మోన్‌శాంటో రైతులను దోచేస్తోంది
* అడ్డగోలుగా రాయల్టీ వసూలు చేస్తోందని హైకోర్టుకు ప్రభుత్వ విన్నపం
* ప్రభుత్వానివి మొసలి కన్నీళ్లని ఆరోపించిన మోన్‌శాంటో
* రాయల్టీ వ్యవహారంతో ప్రభుత్వానికి సంబంధం లేదని వాదన
* విచారణ 22కు వాయిదా
సాక్షి, హైదరాబాద్: బీటీ పత్తి విత్తనాల రాయల్టీ విషయంలో మోన్‌శాంటో, రాష్ట్ర ప్రభుత్వం పరస్పరం తీవ్ర ఆరోపణలు గుప్పించుకున్నాయి. మోన్‌శాంటో అధిక ధరలతో రైతులను దోచుకుంటోందని ప్రభుత్వం వాదించగా...
ప్రభుత్వానివి మొసలి కన్నీళ్లని మోన్‌శాంటో విమర్శించింది. అయితే బీటీ పత్తి విత్తనాలకు కేంద్రం దేశవ్యాప్తంగా ఏకీకృత ధర నిర్ణయించనుందని, దీనిపై రెండు మూడు రోజుల్లో నిర్ణయం వెలువడే అవకాశం ఉందని తెలుసుకున్న హైకోర్టు విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలె, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
మహికో మోన్‌శాంటో బీటీ పత్తి విత్తనాలపై రాయల్టీని ప్యాకెట్‌కు రూ.50గా ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దానిని సవాలు చేస్తూ మోన్‌శాంటో సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా... విచారణ జరిపిన సింగిల్ జడ్జి ప్రభుత్వ ఉత్తర్వులపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ఆ స్టేను తొలగించాలంటూ ప్రభుత్వం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను సైతం కొట్టివేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలిక సీజే నేతృత్వంలోని ధర్మాసనానికి అప్పీలు చేసింది.
దీనిపై ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ జరిపింది. ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్, మోన్‌శాంటో తరఫున సీనియర్ న్యాయవాది సి.వి.మోహన్‌రెడ్డి తదితరులు వాదనలు వినిపించారు. తొలుత విత్తన కంపెనీల నుంచి మోన్‌శాంటో అధిక రేట్లు వసూలు చేస్తోందని వైద్యనాథన్ ధర్మాసనానికి విన్నవించారు. దీనికి మోహన్‌రెడ్డి వెంటనే స్పందిస్తూ... ప్రభుత్వం తమ తరఫున కాకుండా విత్తన కంపెనీల తరఫున వాదనలు వినిపిస్తుండటం ఆశ్చర్యంగా ఉందని... రాయల్టీ విషయంలో విత్తన కంపెనీలకూ, తమకు మధ్య ఒప్పందం ఉందని, ప్రభుత్వానికి ఎటువంటి పాత్ర లేదని పేర్కొన్నారు. అయితే మోన్‌శాంటో వసూలు చేస్తున్న అధిక రాయల్టీ వల్ల అంతిమంగా రైతే నష్టపోతున్నాడని, రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వైద్యనాథన్ కోర్టుకు వివరించారు.
అందువల్లే విత్తన కంపెనీల తరఫున కూడా వాదనలు వినిపిస్తున్నామని స్పష్టం చేశారు. దీనికి మోహన్‌రెడ్డి అభ్యంతరం చెబుతూ... బీటీ విత్తనాల తయారీకి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తున్నందున విత్తన కంపెనీలు తమకు రాయల్టీ చెల్లిస్తున్నాయని, దీని వల్ల ప్రభుత్వానికి వస్తున్న నష్టమేమీ లేదని పేర్కొన్నారు. రాయల్టీ అనేది తమకూ, విత్తన కంపెనీలకు మధ్య వ్యవహారమన్నారు. అంతేగాకుండా ప్రభుత్వం నిర్ణయించిన ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు విత్తన ప్యాకెట్లను విక్రయించవద్దని విత్తన కంపెనీలకు తాము చెబుతున్నామని వివరించారు.
రాయల్టీ విషయంలో విత్తన కంపెనీలకు ఎటువంటి ఇబ్బంది లేదని, ఏ కంపెనీ కూడా ఎటువంటి ఫిర్యాదు చేయలేదని... ఈ వ్యవహారంలో ప్రభుత్వానివి మొసలి కన్నీళ్లని విమర్శించారు. బీటీ పత్తి విత్తనాలకు ఒక్కో రాష్ట్రం ఒక్కో ధరను నిర్ణయిస్తున్న నేపథ్యంలో... ఏకీకృత ధరను నిర్ణయించేందుకు కేంద్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసిందని, దీనిపై రెండు మూడు రోజుల్లో నిర్ణయం వెలువడే అవకాశం ఉందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ... కేంద్రం తీసుకునే నిర్ణయం వల్ల ఈ వ్యవహారంలో స్పష్టత వస్తుందని పేర్కొంటూ విచారణను వాయిదా వేసింది.