సాక్షి, అమరావతి: గోదావరి వరదల ఉధృతికి పోలవరం ప్రాజెక్టులో గ్యాప్–1, గ్యాప్–2 ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్‌ఎఫ్) డ్యామ్‌ల నిర్మాణ ప్రదేశానికి ఎగువన నదీ గర్భంలో కోతకు గురైన ప్రాంతాన్ని ఎలా పటిష్టపర్చాలనే అంశాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించాకే తేల్చాలని డీడీఆర్పీ (డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్) నిర్ణయించింది. డ్రిప్ (డ్యామ్ రిహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రోగ్రామ్)–2 కింద ఆధునీకరణకు ఎంపికైన ధవళేశ్వరం బ్యారేజీ, శ్రీశైలం ప్రాజెక్టులను పరిశీలించేందుకు జనవరి 7న డీడీఆర్పీ చైర్మన్ ఏబీ పాండ్య రాష్ట్రానికి వస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజీని పరిశీలించిన రోజునే పోలవరం ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో తనిఖీచేసి.. అపరిష్కృత డిజైన్లకు తుదిరూపు ఇవ్వాలని నిర్ణయించారు.
వర్చువల్ విధానంలో డీడీఆర్పీ భేటీ
మరోవైపు.. పోలవరం ప్రాజెక్టు డిజైన్ల రూపకల్పన కోసం సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) మాజీ చైర్మన్ ఏబీ పాండ్య అధ్యక్షతన కేంద్రం ఏర్పాటుచేసిన డీడీఆర్పీ సోమవారం వర్చువల్ విధానంలో సమావేశమైంది. పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ) సీఈవో చంద్రశేఖర్ అయ్యర్, రాష్ట్ర జలవనరుల శాఖ ఈఎన్‌సీ నారాయణరెడ్డి, పోలవరం ప్రాజెక్టు, సీడబ్ల్యూసీ అధికారులతోపాటు సీడబ్ల్యూపీఆర్‌ఎస్ (సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్), సీఎస్‌ఎంఆర్‌ఎస్ (సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్) శాస్త్రవేత్తలు, ఐఐటీ–ఢిల్లీ, ఐఐటీ–చెన్నై ప్రొఫెసర్లు పాల్గొన్నారు.
స్పిల్ వే నిర్మించకుండా వరద ప్రవాహాన్ని మళ్లించేలా కాఫర్ డ్యామ్ పనులను ప్రారంభిం చి.. మధ్యలోనే వాటిని వదిలేయడంవల్ల వరద ఉధృతికి ఈసీఆర్‌ఎఫ్ డ్యామ్ గ్యాప్–1, గ్యాప్–2 కు ఎగువన ఇసుక తిన్నెలు కోతకు గురయ్యాయి. వాటిని ఇసుకతో నింపడం, వైబ్రో కాంపక్షన్ పద్ధతిలో ఇసుక తిన్నెలను పటిష్టపర్చడం.. డెన్సిఫికేషన్ (సాంద్రీకరణ) ద్వారా ఇసుక తిన్నెలను అ త్యంత పటిష్టంగా తీర్చిదిద్దడం, స్టోన్ కాలమ్స్ విదానంలో అభివృద్ధి చేసే విధానాలను డీడీఆర్పీకి అధికారులు వివరించారు.
పోలవరం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి.. ఏ విధానం ప్రకారం చేస్తే కోతకు గురైన ఇసుక తిన్నెలను అత్యంత పటిష్టంగా తీర్చిదిద్దవచ్చో అనే అంశంపై తుది నిర్ణయం తీసుకుంటామని పాండ్య చెప్పారు. గోదావరి నదీ ప్రవాహాన్ని స్పిల్ వే వైపునకు మళ్లించేందుకు నది వద్ద 450 మీటర్లు వెడల్పు.. ఆ తర్వాత ప్రతి వంద మీటర్లకూ 50 మీటర్ల వెడల్పును పెంచుతూపోయి.. స్పిల్ వే వద్దకు వచ్చేసరికి 1,100 మీటర్ల వెడల్పుతో అప్రోచ్ చానల్ తవ్వేలా డిజైన్‌ను 17వ డీడీఆర్పీ సమావేశంలోనే ఆమోదించారు. కానీ, నది వద్ద ప్రారంభంలో అప్రోచ్ చానల్ వెడల్పును 450 మీటర్లతో కాకుండా 550 మీటర్లకు పెంచే అంశంపై డీడీఆర్పీ చర్చించింది. ప్రారంభంలో అప్రోచ్ ఛానల్ వెడల్పును పెంచడంవల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని తేల్చారు. పోలవరం స్పిల్ వే సహా హెడ్ వర్క్స్‌లో అన్ని పనుల పటిష్టతను పరీక్షించే పనిని చెన్నైకి చెందిన సీఎస్‌ఐఆర్–ఎస్‌ఈఆర్‌సీ సంస్థకు అప్పగించేందుకు డీడీఆర్పీ అంగీకరించింది.
కోతకు గురైన నదీ గర్భం అభివృద్ధి.. క్షేత్రస్థాయిలో పరిశీలించాకే
Published Tue, Dec 21 2021 6:01 AM | Last Updated on Tue, Dec 21 2021 6:01 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment