BT cotton seeds
-
రాయితీకి మంగళం!
యాచారం(ఇబ్రహీంపట్నం): కూరగాయ విత్తనాల పంపిణీ విషయంలో ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖ చేతులేత్తెసింది. విత్తనాలపై అందజేసే రాయితీలపై కేసీఆర్ సర్కార్ నుంచి నేటికి ఎటువంటి స్పష్టత రాకపోవడంతో సంబంధిత శాఖ అధికారులతోపాటు రైతుల్లో అయోమయం నెలకొంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడం, వర్షాలు కురిసి పొలం దున్ని నార్లు పోయడానికి సిద్ధమవుతున్న తరుణంలో రాయితీ విత్తనాలు లేవంటూ ఉద్యాన, పట్టుపరిశ్రమల శాఖ అధికారులు చావు కబురు చల్లగా చెప్పడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మార్కెట్లో విత్తనాలు కొనుగోలు చేస్తే అవి నకిలీవో... లేదా నాణ్యమైనవో తెలియకని భయాందోళన నెలకొంది. అదే ఉద్యానశాఖ ఆధ్వర్యంలో పంపిణీ చేస్తే ఆ భయం, దిగులు ఉండదు. మంచి దిగుబడి వస్తుందని రైతుల నమ్మకం. అయితే, ఈ ఏడాది ఆ ఉసే లేకపోవడంతో ఏం చేయాలో పాలుపోక రైతులకు దిక్కు తోచని పరిస్థితి ఏర్పడింది. కూరగాయ విత్తనాల కోసం ఆయా డివిజన్లల్లో ఉన్న ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ అధికారులను రైతులు నిత్యం కలుస్తున్నా.. స్వష్టమైన హామీ రావడం లేదు. మహానగరం చుట్టూ రంగారెడ్డి జిల్లా విస్తరించి ఉండడంతో విస్తారంగా కూరగాయలు పండించేలా కేసీఆర్ సర్కార్ పంట కాలనీల పథకాన్ని చేపట్టింది. మొదట పైలెట్ ప్రాజెక్టు కింద ఇబ్రహీంపట్నం డివిజన్‌ను ఎంపిక చేసింది. అనంతరం చేవెళ్ల, మహేశ్వరం, షాద్‌నగర్ డివిజన్లను కూడా ఈ పథకం కింద ఎంపిక చేసింది. ప్రభుత్వం జిల్లావ్యాప్తంగా దాదాపు రూ. 100 కోట్లకు పైగా నిధులు ఖర్చు చేసి వేలాది టన్నుల కూరగాయల పండించాలని సంకల్పించింది. ఆలోచన బాగానే ఉన్నా అమలు విషయానికి వచ్చేసరికి తుస్సుమంది. రాయితీ విత్తనాలకే మంగళం పాడడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూరగాయ విత్తనాలను అధికారులు 50 శాతం రాయితీతో అందజేసేవారు. ఈసారి సబ్సిడీకి బడ్జెట్లో నిధులు కూడా కేటాయించలేదు. విత్తనాల్లేవ్... నారే ఇస్తాం.. రాయితీ విత్తనాలకు మంగళం పాడిన ప్రభుత్వం నారును పంపిణీ చేయడానికి నిర్ణయించింది. అది కూడా కేవలం టమాట, మిర్చి, వంకాయ రకానికే పరిమితం చేసింది. కేవలం మూడు రకాల నార్లనే ఇస్తామని చెప్పడం రైతులకు మింగుడుపడడం లేదు. కాగా కూరగాయల విత్తనాలపై ఉన్న రాయితీలను రద్దు చేసిన సర్కార్.. రైతుబంధు పథకం కింద అందించే పెట్టుబడి సాయంలోనే రైతులు తమకు కావాల్సిన విత్తనాలు కొనుగోలు చేసు కోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే రాయితీ లేదని చెబుతున్నట్లు తెలిసింది. ప్రభుత్వం నుంచి స్వష్టత రాలేదు రాయితీ విత్తనాలు అందించే విషయంలో నేటికీ ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు. రైతులు నిత్యం ఆయా డివిజన్లల్లోని మండలాల్లో ఉద్యానశాఖ అధికారులను కలిసి రాయితీ విత్తనాలు కావాలని అడుగుతున్నారు. ప్రస్తుతానికి 20 పైసలకు ఒకటి చొప్పన టమాట, మిర్చి, వంకాయ నారును అందించాలని ఆదేశాలు ఉన్నాయి. రైతులు కొంతమంది కలిసి గచ్చిబౌలి వెళ్లి నారు తెచ్చుకుంటే ట్రాన్స్పోర్ట్ చార్జీలు ఇస్తాం. పంట కాలనీల పథకం అమలు గగనమే. మరోమారు ఉన్నతా«ధికారుల దృష్టికి తీసుకెళ్తాం. – సునందారెడ్డి, జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖ అధికారిణి -
నాన్ బీటీ పత్తి రకం ఎ.డి.బి. 542
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలి నాన్ బీటీ పత్తి రకం ఎ.డి.బి. 542ని ఇటీవల ప్రొ. జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం విడుదల చేసింది. ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా కేంద్రం ఈ సూటి రకాన్ని రూపొందించింది. దీర్ఘకాలిక పంటకాలం కలిగిన బీటీ హైబ్రిడ్లు సైతం గులాబీ రంగు పురుగును తట్టుకోలేకపోతున్న తరుణంలో 6 నెలల్లోపలే పూర్తయ్యే ఎ.డి.బి. 542 వంటి మధ్యస్థ కాలిక రకాన్ని ఎంచుకోవడం ప్రయోజనకరమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మధ్యస్థ కాలపరిమితి కలిగి అధిక దిగుబడినిచ్చే రకం ఎ.డి.బి. 542. 150–170 రోజుల్లోనే పంటను పూర్తి చేసుకోవడం దీని ప్రత్యేకత. తక్కువ పెట్టుబడితో తేలిక నేలల్లో, బరువైన నల్లరేగడి నేలల్లోనూ వర్షాధారంగా లేదా ఆరుతడి పద్ధతిలోనూ ఖరీఫ్‌లో పండించడానికి అనువైన రకం ఇది. హెక్టారుకు 3 వేల కిలోల దిగుబడి వర్షాధారంగా సాగు చేసినప్పుడు హెక్టారుకు 1500 నుంచి 2500 కిలోల వరకు దిగుబడి వస్తుంది. ఆరుతడి పంటగా సాగు చేసినప్పుడు హెక్టారుకు 3000 కిలోల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉందని విశ్వవిద్యాలయం పత్తి పరిశోధనా విభాగం అధిపతి, ముఖ్య శాస్త్రవేత్త డా. సుదర్శన్ ‘సాక్షి సాగుబడి’కి తెలిపారు. కాయ సైజు పెద్దగా ఉండటంతో పత్తి తీత సులభం. కాయలు దగ్గర దగ్గరగా గొలుసు వలె కాయడం ఈ రకం ప్రత్యేకత. పత్తి నాణ్యత బాగుంటుంది. పింజ పొడవు 27 మిల్లీమీటర్లు ఉంటుంది. బాక్టీరియా తెగులును, టొబాకో స్ట్రిక్ వైరస్ తెగులును సమర్థవంతంగా తట్టుకుంటుంది. పచ్చదోమ, కాయతొలిచే పురుగులను కొంత వరకు తట్టుకుంటుంది. బలమైన(నల్లరేగడి) నేలల్లో వరుసల మధ్య 3 అడుగులు, మొక్కల మధ్య 2 అడుగుల (90 సి.ఎం.“ 60 సి.ఎం.) దూరంలో నాటుకోవచ్చు. మధ్యస్థ భూముల్లో వరుసల మధ్య 3 అడుగులు, మొక్కల మధ్య ఒక అడుగు దూరంలో నాటుకోవాలి. తేలిక నేలల్లో వరుసల మధ్య రెండున్నర అడుగులు, మొక్కల మధ్య ఒక అడుగు దూరంలో నాటుకోవాలని డా. సుదర్శన్ తెలిపారు. సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో సాగుకు సైతం ఈ సూటిరకం అనువైనదని ఆయన తెలిపారు. సేంద్రియ సాగుకూ అనువైనది ఎ.డి.బి. 542 రకం పత్తి మధ్యలో కంది సాళ్లు వేసుకోవచ్చు. 4 లేదా 5 లేదా 6 సాళ్లు పత్తివి విత్తుకొని ఒక సాలులో కంది విత్తుకోవచ్చు. ఈ రకం పత్తి ఆరు నెలల్లో పూర్తవుతుంది కాబట్టి అందుకు తగిన కంది రకాలు విత్తుకోవాలని డా. సుదర్శన్ తెలిపారు. తేలిక నేలల్లో అయితే మారుతి, వరంగల్ 97 కంది రకాలు, బరువైన (నల్లరేగడి) నేలల్లో అయితే ఆశ కంది రకాన్ని విత్తుకోవాలి. ఈ మూడు కంది రకాలూ ఎండు తెగులును సమర్థవంతంగా తట్టుకొని మంచి దిగుబడినిస్తాయని డా. సుదర్శన్(98669 62634) వివరించారు. ఎ.డి.బి. 542 రకం పత్తి నుంచి విత్తనాలను ౖవేరుచేసి దాచుకొని తర్వాత పంటకాలంలో విత్తనంగా వాడుకోవచ్చు. ఎ.డి.బి. 542 సూటి రకం పత్తి విత్తనాల కోసం రైతులు ఆదిలాబాద్‌లోని వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డా. రాజేంద్రరెడ్డిని 97041 34304 నంబరులో సంప్రదించవచ్చు. -
మన్యంలో నిషేధిత పత్తి
అడవిబిడ్డల అమాయకత్వం వ్యాపారులకు వరంగా మారింది. అధికారుల పర్యవేక్షణ లోపం అవకాశంగా మారింది. ఆరోగ్యం పాడవుతుందని తెలియక... పంట దిగుబడిపై ఆశతో వ్యాపారుల మాటలు నమ్మేస్తున్నారు. భూ సారం పోతుందన్న విషయం తెలియక ఇష్టానుసారం నిషేధిత విత్తనాలు వేసేస్తున్నారు. ఇదీ జిల్లాలోని పత్తి పంట సాగు చేసే గిరిజనుల దౌర్భాగ్యం. అయినా వారిని చైతన్యపరచడంలో గానీ... నిషేధిక విత్తనాలు అరికట్టడంలోగానీ... అధికారులు విఫలమవుతున్నారన్న విషయం ఇక్కడ స్పష్టమవుతోంది. సాక్షి ప్రతినిధి, విజయనగరం/టాస్క్‌ఫోర్స్: గిరిజన రైతులే లక్ష్యంగా జిల్లాలో నిషేధిత విత్తనా ల విక్రయం జోరుగా సాగుతోంది. జిల్లాలో అ న్ని రకాల పంటల సాధారణ విస్తీర్ణం 1,83,129.54 హెక్టార్లు కాగా పత్తి సాధారణ విస్తీర్ణం 12,595.73 హెక్టార్లు. ప్రధానంగా మన్యంలో నిషేధిత పత్తి విత్తనాలను చైనా నుంచి దిగుమతి చేసుకుని గుంటూరు మీదుగా విజయనగరం జిల్లాకు దిగుమతి చేసి గ్రామాల్లోకి తెచ్చి విక్రయిస్తున్నారు. ఆరోగ్యానికి ప్రమాదకరమైనప్పటికీ ప్రయోజనాలు అధికంగా ఉంటాయని నమ్మించి నిషేధిత విత్తనాలను అమాయక రైతులకు అంటగడుతున్నారు. రైతుకు, నేలకూ ప్రమాదం జిల్లాలోని ఏజెన్సీలోనే రైతులు అధికంగా పత్తి పంటను సాగుచేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు పొలం పనులు ముమ్మరం చేశారు. రైతులు పత్తి విత్తనాల కొనుగోలు ముమ్మరం చేశారు. ఇదే అదనుగా నిషేధిత గైశిల బీటీ, బీటీ3, హెచ్‌టీ(హెర్బిసైడ్టోలరైట్ ) రకం పత్తి విత్తనాలను వారికి అంటగడుతున్నారు. ఈ విత్తనాల వల్ల రైతుకు ఆరోగ్యపరంగా హాని కలగడంతోపాటు, భూసారం తగ్గడం, వాన పాములు మతి చెందడం వంటి నష్టాలు కలుగుతాయి. గైశిల బీటీ రకం పత్తి విత్తనాల వల్ల లభించే దూది వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని, హెచ్‌టీ రకం విత్తనాల వల్ల భూసారం తగ్గిపోయి, వానపాములు మతిచెందడం వంటి నష్టాలు ఏర్పాడతా యని పరిశోధనల్లో తేలడంతో బీటీ3 రకం విత్తనాలను వినియోగించరాదని నిషేధం విధించారు. కలుపు ఖర్చు మిగులుతుందని ఆరోగ్యానికి ప్రమాదకరం, భూసారం కోల్పోవడం వంటి నష్టాలు ఉన్నాయని పరిశోధనల్లో తేలినప్పటికీ ఈ రకం విత్తనాలను వినియోగించేందుకు రైతులు ఆసక్తి చూపడం విశేషం. ఈ విత్తనాలు నాటి వారం రోజుల్లో గడ్డిమందు కొట్టినా ఈ మొక్కలకు ఏమీకాదట. దానివల్ల రైతులకు కలుపు నివారణ చాలా సులభతరం అవడమే గాక ఖర్చు కూడా తగ్గుతుంది. మిగిలిన రకం పత్తివిత్తనాలకు గడ్డిమందు కొడితే పత్తిమొక్కలు చనిపోతాయని రైతులకు నచ్చజెబుతుండటంతో వారు వీటిపైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. చిత్రమేమిటంటే గడ్డిమందును కూడా ప్రభుత్వం నిషేధించింది. కానీ అనధికారంగా రైతులకు అం దించి వ్యాపారులు సొమ్ముచేసుకుంటున్నారు. చైనా టు విజయనగరం వయా గుంటూరు నిషేధిత విత్తనాలను చైనా దేశం నుంచి మన రాష్ట్రానికి తెప్పించి గుంటూరు కేంద్రంగా వివిధ జిల్లాలకు సరఫరా చేస్తున్నారు. మన జిల్లాలో సాలూరు, పార్వతీపురం, పాచిపెం ట, కొమరాడ ప్రాంతాల్లోని పలు విత్తన విక్రయ కేంద్రాల్లో వీటిని గుట్టుగా అమ్మేస్తున్నారు. రైతులకు నేరుగా ఈ విత్తనాలను అమ్మకుండా గ్రామాల్లోని పెద్దరైతు, భూ యజమానుల ద్వారా మిగిలిన చిన్న, సన్నకారు రైతులకు చేరవేస్తున్నారు. గిరిజన గ్రామాలే లక్ష్యంగా... గిరిశిఖర, మైదాన ప్రాంతాల్లోని గిరిజన గ్రామాల్లో పత్తి రైతులే లక్ష్యంగా ఈ నిషేధిత పత్తి విత్తనాల వ్యాపారం సాగిస్తున్నారు. గిరిజన రైతులకు నిషేధిత విత్తనాలపై పెద్దగా అవగాహన ఉండదనే ఆలోచనలతో ఈ విధమైన వ్యాపారాలు చేస్తూ వారిని మోసగిస్తున్నారు. 450 గ్రాములుండే ఒక్కో ప్యాకెట్ విత్తనాలు రూ.700 నుంచి రూ.1000 మధ్య అమ్ముతున్నారు. ప్యాకింగ్ మార్చేసి నకిలీ విత్తనాలతో నాటిన పత్తి పొలాలను సులభంగా గుర్తించవచ్చని వ్యవసాయశాఖ అధికారులు అంటున్నారు. మొక్క వచ్చిన తరువాత ఆకును పరిశీలించి నిషేధిత రకమా కాదా తెలుసుకోవచ్చట. అయితే వీటిని విత్తనాలుగా ఉన్నప్పుడే గుర్తించి నాటకుండా అరికట్టలేకపోతున్నారు. ఎందుకంటే నిషేధిత పత్తి విత్తనాలనే వేరే కంపెనీలకు చెందిన ప్యాకెట్ల కవర్లలోకి మార్చేసి అమ్మేస్తున్నారు. పలు గ్రామాల్లో రైతులు నిషేధిత గైశిల బీటీ, హెచ్‌టీ రకం పత్తి విత్తనాలు నాటుతున్నారని వ్యవసాయ అధికారులకు కూడా సమాచారం అందుతోంది. అయినా సరైన ఆధారాలు లభించకపోవడంతో ఏమీ చేయలేకపోతున్నామని వారు చేతులెత్తేస్తున్నారు. నిజానికి కొందరు ప్రైవేటు విత్తన వ్యాపారులతో వ్యవసాయ శాఖ అధికారులు సత్సంబంధాలు ఏర్పరచుకుని ఈ దందాకు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. -
నాన్ బీటీ.. నాదే విత్తనం!
విత్తనమే లేకుంటే వ్యవసాయమే లేదు. పది వేల సంవత్సరాల క్రితం నుంచీ రైతులు తాము పండించిన పంటలో నుంచే మెరుగైన విత్తనాన్ని సేకరించి దాచుకుని.. తర్వాత సీజన్లో విత్తుకుంటున్నారు. అంతేకాదు, ఇతర రైతులతో విత్తనాలు ఇచ్చి పుచ్చుకుంటున్నారు. అమ్ముతున్నారు. ఇది రైతుకున్న హక్కు. విత్తన సార్వభౌమత్వమే రైతు స్వాతంత్య్రానికి ప్రాణాధారం. అయితే, విత్తనం కంపెనీల సొత్తుగా మారిపోయిన ఆధునిక కాలంలోనూ.. విత్తనం కోసం అంగడికి పోకుండా.. తమదైన సొంత విత్తనాన్ని అపురూపంగా కాపాడుకుంటున్న రైతు కుటుంబాలు లేకపోలేదు. వరి వంటి పంటల్లో సొంత విత్తనాన్నే వాడుకుంటున్న రైతులు చాలా చోట్ల కనిపిస్తారు. అయితే, ఆశ్చర్యకరమేమిటంటే ఏళ్ల తరబడీ పత్తి, మిర్చి పంటల విత్తనాలూ సొంతవే వాడుతూ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో అధిక దిగుబడులు తీస్తున్న కుటుంబాలు చాలా అరుదనే చెప్పాలి. అటువంటి అరుదైన రైతు దంపతులు లావణ్య, రమణారెడ్డి! రమణారెడ్డి, లావణ్య దంపతుల స్వగ్రామం కారువంక(నాగర్‌కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం). ఇతర పంటలతోపాటు గత 29 ఏళ్లుగా పత్తి పండిస్తున్న కుటుంబం ఇది. గత ఎనిమిదేళ్లుగా పత్తి, మిర్చి పంటలకు సొంత విత్తనాలనే వాడుకుంటూ రైతు లోకానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. పత్తిని వర్షాధారంగా, మిర్చిని డ్రిప్‌తో సాగు చేస్తున్నారు. పంట ఏదైనా కుటుంబ సభ్యులందరూ నిమగ్నమై పొలం పనులు చేసుకోవడం వీరి అలవాటు. 2010 నుంచి సుభాష్ పాలేకర్ చూపిన బాటలో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరిస్తున్నారు. నాన్ బీటీ సూటిరకం లోకల్ పత్తి విత్తనాన్నే గత ఎనిమిదేళ్లుగా వాడుతున్నారు. తమ పత్తి పంటలో 2,3 విడతల తీతల్లో నాణ్యత ఉన్న చెట్ల నుంచి దూదిని సేకరించి విత్తనం కోసం వేరుగా పక్కన పెట్టుకుంటారు. దగ్గర్లోని జిన్నింగ్ మిల్లులో ఆ పత్తిని జిన్నింగ్ చేయించి, గింజలను శుద్ధి చేయించి ఇంటికి తెచ్చుకుని తర్వాత పంట కాలంలో విత్తుకుంటారు. క్వింటా పత్తి నుంచి 65 కిలోల వరకు విత్తనాలు వస్తాయని, వాటిని శుద్ధి చేయించి ప్రతి ఏటా విత్తుకుంటున్నామని రమణారెడ్డి తెలిపారు. మార్కెట్లో కంపెనీలు అమ్మే జన్యుమార్పిడి పత్తి విత్తనాలను కొనుగోలు చేయకుండా పత్తిని సైతం తన సొంత నాన్‌బీటీ సూటి విత్తనంతోనే సాగు చేస్తున్నామని తెలిపారు. రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపుమందులు.. ఏవీ వాడకుండా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలోనే సాగు చేస్తున్నారు. ఆవులు, ఎద్దులన్నీ కలిపి 16 ఉన్నాయి. ఎకరానికి ఘనజీవామృతం మొత్తం 600 కిలోలు, 400 లీ. ద్రవ జీవామృతం, అవసరం మేరకు కషాయాలు వాడుతున్నారు. ప్రతి పది పత్తి సాళ్లకు ఒక సాలు కందిని విత్తుతున్నారు. ఘనజీవామృతం దుక్కి ఎకరానికి వంద కిలోలు వేస్తారు. జీవామృతాన్ని నెలకోసారి పది రెట్లు నీటితో కలిపి మొక్కకు పోస్తారు, నెలకోసారి పిచికారీ చేస్తారు. దీపావళి రోజుల్లో పత్తిలో ఆవాలను అంతరపంటగా చల్లుతారు. తమ పత్తి పంటకు గులాబీ రంగు పురుగు బెడద అసలు లేకపోవడం విశేషం. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో ఎకరానికి వర్షాధారంగా 12–15 క్వింటాళ్ల పత్తి దిగుబడి పొందుతున్నారు. గత ఏడాది 18 ఎకరాల్లో అధిక వర్షాల కారణంగా కొంత నష్టం జరగడంతో 219 క్వింటాళ్ల (ఎకరానికి 12 క్వింటాళ్ల చొప్పున) పత్తి దిగుబడి వచ్చిందని రమణారెడ్డి ‘సాక్షి సాగుబడి’కి తెలిపారు. ఈ ఏడాది 10 ఎకరాల్లో నాన్ బీటీ పత్తిని ఇప్పటికే విత్తామని, మరో పదెకరాల్లో త్వరలో విత్తబోతున్నామని చెప్పారు. రోహిణీ కార్తెలోనే విత్తుకోవడం..! రోహిణీ కార్తెలో వర్షానికి ముందే తాము ఎకరానికి 3 కిలోల విత్తనాన్ని సాళ్లుగా విత్తుకుంటామని, అధిక దిగుబడి పొందడానికి ఇదే ముఖ్యకారణమని రమణారెడ్డి చెబుతున్నారు. ఒక వేళ వర్షాలు సరిగ్గా లేక విత్తనంలో సగం మొలిచినా మంచి దిగుబడే వస్తున్నదని, ఇది గత ఎనిమిదేళ్లుగా తమ అనుభవమని ఆయన అంటున్నారు. తమ సొంత విత్తనమే కాబట్టి పూర్తిగా మొలవకపోయినా మళ్లీ విత్తనం వేసుకోవచ్చన్న భరోసా వీరిలో కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు తమకు ఆ అవసరం ఎప్పుడూ రాలేదని అంటున్నారాయన. ఆరుద్రలో మిరప, వరి నారు.. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ఎండు మిరపను డ్రిప్‌తో సొంత విత్తనంతో సాగు చేస్తూ.. ఎకరానికి 30–36 క్వింటాళ్ల వరకు దిగుబడి పొందుతూ రమణారెడ్డి, లావణ్య తమ ప్రత్యేకత చాటుతున్నారు. నాగపూర్‌లో ఒక రైతు నుంచి గత 14 ఏళ్ల క్రితం హర్షవర్ధిని మిరప విత్తనాన్ని తెచ్చారు. 2,3 కోతల్లో మంచి నాణ్యతతో ఉన్న కాయలను విత్తనానికి పక్కన పెట్టుకుంటూ.. ఇప్పటికీ అదే వంగడం వాడుకుంటున్నామని తెలిపారు. 9 నెలల పంటకాలంలో 5 విడతలుగా ఎకరానికి 2 నుంచి 4 టన్నుల వరకు ఘనజీవామృతం వేస్తారు. 5 విడతల్లో ఎకరానికి వెయ్యి లీ. ద్రవజీవామృతం ఇస్తున్నారు. గత ఏడాది 3 ఎకరాల్లో ఎండు మిరప సాగు చేశారు. ఆరుద్ర కార్తెలో మిరప, వరి నార్లు పోసుకుని నాటు వేస్తారు. మొదట్లోనే మిర్చి పొలం చుట్టూ ఎర పంటగా ఆవాలు చల్లడం ద్వారా పురుగుల తాకిడిని అదుపు చేస్తున్నారు. మొక్కనాటిన 3 నెలల తర్వాత ధనియాలు, మెంతులు, గోధుమలు, పప్పుశనగ వంటి స్వల్పకాలిక అంతర పంటల విత్తనాలు చలుతున్నారు. గత ఏడాది ఎకరానికి 30 క్వింటాళ్ల ఎండు మిర్చి దిగుబడి తీశామని రమణారెడ్డి(99513 41819) వివరించారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పూర్తిస్థాయిలో అనుసరిస్తే నాన్‌బీటీ సూటిరకం పత్తి, మిరప పంటలను కూడా నిశ్చింతగా సాగు చేసి మంచి దిగుబడులు పొందవచ్చని ఈ రైతు దంపతులు చెబుతున్నారు. ఇదేమి చోద్యం?! రమణారెడ్డి, లావణ్య గత 8 ఏళ్లుగా ప్రకృతి సేద్యంలో చేస్తున్న సఫల ప్రయోగాలపై వ్యవసాయ విశ్వవిద్యాలయం, స్పైసెస్ బోర్డు పట్టించుకున్న దాఖలాల్లేవు. అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యే ముఖ్యమైన వాణిజ్య పంటలపై 8 ఏళ్ల క్షేత్రస్థాయి ఆదర్శ సేద్యంపై ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడం విడ్డూరం! -
నివాసాల మధ్య నకిలీ బాగోతం
బీటీ పత్తి విత్తనాల గుట్టురట్టు - విజిలెన్స్ అధికారుల మూకుమ్మడి దాడులు - కల్లూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లోని పోలీసు కాలనీలో రూ.55 లక్షల నకిలీ విత్తనాలు స్వాధీనం - 3వేలు ప్యాకెట్లు, ప్యాకింగ్‌కు సిద్ధంగా ఉన్న 3వేల కిలోల విత్తనాలు సీజ్ కర్నూలు(అగ్రికల్చర్): ఖరీఫ్ సీజన్ మొదలు కానున్న నేపథ్యంలో నకిలీ విత్తనాలు భారీగా పట్టుబడ్డాయి. బిటీ పత్తి విత్తనాలకు పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో అనుమతి ఉండగా.. అదే అడ్రస్‌తో కర్నూలులో విత్తన ప్యాకెట్లు తయారు చేసి రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సరఫరా చేస్తుండటం గమనార్హం. గురువారం విజిలెన్స్ ఎన్ఫోర్సుమెంట్ అధికారులు కర్నూలులో గుట్టుగా సాగుతున్న నకిలీ విత్తనాల రాకెట్‌ను రట్టు చేశారు. ఏకంగా రూ.55 లక్షలకు పైగా నకిలీ బీటీ పత్తి విత్తనాలను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకోవడం కలకలం రేపింది. ఈ ఘటనతో నకిలీ విత్తనాలకు అడ్డా కర్నూలు అనే విషయం మరోసారి నిరూపితమైంది. ‘సాక్షి’లో గత బుధవారం నకిలీ విత్తనాలపై ‘తెల్ల బంగారం.. విత్తు కలవరం’ శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురితమైంది. ఇందుకు స్పందించిన విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించడంతో నకిలీ బాగోతం వెలుగులోకి వచ్చింది. రీజినల్ విజిలెన్స్ ఎన్ఫోర్సుమెంట్ అధికారి బాబురావుకు వచ్చిన సమాచారం మేరకు ఆయన ఆదేశాలతో విజిలెన్ ఏడీఏ వెంకటేశ్వర్లు, విజిలెన్స్ ఇన్స్పెక్టర్లు శ్రీనివాసరెడ్డి, రామకృష్ణాచారి, జగన్మోహన్, కానిస్టేబుళ్లు శేఖర్, శివరాముడు, గౌడులు కల్లూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లోని పోలీసు కాలనీపై నిఘా వేశారు. పోలీసు కాలనీలోని డోర్ నెం.77/180–7–1–3 ఇంటిలో బీటీ విత్తన ప్యాకెట్లు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఆ మేరకు విజిలెన్స్ అధికారులు మూకుమ్మడిగా దాడి చేశారు. నివాస ప్రాంతాల మధ్య భారీ ఎత్తున నకిలీ విత్తనాల రాకెట్ సాగుతుండటం చూసి అధికారులే విస్తుపోయారు. ఇండిగో క్రాప్ కేర్ సీడ్‌కు పశ్చిమగోదావరి జిల్లాలో అనుమతి ఉంది. బీటీ విత్తన ప్యాకెట్లను గుజరాత్లో తయారు చేసినట్లు ఉంది. కానీ ప్యాకెట్లు మాత్రం కల్లూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లోని పోలీసు కాలనీలో తయారు చేస్తున్నట్లు గుర్తించారు. కర్నూలు ఆదిత్యనగర్‌లో కార్యాలయం ఉన్నట్లు చూపినా.. అక్కడ అలాంటి ఆనవాళ్లు ఏవీ లేకపోవడం గమనార్హం. లీడర్, బీజీ, రుద్ర పేర్లతో ప్యాకెట్ల తయారీ లీడర్–99, బీజీ–2, రుద్ర–118, బీజీ–2 పేరుతో 3వేల ప్యాకెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భారీగా ఖాళీ ప్యాకెట్లను కూడా సీజ్ చేశారు. వీటిపై గుజరాత్లో ప్యాకెట్లు తయారు చేసినట్లు, కంపెనీ తాడేపల్లిగూడెంలో ఉన్నట్లు ఉంది. 450 గ్రాముల ప్యాకెట్ ధర రూ.800లుగా ముద్రించారు. ప్యాకెట్లు తయారు చేసినవి 3వేలు ఉండగా.. 7,500 ప్యాకెట్ల తయారీకి అవసరమైన విత్తనాలను సిద్ధంగా ఉంచారు. వీటి విలువను విజిలెన్స్ అధికారులు రూ.55లక్షలుగా చెబుతున్నా.. ముద్రించిన ధర ప్రకారం రూ.84లక్షలు ఉంటుందని తెలుస్తోంది. వ్యవసాయాధికారులకు నకిలీ విత్తనాలు అప్పగింత విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న బీటీ విత్తన ప్యాకెట్లు, బస్తాల్లో ఉన్న విత్తనాలను కర్నూలు మండల వ్యవసాయాధికారి అశోక్కుమార్రెడ్డికి అప్పగించారు. నకిలీ విత్తనాలు ఉన్న ఇంటిని కూడా సీజ్ చేశారు. సీడ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు విజిలెన్స్ ఏడీఏ వెంకటేశ్వర్లు తెలిపారు. ఘటనా ప్రాంతాన్ని కర్నూలు ఏడీఏ రమణారెడ్డి, ఏఓ విశ్వనా«ద్ తదితరులు పరిశీలించారు. -
మోన్శాంటోకు ముకుతాడు
- పత్తి విత్తన గుత్తాధిపత్యానికి కేంద్రం చెక్ - బీటీ టెక్నాలజీ ఉన్న ఏ కంపెనీకైనా లెసైన్స్ - కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర కమిటీ - లెసైన్సింగ్ విధానంపై మార్గదర్శకాల రూపకల్పన - ఇతర విత్తన కంపెనీలు మార్కెట్లోకి వచ్చే వెసులుబాటు - బీటీ-3 పత్తి వంగడానికి లైన్‌క్లియర్ - బీటీ విత్తన ధరలు తగ్గే అవకాశం.. రైతులకు ప్రయోజనం - ఇన్నాళ్లూ రాయల్టీ రూపంలో వేల కోట్లు దండుకున్న మోన్శాంటో సాక్షి, హైదరాబాద్: బీటీ పత్తి.. ఇప్పటివరకు ఇది మోన్శాంటో సొంతం! బీటీ టెక్నాలజీని అడ్డుపెట్టుకొని ఈ బహుళజాతి సంస్థ ఇన్నేళ్లుగా వేల కోట్లు కొల్లగొట్టింది. అడ్డగోలుగా విత్తన రేట్లు నిర్ణయించి సొమ్ము చేసుకుంది. విత్తనంపై పెత్తనం చలాయిస్తూ ఇతర విత్తన కంపెనీలను తొక్కేసింది. ఈ గుత్తాధిపత్యానికి కేంద్ర ప్రభుత్వం తాజాగా చెక్ పెట్టింది. బీటీ టెక్నాలజీ పరిజ్ఞానం ఉన్న ఇతర కంపెనీలు కూడా పత్తి విత్తన వ్యాపారం చేసుకునేందుకు పచ్చజెండా ఊపింది. ఈ మేరకు కేంద్రం నియమించిన కమిటీ మార్గదర్శకాలను, లెసైన్సింగ్ విధానాన్ని ఖరారు చేసింది. దీంతో కంపెనీల మధ్య పోటీ ఏర్పడి రైతులకు తక్కువ ధరకే విత్తనాలు లభించే అవకాశం కలగనుంది. 2002 నుంచి కొనసాగుతున్న మోన్శాంటో గుత్తాధిపత్యానికీ కళ్లెం పడనుంది. టెక్నాలజీ ఉంటే చాలు.. 2016-17 సంవత్సరానికి బీటీ కాటన్ గరిష్ట విక్రయ ధర, లెసైన్సింగ్ నిర్ధారణకు కేంద్ర వ్యవసాయశాఖ ఇటీవల ఒక కమిటీ ఏర్పాటు చేసింది. కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి(సీడ్) చైర్మన్‌గా ఉన్న ఈ కమిటీలో తెలంగాణ వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసార థి సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ మంగళవారం ఢిల్లీలో సమావేశమైంది. ఇప్పటికే బీటీ పత్తి విత్తన ధరలను త గ్గించిన కమిటీ.. ఈ సమావేశంలో లెసైన్సింగ్పై కీలక నిర్ణయం తీసుకుంది. బీటీ టెక్నాలజీ ద్వారా పత్తి విత్తనం తయారు చేసే కంపెనీలకు లెసైన్స్ ఎలా ఇవ్వాలన్న అంశంపై మార్గదర్శకాలు తయారుచేసింది. బీటీ టెక్నాలజీ కలిగిన కంపెనీలు, విత్తన ఉత్పత్తి సంస్థల మధ్య ఒప్పందం అంశంపైనా నిర్ణయం తీసుకున్నారు. ఈ ఒప్పందం విషయంలో ప్రభుత్వం మధ్యవర్తిగా ఉండనుంది. ఇంతకుముందు బీటీ పత్తి విత్తనాన్ని ఇతర కంపెనీలు తయారు చేసి విక్రయించాలంటే మోన్శాంటోకు ముందస్తుగా ఒకేసారి రూ.40 లక్షలు రుసుం చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు రూ.25 లక్షలకు తగ్గించి రెండు వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు కల్పించారు. ప్రస్తుతం బీటీ టెక్నాలజీపై మోన్శాంటోకే లెసైన్స్ ఉంది. దీంతో ఇతర కంపెనీలు ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసినా వాటికి లెసైన్స్ దక్కకుండా అడ్డుకుంది. ఇకపై మోన్శాంటో కంపెనీ మాదిరే ఏ కంపెనీకైనా లెసైన్స్ పొందే వీలు కలుగనుంది. ఫలితంగా బీటీ టెక్నాలజీ కలిగిన కంపెనీలు తమ విత్తనాలను మార్కెట్లోకి విడుదల చేసుకునే వెసులుబాటు కలుగుతుంది. తక్కువ ధరకే విత్తనాలు తాజా మార్గదర్శకాలతో రైతులకు తక్కువ ధరలకు బీటీ విత్తనాలు అందుబాటులోకి వస్తాయని కమిటీ సభ్యులు అభిప్రాయపడుతున్నారు. విత్తన ఉత్పత్తి రైతులకు కూడా గిట్టుబాటు ధర అందేలా మార్గదర్శకాలు రూపొందించారు. రాయల్టీ నిర్ధారణ, వాణిజ్యపరంగా రాయల్టీ ఎన్నాళ్లు ఉండాలన్న దానిపైనా మార్గదర్శకాలు ఖరారు చేశారు. విత్తన కంపెనీలు పరిశోధనకు ప్రాధాన్యం ఇవ్వాలని కమిటీ కోరింది. విత్తన టెక్నాలజీ పునర్వ్యవస్థీకరణ లో భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్), వ్యవసాయ విశ్వవిద్యాలయాల భాగస్వామ్యం ఉండాలని సూచించింది. ఇన్నాళ్లూ మోన్శాంటో ఆడిందే ఆట మోన్శాంటో కంపెనీ మహారాష్ట్ర హైబ్రిడ్ కంపెనీ (మైకో)తో కలిసి దేశవ్యాప్తంగా 2002 నుంచి బీటీ-1 పత్తి విత్తన వ్యాపారం చేస్తోంది. ఇతర విత్తన కంపెనీలతో ఒప్పందాలు చేసుకొని మరే ఇతర పత్తి విత్తనాలు మార్కెట్లోకి అడుగుపెట్టకుండా గుత్తాధిపత్యం చెలాయిస్తూ వేల కోట్ల వ్యాపారం చేస్తోంది. బీటీ-1 పత్తి (మోన్ 531 జీన్) విత్తనానికి సంబంధించి మోన్శాంటో కంపెనీకి పేటెంట్ హక్కే లేదని, అందువల్ల రాయల్టీ చెల్లించాల్సిన అవసరం లేదని, ఉచితంగానే వాడుకోవచ్చని జాతీయ పత్తి పరిశోధన సంస్థ (సీఐసీఆర్) గతంలోనే తేల్చిచెప్పింది. అయినా ఇప్పటికీ కంపెనీల నుంచి రాయల్టీ వసూలు చేస్తోంది. 2006లో బీటీ-2 పత్తి విత్తనాన్ని మార్కెట్లో ప్రవేశపెట్టి దానికి పేటెంట్ ఉందని చెబుతూ రాయల్టీ నిర్ణయించినా.. ఇప్పటికీ బీటీ-1కు అక్రమంగా రాయల్టీని వసూలు చేస్తుండడం గమనార్హం. బీటీ-2 ఔట్.. బీటీ-3 ఇన్! ఇప్పుడు బీటీ-2 పత్తి విత్తనం కూడా పురుగును తట్టుకునే శక్తి కోల్పోయింది. ఫలితంగా దేశవ్యాప్తంగా అనేకచోట్ల పత్తి పంటకు గులాబీ రంగు పురుగు సోకింది. రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు. దీనిపై వివిధ రాష్ట్రాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కర్ణాటక ప్రభుత్వం మోన్శాంటో నుంచి రూ.2 వేల కోట్ల పరిహారం కోరుతోంది. ఈ నేపథ్యంలో బీటీ-2కు ప్రత్యామ్నాయంగా దేశంలోని పలు పత్తి కంపెనీలు బీటీ-3 టెక్నాలజీని తీసుకురావాలని నిర్ణయించాయి. కేంద్రం తాజాగా లెసైన్స్ మార్గదర్శకాలు తయారుచేసినందున బీటీ-3 పత్తి వంగడానికి మార్గం సుగమం అయినట్లేనని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. బీటీ-2 పత్తి విత్తనం విఫలమైందంటూ కేంద్రం కూడా సుప్రీంకోర్టుకు అఫిడవిట్ రూపంలో నివేదించింది. దీంతో దాన్ని నిషేధించి బీటీ-3కి అనుమతి ఇవ్వాలని దేశీయ కంపెనీలు కోరుతున్నాయి. రాష్ట్రంలో 42.42 లక్షల ఎకరాల్లో బీటీ దేశంలో అత్యధిక పత్తి సాగు చేసే రాష్ట్రాల్లో తెలంగాణ అత్యంత కీలకం. 2015-16 ఖరీఫ్‌లో రాష్ట్రంలో 88.90 లక్షల ఎకరాల్లో పంటలు సాగైతే అందులో 42.42 లక్షల ఎకరాల్లో పత్తిని సాగు చేశారు. మొత్తం వ్యవసాయ పంటల సాగు విస్తీర్ణంలో దాదాపు సగం వరకు పత్తి ఉండటం గమనార్హం. రాష్ట్రంలో 55.53 లక్షల మంది రైతులుండగా.. వారిలో దాదాపు 25 లక్షల మంది పత్తి సాగు చేశారని అంచనా. ప్రతి ఏటా సుమారు కోటికిపైగా బీటీ పత్తి విత్తన ప్యాకెట్లు విక్రయిస్తున్నారు. గతేడాది ఒక్కో ప్యాకెట్ కు రూ.930 వసూలు చేశారు. ఈ లెక్కన రాష్ట్రంలో రూ.వెయ్యి కోట్ల బీటీ పత్తి విత్తన వ్యాపారం జరుగుతోంది. 2002-03లో మొత్తం పత్తి సాగు విస్టీర్ణంలో కేవలం ఒక శాతమే బీటీ-1 విత్తనాలను వేయగా.. 2006-07 నాటికి అది కాస్తా 85 శాతానికి చేరింది! బీటీ-2 వచ్చాక 2014-15లో బీటీ-1 విత్తన మార్కెట్ వాటా 4 శాతానికి పడిపోయింది. ప్రస్తుతం బీటీ-2 వాటా 98 శాతంగా ఉంది. గుత్తాధిపత్యానికి అడ్డువేశాం ఇప్పటివరకు ప్రభుత్వానికి సంబంధం లేకుండా లెసైన్సింగ్ పద్ధతి ఉండేది. మిగతా కంపెనీలకు లెసైన్స్ రానీయకుండా గుత్తాధిపత్యం కొనసాగింది. కమిటీ తీసుకున్న నిర్ణయంతో మోన్శాంటో గుత్తాధిపత్యానికి కాలం చెల్లినట్లే! ఇకపై బీటీ టెక్నాలజీ ఉన్న ఏ కంపెనీ అయినా లెసైన్స్ తీసుకోవచ్చు. టెక్నాలజీ ఒక్కరి వద్దే ఉండటం సరికాదు. అది బదిలీ కావాలి. అందుకు తాజా మార్గదర్శకాలు దోహదం చేస్తాయి. ఇక నుంచి ఒప్పందాలేవైనా ప్రభుత్వ మధ్యవర్తిత్వంలోనే జరగాలని నిర్ణయించాం. - సి.పార్థసారథి, తెలంగాణ వ్యవసాయశాఖ కార్యదర్శి విత్తన ధరలు తగ్గుతాయి బీటీ పత్తి విత్తన కంపెనీలకు ఎలా లెసైన్స్ ఇవ్వాలన్న అంశంపై కేంద్ర కమిటీ తయారుచేసిన ముసాయిదా మార్గదర్శకాల వల్ల ఇక నుంచి అన్ని బీటీ కంపెనీలకూ లెసైన్స్ పొందే అవకాశం ఉంటుంది. ఫలితంగా భవిష్యత్తులో విత్తన ధర లు తగ్గనున్నాయి. - కేశవులు, తెలంగాణ విత్తన ధ్రువీకరణ సంస్థ బీటీ-3కి మార్గం సుగమం కేంద్రం తాజాగా మార్గదర్శకాలు అమల్లోకి వస్తే మోన్శాంటో గుత్తాధిపత్యానికి కాలం చెల్లుతుంది. బీటీ టెక్నాలజీ ఉన్న ఏ కంపెనీ అయినా తన ైనె పుణ్యాన్ని బట్టి నిబంధనల ప్రకారం లెసైన్స్ పొందవచ్చు. బీటీ-3 విత్తనానికి మార్గం సుగమమవుతుంది. రైతులకు ప్రయోజనం కలుగుతుంది. - నర్సింహారెడ్డి, వ్యవసాయరంగ నిపుణులు -
మోన్శాంటో రైతులను దోచేస్తోంది
* అడ్డగోలుగా రాయల్టీ వసూలు చేస్తోందని హైకోర్టుకు ప్రభుత్వ విన్నపం * ప్రభుత్వానివి మొసలి కన్నీళ్లని ఆరోపించిన మోన్శాంటో * రాయల్టీ వ్యవహారంతో ప్రభుత్వానికి సంబంధం లేదని వాదన * విచారణ 22కు వాయిదా సాక్షి, హైదరాబాద్: బీటీ పత్తి విత్తనాల రాయల్టీ విషయంలో మోన్శాంటో, రాష్ట్ర ప్రభుత్వం పరస్పరం తీవ్ర ఆరోపణలు గుప్పించుకున్నాయి. మోన్శాంటో అధిక ధరలతో రైతులను దోచుకుంటోందని ప్రభుత్వం వాదించగా... ప్రభుత్వానివి మొసలి కన్నీళ్లని మోన్శాంటో విమర్శించింది. అయితే బీటీ పత్తి విత్తనాలకు కేంద్రం దేశవ్యాప్తంగా ఏకీకృత ధర నిర్ణయించనుందని, దీనిపై రెండు మూడు రోజుల్లో నిర్ణయం వెలువడే అవకాశం ఉందని తెలుసుకున్న హైకోర్టు విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలె, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మహికో మోన్శాంటో బీటీ పత్తి విత్తనాలపై రాయల్టీని ప్యాకెట్‌కు రూ.50గా ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దానిని సవాలు చేస్తూ మోన్శాంటో సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా... విచారణ జరిపిన సింగిల్ జడ్జి ప్రభుత్వ ఉత్తర్వులపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ఆ స్టేను తొలగించాలంటూ ప్రభుత్వం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను సైతం కొట్టివేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలిక సీజే నేతృత్వంలోని ధర్మాసనానికి అప్పీలు చేసింది. దీనిపై ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ జరిపింది. ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్, మోన్శాంటో తరఫున సీనియర్ న్యాయవాది సి.వి.మోహన్‌రెడ్డి తదితరులు వాదనలు వినిపించారు. తొలుత విత్తన కంపెనీల నుంచి మోన్శాంటో అధిక రేట్లు వసూలు చేస్తోందని వైద్యనాథన్ ధర్మాసనానికి విన్నవించారు. దీనికి మోహన్‌రెడ్డి వెంటనే స్పందిస్తూ... ప్రభుత్వం తమ తరఫున కాకుండా విత్తన కంపెనీల తరఫున వాదనలు వినిపిస్తుండటం ఆశ్చర్యంగా ఉందని... రాయల్టీ విషయంలో విత్తన కంపెనీలకూ, తమకు మధ్య ఒప్పందం ఉందని, ప్రభుత్వానికి ఎటువంటి పాత్ర లేదని పేర్కొన్నారు. అయితే మోన్శాంటో వసూలు చేస్తున్న అధిక రాయల్టీ వల్ల అంతిమంగా రైతే నష్టపోతున్నాడని, రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వైద్యనాథన్ కోర్టుకు వివరించారు. అందువల్లే విత్తన కంపెనీల తరఫున కూడా వాదనలు వినిపిస్తున్నామని స్పష్టం చేశారు. దీనికి మోహన్‌రెడ్డి అభ్యంతరం చెబుతూ... బీటీ విత్తనాల తయారీకి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తున్నందున విత్తన కంపెనీలు తమకు రాయల్టీ చెల్లిస్తున్నాయని, దీని వల్ల ప్రభుత్వానికి వస్తున్న నష్టమేమీ లేదని పేర్కొన్నారు. రాయల్టీ అనేది తమకూ, విత్తన కంపెనీలకు మధ్య వ్యవహారమన్నారు. అంతేగాకుండా ప్రభుత్వం నిర్ణయించిన ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు విత్తన ప్యాకెట్లను విక్రయించవద్దని విత్తన కంపెనీలకు తాము చెబుతున్నామని వివరించారు. రాయల్టీ విషయంలో విత్తన కంపెనీలకు ఎటువంటి ఇబ్బంది లేదని, ఏ కంపెనీ కూడా ఎటువంటి ఫిర్యాదు చేయలేదని... ఈ వ్యవహారంలో ప్రభుత్వానివి మొసలి కన్నీళ్లని విమర్శించారు. బీటీ పత్తి విత్తనాలకు ఒక్కో రాష్ట్రం ఒక్కో ధరను నిర్ణయిస్తున్న నేపథ్యంలో... ఏకీకృత ధరను నిర్ణయించేందుకు కేంద్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసిందని, దీనిపై రెండు మూడు రోజుల్లో నిర్ణయం వెలువడే అవకాశం ఉందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ... కేంద్రం తీసుకునే నిర్ణయం వల్ల ఈ వ్యవహారంలో స్పష్టత వస్తుందని పేర్కొంటూ విచారణను వాయిదా వేసింది. -
‘రాయల్టీ’గా దోపిడీ
బీటీ పత్తి విత్తనాల రాయల్టీ పేరుతో వేలకోట్లు దోచుకున్న మోన్శాంటో 2002 నుంచి ఉమ్మడి ఏపీలో రూ. 2,010 కోట్లు వసూలు బీటీ-1 పత్తికి పేటెంట్ లేదని నిర్ధారించిన సీఐసీఆర్ దానిని ఉచితంగానే వాడుకోవచ్చని స్పష్టీకరణ పత్తి విత్తన మార్కెట్లో మోన్‌శాంటోదే గుత్తాధిపత్యం ప్రభుత్వం నిర్ణయించిన రాయల్టీకి నాలుగు రెట్లు వసూలు ఒక్కో ప్యాకెట్ విత్తనాలపై రూ. 200 వరకు దోపిడీ దేశంలో ఏ బీటీ పత్తికీ పేటెంట్ లేదంటున్న రైతు సంఘం అది యాజమాన్య హక్కు అని చెప్పుకొంటున్న కంపెనీ అదో బహుళజాతి కంపెనీ.. ఉత్తమ విత్తనాలు, అత్యుత్తమ దిగుబడులు అంటూ రైతుల ముంగిటకు వచ్చింది.. విపరీతంగా ప్రచారం చేసుకుని మార్కెట్లో గుత్తాధిపత్యం సాధించింది.. మరే విత్తన కంపెనీ రంగంలో లేకుండా చేసుకొంది.. తనకు లేని హక్కులను చూపుకొంటూ 2,010 కోట్ల రూపాయల దగాకు పాల్పడింది.. రైతుల సొమ్మంతా కొల్లగొట్టి, జేబులో వేసేసుకుంది.. ఇదీ బీటీ పత్తి విత్తనాల సంస్థ మోన్శాంటో దోపిడీ వ్యవహారం. బొల్లోజు రవి మోన్శాంటో బహుళ జాతి కంపెనీ రాయల్టీ పేరుతో పత్తి రైతులను నిలువు దోపిడీ చేసింది. బీటీ-1 పత్తి విత్తనానికి దేశంలో పేటెంట్ హక్కు లేకపోయినా ఉందని నమ్మించి 13 ఏళ్లుగా రాయల్టీ వసూలు చేస్తూ.. రూ.2,010 కోట్లు కొల్లగొట్టింది. ఒక్కో విత్తన ప్యాకెట్‌పై విత్తన ధరకు అదనంగా రూ.200 రాయల్టీ రూపేణా వసూలు చేసింది. కొన్ని చోట్ల విత్తనాలు మొలకెత్తక, ఆశించిన దిగుబడులు రాక రైతులు నష్టపోయినా.. అప్పుల పాలైనా మోన్శాంటో మాత్రం ముక్కుపిండి మరీ రాయల్టీ వసూలు చేసింది. ఇంత మోసం జరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదు. అసలు దీనిపై సరైన అవగాహన లేని ప్రభుత్వాలు కొంత రాయల్టీని నిర్ధారించగా.. అంతకు నాలుగు రెట్లకుపైగా మోన్శాంటో వసూలు చేసింది. ఈ తప్పుడు రాయల్టీ కారణంగా దేశంలోనే అధికంగా పత్తి పండించే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రైతులు భారీగా నష్టపోయారు. అయితే వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో బీటీ పత్తిపై రాయల్టీని తగ్గించి రైతులకు ఊరట కల్పించారు. పేటెంట్ లేదని తేల్చిన సీఐసీఆర్ మహారాష్ట్ర హైబ్రీడ్ కంపెనీ (మైకో)తో కలిసి మోన్శాంటో కంపెనీ దేశవ్యాప్తంగా 2002 నుంచి బీటీ-1 పత్తి విత్తనాల వ్యాపారం చేస్తోంది. ఇతర విత్తన కంపెనీలతో ఒప్పం దాలు చేసుకొని ఏ ఇతర పత్తి విత్తనాలు మార్కెట్లోకి అడుగుపెట్టకుండా గుత్తాధిపత్యం సంపాదించింది. మొత్తంగా తన బీటీ విత్తన సామ్రాజ్యాన్ని నిర్మించుకుని, వేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తోంది. కానీ ఇదంతా రైతుల్ని దగా చేసి, నిర్మించుకున్నదేనని ఇటీవల బహిర్గతమైంది. బీటీ-1 పత్తి (మోన్ 531 జీన్) విత్తనానికి సంబంధించి మోన్శాంటో కంపెనీకి పేటెంట్ హక్కు లేదని, రాయల్టీ చెల్లించనవసరం లేదని జాతీయ పత్తి పరిశోధన సంస్థ (సీఐసీఆర్) తాజాగా తేల్చిచెప్పడంతో మోన్శాంటో బండారం బయటపడింది. యాజమాన్య హక్కు పేరిట.. బీటీ-1 పత్తికి పేటెంట్ హక్కు లేకున్నా దేశంలోని విత్తన తయారీదారుల నుంచి కొన్నేళ్లుగా రూ. కోట్ల రాయల్టీని మోన్శాంటో వసూలు చేస్తోంది. విత్తన తయారీదారులు ఈ సొమ్ము ను రైతుల నుంచి వసూలు చేస్తున్నారు. ఇక 2006లో బీటీ-2 పత్తి విత్తనాన్ని మార్కెట్లో ప్రవేశపెట్టిన మోన్శాంటో దానికి పేటెంట్ ఉందంటూ రాయల్టీ నిర్ణయించింది. దాంతోపాటు ఇప్పటికీ బీటీ-1కు రాయల్టీ వసూలు చేస్తూనే ఉంది. అసలు దేశంలో విత్తన పేటెంట్ లేకపోయినా మోన్శాంటో మాత్రం పేటెంట్ అనే పదం వాడకుండా యాజమాన్య హక్కు అని చెబుతోంది. మరోవైపు యాజమాన్య హక్కుకు సంబంధించినవన్నీ వ్యాపార రహస్యాలని, ఇతర దేశాల్లో దానికి సంబంధించిన వివరాలు వెల్లడించబోమని మోన్శాంటో చెబుతూ వచ్చింది. వేల కోట్ల దగా.. పేటెంట్ హక్కులు లేకపోయినా ఉందని చెప్పి మోన్శాంటో సంస్థ రైతుల నుంచి కోట్లు కొల్లగొట్టింది. బీటీ-1 పత్తి ధరలోనే రాయల్టీని కూడా కలిపి వసూలు చేస్తూ వచ్చింది. 2002-03లో బీటీ-1 ప్యాకెట్ ధర రూ.1,600 కాగా.. అందులో రాయల్టీ కిందే రూ.1,250 వసూలు చేయడం గమనార్హం. ఈ లెక్కన మొదటి ఏడాది ఉమ్మడి ఏపీలో రూ.40 కోట్లను రాయల్టీ కింద వసూలు చేసింది. ఆ ఏడాది ఉమ్మడి ఏపీలో రైతాంగం వినియోగించిన పత్తి విత్తనాల్లో మోన్శాంటో వాటా ఒక్క శాతం మాత్రమే. ఆ తరువాత సంవత్సరం కూడా పెద్దగా విక్రయించలేకపోయింది. అయినా రాయల్టీ రూపేణా రూ.50 కోట్లు దండుకుంది. ఆ తర్వాత విస్తృతంగా ప్రచారం చేస్తూ అమ్మకాలను పెంచుకుంది. ఆ తర్వాత మోన్శాంటోకు తిరుగు లేకుండా పోయింది. 2002-03 నుంచి 2013-14 వరకు ఉమ్మడి ఏపీలో, గత ఏడాది తెలంగాణలో రాయల్టీ వసూలు చేసింది. రైతాంగం వినియోగించే విత్తనాల్లో 80% వాటా మోన్శాంటోకు దక్కడంతో రాయల్టీ రూపేణా భారీగా దోచుకుంది. ఇక బీటీ-2 ప్రవేశించిన ఏడాది 2006-07లో 96% మార్కెట్ వాటా బీటీ-1 పత్తిదే. రైతాంగం నుంచి వందల కోట్ల రూపాయల మేర రాయల్టీ వసూలు చేసిన మోన్శాంటో బీటీ-2 ప్రవేశంతో బీటీ-1 రాయల్టీని కొంత తగ్గించింది. దాంతో ఆ ఏడాది బీటీ-1 కింద రూ.250 కోట్లు వసూలు చేసింది. ఇలా మొత్తంగా ఈ 13 ఏళ్లలో ఏపీలో (ఏడాదిగా తెలంగాణలో) ఏకంగా రాయల్టీ రూపేణా సుమారు రూ.2,010 కోట్లను దండుకుంది. అందులోనూ ప్రభుత్వం నిర్ణయించిన రాయల్టీని లెక్కచేయకుండా పత్తి కంపెనీల నుంచి అనేక రెట్లు వసూలు చేసింది. ఉదాహరణకు గ త ఏడాది తెలంగాణ, ఏపీల్లో బీటీ-1 కింద రాయల్టీని రూ.50గా నిర్ణయిస్తే పత్తి కంపెనీల నుంచి మోన్శాంటో రూ.200 వరకు వసూలు చేసింది. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో ఆయా కంపెనీలే ఒప్పుకోవడం గమనార్హం. ఏ బీటీ పత్తికీ పేటెంట్ లేదు మోన్‌శాం టోకు చెందిన బీటీ-1, బీటీ-2 పత్తి విత్తనాలకు వేటికీ పేటెంట్ లేదు. వీటిపై అక్రమంగా వందల కోట్ల రాయల్టీ వసూలు చేస్తున్నారు. ఒకవేళ పేటెంట్ హక్కులు ఉన్నాయనుకున్నా.. పదేళ్ల తర్వాత అవి రద్దవుతాయి. కానీ అవి వచ్చి 13 ఏళ్లు నిండాయి. ఇంకా ఎందుకు రాయల్టీ వసూలు చేస్తున్నారు? దీనికి ప్రభుత్వాలు ఎందుకు అంగీకరిస్తున్నాయన్నదే ప్రశ్న. - సారంపల్లి మల్లారెడ్డి, తెలంగాణ రైతు సంఘం నేత పేటెంట్ హక్కులు లేవు.. కానీ? బోల్‌గార్డ్-1 పత్తికి సంబంధించి మోన్శాంటోకు పేటెంట్ హక్కులు లేవు. దీనిపై అన్నిరకాల యాజమాన్య హక్కులు (ట్రేడ్‌మార్క్స్ మొదలుకొని పరిశోధన, అభివృద్ధి ఖర్చు మొదలైనవి) మా కంపెనీకే ఉన్నాయి. జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీ, ఇతర భారతీయ చట్టాలకు లోబడి లభించిన ఈ యాజమాన్య హక్కులను కేవలం పేటెంట్ల దృష్టితోనే కాకుండా.. విస్తృత స్థాయిలో చూడాలి. ఏ టెక్నాలజీకైనా నియంత్రణ సంస్థల అనుమతి లభించేందుకు దాదాపు పదేళ్లు పడుతుంది. - రంగరాజన్ వాసుదేవన్, మోన్శాంటో అధికార ప్రతినిధి -
రకాలు వేరైనా దిగుబడి సమానమే
న్యాల్కల్: బీటీ పత్తి విత్తనాలు ఏవైనా ఒకే రకం దిగుబడులను ఇస్తాయని ఆత్మకమిటీ జిల్లా ఇన్చార్జ్ డీపీడీ కరుణాకర్‌రెడ్డి అన్నారు. ఆత్మ ఆధ్వర్యంలో మండల పరిధిలోని మిర్జాపూర్(ఎన్)లో మంగళవారం బీటీ పత్తి రకాల వ్యత్యాసాలపై ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీటీ రకాలు వేరైనప్పటికీ దిగుబడులు మాత్రం ఒకే రకంగా వస్తాయని చెప్పారు. దీనిపై రైతులకు సరైన అవగాహన లేకపోవడంతో అధిక ధరలకు విత్తనాలు కొని నష్టపోతున్నారని తెలిపారు. వీరికి అవగాహన కల్పించేందుకు స్థానిక రైతు వామన్‌రావుకు చెందిన నాలుగు ఎకరాల పొలంలో ప్రయోగాత్మకంగా మల్లికగోల్డ్, భాస్కర్, వర్మ, జాదు అనే నాలుగు రకాల బీటీ పత్తి విత్తనాలను ఎకరం చొప్పన నాలుగు ఎకరాల్లో సాగు చేశామని చెప్పారు. అన్ని రకాల పంటలకు సమాన పరిమాణంలో ఎరువులు, నీరు అందిస్తున్నామన్నారు. మొక్కల ఎదుగుదలలో మార్పు అన్నింటిలోనూ ఒకే రకంగా ఉందని తెలిపారు. దిగుబడులు కూడా ఒకే రకంగా వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. లేత కాండంపై బొట్టు పెట్టే కార్యక్రమం పలుమార్లు నిర్వహించామన్నారు. దీంతో రసం పీల్చే పురుగులను సమర్థవంతంగా నివారించవచ్చని తెలిపారు. అంతే కాకుండా పొలంలో అక్కడక్కడ జిగురుతో ఉండే పసుపు రంగు ప్లేట్లను పెట్టాలన్నారు. పంటకు నష్టం చేసే పురుగులు దీనికి అతుక్కుని చనిపోతాయని వివరించారు. ఈ విధానం ద్వారా రైతులకు అధిక దిగుబడులు రావడమే కాకుండా 50 శాతం మేర ఖర్చు తగ్గుతుందని చెప్పారు. రసాయన మందులను అధికంగా వాడొద్దని సూచించారు. కార్యక్రమంలో జహీరాబాద్ వ్యవసాయ శాఖ ఏడీ వినోద్‌కుమార్, మండల వ్యవసాయ శాఖ అధికారి లావణ్య రైతులు పాల్గొన్నారు.