మళ్లీ గోదారి కన్నెర్ర
Published Mon, Aug 19 2013 5:12 AM | Last Updated on Fri, Sep 1 2017 9:54 PM
అమలాపురం, న్యూస్‌లైన్ : నెలరోజుల్లో గోదావరి వరద నాలుగోసారి పోటెత్తింది. లంక గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది. ప్రస్తుతం గోదావరి వరద ఉద్ధృతి తగ్గుతున్నప్పటికీ ఇప్పుడిప్పుడే ముంపు నుంచి కోలుకుంటున్న లంక గ్రామాలు, పంట భూములు మరోసారి ముంపుబారిన పడ్డాయి. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల గోదావరికి వరద పోటెత్తింది. వరద ఉద్ధృతి తగ్గినా దిగువ ప్రాంతాల్లోని లంక గ్రామాల్లో ముంపునీరు పోటెత్తింది. అయినవిల్లి మండలంలో ముక్తేశ్వరం కాజ్‌వే నీట మునిగింది. కాజ్‌వేపై మూడు నంచి నాలుగు అడుగుల మేర నీరు ఉండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే అప్పనపల్లి ఉచ్చిలివారిపేట కాజ్‌వే నీటమునిగింది. అప్పనపల్లి ప్రధాన కాజ్‌వే ముంపుబారిన పడే అవకాశం ఉంది. అయినవిల్లి మండలంలోని వీరవల్లిపాలెం, అయినవిల్లిలంక, కొండుకుదురులంక, ముమ్మిడివరం మండలం గురజాపులంక, లంకాఫ్‌ఠానేల్లంక, కూనాల్లంక తదితర లంకగ్రామాలతోపాటు పి.గన్నవరం, కొత్తపేట, మలికిపురం మండలాల్లోని లోతట్టు ప్రాంతాలపై వరద ప్రభావం పడింది. కొబ్బరి, అరటితోటల్లోకి ముంపునీరు వచ్చి చేరింది. ఇప్పటికే కూరగాయలు, వాణిజ్య పంటలు నష్టపోయిన రైతులను తాజావరద కలవరానికి గురిచేసింది.
నాలుగోసారి...
గోదావరికి నెలరోజుల వ్యవధిలో వరుసగా నాలుగోసారి వరద పోటెత్తింది. గత నెల 20న తొలిసారి వరద పోటెత్తడంతో లంకగ్రామాలు నీటమునిగాయి. వరద ఉద్ధృతి తగ్గుతున్న సమయంలో అదే నెల 25న మరోసారి గోదావరి ఉగ్రరూపం దాల్చింది. అదితగ్గుతున్న సమయంలో ఈనెల 3న మరింత వరద వచ్చి లంకగ్రామాలను నిండా ముంచేసింది. అంతకుముందువచ్చిన రెండు వరదల కన్నా మూడోసారి అతి తక్కువ సమయంలో వరద పోటెత్తడంతో లంకగ్రామాలు విలవిల్లాడిపోయాయి. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి అత్యధికంగా 21.50లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి వదిలారు.
దీనితో అయినవిల్లి, ముమ్మిడివరం, పి.గన్నవరం, మామిడికుదురు, ఆత్రేయపురం, మలికిపురం, కపిలేశ్వరపురం, ఆలమూరు మండలాల్లోని లోతట్టు ప్రాంతాలు వరదబారిన పడ్డాయి. 90గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకోగా 95 గ్రామాలు పూర్తిగా నీటమునిగాయి. సుమారు 5వేల ఎకరాల్లో కూరగాయల పంటలు తుడిచిపెట్టుకుపోయాయి. 1.50లక్షల మందిపై వరద ప్రభావం చూపింది. లంక గ్రామాల్లోనే కాకుండా అవుట్‌ఫాల్ స్లూయిజ్‌లు దెబ్బతినడంతో డెల్టా ప్రాంతంపై ప్రభావం పడింది. దాంతో సుమారు 3వేల ఎకరాల పంటనీటమునిగింది. రూ.130కోట్లు ఆస్తినష్టంవాటిల్లిందని అధికారులు చెబుతున్నా అంతకుమించి నష్టం వాటిల్లిందని అంచనా. తాజాగా నాలుగోసారి వరద రావడం, మధ్యలో అప్పుడప్పుడు వరద పోటెత్తుతుండడం లంకవాసులను కలవరానికి గురిచేస్తోంది.
పెరిగి తగ్గిన గోదావరి నీటిమట్టం
ధవళేశ్వరం : గోదావరి పరీవాహక ప్రాంతాల్లో పడుతున్న వర్షాలతో కాటన్‌బ్యారేజీ వద్ద శనివారం సాయంత్రం నుంచి పెరుగుతూ వచ్చిన గోదావరి నీటిమట్టం ఆదివారం మధ్యాహ్నం నుంచి తగ్గుముఖం పట్టింది. బ్యారేజీ వద్ద ఆదివారం ఉదయం 10 గంటలకు గరిష్ఠంగా 11.50 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. మధ్యాహ్నం 12 గంటల వరకు అదే నీటిమట్టం నిలకడగా కొనసాగింది. మధ్యాహ్నం నుంచి నీటి ఉద్ధృతి క్రమేపీ తగ్గుతూ సాయంత్రం 6 గంటలకు 11.20 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. బ్యారేజీ నుంచి 9,56,900 క్యూసెక్కుల జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. సోమవారం నాటికి ధవళేశ్వరం వద్ద మరో అడుగు నీటిమట్టం తగ్గవచ్చని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. భద్రాచ లం వద్ద 40.80 అడుగుల వద్ద నీటిమట్టం కొనసాగుతోంది.
Advertisement
Advertisement