Banana prices
-
అమ్మో.. అరటిపండు.. డజన్ రూ.80 పైమాటే.. ఎందుకంటే?
కడప కల్చరల్(వైఎస్సార్ జిల్లా): అమ్మో... అరటిపండు!.. ఆ మాటెత్తితే సామాన్యుడు ఉలిక్కిపడుతున్నాడు. మొన్నటివరకు సామాన్యుడి పండుగా పేరుగాంచిన అరటి ధర నేడు చుక్కలనంటుతోంది. పెళ్లిళ్లు, ఇతర శుభ కార్యాలు, పూజల్లో అరటి పండు ప్రధానపాత్ర వహిస్తోంది. విందు భోజనాల్లో ఎన్ని రకాలు వడ్డించినా చివరగా అరటిపండు లేకపోతే తృప్తిగా ఉండదంటారు. చదవండి: సీమ బిడ్డల సినిమా కథ.. 60 సినిమాలు, 100కు పైగా సీరియళ్లు.. ‘పోలీస్’ దావూద్ అలాంటి పండు ధర క్రమంగా రెండు నెలలుగా కొండెక్కి కూర్చొంది. డజన్ రూ. 20గా ఉన్న పండ్లు నేడు రూ. 80 లకు పైగా అమ్ముతున్నారు. కాస్త పెద్ద సైజు పండైతే రూ. 100 వెచ్చించాల్సి వస్తోంది. ప్రస్తుతం వివాహ ముహూర్తాలు, శుభకార్యాలు లేకపోయినా అరటిపండ్ల ధర ఈ స్థాయిలో ఉంటే ఈనెల 29వ తేది నుంచి శ్రావణమాసం రావడం, నెలాఖరు వరకు వరుస ముహూర్తాలు ఉండడంతో మరింత ప్రియం అయ్యే అవకాశం ఉంది. ధర ‘పండు’తోంది ఏప్రిల్ వరకు డజన్ రూ. 20గా ఇంటింటికి తిరిగిన అరటిపండ్ల వ్యాపారులు మే నుంచి క్రమంగా కనుమరుగయ్యారు. కేవలం కడప నగరంలోనే 400కు పైగా ఉన్న అరటిపండ్లు విక్రయించే బండ్లు నేడు నాలుగో శాతానికి పడిపోయాయి. ముఖ్యంగా కూడళ్లలో అరటి పండ్ల వ్యాపారాలే అధికంగా కనిపించేవి. ప్రస్తుతం బండ్లు కిక్కిరేసి ఉండే పాత బస్టాండు లాంటి ప్రాంతంలో కూడా నాలుగైదుకు మించి అరటిపండ్ల బండ్లు కనిపించడం లేదు. కొనుగోలుదారుడు తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లినా కూడా పండ్లలో నాణ్యత కనిపించదు. ఇంతకుమించి మంచి సరుకు రావడం లేదని, అసలు తోటల నుంచి దిగుబడి పూర్తిగా తగ్గిపోయిందని, ఒకటి, రెండు మినహా సాగు, తోటలు తగ్గాయని విక్రయదారుడు పేర్కొంటున్నారు. ఈ పాతికేళ్లలో రూ.50కి మించి అరటిపండ్ల ధర లేదని, ఇప్పుడు ఒక్కసారిగా రూ. 80లుగా తిష్ట వేసుకుని కూర్చొవడం తమకు కూడా ఇబ్బందిగా ఉందని, రోజూ 200–400 డజన్ల పండ్లు అమ్మే తాము ఇప్పుడు 25 డజన్లు కూడా అమ్మలేక పోతున్నామని, అమ్ముదామన్నా బండి నిండుగా కూడా సరుకు లభించడం లేదని వాపోతున్నారు. వ్యాపారం మానేశాం ! గత 20 ఏళ్లుగా హౌసింగ్‌బోర్డు సెంటర్లో అరటిపండ్లను విక్రయిస్తున్నాను. ఒకటిన్నర నెలగా సరుకు లేక ఉన్నా...అంత ధర పెట్టి కొనేవారు రాకపోవడంతో ఈ వ్యాపారం మానేశాను. పరిస్థితి ఇంకా ఒకటి, రెండు నెలలు ఇలాగే కొనసాగితే అందరికీ కష్టమే. – విజయుడు, అరటిపండ్ల వ్యాపారి, కడప -
అరటి ధరహాసం.. హెక్టారుకు రూ.15లక్షల ఆదాయం
రోజు రోజుకూ అరటి ధరలు పెరుగుతున్నాయి. సాగు తక్కువగా ఉండటంతో ఉత్పత్తి తగ్గి అరటిధరలు రెట్టింపు అయ్యాయి. రెండు నెలల కిందట టన్ను రూ.5 వేల నుంచి రూ.8 వేలు ఉన్న ధర ఇప్పుడు ఏకంగా రూ.20 వేలకు చేరింది. యాపిల్ పండ్ల ధరలతో అరటి పోటీ పడుతోంది. పెరిగిన ధరలతో అరటి రైతుల ఆనందపడుతున్నారు. ఆళ్లగడ్డ: ఈ ఏడాది అరటి సాగు చేసిన రైతులకు లాభాల పంట పండుతోంది. కాస్త ఖర్చుతో కూడుకున్నదైనప్పటికీ నికరంగా ఆదాయం తెచ్చిపెడుతుండటంతో రైతులు అరటి సాగుపై ఆసక్తి చూపిస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో ఉత్సాహంగా పండ్ల తోటలు సాగు చేస్తున్నారు. నంద్యాల జిల్లా పరిధిలో ఈసారి సుమారు 10 వేల ఎకరాల్లో అరటి తోటలు సాగవుతున్నాయి. ముఖ్యంగా మహానంది, ప్యాపిలి, ఆళ్లగడ్డ, చాగలమర్రి, రుద్రవరం తదితర మండలాల్లోని రైతులు అధికంగా అరటి తోటల పెంపకంపై దృష్టి సారిస్తున్నారు. లాభాల వైపు అడుగులు రెండేళ్ల నుంచి ధర అంతంత మాత్రమే ఉన్న అరటి గెలల ధరలు ఇటీవల ఒక్కసారిగా భారీగా పెరిగాయి. రెండు నెలల వరకు టన్ను రూ.5 వేల నుంచి రూ.8 వేల వరకు ధర పలికింది. ఒక్కో సమయంలో కొనుగోలు చేసేందుకు వ్యాపారులు రాక తోటలోనే వదిలేసిన సంఘటనలు ఉన్నాయి. అయితే అనూహ్యంగా జూన్ నుంచి ధరలు పెరగడం మొదలు కాగా ప్రస్తుతం ధరలు మరింత పెరిగి టన్ను రూ.20 వేల నుంచి రూ.25 వేల పైగానే ధర పలుకుతోంది. అరటి తోట ప్రస్తుతం జీ9 రకం అరటికి మంచి గిరాకీ ఉంది. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలతో పాటు కృష్ణా, ఉభయ గోదావరి తదితర ప్రాంతాల్లో అరటి దిగుబడులు లేకపోవడంతో ప్రస్తుతం రాయలసీమ అరటి గెలలకు మంచి డిమాండ్ వచ్చింది. కేరళ, తమిళనాడు, బిహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు ఇక్కడకు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. దీంతో ధర ఊహించిన దానికంటే ఎక్కువగా పలుకుతుండటంతో నిన్నటి మొన్నటి వరకూ ధరలేక నష్టపోయిన రైతులు పెరిగిన ధరను చూసి ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. 10 వేల ఎకరాల్లో సాగు నంద్యాల జిల్లాలోని వివిధ మండలాల్లో సుమారు 10 వేల ఎకరాల్లో అరటి సాగు చేస్తున్నారు. ఎకరాకు 1,200 మొక్కలు (టిష్యూ కల్చర్) చొప్పున రూ.60 వేలు ఖర్చు చేసి నాటుతున్నారు. సాగు ఖర్చులు, మందులకు అంతా కలిపి ఎకరాకు మరో రూ..40 వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చు అవుతుంది. కౌలు రైతుకు అయితే మరో రూ.30 వేలు అదనంగా అవుతుంది. 1,200 మొక్కల్లో కనీసం 900 నుంచి 1,000 చెట్లు గెలలు తెగినా సరాసరి 30 నుంచి 40 టన్నుల దిగుబడి వస్తుంది. ప్రస్తుతం ఉన్న ధర ఉంటే ఖర్చులు పోను ఎకరాకు రూ.4 లక్షల వరకు ఆదాయం లభిస్తుంది. రెండో పంటకు ఖర్చు తక్కువ అరటి తోట సాగుకు తొలిసారి మాత్రమే ఖర్చు అధికంగా ఉంటుంది. రెండో ఏడాది ఎక్కువగా ఉండదు. కాండం నుంచి వచ్చిన ఐదారు పిలకల్లో మంచి పిలకను ఎంచుకుని మిగతావి తీసి వేస్తే సరిపోతుంది. దీంతో విత్తనం ఖర్చు సుమారు ఎకరాకు రూ.60 వేల వరకు తగ్గుతుంది. సేద్యాల ఖర్చు ఉండదు. ఎరువులు కూడా పెద్దగా అవసరముండక పోవడంతో రైతన్నలకు ఖర్చు తగ్గి ఆదాయం పెరుగుతుంది. రైతులకు చేయూత ఇలా.. ఏరియా, వాతావరణ పరిస్థితులను బట్టి ఆ ప్రాంతంలో సాగుకు అవసరమైన నాణ్యమైన టిష్యూ కల్చర్ మొక్కల నుంచి మైక్రో ఇరిగేషన్, సమగ్ర సస్యరక్షణ (ఐఎన్ఎం), సమగ్ర ఎరువులు, పురుగుల మందుల యాజమాన్యం (ఐపీఎం) ప్రూట్ కేర్ యాక్టివిటీ వరకు ఒక్కో రైతుకు గరిష్టంగా హెక్టార్‌కు రూ.40 వేల వరకు ప్రభుత్వం ఆర్థిక చేయూత ఇస్తోంది. తోట బడుల ద్వారా రైతులకు సాగులో మెలకువలపై శిక్షణ ఇస్తున్నారు. సాగుచేసే ప్రతి రైతుకు గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ సర్టిఫికేషన్ (జీఏపీ) ఇస్తారు. -
ధర వెలవెల! రైతు విలవిల
సాక్షి, అమరావతి: పేదోడి పండుగా పిలిచే అరటికి ఇప్పుడు గడ్డురోజులు వచ్చాయి. గిట్టుబాటు ధరలేక దానిని సాగు చేస్తున్న రైతులు విలవిల్లాడుతున్నారు. నెల కిందట రూ.17 వేలు పలికిన టన్ను కాయలు ప్రస్తుతం రూ.12 వేలకు పడిపోవడమే కారణం. కొన్ని ప్రాంతాలలో గెలకు రూ.50 కూడా రాకపోవడంతో మార్కెట్ యార్డుల్లోనే వాటిని వదిలేస్తున్న దుస్థితి నెలకొంది. గుంటూరు జిల్లా తెనాలి ప్రాంతంలో అయితే కాయ కోయడం కూడా వృధా అని రైతులు వదిలేస్తున్నారు. శుభకార్యాలు లేకపోవడం, వాతావరణంలో వచ్చిన మార్పులు, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లోనూ అరటిసాగు పెరగడం, బెంగాల్ నుంచి ఒడిశాకు అధిక మొత్తంలో దిగుమతులు పెరగడం ధరలు పడిపోవడానికి కారణంగా చెబుతున్నారు. అరటి సాగులో ఏపీది 4వ స్థానం దేశంలో అధికంగా అరటి సాగుచేసే రాష్ట్రాల్లో ఏపీది నాలుగో స్థానం. ఇక్కడ సుమారు 1,12,995 హెక్టార్లలో సాగవుతోంది. అరటి సాగుచేసే జిల్లాల్లో 35,620 హెక్టార్లతో వైఎస్సార్ కడప అగ్రస్థానంలో ఉంది. ఇక రాష్ట్రం నుంచి ఏటా 63,84,730 టన్నుల అరటి దిగుబడి వస్తుందని అంచనా. కాగా, మన రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్లయిన రావులపాలెం, రాజంపేట, పులివెందుల, అనంతపురం, తెనాలి వంటి కేంద్రాల నుంచి బెంగళూరు, చెన్నై, కోల్‌కత, ఢిల్లీ, ఉత్తరాది రాష్ట్రాల మార్కెట్లకు అరటి ఎగుమతి అవుతుంది. మార్కెట్లలో పరిస్థితి ఎలా ఉందంటే.. అనంతపురం జిల్లాలో ప్రస్తుతం 16,400 హెక్టార్లలో అరటి సాగవుతోంది. హెక్టార్‌కు 62 టన్నులకు పైగా దిగుబడి వస్తోంది. నెల కిందట మేలి రకం అరటి టన్ను రూ.17వేలు పలికింది. ఇప్పుడది రూ.13 వేలకు, రూ.12 వేలు పలికిన రెండో రకం ఇప్పుడు రూ.9 వేలకు పడిపోయింది. పులివెందులలో టన్ను ధర రూ.11, రూ.12 వేల మధ్య ఉంది. ఎగుమతులు తగ్గడానికి చలి తీవ్రతే కారణంగా చెబుతున్నారు. ఇక.. తెనాలి మార్కెట్లో పెద్ద గెల (పది అత్తాలు) రూ.50 నుంచి రూ.60 మధ్య ఉంది. చిన్న గెలయితే కేవలం రూ.25, మరీ చిన్నదైతే రూ.15లకు అమ్ముడవుతున్నాయి. కానీ, విడిగా అయితే డజను కాయలు సైజును బట్టి మార్కెట్లో రూ.30, రూ.50 పలుకుతున్నాయి. రావులపాలెం మార్కెట్లో ఇలా.. ఇదిలా ఉంటే.. ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో సుమారు 32,418 హెక్టార్లలో అరటి సాగవుతోంది. ఇక్కడి రావులపాలెం అరటి మార్కెట్ యార్డులో కూడా అరటి ధరలు దారుణంగా పతనమయ్యాయి. ముహూర్తాలు, శుభకార్యాలు లేకపోవడం, కర్పూర రకం అధికంగా సాగు చేయడంతో ధరలు తగ్గాయి. దీనికి తోడు విజయనగరం జిల్లా సాలూరు, పార్వతీపురం తదితర ప్రాంతాల్లో ప్రస్తుతం అరటి పంట అందివచ్చింది. సీజన్లో ఈ యార్డుకు రోజుకు 35–40 వేల గెలలు వచ్చేవి. తమిళనాడు, ఒడిశా, బీహార్, తదితర రాష్ట్రాలతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు సుమారు 40 లారీల సరుకు రవాణా అయ్యేది. కానీ, ప్రస్తుతం అది 20–25 లారీలకు పడిపోయింది. దీంతో కొనుగోళ్లు లేక రైతులు తాము తెచ్చిన గెలలను యార్డులోనే వదిలి వెళ్లాల్సిన దయనీయ స్థితి నెలకొంది. రూ.150 కూలీ చెల్లించి తీసుకువచ్చిన ఆరు గెలలకు (లోడు) రూ. 200 కూడా ధర పలకక రైతులు తీరని నష్టాలు ఎదుర్కొంటున్నారని అరటి వ్యాపారి కోనాల చంద్రశేఖరరెడ్డి అంటున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలి మాది అనంతపురం జిల్లా పుట్లూరు మండలం ఎల్లుట్ల. నాలుగు ఎకరాల్లో అరటి సాగు చేస్తున్నా. కాయ బాగా వచ్చిన తర్వాత ధర లేదు. టన్నుకు కనీసం రూ.15 వేలు అయినా ఉంటే తప్ప గిట్టుబాటు కాదు. కానీ, రూ.13 వేలు కూడా రావడంలేదు. పోయిన నెలలో రూ.17 వేలకు అమ్మాం. ధరల స్థిరీకరణ నిధితో ప్రభుత్వం ఆదుకుంటే బాగుంటుంది. – టి. నారాయణస్వామి,అరటి రైతు -
అరటి 'ధర'హాసం
భారీగా పెరిగిన అరటి ధరలు * రూ.600 పలుకుతున్న కర్పూర, అమృతపాణి రావులపాలెం : అరటి గెలల ధరలు పెరిగాయి. జూన్ నుంచి ఈ పరిస్థితి మొదలు కాగా, గోదావరి వరద నేపథ్యంలో ప్రస్తుతం ధరలు మరింత పెరిగాయి. దీంతో రావులపాలెం అరటి మార్కెట్‌యార్డులో ఎగుమతులు జోరందుకున్నాయి. పది రోజుల క్రితం వరకూ యార్డుకు వచ్చే ప్రధాన రకాలైన కర్పూర, అమృతపాణి తదితర గెల ధర గరిష్టంగా రూ.400 నుంచి రూ.450 వరకూ పలికేది. అయితే ప్రస్తుతం అది రూ.600కు చేరింది. పెరిగిన ధరలు దసరా పండగ రోజుల వరకూ కొనసాగే అవకాశాలు ఉన్నాయని అరటి వ్యాపారి కోనాల చంద్రశేఖరరెడ్డి చెబుతున్నారు. లాభాలవైపు అడుగులు గత ఏడాది నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకూ గిట్టుబాటు ధర లేక నష్టాలు చూసిన అరటి రైతులు ప్రస్తుతం పెరిగిన ధరలతో లాభాల వైపు అడుగులు వేస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో తప్ప అరటి పండించే మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడా దిగుబడులు పెద్దగా లేకపోవడంతో ప్రస్తుతం రావులపాలెం యార్డుకు వచ్చే అరటికి డిమాండ్ పెరిగింది. ఇక్కడ నుంచి కేరళ, తమిళనాడు, బిహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ రాష్ట్రాలకు ఎగుమతులు పెరిగాయి. తమిళనాడు రాష్ర్టంతోపాటు విజయనగరం జిల్లా పార్వతీపురం, సాలూరు తదితర ప్రాంతాల్లో అరటి దిగుబడి పడిపోయింది. దీంతో అక్కడి వ్యాపారులు ఇక్కడకు వచ్చి కొనుగోళ్లు చేస్తున్నారు. ఈ కారణాలతో అరటి గెలల ధరలు పెరిగాయి. ముంపుబారిన.. ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రమే సుమారు 20 వేల హెక్టార్లలో అరటి దిగుబడి వస్తోంది. ప్రస్తుతం గోదావరి వరదలతో సుమారు 2 వేల ఎకరాల్లో లంక ప్రాంతాల్లోని పంట మునిగిపోయింది. దీంతో ఉన్న దిగుబడికి డిమాండ్ మరింత పెరిగింది. రావులపాలెం అరటి మార్కెట్‌కు సీజన్లో రోజుకు 25 నుంచి 30 వేల గెలలను రైతులు అమ్మకానికి తీసుకువచ్చేవారు. ప్రస్తుతం 10 వేల గెలలు మాత్రమే వస్తున్నాయి. రావులపాలెం అరటి మార్కెట్ యార్డు నుంచి వివిధ ప్రాంతాలకు సుమారు 15 లారీల సరుకు రవాణా అవుతోంది. రోజుకు సుమారు రూ.25 నుంచి రూ.30 లక్షల వ్యాపారం జరుగుతోంది.