ఖమ్మం వ్యవసాయం: ఈనెల 7 నుంచి నాలుగు రోజుల పాటు వచ్చిన గోదావరి వరదలతో జిల్లాలోని నదీ పరివాహక ప్రాంతంలో 26,014 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. అయితే ఏ పంటలు ఎంతశాతం మేర నష్టపోయాయో అంచనా వేసేందుకు అధికార యంత్రాగం సమాయత్తమవుతోంది. మూడు, నాలుగు రోజుల పాటు పొలాల్లో నీరు నిలిచి పైర్లు కుళ్లిపోవడంతో పాటు పలు ప్రాంతాల్లో మటి ్టకొట్టుకుపోయి దెబ్బతిన్నాయి. వరి దుబ్బు నుంచి గుండ్రకు తిరిగే దశలో ఉండగా, పత్తి పూత నుంచి కాత దశలో ఉంది.
మొక్కజొన్న కంకి దశలో, పెసర, మినుము పూత దశలో ఉన్నాయి. మిర్చి మాత్రం మొక్క దశలో ఉంది. అయితే ఆయా దశల్లో ఉన్న వరి, పత్తి, మొక్కజొన్న, పెసర, మినుము పంటలకు మాత్రమే నష్ట పరిహారం వర్తిస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. మిరప మొక్కలు వేసి నాటి కొద్ది రోజులే అవుతున్నందున ప్రభుత్వ నిబంధనల ప్రకారం వీటికి పరిహారం వర్తించదని ఉద్యాన శాఖ అధికారులు అంటున్నారు.
అయినా.. పై రెండు శాఖల అధికారులు మాత్రం నష్టపోయిన పంటలన్నింటి వివరాలను ప్రభుత్వానికి అందజేసేందుకు సిద్ధమవుతున్నారు. వ్యవసాయ, ఉద్యాన, రెవెన్యూ అధికారులు బృందాలుగా ఏర్పడి పంట నష్టం అంచనా వేయనున్నారు. నిబంధనల మేరుకు 50 శాతం పైగా దెబ్బతిన్న పంటలకు మాత్రమే పరిహారం ఇస్తారు. వరి, పత్తి పంటలకు హెక్టారుకు రూ.10 వేలు, మొక్కజొన్న హెక్టారుకు రూ. 8,333, పెసర, మినుము పంటలకు హెక్టారుకు రూ. 6,250, ప్రభుత్వ నిబంధనల మేరకు నష్టం జరిగిన మిర్చి హెక్టారుకు రూ.10 వేలు నష్ట పరిహారంగా చెల్లిస్తారు.
నష్టం వివరాలివీ...
ఇటీవలి గోదావరి వరదలతో వీఆర్ పురం, కూనవరం, చింతూరు, భద్రాచలం, దుమ్ముగూడెం, వాజేడు, వెంకటాపురం, చర్ల, మణుగూరు, పినపాక, అశ్వాపురం, కుక్కునూరు, వేలేరుపాడు, బూర్గంపాడు మండలాల్లోని 13,233 మంది రైతులకు చెందిన పంటలు దెబ్బతిన్నాయి. ఆయా మండలాలకు చెందిన 4291 మందికి చెందిన 8,287 ఎకరాల వరి, 7260 మంది రైతులకు చెందిన 13,522 ఎకరాల పత్తి, 11 మంది రైతులకు చెందిన 30 ఎకరాల మొక్కజొన్న, 41 మంది రైతులకు చెందిన 65 ఎకరాల పెసర, 12 మంది రైతులకు చెందిన 13 ఎకరాల మినుము పంటలు నీట మునిగినట్లు వ్యవసాయ శాఖ గుర్తించింది.
ఇక 1618 మంది రైతులకు చెందిన 3,607 ఎకరాల మిర్చికి నష్టం వాటిల్లినట్లు ఉద్యానవనశాఖ తేల్చింది. ఇందులో కుక్కునూరు, వేలేరుపాడు, బూర్గంపాడు మండలాల్లో అధిక నష్టం వాటిల్లింది. జిల్లాలోని ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్‌లో కలిపినప్పటికీ ఆయా మండలాల్లో ఇక్కడి సిబ్బంది పని చేస్తుండటంతో అక్కడ కూడా జిల్లా అధికారులే పంట నష్టం అంచనా వేస్తున్నారు. నష్ట పోయిన పంటల నివేదికలు అందించిన తర్వాత పరిహారం చెల్లింపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం ప్రత్యేకంగా మార్గదర్శకాలు ఇస్తే వాటిని కూడా పరిగణనలోకి తీసుకొని కలెక్టర్ ఆదేశాల మేరకు నష్టం అంచనాలు వేస్తామని జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు పి.బి.భాస్కర్‌రావు ‘సాక్షి’కి తెలిపారు.
నష్టం @26 వేల ఎకరాలు
Published Fri, Sep 12 2014 1:28 AM | Last Updated on Sat, Sep 2 2017 1:13 PM
Advertisement
Advertisement