సా..గుతోన్న సీజీజీ అధ్యయనం
- రెండేళ్లుగా కొలిక్కిరాని నివేదిక
- జలమండలి ఉద్యోగుల్లో వీడని ఉత్కంఠ
- ఉద్యోగాలు ఉంటాయో..పోతాయో తెలియక ఆందోళన
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ నగరానికి మంచినీటిని సరఫరా చేసే జలమండలిలో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్(సీజీజీ) అధ్యయం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఉద్యోగుల సంఖ్య, పని విభజన, ఖాళీల భర్తీ, అదనపు సిబ్బంది, పదోన్నతులు తదితర అంశాలపై సీజీజీ రెండేళ్లుగా చేస్తున్న అధ్యయనం ఇంకా కొలిక్కిరాలేదు. దీంతో ఉద్యోగుల్లో ఎడతెగని ఉత్కంఠ నెలకొంది. ఈ నివేదికతో తమ ఉద్యోగాలు ఉంటాయా?, ఊడతాయా?, పదోన్నతులు లభిస్తాయా లేదా ఖాళీల భర్తీ జరుగుతుందా? అన్న సందేహాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
ఈ విషయంలో ఉద్యోగుల అనుమానాలు, భయాలను నివృత్తి చేసేందుకు బోర్డు యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో వారు ఉత్కంఠకు గురవుతున్నారు. బోర్డులో అన్ని విభాగాల్లో కలిపి సుమారు 4,500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. మరో 600 వరకు ఖాళీలున్నట్టు సమాచారం. వీటి భర్తీ విషయంలో చర్యలు తీసుకోని యాజమాన్యం సీజీజీ నివేదికతో ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టేందుకు ప్రయత్నిస్తుందని ఉద్యోగ, కార్మిక సంఘాలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నాయి.
భర్తీ ఎప్పుడో..
జలమండలిలో రెండునెలల క్రితం 647 జనరల్ పర్పస్ ఎంప్లాయ్, సీవరేజీ కార్మికుల భర్తీ ప్రక్రియను చేపట్టింది.వీరిలో ఇన్‌సర్వీసు అభ్యర్థులైన 500 మందికి మాత్రమే పోస్టింగ్‌లు ఇచ్చారు. మరో 147 మంది బయటి వ్యక్తులకు పోస్టింగ్ ఇచ్చే ఫైలు రెండు నెలలుగా ముఖ్యమంత్రి కార్యాలయంలో పెండింగ్‌లో ఉంది. దీంతో ఇంటర్వ్యూ, క్షేత్రస్థాయి పరీక్షల్లో ఉత్తీర్ణులైన పలువురు నిరుద్యోగ అభ్యర్థులు పోస్టింగ్‌ల కోసం ఎదురు చూస్తున్నారు. ఇక బోర్డు ఫైనాన్స్ విభాగం, ఇతర విభాగాల్లో మినిస్టీరియల్ ఉద్యోగాలు, మేనేజర్ పోస్టులు సుమారు 450 వరకు ఖాళీగా ఉన్నాయ. వీటి భర్తీపైనా సస్పెన్స్ కొనసాగుతోండడం గమనార్హం.
నివేదికను తక్షణం బహిర్గతం చేయాలి..
ఉద్యోగుల భవితవ్యంతో సంబంధం ఉన్న సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ నివేదికను సాగదీయకుండా తక్షణమే ఆ నివేదికను బహిర్గతం చేయాలని ఉద్యోగులు, కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో తమ అభ్యంతరాలను, ఆందోళనను అర్థం చేసుకోవాలని కోరుతున్నారు. పలు విభాగాల్లో సిబ్బంది అదనపు పనిభారంతో సతమతమవుతున్నారని, వెంటనే ఖాళీలను భర్తీచేయాలని వారు యాజమాన్యాన్ని కోరుతున్నారు.