![CM YS Jagan Inquired About Godavari Flood Situation - Sakshi](/styles/webp/s3/article_images/2020/08/16/CM-YS-JAGAN.jpg.webp?itok=MagjeWEe)
సాక్షి, అమరావతి: గోదావరి వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరా తీశారు. సీఎం కార్యాలయ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ముంపు ప్రాంతాల నుంచి ఇప్పటికే చాలా మందిని తరలించారని, వచ్చే వరదను దృష్టిలో ఉంచుకుని మరిన్ని చర్యలు తీసుకుంటున్నట్టుగా సీఎంవో అధికారులు సీఎంకు వివరించారు. ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లకు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చినట్టుగా కూడా ఆయనకు తెలిపారు. వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. (పవన్ అభిమానికి సీఎం జగన్ ఆర్థిక సాయం)
ముంపునకు గురయ్యే ప్రాంతాలపై దృష్టి పెట్టాలని, ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా వారిని రక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. దీని కోసం ప్రత్యేకంగా సహాయ పునరావాస శిబిరాలు తెరిచి వారికి అన్నిరకాల సౌకర్యాలు అందించాలన్నారు. ఉభయగోదావరి జిల్లాలకు చెందిన ఇద్దరు కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సీఎం స్పష్టం చేశారు. రక్షణ చర్యలు, సహాయ పునరావాస కార్యక్రమాల కోసం ఎస్డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్ సహా సంబంధిత సిబ్బందిని సిద్ధం చేసుకోవాలన్నారు. రాష్ట్ర విపత్తు నిర్వహణా శాఖతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుని తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. గోదావరి వరద ఉధృతి, ముంపు పరిస్థితులపై ఎప్పటికప్పుడు తనకు నివేదించాలన్నారు. ఇటు కృష్ణా జిల్లాలో కూడా భారీ వర్షాలు, అనంతర పరిస్థితులపై సీఎం ఆరా తీశారు. అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ బాధితులను ఆదుకోవాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment