ఖమ్మం వ్యవసాయం: గోదావరి ఉప్పొంగడంతో జిల్లాలోని నదీ పరీవాహక ప్రాంతాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వీఆర్.పురం, కూనవరం, భద్రాచలం, దుమ్ముగూడెం, వాజేడు, వెంకటాపురం, చర్ల, మణుగూరు, పినపాక, అశ్వాపురం, కుక్కునూరు, వేలేరుపాడు, బూర్గంపాడు మండలాల పరిధిలోని 170 గ్రామాల్లో 20,867 ఎకరాల్లో వివిధ రకాల పంటలు నీట మునిగినట్లు జిల్లా సంయుక్త వ్యవసాయ సంచాలకులు పి.బి.భాస్కర్ రావు తెలిపారు.
5,020 మంది రైతులకు చెందిన 11,077 ఎకరాల్లో పత్తి నీట మునిగిందని, ఇందులో అత్యధికంగా వేలేరుపాడు మండలంలో 2,600 ఎకరాలు ఉందని చెప్పారు. 3,310 మంది రైతులకు చెందిన 7,622 ఎకరాల్లో వరి పంట నీట మునిందన్నారు. ఇందులో పినపాక మండలంలో 2,300 ఎకరాలు, వెంకటాపురం మండలంలో 2,250 ఎకరాల్లో వరిపంట దెబ్బతిన్నదని వివరించారు. 632 మంది రైతులకు చెందిన 2,130 ఎకరాల్లో మిర్చి నీట మునిగిందన్నారు. ఇంకా 30 ఎకరాల్లో మొక్కజొన్న, 68 ఎకరాల్లో వేసిన పప్పుదినుసుల పంటలకు నష్టం వాటిల్లిందని వివరించారు.
ముందే వేసిన పంటలు..
భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో మే, జూన్ నెలల్లో వర్షాలు కురియటంతో ముందుగానే పత్తి వేశారు. ఈ ప్రాంతంలో పత్తి దాదాపు పూత, కాత దశలో ఉంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం మొక్క దశలోనే ఉంది. ఇప్పటికే ఈ పంటకు రైతులు ఎకరాకు రూ.12 వేలకు పైగా పెట్టుబడి పెట్టారు. నీట మునిగిన పంట కుళ్లి పోతుంది. వరదల తరువాత ఈ పంట ఎర్రబారి తెగుళ్లు సోకి పనికిరాకుండా పోయే ప్రమాదం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఇటీవల వరి నాట్లు వేయగా, మరికొన్ని ప్రాంతాల్లో నెల రోజుల క్రితమే వేశారు.
ప్రస్తుతం ఈ పంట కూడా నీట మునిగి, కుళ్లి పోయి పనికి రాకుండా పోతుందని, మొక్కజొన్న, కంది, పెసర, మినుము పంటలు కూడా నీట మునిగాయని రైతు సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. నీట మునిగిన ప్రాంతాల ప్రజలకు సౌకర్యాలు కల్పించటంతో పాటు ఆయా శాఖల అధికారులు నష్టాలపై దృష్టి సారించాలని కలెక్టర్ ఇలంబరితి ఆదేశించారు. దీంతో జేడీఏ పి.బి.భాస్కర్ రావు గోదావరి పరివాహక ప్రాంత మండలాల వ్యవసాయాధికారులకు నీట మునిగిన పంటలపై పలు సూచనలు చేశారు. వరదలు పూర్తిగా తగ్గితే కానీ నష్టం అంచనాలు వేయలేమని అధికారులు చెప్పారు. 50 శాతానికి పైగా నష్టం వాటిల్లిన పంటల వివరాలను సేకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
20 వేల ఎకరాల్లో పంట నష్టం
Published Tue, Sep 9 2014 1:49 AM | Last Updated on Sat, Sep 2 2017 1:04 PM
Advertisement
Advertisement