పోలవరం ముంపుపై తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు సీడబ్ల్యూసీ చైర్మన్ ఆదేశం
150 అడుగుల ఎఫ్‌ఆర్‌ఎల్‌తో ఉండే ప్రభావంపై అధ్యయనం చేయాలి
క్షేత్రస్థాయిలో ముర్రెడువాగు, కిన్నెరసాని వాగుల ముంపుపై డీమార్కింగ్ చేయాలి
ముంపు గుర్తించిన తర్వాత నివారణ చర్యలపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టులో 150 అడుగుల గరిష్ట నీటిమట్టం (ఎఫ్‌ఆర్‌ఎల్) మేరకు నీళ్లను నిల్వ చేస్తే తెలంగాణ భూభాగంలో ఏర్పడనున్న ముంపు ప్రభావంపై పోలవరం ప్రాజెక్టు ఆథారిటీ (పీపీఏ) ఆధ్వర్యంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో తక్షణమే జాయింట్ సర్వే నిర్వహించాలని కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) చైర్మన్ కుస్విందర్ సింగ్ వోరా ఆదేశించారు.
పోలవరం ప్రాజెక్టుతో కిన్నెరసాని, ముర్రెడువాగులకు ఏర్పడనున్న ముంపుపై ఎన్జీటీ ఆదేశాల మేరకు ఇప్పటికే జాయింట్ సర్వే నిర్వహించగా, తదుపరిగా క్షేత్ర స్థాయిలో ముంపు ప్రాంతాన్ని గుర్తిస్తూ డీమార్కింగ్ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల తో తక్షణమే జాయింట్ సర్వే నిర్వహించి డీమార్కింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని వోరా ఆదేశించారు.
పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రభావాని కి సంబంధించి తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, రాష్ట్ర ప్రభుత్వాల అభ్యంతరాలపై బుధవారం ఢిల్లీలోని సీడబ్ల్యూసీ కార్యాలయంలో వోరా అధ్యక్షతన సాంకేతిక కమిటీ సమావేశం జరిగింది. కమిటీ సభ్యులై న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రా ష్ట్రాల నీటిపారుదల శాఖ ఇంజనీర్లు పాల్గొన్నారు.
ఎప్పటికైనా సర్వే చేయాల్సిందే: వోరా
పోలవరం ప్రాజెక్టు ఎఫ్‌ఆర్‌ఎల్ ఎప్పటికైనా 150 అడుగులే ఉంటుందని, దీనివల్ల తెలంగాణలో ఉండనున్న ముంపు ప్రభావంపై ఎప్పుడైనా సర్వే చేసి నివారణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని సీడబ్ల్యూసీ చైర్మన్ వోరా స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో సర్వే జరగకపోవచ్చని, ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో తెలంగాణ కోరిన మేరకు జాయింట్ సర్వే చేయాల్సిందేనని సూచించారు.
జాయింట్ సర్వేను సమన్వయం చేయాలని పీపీఏ ను ఆదేశించారు. 150 అడుగుల నిల్వతో ఏర్పడే ముంపుతో పాటు ప్రాజెక్టు కారణంగా ముర్రెడువాగు, కిన్నెరసాని వాగులకు ఉండే ముంపును గుర్తించి నివేదిక సమర్పిస్తే, ముంపు నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఏపీ, తెలంగాణతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. తెలంగాణ కోరి న మేరకు.. పోలవరం ప్రాజెక్టుతో మిగిలిన 5 వాగులకు ఉండనున్న ముంపుపై జాయింట్ సర్వే విషయంలో మళ్లీ సమావేశమై నిర్ణయం తీసుకుందా మని చెప్పారు.
కాగా పోలవరం ప్రాజెక్టుతో సీడబ్ల్యూసీ సర్వేలో తేలిన దానికి మించి తమ రాష్ట్రంలో ముంపు ప్రభావం ఉందని ఒడిశా నీటిపారుదల శాఖ సీఈ అశుతోష్ దాస్ పేర్కొన్నారు. ఐఐటీ రూ ర్కెలా అధ్యయన నివేదికలో ఇది తేలిందన్నారు. ఈ నివేదికపై అధ్యయనం చేసి తదుపరి సమావేశంలో చర్చిస్తామని సీడబ్ల్యూసీ చైర్మన్ హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో తెలంగాణ అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం సీఈ మోహన్ కుమార్, డిప్యూటీ డైరెక్టర్ సుబ్రమణ్యం, పీపీఏ సీఈఓ అతుల్ జైన్, సీఈ రఘురామ్ తదితరులు పాల్గొన్నారు.
ఎలాంటి పురోగతి లేదు: తెలంగాణ
గత సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల మేరకు జాయింట్ సర్వేకు ఏపీ ప్రభుత్వం ముందుకు రావడం లేదని తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ (ఓ అండ్ ఎం) బి.నాగేందర్‌రావు తెలియజేశారు. గత సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి ఎలాంటి పురోగతి లేదని, కాగితాలకే పరిమితమయ్యాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. 150 అడుగుల ఎఫ్‌ఆర్‌ఎల్‌తో తెలంగాణలో 950 ఎకరాలు ముంపునకు గురవుతాయని, దీనిపై జాయింట్ సర్వే చేయాల్సిందేనని ఆయన కోరారు.
మరోవైపు జాయింట్ సర్వేకు తెలంగాణ సహకరించడం లేదని, సర్వే రెండు వాగులకే పరిమితం చేయాల్సి ఉండగా, ఏడు వాగులు సర్వే చేయాలని కోరుతోందని ఏపీ అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం సీఈ శ్రీనివాసరావు చెప్పారు. అయితే ముర్రెడువాగు, కిన్నెరసాని వాగుల జాయింట్ సర్వేకు పూర్తిగా సహకరించిన విషయాన్ని తెలంగాణ ఈఎన్‌సీ గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment