పోలవరాన్ని వేగంగా పూర్తి చేయండి | Chandrababu Naidu on Polavaram project | Sakshi
Sakshi News home page

పోలవరాన్ని వేగంగా పూర్తి చేయండి

Published Wed, Nov 6 2024 4:22 AM | Last Updated on Wed, Nov 6 2024 4:22 AM

Chandrababu Naidu on Polavaram project

సమాంతరంగా డయాఫ్రం వాల్, ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాం పనులు చేపట్టండి

జలవనరుల శాఖ అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం

సాక్షి, అమరావతి: కేంద్ర జలసంఘంతో చర్చించి డయాఫ్రం వాల్, ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) డ్యాం పనులను సమాంతరంగా చేపట్టడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని జలవనరుల శాఖ ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. పోలవరం ప్రాజెక్ట్, చింతలపూడి, వెలిగొండ, గోదావరి–పెన్నా అనుసంధానం ప్రాజెక్టులపై మంగళవారం సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. 

పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ సంస్థ ప్రతిని­ధులు మాట్లాడుతూ.. జనవరిలో డయాఫ్రం వాల్‌ పనులు ప్రారంభిస్తే పూర్తి కావడానికి సరిగ్గా ఏడాది పడుతుందని.. ఆ తరువాత ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాం పనులు చేపట్టి, పూర్తి చేయడానికి 24 నెలలు పడుతుందని వివరించా­రు. డయాఫ్రం వాల్, ఈసీ­ఆర్‌ఎఫ్‌ డ్యాం పనులు సమాంతరంగా  చేపడితే 2027 జూలై నాటికి.. విడివిడిగా పనులు చేపడితే 2028 మార్చి నాటికి పనులు పూర్తి చేయవ­చ్చన్నారు. 

అధికారులు మాట్లాడుతూ.. ఈసీఆర్‌­ఎఫ్‌ డ్యాం గ్యాప్‌–2 నిర్మాణ ప్రాంతంలో 0.40 టీ­ఎంసీల నీటిని ఎత్తిపోశామని.. ప్రస్తుతం సముద్ర మట్టానికి 15.9 మీటర్ల స్థాయిలో నీటి నిల్వ తగ్గిందని వివరించారు. 

భూసేకరణకు రూ.7,213 కోట్లు అవసరం
పోలవరం ప్రాజెక్టు తొలి దశలో భూసేకరణ, ఆర్‌ అండ్‌ ఆర్‌ పనులకు రూ.7,213 కోట్లు అవస­రమ­ని.. ఇంకా 16,440 ఎకరాల భూసేకరణ చే­యా­ల్సి ఉందని అధికారులు సీఎంకు చెప్పారు. 2025 ఏప్రిల్‌కి భూసేకరణ, 2026 ఏప్రిల్‌ నాటికి ఆర్‌ అండ్‌ ఆర్‌ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకు­న్నామన్నారు. 

పోలవరం కుడి కాలువ సామర్థ్యాన్ని 30 వేల క్యూసెక్కులకు తీసుకువెళ్లాలనే అంశంపైనా సమీక్షలో చర్చించారు. కొత్తగా మరో కాలువ నిర్మించడమా లేదా ఉన్న కాలువను విస్తరించడమా అనే అంశంపై చర్చిస్తున్నామని అధికారులు తెలిపారు. పోలవరం ప్రాజెక్టుతోపాటు అప్పట్లో అనుకున్న విధంగా ఐకానిక్‌ బ్రిడ్జి నిర్మాణం కూడా చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. జలవిద్యుత్‌ ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలన్నారు. 

ఈ నెలలో పోలవరం ప్రాజెక్టును పరిశీలించి.. పనులపై ప్రణాళిక విడుదల చేస్తానని చెప్పారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం కింద 3 లక్షల ఎకరాలకు నీళ్లందించేందుకు రూ.2,463 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని అధికారులు వివరించగా ఆ పనులు పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

పోలవరంలో నేటి నుంచి వర్క్‌షాప్‌
అంతర్జాతీయ నిపుణులతో డయాఫ్రం వాల్, ప్రధాన డ్యాం డిజైన్లు, నిర్మాణంపై చర్చ 
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడంపై ప్రాజెక్టు వద్దే బుధవారం నుంచి 4రోజుల­పాటు కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) మేధోమథనం చేయనుంది. డ్యాం­ల నిర్మాణం, భద్రత, భూ¿ౌగోళిక సాంకేతికత(జియో టెక్నికల్‌) తదితర అంశాలపై అపార అనుభవం ఉన్న డేవిడ్‌ బి.­పాల్, రిచర్డ్‌ డొన్నెల్లీ, గియాస్‌ ఫ్రాంక్‌ డి సిస్కో, సీస్‌ హించ్‌బెర్గర్‌లతో కూడిన అంతర్జాతీయ నిపుణుల బృందం ప్రాజెక్టును పరిశీలించి.. నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యలను అధిగమించేందుకు చేపట్టాల్సిన చర్యలపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), సీడబ్ల్యూసీలకు నివేదిక ఇచ్చింది. 

వర్షాకాలం ముగియగానే పనులు ప్రారంభించే ముందు నవంబర్‌ మొదటి వారంలో పోలవరం వద్ద వర్క్‌షాప్‌ నిర్వహించి.. డిజైన్లు, నిర్మాణంపై చర్చిద్దామని అంతర్జాతీయ నిపుణుల కమిటీ సూచించింది. ఆ మేరకు సీడబ్ల్యూసీ వర్క్‌షాప్‌ నిర్వహిస్తోంది. ఇందులో పాల్గొనేందుకు అంతర్జాతీయ నిపుణుల బృందం మంగళవారం రాత్రికి రాజమహేంద్రవరం చేరుకుంది. 4 రోజులపాటు ప్రాజె­క్టు వద్దే అంతర్జాతీయ నిపుణుల బృందం ఉంటుంది. 

వర్క్‌షాప్‌లో అంతర్జాతీయ నిపుణులు, పీపీఏ, సీడబ్ల్యూసీ, డ్యాం డిజైన్‌ రివ్యూ ప్యానల్‌(డీడీఆరీ్ప), సీఎస్‌ఎంఆర్‌ఎస్‌ (సెంట్రల్‌ సాయిల్‌ మెటీ­రి­యల్‌ రీసెర్చ్‌ స్టేషన్‌), వ్యాప్కోస్‌ ప్రతినిధులు పా­ల్గొంటారు. ప్రాజెక్టు ప్రధాన కాంట్రాక్ట్‌ సంస్థ మేఘా తరఫున డిజైన్లు రూపొందిస్తున్న ఆఫ్రి, బావర్‌ ప్ర­తిని«­దులు, రాష్ట్ర జలవనరుల శాఖ తరఫున ఈఎన్‌­సీ ఎం.వెంకటేశ్వరరావు, పోలవరం సీఈ నరసింహమూర్తి ఈ వర్క్‌షాప్‌లో పాల్గొననున్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement