
మంథని వద్ద ఎడారిని తలపిస్తున్న గోదావరి
మంథని: గోదావరి ఎడారిని తలపిస్తోంది. నదిలో నీటి ప్రవాహం పూర్తిగా ఆగిపోయింది. సాధారణంగా ఏప్రిల్..మే మాసంలో ఎండ తీవ్రత అధికంగా ఉంటే గోదావరిలో నీటిధార ఆగిపోతుంది. కానీ.. ఈసారి రెండు మాసాలు ముందుగానే గోదావరి ఎండిపోయింది. వేసవిలో తాగునీటి ముప్పు ఇప్పుడే తెలియజేస్తుంది. నదీపరీవాహక ప్రాంతాల్లో సాగుచేసిన పంటల పరిస్థితి కూడా ప్రశ్నార్థకరంగా మారింది. జిల్లాలో సుమారు వంద కిలో మీటర్ల మేర గోదావరి ప్రవహిస్తోంది. ఎక్కడా చుక్కనీరు కనిపించడంలేదు.
కాళేశ్వరం ప్రాజెక్టుతోనే ఈ పరిస్థితి
భవిష్యత్తు అవసరాల కోసం గోదావరినదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుతో ఈసారి గోదావరినదిలో నీరు లేకుండా పోయింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ మొదలుకొని సుందిళ్ల పం పుహౌస్ వరకు గోదావరిలో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీంతో నదీ ప్రవాహాన్ని మళ్లించడమే కాకుండా నిర్మాణానికి నీటిని వినియోగిస్తుండడంతో నదీస్వరూపం పూర్తిగా మారిపోయింది. ఒక్క మేడిగడ్డ వద్ద మాత్రం ప్రాణహిత నీటి ప్రవాహం కనిపిస్తుంది. మిగతా బ్యారేజీలు, పంపుహౌస్‌ల వద్ద ఎక్కడా నీరు లేదు.
తాగునీటికి పొంచి ఉన్న ముప్పు
గోదావరిలో నీటి ప్రవాహం పూర్తిగా ఆగిపోవడంతో ఈ సారి త్రాగునీటి సమస్య ముందే ఎదురౌతుంది. మంథని మేజర్ గ్రామపంచాయతీ ప్రజలకు నీటి సమస్య తలెత్తకుండా ముందు జాగ్రత్తగా అదనంగా బోర్లు వేసి సౌకర్యం కల్పించారు. కాని గ్రామాల్లో ఆ పరిస్థితి లేదు. ఇప్పుడే అనేక గ్రామాల్లో బోర్లలో నీటి మట్టం తగ్గి ప్రజలు తాగునీటి సమస్య ఎదుర్కొంటున్నారు.
చెలిమె నీటితో పుణ్యస్నానాలు
గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించడం ఆచరంగా వస్తుంది. శుభకార్యమైనా..ఆశుభకార్యమైన నదిలో స్నానం చేసి శుద్ధి చేసుకుంటారు. ఐతే నదిలో నీటి ధార లేకపోవడంతో చెలిమలను తోడుకొని పుణ్యస్నానాలు చేస్తున్నారు. గోదావరి నీటిని తీసుకెళ్లి ఇంట్లో శుద్ధిచేసుకుంటున్నారు. ఎవరైనా చనిపోతే వారి అంత్యక్రియల తంతుకూడా గోదావరి నదీతీరంలోనే ఎక్కువమంది చేస్తారు. నదీతీరంలో ఏర్పాటు చేసిన బోరు కింద స్నానాలు చేస్తున్నారు. చనిపోయిన వారి బొక్కలు కలుపడం సంప్రదాయం. ప్రస్తుతం ఆ అవకాశం లేకపోవడంతో కాళేశ్వరంనకు వెళ్తున్నారు.
మహాశివరాత్రి భక్తులకు అసౌకర్యమేనా?
ఈ నెల 13న మహాశివరాత్రి పర్వదినం ఉంది. పండుగ రోజున పుణ్యస్నానాలు చేసి ఉపవాసంతో జాగరణ చేస్తారు అనేక మంది భక్తులు. మంచిర్యాల జిల్లా వేలా లలో 13 నుంచి వారం రోజుల పాటు పెద్ద ఎత్తున జాతర జరుగుతుంది. మల్లన్నకు భక్తులు బోనాలు సమర్పిస్తారు. జిల్లా పరిధిలోని పెద్దపల్లి, రామగుండం, మంథని నియోజకవర్గాలోని ప్రజలు వేలాల మల్లన్నను దర్శించుకొని బోనాలు, పట్నాలు సమర్పిస్తారు. నదీలో పుణ్యస్నానం చేసి స్వామి వారిని దర్శించుకోవడం ఆచారం. మహా శివరాత్రి మరో వారం రోజులు మాత్రమే ఉంది. పుణ్యస్నానాలకు నీటి వదిలితే తప్ప ఆ అవకాశం భక్తులకు ఉండదు. అధికారులు.. ప్రజాప్రతినిధులు స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment