ఖమ్మం: జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో గోదావరి, దాని ఉపనదులు, ఇతరత్ర వాగులూ వంకలు ఉప్పొంగినప్పుడు విద్యుత్ సరఫరా కష్టమవుతోంది. విద్యుత్ స్తంభాలు వరదల్లో చిక్కుకుపోవడం, నేలకూలడం వంటివి చోటుచేసుకొని విద్యుత్ అంతరాయం సంభవిస్తోంది. రోజులు, వారాల తరబడి కరెంట్ లేక అటవీప్రాంత ప్రజలు అంధకారం మధ్య బతుకువెళ్లాదీయాల్సి వస్తోంది. ఇక మీదట అలాంటి కష్టాలకు చెక్ పెట్టేందుకు ట్రాన్స్‌కో సిద్ధమైంది. రూ. 1.75 కోట్లతో ఇప్పటికే పనులు ప్రారంభించింది.
ఆలోచనకు అంకురార్పణ
గత సంవత్సరం వరదలు వచ్చినప్పుడు జిల్లా అధికారులతోపాటు ఎన్‌పీడీసీఎల్ (నార్థర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్) అధికారులు కూడా ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ప్రజలకు విద్యు త్ ఇబ్బందులు కలగకుండా శాశ్విత ఏర్పాటు చేయాలని ట్రాన్స్‌కో అధికారులను ఆదేశించారు. ఇందు కు కావాల్సిన ప్రతిపాదనలు పంపించాలని జిల్లా ట్రాన్స్‌కో అధికారులకు సూచించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అప్పటి ఉమ్మడి రాష్ట్రంలోని 14 మండలాల గ్రామాలకు ఈ వరద కష్టాలు ఉంటాయని తేల్చారు. ఆయా ప్రాంతాల్లో హైలెవల్ టవర్స్ నిర్మించాలని అధికారులు భావించారు.
ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో విలీనమయ్యే గ్రామాలు మినహా మిగిలిన గ్రామాలకు ముందుగా లైన్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఎన్‌పీడీసీఎల్, ఐటీడీఏ నిధులతోపాటు తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి నిధులు కూడా దీనికి కేటాయించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇందుకోసం రూ. 1.75 కోట్లతో ఆయా ప్రాంతాల్లో సబ్‌స్టేషన్ల నిర్మాణం, ఇతర పనులు చేపట్టేందుకు టెండర్ ప్రక్రియ కూడా పూర్తి చేశారు. పనులు ప్రారంభించారు.
విద్యుత్ లైన్లు ముంపునకు గురయ్యే ప్రాంతాలు..
భద్రాచలం డివిజన్‌లోని దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాల్లో గోదావరి వరదలకు విద్యుత్ లైన్లు నీటమునుగుతాయి. సరఫరాకు ఆటంకం ఏర్పడుతుంది. ఆయా గ్రామాలు అంధకారంలో మగ్గుతుంటాయి. ప్రధానంగా దుమ్ముగూడెం మండలం తూరుబాక, రేగుబల్లి, గంగోలు, ప్రగళ్లపల్లి, సీతానగరం, పర్ణశాల. చర్ల మండలం దేవరాపల్లి, కుదునూరు, తేగడ, గుంపెన్నగూడెం, గొళ్లగూడెం, సుబ్బంపేట, వెంకటాపురం మండలం ఎదిర, సూరవీడు, పాత్రాపురం, బోదాపురం, పాలెం, వాజేడు మండలం గుమ్మడిదొడ్డి, వాజేడు, కడేకల్, కృష్ణాపురం, అయ్యవారిపేట, పూసూరు, ఏడ్జెర్లపల్లి, ఇప్పగూడెం, కోయవీరాపురం గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోతూ ఉంటుంది.
హైలెవల్ లైన్ల నిర్మాణం
గోదావరి నీటిమట్టం భద్రాచలం వద్ద 57 అడుగులకు చేరిందంటే ఏజెన్సీ ప్రాంతాల్లోని అనేక గ్రామాల ప్రజలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయినట్లే. విద్యుత్ సరఫరా ఉండదు. అక్కడి పరిస్థితులు బయటి ప్రపంచానికి తెలియవు. కాబట్టి గోదావరిలో హెవీ టవర్స్ వేస్తే తప్ప వరదల తాకిడిని తట్టుకోలేవని ట్రాన్స్‌కో అధికారులు భావించారు. వీటిలో 14 ఎం+12 టవర్స్ (22 మీటర్ల ఎత్తులో ఉండేవి), 20+11 మీటర్ల ఎత్తు ఉండే టవర్స్, ఇతర లైన్లు, కెపాసిటీకి అనుగుణంగా సబ్‌స్టేషన్ల నిర్మాణం చేపట్టనున్నారు. అంటే గోదావరి నదికి అవతల ఒక టవర్, ఇవతలి ఒడ్డుకు మరో టవర్ వేస్తే సరిపోతుందని, నీటిమట్టం పెరిగినా విద్యుత్ లైన్లకు ఇబ్బంది ఉండదని ట్రాన్స్‌కో అధికారులు చెబుతున్నారు.
చీ‘కట్’లు తొలిగినట్టే..!
Published Tue, Nov 25 2014 2:38 AM | Last Updated on Wed, Sep 5 2018 1:45 PM
Advertisement
Advertisement