కడప కల్చరల్(వైఎస్సార్ జిల్లా): అమ్మో... అరటిపండు!.. ఆ మాటెత్తితే సామాన్యుడు ఉలిక్కిపడుతున్నాడు. మొన్నటివరకు సామాన్యుడి పండుగా పేరుగాంచిన అరటి ధర నేడు చుక్కలనంటుతోంది. పెళ్లిళ్లు, ఇతర శుభ కార్యాలు, పూజల్లో అరటి పండు ప్రధానపాత్ర వహిస్తోంది. విందు భోజనాల్లో ఎన్ని రకాలు వడ్డించినా చివరగా అరటిపండు లేకపోతే తృప్తిగా ఉండదంటారు.
చదవండి: సీమ బిడ్డల సినిమా కథ.. 60 సినిమాలు, 100కు పైగా సీరియళ్లు.. ‘పోలీస్’ దావూద్
అలాంటి పండు ధర క్రమంగా రెండు నెలలుగా కొండెక్కి కూర్చొంది. డజన్ రూ. 20గా ఉన్న పండ్లు నేడు రూ. 80 లకు పైగా అమ్ముతున్నారు. కాస్త పెద్ద సైజు పండైతే రూ. 100 వెచ్చించాల్సి వస్తోంది. ప్రస్తుతం వివాహ ముహూర్తాలు, శుభకార్యాలు లేకపోయినా అరటిపండ్ల ధర ఈ స్థాయిలో ఉంటే ఈనెల 29వ తేది నుంచి శ్రావణమాసం రావడం, నెలాఖరు వరకు వరుస ముహూర్తాలు ఉండడంతో మరింత ప్రియం అయ్యే అవకాశం ఉంది.
ధర ‘పండు’తోంది
ఏప్రిల్ వరకు డజన్ రూ. 20గా ఇంటింటికి తిరిగిన అరటిపండ్ల వ్యాపారులు మే నుంచి క్రమంగా కనుమరుగయ్యారు. కేవలం కడప నగరంలోనే 400కు పైగా ఉన్న అరటిపండ్లు విక్రయించే బండ్లు నేడు నాలుగో శాతానికి పడిపోయాయి. ముఖ్యంగా కూడళ్లలో అరటి పండ్ల వ్యాపారాలే అధికంగా కనిపించేవి. ప్రస్తుతం బండ్లు కిక్కిరేసి ఉండే పాత బస్టాండు లాంటి ప్రాంతంలో కూడా నాలుగైదుకు మించి అరటిపండ్ల బండ్లు కనిపించడం లేదు. కొనుగోలుదారుడు తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లినా కూడా పండ్లలో నాణ్యత కనిపించదు.
ఇంతకుమించి మంచి సరుకు రావడం లేదని, అసలు తోటల నుంచి దిగుబడి పూర్తిగా తగ్గిపోయిందని, ఒకటి, రెండు మినహా సాగు, తోటలు తగ్గాయని విక్రయదారుడు పేర్కొంటున్నారు. ఈ పాతికేళ్లలో రూ.50కి మించి అరటిపండ్ల ధర లేదని, ఇప్పుడు ఒక్కసారిగా రూ. 80లుగా తిష్ట వేసుకుని కూర్చొవడం తమకు కూడా ఇబ్బందిగా ఉందని, రోజూ 200–400 డజన్ల పండ్లు అమ్మే తాము ఇప్పుడు 25 డజన్లు కూడా అమ్మలేక పోతున్నామని, అమ్ముదామన్నా బండి నిండుగా కూడా సరుకు లభించడం లేదని వాపోతున్నారు.
వ్యాపారం మానేశాం !
గత 20 ఏళ్లుగా హౌసింగ్‌బోర్డు సెంటర్‌లో అరటిపండ్లను విక్రయిస్తున్నాను. ఒకటిన్నర నెలగా సరుకు లేక ఉన్నా...అంత ధర పెట్టి కొనేవారు రాకపోవడంతో ఈ వ్యాపారం మానేశాను. పరిస్థితి ఇంకా ఒకటి, రెండు నెలలు ఇలాగే కొనసాగితే అందరికీ కష్టమే.
– విజయుడు, అరటిపండ్ల వ్యాపారి, కడప
Comments
Please login to add a commentAdd a comment