అరటి 'ధర'హాసం | Banana prices hike in Ravulapalem banana market Yard | Sakshi
Sakshi News home page

అరటి 'ధర'హాసం

Published Sat, Jul 16 2016 2:50 AM | Last Updated on Mon, Sep 4 2017 4:56 AM

అరటి 'ధర'హాసం

అరటి 'ధర'హాసం

భారీగా పెరిగిన అరటి ధరలు    
* రూ.600 పలుకుతున్న కర్పూర, అమృతపాణి

రావులపాలెం : అరటి గెలల ధరలు పెరిగాయి. జూన్ నుంచి ఈ పరిస్థితి మొదలు కాగా, గోదావరి వరద నేపథ్యంలో ప్రస్తుతం ధరలు మరింత పెరిగాయి. దీంతో రావులపాలెం అరటి మార్కెట్‌యార్డులో ఎగుమతులు జోరందుకున్నాయి. పది రోజుల క్రితం వరకూ యార్డుకు వచ్చే ప్రధాన రకాలైన కర్పూర, అమృతపాణి తదితర గెల ధర గరిష్టంగా రూ.400 నుంచి రూ.450 వరకూ పలికేది. అయితే ప్రస్తుతం అది రూ.600కు చేరింది. పెరిగిన ధరలు దసరా పండగ రోజుల వరకూ కొనసాగే అవకాశాలు ఉన్నాయని అరటి వ్యాపారి కోనాల చంద్రశేఖరరెడ్డి చెబుతున్నారు.
 
లాభాలవైపు అడుగులు
గత ఏడాది నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకూ గిట్టుబాటు ధర లేక నష్టాలు చూసిన అరటి రైతులు ప్రస్తుతం పెరిగిన ధరలతో లాభాల వైపు అడుగులు వేస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో తప్ప అరటి పండించే మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడా దిగుబడులు పెద్దగా లేకపోవడంతో ప్రస్తుతం రావులపాలెం యార్డుకు వచ్చే అరటికి డిమాండ్ పెరిగింది.

ఇక్కడ నుంచి కేరళ, తమిళనాడు, బిహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ రాష్ట్రాలకు ఎగుమతులు పెరిగాయి. తమిళనాడు రాష్ర్టంతోపాటు విజయనగరం జిల్లా పార్వతీపురం, సాలూరు తదితర ప్రాంతాల్లో అరటి దిగుబడి పడిపోయింది. దీంతో అక్కడి వ్యాపారులు ఇక్కడకు వచ్చి కొనుగోళ్లు చేస్తున్నారు. ఈ కారణాలతో అరటి గెలల ధరలు పెరిగాయి.
 
ముంపుబారిన..
ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రమే సుమారు 20 వేల హెక్టార్లలో అరటి దిగుబడి వస్తోంది. ప్రస్తుతం గోదావరి వరదలతో సుమారు 2 వేల ఎకరాల్లో లంక ప్రాంతాల్లోని పంట మునిగిపోయింది. దీంతో ఉన్న దిగుబడికి డిమాండ్ మరింత పెరిగింది. రావులపాలెం అరటి మార్కెట్‌కు సీజన్‌లో రోజుకు 25 నుంచి 30 వేల గెలలను రైతులు అమ్మకానికి తీసుకువచ్చేవారు. ప్రస్తుతం 10 వేల గెలలు మాత్రమే వస్తున్నాయి. రావులపాలెం అరటి మార్కెట్ యార్డు నుంచి వివిధ ప్రాంతాలకు సుమారు 15 లారీల సరుకు రవాణా అవుతోంది. రోజుకు సుమారు రూ.25 నుంచి రూ.30 లక్షల వ్యాపారం జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement