జగన్నాథపురంలో విద్యుత్ షాక్ కొడుతున్న ఇళ్లు
సాక్షి,సత్తుపల్లి(ఖమ్మం) : ఊరంతా ఉలిక్కిపడింది.. విద్యుత్ పరికరాలను పట్టుకుంటే షాక్ కొడుతున్నాయి.. స్విచ్ వేయబోయిన ఓ వ్యక్తి షాక్‌తో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన సత్తుపల్ల మండలం జగన్నాథపురం గ్రామంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామంలో టీవీ, స్విచ్‌బోర్డు ఇలా ఏది పట్టుకున్నా షాక్ కొడుతోంది. ఫేస్, న్యూట్రల్‌వైర్లు కలవడం వల్ల షార్ట్ సర్క్యూట్ అయి ఇళ్లంతా విద్యుత్ సరఫరా అవుతుందని, విద్యుత్ వైరింగ్ సరిగా లేనందున ఈ పరిస్థితి నెలకొందని గుర్తించారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో గురువారం గ్రామంలోని ఇళ్లను పరిశీలించటానికి వచ్చిన విద్యుత్‌శాఖ సిబ్బంది ఒకరు టీవీ ముట్టుకోగానే ఎగిరి పడ్డాడు.
బుధవారం రాత్రి నుంచే సరఫరా నిలిపివేసి గ్రామంలో విద్యుత్ శాఖ సిబ్బంది మరమ్మత్తు చేపట్టారు. కాగా సింగరేణి ఓపెన్ కాస్టు విస్తరణలో జగన్నాథపురం గ్రామం కనుమరుగు కానుంది. ఇక్కడి ప్రజలకు చెరుకుపల్లిలో ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కింద ఇళ్ల స్థలాలు మంజూరు చేయడంతో గ్రామస్తులందరూ కొత్త ఇళ్ల నిర్మాణంలో తలమునకలయ్యారు.
ట్రాన్స్‌ఫార్మర్ ఎర్త్ ఫెయిల్ అయితే?
ఫేస్, న్యూట్రల్ వైర్లు కలవడం వల్ల ఫీజ్ కొట్టేసి ఆ ఇంటి వరకు విద్యుత్ సరఫరా ఆగిపోతుందని, ఊరిలోని ఇళ్లన్నింటికీ షాక్ ఎందుకు కొడుతుందని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ట్రాన్స్‌ఫార్మర్ గ్రౌండ్ ఎర్త్ న్యూట్రల్ వైర్ సరిగా లేకపోవటం వల్ల ఇలా జరిగిందని సమాచారం. కానీ ఈ విషయాన్ని విద్యుత్‌శాఖ సిబ్బంది చెప్పకుండా తప్పు కప్పి పుచ్చుకునే యత్నం చేస్తున్నారని ఆరోపించారు.
కాగా, ఫ్యాను స్విచ్ వేయబోయిన జగన్నాథపురానికి చెందిన ఒగ్గెల కాంతారావు(45) బుధవారం రాత్రి షాక్‌కు అక్కడికక్కడే కుప్పకూలాడు. ఆయనను సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించే సరికి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడి భార్య రాజమ్మ మాట్లాడుతూ కూలీ చేసుకొని కుటుంబాన్ని వెళ్లదీస్తున్నామని.. కొన్ని రోజుల్లో కొత్త ఇంటికి వెళ్లామని భావిస్తుండగా ఈ ఘోరం జరిగిందని కన్నీరుమున్నీరైంది. కాగా, సర్పంచ్ ఇరుపా లలిత, ఎంపీటీసీ సభ్యులు ఇరపా కృష్ణారావు, డాక్టర్ మట్టా దయానంద్, ఉడతనేని అప్పారావు తదితరులు ఆయన కుటుంబాన్ని పరామర్శించారు.
ఇళ్లు పరిశీలించాం..
బుధవారం రాత్రి నుంచే గ్రామానికి విద్యుత్ సరఫరా నిలిపివేశాం. గురువారం ఉదయం ఐదారు ఇళ్లను పరిశీలించాం. ఫేస్,న్యూట్రల్ ఎర్త్ కావడంతోనే ఇళ్లకు విద్యుత్ సరఫరా అయిందని, ఇళ్లల్లో వైరింగ్ సరిగా లేదని తేలింది. దీంతో మా సిబ్బంది మరమ్మతులు చేస్తున్నారు. ఒగ్గెల కాంతారావు విద్యుత్ షాక్‌తో మృతి చెందినట్లు నివేదిక అందజేస్తాం. – వెంకటేశ్వర్లు, ఏఈ, సత్తుపల్లి
Comments
Please login to add a commentAdd a comment