సాక్షి, ఖమ్మం/తూర్పుగోదావరి: భద్రాచలం వద్ద గోదావరి వరద మధ్యాహ్నం 3.19 గంటలకు 43 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ డా.ప్రియాంక తెలిపారు. గోదావరి నుండి 9 లక్షల 32 వేల 228 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
ముంపునకు గురయ్యే ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు జిల్లా యంత్రాంగపు సలహాలు, సూచనలు పాటించాలని చెప్పారు.
అధికార యంత్రాంగం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. ప్రజలు ఇళ్ళ నుండి బయటకి రావొద్దని, అత్యవసర సేవలకు కంట్రోల్ రూము నంబర్లకు కాల్ చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.
గోదావరి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో భద్రాచలం టౌన్‌లోకి లీకేజీ వాటర్ పెద్ద ఎత్తున వస్తుంది. దీంతో రామయ్య ఆలయం చుట్టూ పరిసర ప్రాంతాల్లో వరద నీరు వచ్చి చేరింది. దీంతో సింగరేణి నుంచి తెప్పించిన హై పవర్ మోటార్ల సహాయంతో నీటిని రివర్స్‌గా మళ్లీ గోదావరిలో పంపించే ప్రయత్నం చేస్తున్నారు.
తూర్పు గోదావరి:
ధవళేశ్వరం వద్ద గోదావరికి వరద తీవ్రత పెరుగుతుంది. కోటిపల్లి స్నాన ఘట్టాలను వరద తాకడంతో కోటిపల్లి-ముక్తేశ్వరం పంటి ప్రయాణాలు నిలిపివేశారు. కోటిపల్లి గోదావరి సమీప గ్రామాలను అధికారులు అప్రమత్తం చేశారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా
పి.గన్నవరం మండలం గంటి పెదపూడిలో నదీపాయ గట్టుకు వరద తాకిడితో తాత్కాలిక గట్టు తెగిపోయింది. దీంతో నాలుగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గంటి పెదపూడి, బురుగులంక, అరిగెల వారిపాలెం,పెదలంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు పడవపైనే ప్రయాణాలు చేస్తున్నారు. మరింత వరద పెరిగితే కోనసీమలోని కనకాయలంక, అయినవిల్లి ఎదురు బిడియం కాజ్‌వేల పైకి కూడా వరద నీరు చేరనుంది.
ఉమ్మడి వరంగల్ జిల్లా:
ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షం వరదలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో వాగులు వంకలు పొంగి పోర్లడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
లోతట్టు ప్రాంతాలు జలమయమై వరంగల్‌తో పాటు పలు గ్రామాల్లోని కాలనీల్లో ఇళ్లలోకి నీళ్లు చేరి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ములుగు జిల్లా టేకులగూడెం వద్ద గోదావరి వరద ఉధృతికి రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వర్ధన్నపేట మండలం కట్రియాల- ఇల్లంద మద్య జాతీయ రహదారిపై భారీ వృక్షం కూలడంతో వరంగల్-ఖమ్మం మార్గంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
తెలంగాణలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతి కుమారి అత్యవసర సమావేశం నిర్వహించారు. సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ఆధార్ సిన్హా, రజత్ కుమార్, సునీల్ శర్మ,రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా తదితరులు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment