‘రాయల్టీ’గా దోపిడీ | Robbery of Royality in BT cotton seeds | Sakshi
Sakshi News home page

‘రాయల్టీ’గా దోపిడీ

Published Wed, Jul 1 2015 1:56 AM | Last Updated on Sun, Sep 3 2017 4:38 AM

‘రాయల్టీ’గా దోపిడీ

‘రాయల్టీ’గా దోపిడీ

బీటీ పత్తి విత్తనాల రాయల్టీ పేరుతో వేలకోట్లు దోచుకున్న మోన్‌శాంటో
2002 నుంచి ఉమ్మడి ఏపీలో రూ. 2,010 కోట్లు వసూలు
బీటీ-1 పత్తికి పేటెంట్ లేదని నిర్ధారించిన సీఐసీఆర్
దానిని ఉచితంగానే వాడుకోవచ్చని స్పష్టీకరణ
పత్తి విత్తన మార్కెట్లో మోన్‌శాంటోదే గుత్తాధిపత్యం
ప్రభుత్వం నిర్ణయించిన రాయల్టీకి నాలుగు రెట్లు వసూలు
ఒక్కో ప్యాకెట్ విత్తనాలపై రూ. 200 వరకు దోపిడీ
దేశంలో ఏ బీటీ పత్తికీ పేటెంట్ లేదంటున్న రైతు సంఘం
అది యాజమాన్య హక్కు అని చెప్పుకొంటున్న కంపెనీ

 
అదో బహుళజాతి కంపెనీ.. ఉత్తమ విత్తనాలు, అత్యుత్తమ దిగుబడులు అంటూ రైతుల ముంగిటకు వచ్చింది.. విపరీతంగా ప్రచారం చేసుకుని మార్కెట్లో గుత్తాధిపత్యం సాధించింది.. మరే విత్తన కంపెనీ రంగంలో లేకుండా చేసుకొంది.. తనకు లేని హక్కులను చూపుకొంటూ 2,010 కోట్ల రూపాయల దగాకు పాల్పడింది.. రైతుల సొమ్మంతా కొల్లగొట్టి, జేబులో వేసేసుకుంది.. ఇదీ బీటీ పత్తి విత్తనాల సంస్థ మోన్‌శాంటో దోపిడీ వ్యవహారం.
 
 బొల్లోజు రవి
 మోన్‌శాంటో బహుళ జాతి కంపెనీ రాయల్టీ పేరుతో పత్తి రైతులను నిలువు దోపిడీ చేసింది. బీటీ-1 పత్తి విత్తనానికి దేశంలో పేటెంట్ హక్కు లేకపోయినా ఉందని నమ్మించి 13 ఏళ్లుగా రాయల్టీ వసూలు చేస్తూ.. రూ.2,010 కోట్లు కొల్లగొట్టింది. ఒక్కో విత్తన ప్యాకెట్‌పై విత్తన ధరకు అదనంగా రూ.200 రాయల్టీ రూపేణా వసూలు చేసింది. కొన్ని చోట్ల విత్తనాలు మొలకెత్తక, ఆశించిన దిగుబడులు రాక రైతులు నష్టపోయినా.. అప్పుల పాలైనా మోన్‌శాంటో మాత్రం ముక్కుపిండి మరీ రాయల్టీ వసూలు చేసింది. ఇంత మోసం జరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదు. అసలు దీనిపై సరైన అవగాహన లేని ప్రభుత్వాలు కొంత రాయల్టీని నిర్ధారించగా.. అంతకు నాలుగు రెట్లకుపైగా మోన్‌శాంటో వసూలు చేసింది. ఈ తప్పుడు రాయల్టీ కారణంగా దేశంలోనే అధికంగా పత్తి పండించే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ  రాష్ట్రాల రైతులు భారీగా నష్టపోయారు. అయితే వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో బీటీ పత్తిపై రాయల్టీని తగ్గించి రైతులకు ఊరట కల్పించారు.
 
 పేటెంట్ లేదని తేల్చిన సీఐసీఆర్
 మహారాష్ట్ర హైబ్రీడ్ కంపెనీ (మైకో)తో కలిసి మోన్‌శాంటో కంపెనీ దేశవ్యాప్తంగా 2002 నుంచి బీటీ-1 పత్తి విత్తనాల వ్యాపారం చేస్తోంది. ఇతర విత్తన కంపెనీలతో ఒప్పం దాలు చేసుకొని ఏ ఇతర పత్తి విత్తనాలు మార్కెట్లోకి అడుగుపెట్టకుండా గుత్తాధిపత్యం సంపాదించింది. మొత్తంగా తన బీటీ విత్తన సామ్రాజ్యాన్ని నిర్మించుకుని, వేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తోంది. కానీ ఇదంతా రైతుల్ని దగా చేసి, నిర్మించుకున్నదేనని ఇటీవల బహిర్గతమైంది. బీటీ-1 పత్తి (మోన్ 531 జీన్) విత్తనానికి సంబంధించి మోన్‌శాంటో కంపెనీకి పేటెంట్ హక్కు లేదని, రాయల్టీ చెల్లించనవసరం లేదని జాతీయ పత్తి పరిశోధన సంస్థ (సీఐసీఆర్) తాజాగా తేల్చిచెప్పడంతో మోన్‌శాంటో బండారం బయటపడింది.
 
యాజమాన్య హక్కు పేరిట..
బీటీ-1 పత్తికి పేటెంట్ హక్కు లేకున్నా దేశంలోని విత్తన తయారీదారుల నుంచి కొన్నేళ్లుగా రూ. కోట్ల రాయల్టీని మోన్‌శాంటో వసూలు చేస్తోంది. విత్తన తయారీదారులు ఈ సొమ్ము ను రైతుల నుంచి వసూలు చేస్తున్నారు. ఇక 2006లో బీటీ-2 పత్తి విత్తనాన్ని మార్కెట్లో ప్రవేశపెట్టిన మోన్‌శాంటో దానికి పేటెంట్ ఉందంటూ రాయల్టీ నిర్ణయించింది. దాంతోపాటు ఇప్పటికీ బీటీ-1కు రాయల్టీ వసూలు చేస్తూనే ఉంది. అసలు దేశంలో విత్తన పేటెంట్ లేకపోయినా మోన్‌శాంటో మాత్రం పేటెంట్ అనే పదం వాడకుండా యాజమాన్య హక్కు అని చెబుతోంది. మరోవైపు యాజమాన్య హక్కుకు సంబంధించినవన్నీ వ్యాపార రహస్యాలని, ఇతర దేశాల్లో దానికి సంబంధించిన వివరాలు వెల్లడించబోమని మోన్‌శాంటో చెబుతూ వచ్చింది.
 
వేల కోట్ల దగా..
 పేటెంట్ హక్కులు లేకపోయినా ఉందని చెప్పి మోన్‌శాంటో సంస్థ రైతుల నుంచి కోట్లు కొల్లగొట్టింది. బీటీ-1 పత్తి ధరలోనే రాయల్టీని కూడా కలిపి వసూలు చేస్తూ వచ్చింది. 2002-03లో బీటీ-1 ప్యాకెట్ ధర రూ.1,600 కాగా.. అందులో రాయల్టీ కిందే రూ.1,250 వసూలు చేయడం గమనార్హం. ఈ లెక్కన మొదటి ఏడాది ఉమ్మడి ఏపీలో రూ.40 కోట్లను రాయల్టీ కింద వసూలు చేసింది. ఆ ఏడాది ఉమ్మడి ఏపీలో రైతాంగం వినియోగించిన పత్తి విత్తనాల్లో మోన్‌శాంటో వాటా ఒక్క శాతం మాత్రమే. ఆ తరువాత సంవత్సరం కూడా పెద్దగా విక్రయించలేకపోయింది. అయినా రాయల్టీ రూపేణా రూ.50 కోట్లు దండుకుంది. ఆ తర్వాత విస్తృతంగా ప్రచారం చేస్తూ అమ్మకాలను పెంచుకుంది. ఆ తర్వాత మోన్‌శాంటోకు తిరుగు లేకుండా పోయింది.
 
 2002-03 నుంచి 2013-14 వరకు ఉమ్మడి ఏపీలో, గత ఏడాది తెలంగాణలో రాయల్టీ వసూలు చేసింది. రైతాంగం వినియోగించే విత్తనాల్లో 80% వాటా మోన్‌శాంటోకు దక్కడంతో రాయల్టీ రూపేణా భారీగా దోచుకుంది. ఇక బీటీ-2 ప్రవేశించిన ఏడాది 2006-07లో 96% మార్కెట్ వాటా బీటీ-1 పత్తిదే. రైతాంగం నుంచి వందల కోట్ల రూపాయల మేర రాయల్టీ వసూలు చేసిన మోన్‌శాంటో బీటీ-2 ప్రవేశంతో బీటీ-1 రాయల్టీని కొంత తగ్గించింది. దాంతో ఆ ఏడాది బీటీ-1 కింద రూ.250 కోట్లు వసూలు చేసింది. ఇలా మొత్తంగా ఈ 13 ఏళ్లలో ఏపీలో (ఏడాదిగా తెలంగాణలో) ఏకంగా రాయల్టీ రూపేణా సుమారు రూ.2,010 కోట్లను దండుకుంది. అందులోనూ ప్రభుత్వం నిర్ణయించిన రాయల్టీని లెక్కచేయకుండా పత్తి కంపెనీల నుంచి అనేక రెట్లు వసూలు చేసింది. ఉదాహరణకు గ త ఏడాది తెలంగాణ, ఏపీల్లో బీటీ-1 కింద రాయల్టీని రూ.50గా నిర్ణయిస్తే పత్తి కంపెనీల నుంచి మోన్‌శాంటో రూ.200 వరకు వసూలు చేసింది. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో ఆయా కంపెనీలే ఒప్పుకోవడం గమనార్హం.
 
ఏ బీటీ పత్తికీ పేటెంట్ లేదు
 మోన్‌శాం టోకు చెందిన బీటీ-1, బీటీ-2 పత్తి విత్తనాలకు వేటికీ పేటెంట్ లేదు. వీటిపై అక్రమంగా వందల కోట్ల రాయల్టీ వసూలు చేస్తున్నారు. ఒకవేళ పేటెంట్ హక్కులు ఉన్నాయనుకున్నా.. పదేళ్ల తర్వాత అవి రద్దవుతాయి. కానీ అవి వచ్చి 13 ఏళ్లు నిండాయి. ఇంకా ఎందుకు రాయల్టీ వసూలు చేస్తున్నారు? దీనికి ప్రభుత్వాలు ఎందుకు అంగీకరిస్తున్నాయన్నదే ప్రశ్న.
 - సారంపల్లి మల్లారెడ్డి,
 తెలంగాణ రైతు సంఘం నేత

 
 పేటెంట్ హక్కులు లేవు.. కానీ?
 బోల్‌గార్డ్-1 పత్తికి సంబంధించి మోన్‌శాంటోకు పేటెంట్ హక్కులు లేవు. దీనిపై అన్నిరకాల యాజమాన్య హక్కులు (ట్రేడ్‌మార్క్స్ మొదలుకొని పరిశోధన, అభివృద్ధి ఖర్చు మొదలైనవి) మా కంపెనీకే ఉన్నాయి. జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీ, ఇతర భారతీయ చట్టాలకు లోబడి లభించిన ఈ యాజమాన్య హక్కులను కేవలం పేటెంట్ల దృష్టితోనే కాకుండా.. విస్తృత స్థాయిలో చూడాలి. ఏ టెక్నాలజీకైనా నియంత్రణ సంస్థల అనుమతి లభించేందుకు దాదాపు పదేళ్లు పడుతుంది.
 - రంగరాజన్ వాసుదేవన్,
 మోన్‌శాంటో అధికార ప్రతినిధి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement