
సాక్షి, కాకినాడ: గోదావరి వరద బతికున్నోళ్లనే కాదు చనిపోయిన వాళ్లను కూడా ఇబ్బంది పెడుతోంది. తూర్పు గోదావరి జిల్లాలో వృద్ధ గౌతమీ నదికి వరద నీరు పోటెత్తడంతో మురమళ్ల గ్రామ స్మశాన వాటిక మునిగిపోయింది. గ్రామంలో నాగమణి అనే వృద్ధురాలు చనిపోవడంతో వరద నీటిలోనే అంతిమ యాత్ర నిర్వహించారు గ్రామ ప్రజలు. దహన సంస్కారాలు చేసినప్పుడు నీటితో తడిసిన కట్టెలు మండకపోవడంతో టైర్లు, కొబ్బరి మట్టలు వేసి అతికష్టం మీద కార్యక్రమాన్ని పూర్తి చేయగలిగారు. మరోవైపు ఆంధ్ర, చత్తీస్గడ్ జాతీయ రహదారిపై వరద నీరు రావడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. చింతూరు మండలంలో 22 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పోలవరం విలీన మండలాల్లో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.