Manyam area
-
మన్యానికి రైలొస్తోంది! 173 కి.మీ. కొత్త రైల్వేలైనుకు రూ 2,800 కోట్ల అంచనా!
చింతూరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): త్వరలోనే మన్యంలో రైలుకూత వినపడనుంది. ఇప్పటివరకు బస్సులు, లాంచీలు మాత్రమే తిరిగిన మన్యం ఏరియాలో రైళ్లు కూడా రాకపోకలు సాగించనున్నాయి. ప్రస్తుతం మన్యం ప్రజలు రైలులో ప్రయాణించాలంటే రాజమహేంద్రవరం, ఖమ్మం, కొత్తగూడెం వెళ్లాల్సి ఉంది. నూతన లైను ఏర్పాటులో భాగంగా మన్యం ఏరియాలో నాలుగు రైల్వే స్టేషన్లు నిర్మించనున్నారు. మారుమూల గిరిజన ప్రాంతాలను అనుసంధానం చేస్తూ రవాణాను సులభతరం చేసేందుకు ఒడిశాలోని మల్కన్‌గిరి నుంచి భద్రాచలం వరకు సుమారు 173 కిలో మీటర్ల మేర రైల్వేలైను మంజూరైంది. దీని నిర్మాణానికి రూ 2,800 కోట్లు అవసరమని అంచనా. ఈ లైన్‌ను మల్కన్‌గిరి నుంచి భద్రాచలం సమీపంలోని పాండురంగాపురం రైల్వేస్టేషన్ వరకు నిర్మిస్తారు. ఈ లైను ఏర్పాటులో భాగంగా పలుచోట్ల 213 వంతెనలు నిర్మించనున్నారు. వీటిలో 48 పెద్ద వంతెనలు, 165 చిన్న వంతెనలు ఉన్నాయి. విలీన మండలాల మీదుగా... మల్కన్‌గిరి నుంచి భద్రాచలం వరకు నిర్మించనున్న రైల్వేలైను విలీన మండలాలైన చింతూరు, కూనవరం, ఎటపాక మండలాల మీదుగా సాగనుంది. దీనిలో భాగంగా ఒడిశాలోని మల్కన్‌గిరి, కోవాసిగూడ, బదలి, రాజన్‌గూడ, మహరాజ్‌పల్లి, లూనిమన్‌గూడ, ఆంధ్రాలోని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం కన్నాపురం, కూనవరం మండలం కూటూరు గట్టు, పల్లూరు, ఎటపాక మండలం నందిగామలో స్టేషన్లు ఏర్పాటుచేస్తారు. నందిగామ నుంచి తెలంగాణలో గోదావరి మీదుగా భద్రాచలం, అక్కడి నుంచి పాండురంగాపురం వరకు ఈ రైల్వేలైను నిర్మించనున్నారు. -
గిరిజన మహిళ ధైర్యం, తప్పిన పెనుప్రమాదం.. లేదంటే బూడిదే!
సాక్షి,గుమ్మలక్ష్మీపురం(పార్వతిపురం మణ్యం): వంట గ్యాస్ లీకవడంతో మంటలు చెలరేగగా.. ఎవరికీ ఎటువంటి ప్రమాదం సంభవించకూడదని భావించిన ఓ గిరిజన మహిళ ధైర్యంతో..చాకచక్యంగా వ్యవహరించి గ్యాస్ సిలిండర్‌ను ఆరుబయటకు తీసుకొచ్చి పడేయడంతో పెనుప్రమాదం తప్పింది. వివరాలిలా ఉన్నాయి. గుమ్మలక్ష్మీపురం మండలంలోని పెదఖర్జ పంచాయతీ బొద్దిడి గ్రామానికి చెందిన మండంగి సుజాత సోమవారం ఉదయం ఇంట్లో గ్యాస్‌పొయ్యిపై వంట చేస్తుండగా గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. వంట గది పురిపాక కావడంతో మంటలు ఎగసిపడడం గమనించిన ఆమె గ్యాస్ సిలిండర్ పేలితే పెనుప్రమాదం జరుగుతుందని ఊహించి ఎవరికీ ఎటువంటి నష్టం జరగకూడదని భావించి, సిలిండర్‌ను పొయ్యి నుంచి వేరు చేసి, ఆరుబయటకు తీసుకొచ్చి మురుగునీటి కాలువలో పడేసింది. ఈ విషయాన్ని గమనించిన చుట్టు పక్కల వారు వంటగదిలోని మంటలతో పాటు గ్యాస్ సిలిండర్లోని మంటను ఆర్పివేశారు. ఈ సంఘటణలో ప్రాణాలకు తెగించి సాహసం చేసిన మహిళ ఎడమ చేతికి కొంతమేర కాలిన గాయాలయ్యాయి. ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా ధైర్యంగా వ్యవహరించిన ఆమెను గ్రామస్తులంతా అభినందిస్తున్నారు. చదవండి: AP: ఏ సీఎం ఇలాంటి ఆలోచన చేయలేదు -
విశాఖ మన్యంలో ఎడతెరిపి లేకుండా వర్షం
-
మావోయిస్టుల లేఖల కలకలం
సాక్షి, గుంటూరు: జిల్లాలోని దాచేపల్లి మండల కేంద్రంలో మావోయిస్టుల లేఖలు కలకలం రేపుతున్నాయి. దాచేపల్లి మండలం తహాశీల్దార్ కార్యాలయంలో అవినీతి పెరిగిందని, అధికారులు పద్దతులు మార్చుకోవాలంటూ హెచ్చరికలు జారీ చేసిన మావోయిస్టులు. పల్నాడులో అక్రమార్కులకు హెచ్చరిక పేరుతో మరో లేఖ విడుదల చేశారు. పల్నాడు ప్రాంతంలో బెల్ట్ షాపులు ఎత్తివేయాలి. కబ్జా చేసిన భూములను తక్షణమే ఖాళీ చేయాలని మావోయిస్ట్‌ల లేఖల ద్వారా హెచ్చరించారు. -
గడప దాటాలంటే వణుకు
సాక్షి, విశాఖపట్నం: అధికార పార్టీ నేతలందరిలోనూ ఒక్కటే భయం.. ఇళ్ల నుంచి బయటకు వెళితే ఎలాంటి ముప్పు వాటిల్లుతుందోనన్న ఆందోళన. మావోయిస్టులు ఇన్నాళ్లూ మన్యంలో ఏదైనా దుశ్చర్యకు పాల్పడితే ఏజెన్సీ ప్రాంతంలోని నాయకుల్లోనే ఆందోళన రేకెత్తేది. ఈనెల 23న జిల్లాలోని డుంబ్రిగుడ మండలంలివిటిపుట్టులో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు మట్టుబెట్టిన నాటి నుంచి మైదాన ప్రాంత అధికార పార్టీ ప్రజాప్రతినిధుల్లోనూ తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఇప్పటికే మన్యంలో నేతలతో పాటు మైదానంలో ఉంటున్న ప్రజాప్రతినిధులు విశాఖ నగరంలోని సురక్షిత ప్రాంతాలకు వచ్చేయాలని సూచించారు. కానీ పోలీసుల సూచనల మేరకు ఇప్పటిదాకా విశాఖలోకి అధికార పార్టీ ముఖ్య నేతలు రాలేదు. ఏజెన్సీలో ఉన్న ప్రజాప్రతినిధులకు పోలీసులు భద్రతను కల్పించారు. పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఇంటివద్ద మరో ఆరుగురు అదనపు సాయుధ పోలీసులను, మాజీ మంత్రి మణికుమారికి కూడా భద్రతను పెంచారు. బుధవారం గిడ్డి ఈశ్వరి ఇంటికి సమీపంలో ఓ గుర్తు తెలియని మహిళ సంచరించి మాయమైనట్టు గుర్తించారు. ఆమె మావోయిస్టా? మిలీషియా సభ్యురాలా? అన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మహిళ వ్యవహారం వెలుగు చూడడంతో అక్కడ ఏదైనా పథక రచనకు వచ్చి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏజెన్సీలో మిగిలిన అధికార పార్టీ నాయకులు తమ ఇళ్లను వదిలి బయటకు వచ్చే పరిస్థితి లేదు. మావోయిస్టుల హిట్‌లిస్టులో దాదాపు 200 మంది వరకు చిన్నా, పెద్ద నాయకులున్నట్టు ఇప్పటికే వెలుగులోకి వచ్చింది. దీంతో ఆయా ప్రాంతాల నాయకులు ఆడుగు బయట పెట్టే సాహసం చేయలేకపోతున్నారు. కొద్దిమంది మాత్రం రహస్య ప్రదేశాలకు వెళ్లిపోయారు. మన్యంలో నిన్న మొన్నటి వరకు హడావుడి చేస్తూ కనిపించిన వారెవరూ ఇప్పుడు జనావాసాల్లో కనిపించడం లేదు. రోడ్లపై వారితో పాటు వారి వాహనాల జాడా లేకుండా పోయింది. ఏజెన్సీలో ఏ గ్రామంలో చూసినా బితుకుబితుకుమంటూ ఉన్న వారే కనిపిస్తున్నారు. పలు గ్రామాల్లో సాయుధులైన పోలీసు బలగాలు దర్శనమిస్తున్నాయి. అడుగడుగునా పహరా కాస్తున్నాయి. మైదాన ప్రాంతాల్లో పోలీసు దళాలు లేకపోయినా అక్కడ కూడా ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నేతలు భయంతో వణుకుతున్నారు. నర్సీపట్నానికి చెందిన మంత్రి అయ్యన్నపాత్రుడు మావోయిస్టుల హిట్‌లిస్టులో ఉన్నారు. దీంతో ఆయన చాలా సంవత్సరాలుగా విశాఖలోనే కుటుంబంతో ఉంటున్నారు. ఆయనకు ప్రభుత్వం బులెట్‌ప్రూఫ్ వాహనాన్ని సమకూర్చింది. తాజాగా మావోయిస్టుల దుశ్చర్య నేపథ్యంలో ఆయన తన నియోజకవర్గానికి , మరో ప్రాంతంలో పర్యటనకు వెళ్లడం లేదు. మరోమంత్రి గంటా శ్రీనివాసరావుకు కూడా కిడారి, సివేరిల హత్య అనంతరం భద్రతను పెంచారు. వీరు జిల్లాలో మరెక్కడా అధికార, అనధికార కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాల ఎమ్మెల్యేల్లో యలమంచిలి, పాయకరావుపేట ఎమ్మెల్యేలు విశాఖలోనే ఉంటున్నారు. చోడవరం, అనకాపల్లి శాసనసభ్యులు వారి గ్రామాల్లో మకాం ఉంటున్నారు. ఈ కిడారి, సివేరిల హత్య, పోలీసుల హెచ్చరికలు నేపథ్యంలో శాసనసభ్యులు తమ నియోజకవర్గాల్లో ఏ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం లేదు. మరోవైపు బుధవారం జిల్లాకు వచ్చిన డీజీపీ ఆర్పీ ఠాకూర్ గురువారం కూడా ఏజెన్సీలో పర్యటించారు. చింతపల్లి పోలీస్ సబ్ డివిజన్‌కు వెళ్లి అక్కడ పోలీసు అధికారులతో సమావేశమయ్యారు. సెక్యూరిటీ ఆడిట్ రెవ్యూ నిర్వహించారు. ఆ డివిజన్లోని జీకేవీధి, అన్నవరం, సీలేరు పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రస్తుత పరిస్థితిని సమీక్షించారు. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్, ఆయా స్టేషన్ల సీఐ, ఎస్ఐలతో భేటీ అయ్యారు. డీఐజీ శ్రీకాంత్ కూడా పాల్గొన్నారు. -
పార్టీ బలోపేతానికి సైనికుల్లా పని చేయాలి
సాక్షి, అనంతగిరి (అరకులోయ) : మన్య ప్రాంతంలో ఉన్న వైఎస్సార్సీపీ పార్టీ బూత్ కమిటీల బాధ్యతలపై అరకు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజుతో అరకులోయ సమన్వయకర్త చెట్టి పాల్గుణ చర్చించారు. శుక్రవారం కురుపాం నియోజకవర్గంలోని పరీక్షిత్‌రాజును ఆయన గృహంలో పార్టీ నాయకులతో కలిశారు. పార్టీ బలోపేతానికి పార్టీ నాయకులు సైనికుల్లా పనిచేయాలని పరీక్షిత్‌రాజు సూచించారు. పార్టీ భవిష్యత్తు కార్యచరణపై చర్చించారు. మన్య ప్రాంతంలో ఉన్న పలు సమస్యలపై వైఎస్సార్సీపీ పార్టీ నాయకులు ఎత్తిచూపాలని అన్నారు. పార్టీ నాయకులను అభినందించారు. అనంతరం కురుపాం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణికి నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అరకులోయ, హుకుంపేట మండల పార్టీ అధ్యక్షులు కొర్రా గాశీ, గెమ్మెల కొండబాబు, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు కమ్మిడి అశోక్, డుంబ్రిగుడ మాజీ ఎంపీపీ సాయిబాబ, ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి డి. ఆనంద్ కుమార్, జిల్లా ఎస్టీ సెల్ కార్యదర్శి బాకూరి సదాశివరాజు, అరకు పార్లమెంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి సీవేరి కొండలరావు, వైస్ ఎంపీపీ ధర్మనాయుడు, అరకు మండల ప్రధాన కార్యదర్శులు రమేష్, గెన్ను, డుంబ్రిగుడ మండల కార్యదర్శి విజయదస్మి, మహిళ నాయకురాలు కోడ సుçహాసిని తదితరులు పాల్గొన్నారు. -
మన్యంలో నిషేధిత పత్తి
అడవిబిడ్డల అమాయకత్వం వ్యాపారులకు వరంగా మారింది. అధికారుల పర్యవేక్షణ లోపం అవకాశంగా మారింది. ఆరోగ్యం పాడవుతుందని తెలియక... పంట దిగుబడిపై ఆశతో వ్యాపారుల మాటలు నమ్మేస్తున్నారు. భూ సారం పోతుందన్న విషయం తెలియక ఇష్టానుసారం నిషేధిత విత్తనాలు వేసేస్తున్నారు. ఇదీ జిల్లాలోని పత్తి పంట సాగు చేసే గిరిజనుల దౌర్భాగ్యం. అయినా వారిని చైతన్యపరచడంలో గానీ... నిషేధిక విత్తనాలు అరికట్టడంలోగానీ... అధికారులు విఫలమవుతున్నారన్న విషయం ఇక్కడ స్పష్టమవుతోంది. సాక్షి ప్రతినిధి, విజయనగరం/టాస్క్‌ఫోర్స్: గిరిజన రైతులే లక్ష్యంగా జిల్లాలో నిషేధిత విత్తనా ల విక్రయం జోరుగా సాగుతోంది. జిల్లాలో అ న్ని రకాల పంటల సాధారణ విస్తీర్ణం 1,83,129.54 హెక్టార్లు కాగా పత్తి సాధారణ విస్తీర్ణం 12,595.73 హెక్టార్లు. ప్రధానంగా మన్యంలో నిషేధిత పత్తి విత్తనాలను చైనా నుంచి దిగుమతి చేసుకుని గుంటూరు మీదుగా విజయనగరం జిల్లాకు దిగుమతి చేసి గ్రామాల్లోకి తెచ్చి విక్రయిస్తున్నారు. ఆరోగ్యానికి ప్రమాదకరమైనప్పటికీ ప్రయోజనాలు అధికంగా ఉంటాయని నమ్మించి నిషేధిత విత్తనాలను అమాయక రైతులకు అంటగడుతున్నారు. రైతుకు, నేలకూ ప్రమాదం జిల్లాలోని ఏజెన్సీలోనే రైతులు అధికంగా పత్తి పంటను సాగుచేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు పొలం పనులు ముమ్మరం చేశారు. రైతులు పత్తి విత్తనాల కొనుగోలు ముమ్మరం చేశారు. ఇదే అదనుగా నిషేధిత గైశిల బీటీ, బీటీ3, హెచ్‌టీ(హెర్బిసైడ్టోలరైట్ ) రకం పత్తి విత్తనాలను వారికి అంటగడుతున్నారు. ఈ విత్తనాల వల్ల రైతుకు ఆరోగ్యపరంగా హాని కలగడంతోపాటు, భూసారం తగ్గడం, వాన పాములు మతి చెందడం వంటి నష్టాలు కలుగుతాయి. గైశిల బీటీ రకం పత్తి విత్తనాల వల్ల లభించే దూది వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని, హెచ్‌టీ రకం విత్తనాల వల్ల భూసారం తగ్గిపోయి, వానపాములు మతిచెందడం వంటి నష్టాలు ఏర్పాడతా యని పరిశోధనల్లో తేలడంతో బీటీ3 రకం విత్తనాలను వినియోగించరాదని నిషేధం విధించారు. కలుపు ఖర్చు మిగులుతుందని ఆరోగ్యానికి ప్రమాదకరం, భూసారం కోల్పోవడం వంటి నష్టాలు ఉన్నాయని పరిశోధనల్లో తేలినప్పటికీ ఈ రకం విత్తనాలను వినియోగించేందుకు రైతులు ఆసక్తి చూపడం విశేషం. ఈ విత్తనాలు నాటి వారం రోజుల్లో గడ్డిమందు కొట్టినా ఈ మొక్కలకు ఏమీకాదట. దానివల్ల రైతులకు కలుపు నివారణ చాలా సులభతరం అవడమే గాక ఖర్చు కూడా తగ్గుతుంది. మిగిలిన రకం పత్తివిత్తనాలకు గడ్డిమందు కొడితే పత్తిమొక్కలు చనిపోతాయని రైతులకు నచ్చజెబుతుండటంతో వారు వీటిపైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. చిత్రమేమిటంటే గడ్డిమందును కూడా ప్రభుత్వం నిషేధించింది. కానీ అనధికారంగా రైతులకు అం దించి వ్యాపారులు సొమ్ముచేసుకుంటున్నారు. చైనా టు విజయనగరం వయా గుంటూరు నిషేధిత విత్తనాలను చైనా దేశం నుంచి మన రాష్ట్రానికి తెప్పించి గుంటూరు కేంద్రంగా వివిధ జిల్లాలకు సరఫరా చేస్తున్నారు. మన జిల్లాలో సాలూరు, పార్వతీపురం, పాచిపెం ట, కొమరాడ ప్రాంతాల్లోని పలు విత్తన విక్రయ కేంద్రాల్లో వీటిని గుట్టుగా అమ్మేస్తున్నారు. రైతులకు నేరుగా ఈ విత్తనాలను అమ్మకుండా గ్రామాల్లోని పెద్దరైతు, భూ యజమానుల ద్వారా మిగిలిన చిన్న, సన్నకారు రైతులకు చేరవేస్తున్నారు. గిరిజన గ్రామాలే లక్ష్యంగా... గిరిశిఖర, మైదాన ప్రాంతాల్లోని గిరిజన గ్రామాల్లో పత్తి రైతులే లక్ష్యంగా ఈ నిషేధిత పత్తి విత్తనాల వ్యాపారం సాగిస్తున్నారు. గిరిజన రైతులకు నిషేధిత విత్తనాలపై పెద్దగా అవగాహన ఉండదనే ఆలోచనలతో ఈ విధమైన వ్యాపారాలు చేస్తూ వారిని మోసగిస్తున్నారు. 450 గ్రాములుండే ఒక్కో ప్యాకెట్ విత్తనాలు రూ.700 నుంచి రూ.1000 మధ్య అమ్ముతున్నారు. ప్యాకింగ్ మార్చేసి నకిలీ విత్తనాలతో నాటిన పత్తి పొలాలను సులభంగా గుర్తించవచ్చని వ్యవసాయశాఖ అధికారులు అంటున్నారు. మొక్క వచ్చిన తరువాత ఆకును పరిశీలించి నిషేధిత రకమా కాదా తెలుసుకోవచ్చట. అయితే వీటిని విత్తనాలుగా ఉన్నప్పుడే గుర్తించి నాటకుండా అరికట్టలేకపోతున్నారు. ఎందుకంటే నిషేధిత పత్తి విత్తనాలనే వేరే కంపెనీలకు చెందిన ప్యాకెట్ల కవర్లలోకి మార్చేసి అమ్మేస్తున్నారు. పలు గ్రామాల్లో రైతులు నిషేధిత గైశిల బీటీ, హెచ్‌టీ రకం పత్తి విత్తనాలు నాటుతున్నారని వ్యవసాయ అధికారులకు కూడా సమాచారం అందుతోంది. అయినా సరైన ఆధారాలు లభించకపోవడంతో ఏమీ చేయలేకపోతున్నామని వారు చేతులెత్తేస్తున్నారు. నిజానికి కొందరు ప్రైవేటు విత్తన వ్యాపారులతో వ్యవసాయ శాఖ అధికారులు సత్సంబంధాలు ఏర్పరచుకుని ఈ దందాకు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. -
మన్యంను కప్పేసిన పొగమంచు
సాక్షి, విశాఖపట్టణం: ఆంధ్రా కశ్మీర్‌గా పేరుపొందిన విశాఖ మన్యంలో మంగళవారం ఉదయం ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. లంబసింగి-3, చింతపల్లి-4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో మన్యం ప్రజలు చలికి గజగజ వణుకుతున్నారు. అలాగే... ఏజెన్సీ వ్యాప్తంగా పొగ మంచు దట్టంగా అలుముకుంటోంది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. ఉదయం సమయంలో కూడా లైట్లు వేసుకుని రాకపోకలు కొనసాగించాల్సి వస్తోంది. ఇదిలా ఉండగా మొన్నటి వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా ప్రస్తుతం ఒక్కసారిగా పడిపోవడంతో ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. -
మన్యంలో ‘మర్లపులి’ షూటింగ్ సందడి
ఏలూరు: కొయ్యలగూడెం, బుట్టాయిగూడెం, పోలవరం మండల పరిసర గ్రామాల్లో 4 రోజులుగా ‘మర్లపులి’ తెలుగు చలనచిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. కన్నాపురానికి చెందిన కె.మాణిక్యాలరావు స్వీయరచన గావించిన యథార్థగాథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు నిర్మాతలు ప్రదీప్‌రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. దర్శకుడు డి.రామకృష్ణ పర్యవేక్షణలో నిర్మిస్తున్న ఈ చిత్రం హర్రర్ కథతో మిళితమై ఉంటుందన్నారు. 1970,80 దశకంలో కన్నాపురం సమీపంలో జరిగిన యథార్థగాథ ఈ చిత్రానికి మూలకథ అని రచయిత చెప్పారు. మర్లపులిగా అమాయకురాలైన ఓ మహిళని చిత్రీకరించి అమానుషంగా కొట్టి ఆమె చావుకు కారణం ఎలా అయ్యారు? వారిపై ఆమె ఎలా ప్రతీకారం తీర్చుకుందనేది కథాంశం అన్నారు. హీరోయిన్ తాతగా సీనియర్ నటులు చంద్రమౌళి, తదితరులు నటిస్తున్నట్టు చెప్పారు.