రతిరోజూ ఉత్పత్తవుతున్న 11 టన్నుల తడి, పొడి చెత్తను దేవస్థానానికి సమీపంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వెనుక భాగంలో గోదావరి కరకట్ట లోపల నది పారుతున్న చోటే వేస్తున్నారు. దీంతో నదిలోని నీరు కాలకూట విషంలా మారుతోంది. భద్రాచలం పట్టణం మినహా మండలంలోని మిగిలిన గ్రామాలన్నీ పోలవరం ముంపు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో కలిపారు. భద్రాచలం చుట్టూ ఏపీ గ్రామాలే ఉన్నాయి. చివరకు భద్రాచలం ఆలయ భూములు 950 ఎకరాలు సైతం ఏపీలోకే వెళ్లాయి. దీంతో పట్టణానికి డంపింగ్ యార్డుకు కూడా స్థలం లేకుండా పోయింది. ఈ క్రమంలో గోదావరికి ఇవతలి ఒడ్డున ఉన్న బూర్గంపాడు మండలం సారపాక పంచాయతీలోని భాస్కర్‌నగర్, గాంధీనగర్ వద్ద భద్రాచలం డంప్ యార్డ్ ఏర్పాటుకు అధికారులు ప్రయత్నాలు చేయగా.. సారపాక వాసులు వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల జరిగిన బూర్గంపాడు మండల ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశంలో పినపాక ఎమ్మెల్యే, విప్ రేగా కాంతారావు సైతం ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. దీంతో ప్రస్తుతానికి భద్రాచలం వద్ద గోదావరి నదీగర్భమే డంపింగ్ యార్డులా మారింది. ఇచ్చట చెత్త వేస్తే శిక్షార్హులని బోర్డు ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీయే ఆ బోర్డు వద్ద చెత్తను డంప్ చేస్తుండటం గమనార్హం. ఈ విషయమై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కొత్తగూడెం ఇన్చార్జ్ ఈఈ బి.శంకర్‌బాబును వివరణ కోరగా.. పరిశీలించి భద్రాచలం గ్రామపంచాయతీపై చర్యలు తీసుకుంటామన్నారు. సందట్లో సడేమియాలా.. రాష్ట్ర సరిహద్దులోని మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్‌లో ఉన్న పయనీర్ లిక్కర్ ఫ్యాక్టరీ వారు వ్యర్థాలను గోతుల్లో నిల్వ చేసి జూలైలో బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తిన సమయంలో సందట్లో సడేమియాలా వ్యర్థాలను గోదావరిలోకి వదులుతుంటారు. ఇక మంచిర్యాల జిల్లా కేంద్రం వద్ద ఉన్న 3 ఎస్టీపీ ప్లాంట్లు పనిచేయడం లేదు. దీంతో మురుగునీరు వాగుల ద్వారా నేరుగా గోదావరిలో కలుస్తోంది. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణం నుంచి మురుగు నీరు నేరుగానే గోదావరిలో కలుస్తోంది. ఇక్కడ ఎస్టీపీ ప్లాంట్ కోసం రూ.18 కోట్లతో ప్రభుత్వానికి ప్రతాపాదనలు పంపారు. ఇటు పెద్దపల్లి జిల్లా మంథని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణాల నుంచి కూడా మురుగునీరు శుద్ధి చేయకుండానే నేరుగా గోదావరిలో కలుపుతున్నారు. -
గోదారి.. ఎడారి!
మంథని: గోదావరి ఎడారిని తలపిస్తోంది. నదిలో నీటి ప్రవాహం పూర్తిగా ఆగిపోయింది. సాధారణంగా ఏప్రిల్..మే మాసంలో ఎండ తీవ్రత అధికంగా ఉంటే గోదావరిలో నీటిధార ఆగిపోతుంది. కానీ.. ఈసారి రెండు మాసాలు ముందుగానే గోదావరి ఎండిపోయింది. వేసవిలో తాగునీటి ముప్పు ఇప్పుడే తెలియజేస్తుంది. నదీపరీవాహక ప్రాంతాల్లో సాగుచేసిన పంటల పరిస్థితి కూడా ప్రశ్నార్థకరంగా మారింది. జిల్లాలో సుమారు వంద కిలో మీటర్ల మేర గోదావరి ప్రవహిస్తోంది. ఎక్కడా చుక్కనీరు కనిపించడంలేదు. కాళేశ్వరం ప్రాజెక్టుతోనే ఈ పరిస్థితి భవిష్యత్తు అవసరాల కోసం గోదావరినదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుతో ఈసారి గోదావరినదిలో నీరు లేకుండా పోయింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ మొదలుకొని సుందిళ్ల పం పుహౌస్ వరకు గోదావరిలో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీంతో నదీ ప్రవాహాన్ని మళ్లించడమే కాకుండా నిర్మాణానికి నీటిని వినియోగిస్తుండడంతో నదీస్వరూపం పూర్తిగా మారిపోయింది. ఒక్క మేడిగడ్డ వద్ద మాత్రం ప్రాణహిత నీటి ప్రవాహం కనిపిస్తుంది. మిగతా బ్యారేజీలు, పంపుహౌస్‌ల వద్ద ఎక్కడా నీరు లేదు. తాగునీటికి పొంచి ఉన్న ముప్పు గోదావరిలో నీటి ప్రవాహం పూర్తిగా ఆగిపోవడంతో ఈ సారి త్రాగునీటి సమస్య ముందే ఎదురౌతుంది. మంథని మేజర్ గ్రామపంచాయతీ ప్రజలకు నీటి సమస్య తలెత్తకుండా ముందు జాగ్రత్తగా అదనంగా బోర్లు వేసి సౌకర్యం కల్పించారు. కాని గ్రామాల్లో ఆ పరిస్థితి లేదు. ఇప్పుడే అనేక గ్రామాల్లో బోర్లలో నీటి మట్టం తగ్గి ప్రజలు తాగునీటి సమస్య ఎదుర్కొంటున్నారు. చెలిమె నీటితో పుణ్యస్నానాలు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించడం ఆచరంగా వస్తుంది. శుభకార్యమైనా..ఆశుభకార్యమైన నదిలో స్నానం చేసి శుద్ధి చేసుకుంటారు. ఐతే నదిలో నీటి ధార లేకపోవడంతో చెలిమలను తోడుకొని పుణ్యస్నానాలు చేస్తున్నారు. గోదావరి నీటిని తీసుకెళ్లి ఇంట్లో శుద్ధిచేసుకుంటున్నారు. ఎవరైనా చనిపోతే వారి అంత్యక్రియల తంతుకూడా గోదావరి నదీతీరంలోనే ఎక్కువమంది చేస్తారు. నదీతీరంలో ఏర్పాటు చేసిన బోరు కింద స్నానాలు చేస్తున్నారు. చనిపోయిన వారి బొక్కలు కలుపడం సంప్రదాయం. ప్రస్తుతం ఆ అవకాశం లేకపోవడంతో కాళేశ్వరంనకు వెళ్తున్నారు. మహాశివరాత్రి భక్తులకు అసౌకర్యమేనా? ఈ నెల 13న మహాశివరాత్రి పర్వదినం ఉంది. పండుగ రోజున పుణ్యస్నానాలు చేసి ఉపవాసంతో జాగరణ చేస్తారు అనేక మంది భక్తులు. మంచిర్యాల జిల్లా వేలా లలో 13 నుంచి వారం రోజుల పాటు పెద్ద ఎత్తున జాతర జరుగుతుంది. మల్లన్నకు భక్తులు బోనాలు సమర్పిస్తారు. జిల్లా పరిధిలోని పెద్దపల్లి, రామగుండం, మంథని నియోజకవర్గాలోని ప్రజలు వేలాల మల్లన్నను దర్శించుకొని బోనాలు, పట్నాలు సమర్పిస్తారు. నదీలో పుణ్యస్నానం చేసి స్వామి వారిని దర్శించుకోవడం ఆచారం. మహా శివరాత్రి మరో వారం రోజులు మాత్రమే ఉంది. పుణ్యస్నానాలకు నీటి వదిలితే తప్ప ఆ అవకాశం భక్తులకు ఉండదు. అధికారులు.. ప్రజాప్రతినిధులు స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
సత్యనారాయణ వ్రతం కోసం వెళ్లి..
చెన్నూర్ : సత్యనారాణయ వ్రతం కోసం వెళ్లిన అన్నాతమ్ముడు గోదావరిలో నీట మునిగి చనిపోయిన సంఘటన చెన్నూర్‌లో విషాదాన్ని నింపింది. ఓ చిన్నారిని కాపాడి తన కొడుకులను రక్షించుకుకోలేకపోయిన ఆ తండ్రి గుండె విలవిల్లాడింది. ‘స్వామి వత్రం కోసం వస్తే మీ ఇద్దర్ని తీసుకెళ్లాడా కొడుకా’ అంటూ తల్లి రోదించిన తీరు అక్కడున్న వారిని కలచివేసింది. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రామంచ గ్రామానికి చెందిన పేరాల రామారావు స్థానిక అభయాంజనేయ ఆలయం సమీపంలో నివాసం ఉంటున్నాడు. రామారావు ప్రజావైన్స్లో ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రామారావు ఇంటి పక్కనే అద్దెకు ఉంటున్న ఆర్యవైశ్యులు పట్టణ సమీపంలోని గోదావరి నదిలో ఆదివారం సామూహిక సత్యనారాయణ వ్రతం చేసుకున్నారు. వ్రతానికి వీరిని ఆహ్వానించడంతో రామారావు, భార్య లావణ్యతోపాటు ఇద్దరు కుమారులు సాయికృష్ణ (11), సాయి వర్షిత్ (6) వెళ్లారు. అక్కడి వెళ్లిన రామారావు పిల్లలతో గోదావరి స్నానాలు చేస్తున్నారు. వీరికి కొంత దూరంలో కొంత మంది చిన్నారులు స్నానాలు చేస్తున్నారు. అందులోంచి ఓ చిన్నారి గోదావరిలో మునిగిపోతుండగా రామారావు పరుగెత్తుకుంటూ వెళ్లి ఒడ్డుకు చేర్చాడు. ఒడ్డుకు వచ్చి చూసే సరికి తన కొడుకులు ఇద్దరు కన్పించలేదు. తండ్రి వెంటనే వెళ్లిన సాయికృష్ణ (11), సాయివర్షిత్(6) గోదావరి నదిలో గల్లంతయ్యారు. చిన్నారులు గల్లంతైన ప్రదేశం లోతుగా ఉండడంతో జాలర్లు గాలింపు చర్యలు చేపట్టి పిల్లల మృతదేహాలను బయటికి తీశారు. సత్యనారాయణ స్వామి వత్రాలను చూసేందుకు వస్తే ఆ స్వామి మీ ఇద్దర్ని తీసుకెళ్లాడా కొడుకా అంటూ తల్లి లావణ్య రోధించిన తీరు పలువురిని కలచివేసింది. మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని ఎస్సై శివప్రసాద్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ మూలరాజిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ కరుణసాగర్‌రావు సందర్శించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కాగా సాయికృష్ణ స్థానిక ఎస్జీబీ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో 4వ తరగతి, సాయివర్షిత్ ఎల్కేజీ చదువుతున్నారు. బంధువుల ఆందోళన సత్యనారాయణ వత్రాలు నిర్వహించే సమీపంలోనే ఇద్దరు చిన్నారులు మృతి చెంది బాధిత కుటుంబ సభ్యులు రోధిస్తుంటే పూజలు నిర్వహించడం ఎంత వరకు సమంజసమని మృతుల బంధువులు గోదావరి తీరం వద్ద ఆందోళన చేశారు. వెంటనే పూజలు నిలిపివేయాలని ఆర్యవైశ్య సంఘం నాయకులతో వాగ్వాదానికి దిగారు. ఎస్సై శివప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళన కారులకు నచ్చజెప్పారు. -
వరద వదిలింది.. బురద మిగిలింది
కొవ్వూరు/పోలవరం : గోదావరిలో వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద ప్రమాద హెచ్చరికలను గురువారం ఉపసంహరించారు. గోష్పాద క్షేత్రంలోని ఆలయాలు వరద ముంపు నుంచి తేరుకున్నాయి. శ్రీబాలా త్రిపురసుందరి సమేత సుందరేశ్వరస్వామి ఆలయం, గీతా మందిరం, షిర్డీసాయి ఆలయంలో ఒండ్రు మట్టి, ఇసుక మేటలు వేశారుు. మూడు రోజులపాటు ఆలయాలు ముంపులోనే ఉండటంతో ధూపదీప నైవేద్యాలు నిలిచిపోయాయి. ఆలయాల్లో పేరుకుపోయిన బురదను గురువారం ఉదయం తొలగించి, శుభ్రం చేసే పనులు చేపట్టారు. గోష్పాద క్షేత్రంలోకి వెళ్లే రహదారులు బురదమయంగా మారాయి. పలుచోట్ల ఇసుక, ఒండ్రు మేటలు వేశారుు. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నీటిమట్టం తగ్గడంతో బుధవారం రాత్రి 11 గంటలకు రెండో ప్రమాద హెచ్చరికను, గురువారం మధ్యాహ్నం 12 గంటలకు మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. సాయంత్రం 4 గంటలకు ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నీటిమట్టం 10.40 అడుగులు నమోదైంది. గోదావరి నుంచి 8,49,625 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచి పెడుతున్నారు. ఆనకట్టకు గల 175 గేట్లను పూర్తి స్థాయిలో ఎత్తివేసి నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరదనీరు తగ్గడంతో లంక భూములు ముంపు బారినుంచి తేరుకుంటున్నాయి. జల దిగ్బంధంలోనే గిరిజన గ్రామాలు పోలవరం/పోలవరం రూరల్ : గోదావరి శాంతించినా ఏజెన్సీ గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారిపై పలుచోట్ల వరద నీరు ఇంకా తొలగిపోలేదు. గిరిజనులు గ్రామాలను విడిచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. స్పిల్‌వే నిర్మాణ ప్రాంతంలో ఇంకా సుమారు ఐదు అడుగుల నీరు రోడ్డుపై ప్రవహిస్తోంది. మామిడిగొంది, దేవరగొంది, చేగొండపల్లి గిరిజనులు మాత్రం కొండల పైనుంచి అంచెలంచెలుగా పోలవరం చేరుకుని నిత్యావసర సరుకులు, అవసరమైన మందులు కొనుగోలు చేసి తీసుకువెళుతున్నారు. స్పిల్‌వే ప్రాంతంలో విద్యుత్ స్తంభం విరిగి పోవడంతో ఏజెన్సీ గ్రామాలకు సింగల్ ఫేజ్ విద్యుత్ మాత్రమే సరఫరా అవుతోంది. దీంతో ఏజెన్సీ గ్రామాల్లో మంచినీటి పథకాలు పనిచేయడం లేదు. మంచినీటి కోసం గిరి జనులు ఇబ్బందులు పడుతున్నారు. కోండ్రుకోట, మాదాపురం గ్రామాల్లో విద్యుత్ సరఫరా లేదు. కొత్తూరు కాజ్వే మీదుగా ఇంకా వరద నీరు ప్రవహిస్తోంది. కొన్నిచోట్ల రోడ్లు బయటపడినా బురద పేరుకుపోవడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. -
ముట్టడి వీడింది
జల‘జాలం’ తొలగిపోతోంది. ఉప్పొంగి, ముంచెత్తి, ముప్పుగా మారిన గోదావరి.. తన ఉగ్రరూపాన్ని ఉపసంహరించుకుంది. నీటి పిడికిట్లో నాలుగురోజులు ఉక్కిరి బిక్కిరైన లంక గ్రామాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి. దారీతెన్నూ లేకుండా పోయిన దుస్థితి నుంచి తేరుకుంటున్నాయి. పలుచోట్ల వరద చిన్నెలు ఇంకా కొనసాగుతున్నా.. మొత్తం మీద బెడద తప్పినట్టే! అమలాపురం : గోదావరి వరద ఉధృతి వేగంగా తగ్గిపోతోంది. ఒక్కరోజులో నది ఉరవడి సగానికి తగ్గిపోయింది. లంకలు జలదిగ్బంధం నుంచి బయటపడుతున్నాయి. నాలుగు రోజుల పాటు ముంపులో కొట్టుమిట్టాడిన లంకగ్రామాల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే కాజ్‌వేలు, రోడ్లపై ఇంకా ముంపునీరు పారుతుండడంతో రాకపోకలు పూర్తిస్థాయిలో ఆరంభం కాలేదు. అయితే మురుగు కాలువల వల్ల ముంపు బారిన పడ్డ గ్రామాలు ఇంకా తెరిపిన పడలేదు. గోదావరి వరద ఎంత వేగంగా ముంచెత్తిందో.. అంతే వేగంగా తగ్గుముఖం పడుతోంది. బుధవారం సాయంత్రం ఆరు గంటలకు ధవళేశ్వరం బ్యారేజి వద్ద 14.70 అడుగుల నీటిమట్టం నమోదు కాగా, 14.15 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. గురువారం సాయంత్రం ఆరు గంటలకు 9.90 అడుగుల నీటిమట్టం నమోదు కాగా, 7.98 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. బుధవారం రాత్రి 11 గంటల సమయంలో రెండో ప్రమాద హెచ్చరిక, గురువారం ఉదయం పది గంటలకు మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించారు. వరద తగ్గడంతో బ్యారేజి ఎగువన ఉన్న దేవీపట్నం, సీతానగరం మండలాల్లోని పలుగ్రామాలు, రాజమండ్రి వద్ద బ్రిడ్జిలంక ముంపు నుంచి బయటపడ్డాయి. ఆయా లంకలకు రాకపోకలు ఆరంభమయ్యాయి. కాగా బ్రిడ్జిలంక వాసుల్లో చాలా మంది శుక్రవారం కానీ వారి ఇళ్ల వద్దకు వెళ్లే అవకాశం లేదు. దిగువ న ఉన్న కోనసీమలంకల్లో సైతం ముంపు వేగంగా తగ్గుతోంది. అయితే పాశర్లపూడిలంక దిగువన, వీరవల్లిపాలెం, చాకలిపాలెం కాజ్‌వేలు, రోడ్లు ఇంకా ముంపులోనే ఉన్నాయి. ముమ్మిడివరం మండలం గురజాపులంక, ఠానేలంకలు ముంపు నుంచి బయటపడ్డా లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు, తోటలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. పి.గన్నవరం, మామిడికుదురుల్లో బి.దొడ్డవరం, అప్పనపల్లి, పాశర్లపూడిలంక, జి.పెదపూడి, ఊడిముడిలంక, కె.ఏనుగుపల్లి, పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోని కోడేరులంక, కనకాయలంక ముంపు నుంచి ఇంకా బయటపడలేదు. తగ్గని డ్రైన్ల ముంపు మంగళవారం వరదకు కొట్టుకుపోయిన పి.గన్నవరం మండలం కె.ఏనుగుపల్లికి చెందిన చింతా కృష్ణమూర్తి మృతదేహం సమీపలంక గ్రామమైన వై.కొత్తపల్లిలంకలో దొరికింది. అయితే బుధవారం రాత్రి కొట్టుకుపోయిన అప్పనపల్లి దేవస్థానం ఉద్యోగి కాండ్రేగుల శ్రీనివాసశాస్త్రి ఆచూకీ లభ్యం కాలేదు. మరోవైపు అయినాపురం, బండార్లంక అప్పర్ కౌశిక డ్రైన్ల ముంపు తీవ్రత అలాగే ఉంది. అయినాపురం డ్రైన్ నుంచి ముంపునీరు ముమ్మిడివరం మండలాల్లోని గ్రామాల్లోనే కాక ఉప్పలగుప్తం, కాట్రేనికోన మండలాల్లోని లోతట్టు ప్రాంతాల వరిచేలను ముంచెత్తుతోంది. డ్రైన్ నుంచి ముంపునీరు గోదావరిలోకి దిగే వరకూ ఈ దుస్థితి తప్పదని ఈ ప్రాంతవాసులు ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి దూరంగా నష్టం అంచనాలు వరద నష్టంపై ఉద్యానశాఖ అధికారులు తయారు చేస్తున్న ప్రాథమిక అంచనాలకు, వాస్తవాలకు పొంతన లేకుండా పోయింది. కేవలం 1984 ఎకరాల్లో మాత్రమే కూరగాయ పంటలు, బొప్పాయి, తమలపాకు, పూల సాగు దెబ్బ తిన్నట్టు చెపుతున్న అధికారులు ముంపుబారిన పడిన కొబ్బరి, అరటి, కోకో వంటి వాణిజ్య పంటలకు నష్టం ఉండదని తేల్చేశారు. వాస్తవంగా నష్టం ఇంతకన్నా బాగా ఎక్కువగానే ఉంటుందని రైతులు చెబుతున్నారు. సీతానగరం, ఆలమూరు, పి.గన్నవరం, కపిలేశ్వరపురం, కొత్తపేట, మామిడికుదురు, అయినవిల్లి మండలాల్లో కూరగాయల పంటలకు అపారనష్టం జరిగింది. ఈ ప్రాంతాల్లోనే సుమారు 5 వేల ఎకరాల్లో పంట దెబ్బ తిందని రైతులు చెబుతున్నారు. అరటిలో నర్సరీ స్థాయి మొక్కలు నాలుగురోజులపాటు ముంపులో ఉండడం వల్ల తెగులు సోకే ప్రమాదం ఉందని వాపోతున్నారు. పశువుల పాకలు ఎక్కువగా ధ్వంసమయ్యాయి. వరద ఉధృతికి లంక గ్రామాల్లోని గ్రావెల్ రోడ్లు దెబ్బ తిన్నాయి. ముంపు నీట నానిన పూరి గుడిసెలు సైతం కూలిపోయే స్థితికి చేరుకుంటున్నాయి. వాస్తవంగా జరిగిన నష్టం తేలాలంటే ప్రభుత్వం, అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరిస్తేనే సాధ్యం. -
దుమ్ముగూడెంతో మనకేం లాభం?
ప్రాజెక్టు నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం నిరాసక్తత సాక్షి, హైదరాబాద్: గోదావరి వరద నీటి మళ్లింపుద్వారా నాగార్జునసాగార్ కుడి, ఎడమ కాల్వల కింద ఆయకట్టు స్థిరీకరణకోసం ఉద్దేశించిన దుమ్ముగూడెం- నాగార్జునసాగర్ టేల్పాండ్ ప్రాజెక్టు పనుల కొనసాగింపుపై తెలంగాణ ప్రభుత్వం సందిగ్ధంలో పడింది. ప్రాజెక్టుతో తెలంగాణకు వచ్చే ప్రయోజనాలు స్వల్పంగా, నిర్మాణానికి అయ్యే వ్యయం భారీగా ఉండటంతో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడంపై ఊగిసలాటలో పడింది. తెలంగాణ ప్రయోజనాల వరకు ప్రాజెక్టును కుదించి నిర్మాణం కొనసాగించాలని గతంలో భావించిన ప్రభుత్వం, ప్రస్తుతం పూర్తిగా ప్రాజెక్టును నిలిపివేయాలనే దిశగా ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ప్రాజెక్టు పనులకోసం సుమారు రూ.700 కోట్ల మేర ఖర్చు చేసినందున ప్రాజెక్టు రద్దు అంత సులభం కాదని భావిస్తున్న ప్రభుత్వం, దీని సాధ్యాసాధ్యాలు, ఇతరత్రా మార్గాలపై అన్వేషణ జరుపుతోంది. ప్రాజెక్టును పూర్తిస్థాయిలో రద్దు చేసే పరిస్థితుల్లో ఎదురయ్యే న్యాయపరమైన చిక్కులపై దృష్టిపెట్టిన ప్రభుత్వం, అన్ని అంశాలను క్రోడీకరించుకునే పనిలో పడింది. అంతిమ నిర్ణయం మాత్రం తెలంగాణ ముఖ్యమంత్రిదేనని తెలుస్తోంది. ప్రాజెక్టుపై ఉన్నతస్థాయి సమీక్ష: ఈ ప్రాజెక్టును కొనసాగించాలా? లేక రద్దు చేయాలా? అన్న అంశంపై గురువారం జలసౌధలోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. సుమారు నాలుగు గంటల పాటు జరిగిన ఈ సమీక్షలో ప్రభుత్వ సలహాదారు విదాయసాగర్రావు, ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్, దుమ్ముగూడెం చీఫ్ ఇంజనీర్ శంకర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు. ప్రాజెక్టును రద్దు చేస్తే తలెత్తే సాంకేతిక, న్యాయపర చిక్కులపై చర్చించారు. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి వ్యక్తమయ్యే అభ్యంతరాలను ఎలా ఎదుర్కోవాలన్నదానిపైనా ఈ సమావేశంలో చర్చించారు. అయితే ప్రాజెక్టు కొనసాగింపు లేక రద్దుపై ఇంకా నిర్ణయానికి రాలేదని, దీనిపై ముఖ్యమంత్రిదే తుది నిర్ణయమని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. -
గోదావరిలో బోటు బోల్తా.. ప్రయాణికులు సురక్షితం
హైదరాబాద్: తూర్పు గోదావరి జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. గోదావరి నదిలో టూరిస్టులను తీసుకెళ్తున్న బోటు బలమైన ఈదురు గాలులకు తిరగబడింది. కాగా ప్రయాణికులందరూ సురక్షింగా బయటపడ్డారు. సఖినేటిపల్లి మండలం అంతర్వేదీ ద్వీపంలో శనివారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది. టూరిస్టులందరినీ వెంటనే రక్షించి వేరే బోటులోకి చేర్చారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. టూరిస్టులందరినీ సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.