మన్యంలో నిషేధిత పత్తి | Prohibited Bt Cotton Seeds Are Sold In The Vizianagaram District | Sakshi
Sakshi News home page

మన్యంలో నిషేధిత పత్తి

Published Sat, Jun 23 2018 11:03 AM | Last Updated on Sat, Jun 23 2018 11:03 AM

Prohibited Bt Cotton Seeds Are Sold In The Vizianagaram District - Sakshi

నిషేధిత బీటీ3 పత్తివిత్తనాలు

అడవిబిడ్డల అమాయకత్వం వ్యాపారులకు వరంగా మారింది. అధికారుల పర్యవేక్షణ లోపం అవకాశంగా మారింది. ఆరోగ్యం పాడవుతుందని తెలియక... పంట దిగుబడిపై ఆశతో వ్యాపారుల మాటలు నమ్మేస్తున్నారు. భూ సారం పోతుందన్న విషయం తెలియక ఇష్టానుసారం నిషేధిత విత్తనాలు వేసేస్తున్నారు.

ఇదీ జిల్లాలోని పత్తి పంట సాగు చేసే గిరిజనుల దౌర్భాగ్యం. అయినా వారిని చైతన్యపరచడంలో గానీ... నిషేధిక విత్తనాలు అరికట్టడంలోగానీ... అధికారులు విఫలమవుతున్నారన్న విషయం ఇక్కడ స్పష్టమవుతోంది.

సాక్షి ప్రతినిధి, విజయనగరం/టాస్క్‌ఫోర్స్‌: గిరిజన రైతులే లక్ష్యంగా జిల్లాలో నిషేధిత విత్తనా ల విక్రయం జోరుగా సాగుతోంది. జిల్లాలో అ న్ని రకాల పంటల సాధారణ విస్తీర్ణం 1,83,129.54 హెక్టార్లు కాగా పత్తి సాధారణ విస్తీర్ణం 12,595.73 హెక్టార్లు. ప్రధానంగా మన్యంలో నిషేధిత పత్తి విత్తనాలను చైనా నుంచి దిగుమతి చేసుకుని గుంటూరు మీదుగా విజయనగరం జిల్లాకు దిగుమతి చేసి గ్రామాల్లోకి తెచ్చి విక్రయిస్తున్నారు.

ఆరోగ్యానికి ప్రమాదకరమైనప్పటికీ ప్రయోజనాలు అధికంగా ఉంటాయని నమ్మించి నిషేధిత విత్తనాలను అమాయక రైతులకు అంటగడుతున్నారు.

రైతుకు, నేలకూ ప్రమాదం

జిల్లాలోని ఏజెన్సీలోనే రైతులు అధికంగా పత్తి పంటను సాగుచేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు పొలం పనులు ముమ్మరం చేశారు. రైతులు పత్తి విత్తనాల కొనుగోలు ముమ్మరం చేశారు. ఇదే అదనుగా నిషేధిత గైశిల బీటీ, బీటీ3, హెచ్‌టీ(హెర్బిసైడ్‌టోలరైట్‌ ) రకం పత్తి విత్తనాలను వారికి అంటగడుతున్నారు.

ఈ విత్తనాల వల్ల రైతుకు ఆరోగ్యపరంగా హాని కలగడంతోపాటు, భూసారం తగ్గడం, వాన పాములు మతి చెందడం వంటి నష్టాలు  కలుగుతాయి. గైశిల బీటీ రకం పత్తి విత్తనాల వల్ల లభించే దూది వల్ల క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉందని, హెచ్‌టీ రకం విత్తనాల వల్ల భూసారం తగ్గిపోయి, వానపాములు మతిచెందడం వంటి నష్టాలు ఏర్పాడతా యని పరిశోధనల్లో తేలడంతో బీటీ3 రకం విత్తనాలను వినియోగించరాదని నిషేధం విధించారు.

కలుపు ఖర్చు మిగులుతుందని

ఆరోగ్యానికి ప్రమాదకరం, భూసారం కోల్పోవడం వంటి నష్టాలు ఉన్నాయని పరిశోధనల్లో తేలినప్పటికీ ఈ రకం విత్తనాలను వినియోగించేందుకు రైతులు ఆసక్తి చూపడం విశేషం. ఈ విత్తనాలు నాటి వారం రోజుల్లో గడ్డిమందు కొట్టినా ఈ మొక్కలకు ఏమీకాదట. దానివల్ల రైతులకు కలుపు నివారణ చాలా సులభతరం అవడమే గాక ఖర్చు కూడా తగ్గుతుంది.

మిగిలిన రకం పత్తివిత్తనాలకు గడ్డిమందు కొడితే పత్తిమొక్కలు చనిపోతాయని రైతులకు నచ్చజెబుతుండటంతో వారు వీటిపైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. చిత్రమేమిటంటే గడ్డిమందును కూడా ప్రభుత్వం నిషేధించింది. కానీ అనధికారంగా రైతులకు అం దించి వ్యాపారులు సొమ్ముచేసుకుంటున్నారు.

చైనా టు విజయనగరం వయా గుంటూరు

నిషేధిత విత్తనాలను చైనా దేశం నుంచి మన రాష్ట్రానికి తెప్పించి గుంటూరు కేంద్రంగా వివిధ జిల్లాలకు సరఫరా చేస్తున్నారు. మన జిల్లాలో సాలూరు, పార్వతీపురం, పాచిపెం ట, కొమరాడ ప్రాంతాల్లోని పలు విత్తన విక్రయ కేంద్రాల్లో వీటిని గుట్టుగా అమ్మేస్తున్నారు. రైతులకు నేరుగా ఈ విత్తనాలను అమ్మకుండా గ్రామాల్లోని పెద్దరైతు, భూ యజమానుల ద్వారా మిగిలిన చిన్న, సన్నకారు రైతులకు చేరవేస్తున్నారు.

గిరిజన గ్రామాలే లక్ష్యంగా...

గిరిశిఖర, మైదాన ప్రాంతాల్లోని గిరిజన గ్రామాల్లో పత్తి రైతులే లక్ష్యంగా ఈ నిషేధిత పత్తి విత్తనాల వ్యాపారం సాగిస్తున్నారు. గిరిజన రైతులకు నిషేధిత విత్తనాలపై పెద్దగా అవగాహన ఉండదనే ఆలోచనలతో ఈ విధమైన వ్యాపారాలు చేస్తూ వారిని మోసగిస్తున్నారు. 450 గ్రాములుండే ఒక్కో ప్యాకెట్‌ విత్తనాలు రూ.700 నుంచి రూ.1000 మధ్య అమ్ముతున్నారు.

ప్యాకింగ్‌ మార్చేసి

నకిలీ విత్తనాలతో నాటిన పత్తి పొలాలను సులభంగా గుర్తించవచ్చని వ్యవసాయశాఖ అధికారులు అంటున్నారు. మొక్క వచ్చిన తరువాత ఆకును పరిశీలించి నిషేధిత రకమా కాదా తెలుసుకోవచ్చట. అయితే వీటిని విత్తనాలుగా ఉన్నప్పుడే గుర్తించి నాటకుండా అరికట్టలేకపోతున్నారు. ఎందుకంటే నిషేధిత పత్తి విత్తనాలనే వేరే కంపెనీలకు చెందిన ప్యాకెట్ల కవర్లలోకి మార్చేసి అమ్మేస్తున్నారు.

పలు గ్రామాల్లో రైతులు నిషేధిత గైశిల బీటీ, హెచ్‌టీ రకం పత్తి  విత్తనాలు నాటుతున్నారని వ్యవసాయ అధికారులకు కూడా సమాచారం అందుతోంది. అయినా సరైన ఆధారాలు లభించకపోవడంతో ఏమీ చేయలేకపోతున్నామని వారు చేతులెత్తేస్తున్నారు. నిజానికి కొందరు ప్రైవేటు విత్తన వ్యాపారులతో వ్యవసాయ శాఖ అధికారులు సత్సంబంధాలు ఏర్పరచుకుని ఈ దందాకు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement