రాయితీకి మంగళం! | TS Government Removed Vegetables Seeds Subsidy | Sakshi
Sakshi News home page

రాయితీకి మంగళం!

Published Mon, Jul 1 2019 10:52 AM | Last Updated on Mon, Jul 1 2019 10:52 AM

TS Government Removed Vegetables Seeds Subsidy - Sakshi

చౌదర్‌పల్లిలో కూరగాయల పంటల సాగు కోసం సిద్ధంగా ఉన్న వ్యవసాయ పొలం

యాచారం(ఇబ్రహీంపట్నం):  కూరగాయ విత్తనాల పంపిణీ విషయంలో ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖ చేతులేత్తెసింది. విత్తనాలపై అందజేసే రాయితీలపై కేసీఆర్‌ సర్కార్‌ నుంచి నేటికి ఎటువంటి స్పష్టత రాకపోవడంతో సంబంధిత శాఖ అధికారులతోపాటు రైతుల్లో అయోమయం నెలకొంది. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం కావడం, వర్షాలు కురిసి పొలం దున్ని నార్లు పోయడానికి సిద్ధమవుతున్న తరుణంలో రాయితీ విత్తనాలు లేవంటూ ఉద్యాన, పట్టుపరిశ్రమల శాఖ అధికారులు చావు కబురు చల్లగా చెప్పడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మార్కెట్లో విత్తనాలు కొనుగోలు చేస్తే అవి నకిలీవో... లేదా నాణ్యమైనవో తెలియకని భయాందోళన నెలకొంది. అదే ఉద్యానశాఖ ఆధ్వర్యంలో పంపిణీ చేస్తే ఆ భయం, దిగులు ఉండదు. మంచి దిగుబడి వస్తుందని రైతుల నమ్మకం. అయితే, ఈ ఏడాది ఆ ఉసే లేకపోవడంతో ఏం చేయాలో పాలుపోక రైతులకు దిక్కు తోచని పరిస్థితి ఏర్పడింది.

కూరగాయ విత్తనాల కోసం ఆయా డివిజన్లల్లో ఉన్న ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ అధికారులను రైతులు నిత్యం కలుస్తున్నా.. స్వష్టమైన హామీ రావడం లేదు. మహానగరం చుట్టూ రంగారెడ్డి జిల్లా విస్తరించి ఉండడంతో విస్తారంగా కూరగాయలు పండించేలా కేసీఆర్‌ సర్కార్‌ పంట కాలనీల పథకాన్ని చేపట్టింది. మొదట పైలెట్‌ ప్రాజెక్టు కింద ఇబ్రహీంపట్నం డివిజన్‌ను ఎంపిక చేసింది. అనంతరం చేవెళ్ల, మహేశ్వరం, షాద్‌నగర్‌ డివిజన్లను కూడా ఈ పథకం కింద ఎంపిక చేసింది. ప్రభుత్వం జిల్లావ్యాప్తంగా దాదాపు రూ. 100 కోట్లకు పైగా నిధులు ఖర్చు చేసి వేలాది టన్నుల కూరగాయల పండించాలని సంకల్పించింది. ఆలోచన బాగానే ఉన్నా అమలు విషయానికి వచ్చేసరికి తుస్సుమంది. రాయితీ విత్తనాలకే మంగళం పాడడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూరగాయ విత్తనాలను అధికారులు 50 శాతం రాయితీతో అందజేసేవారు. ఈసారి సబ్సిడీకి బడ్జెట్‌లో నిధులు కూడా కేటాయించలేదు.   

విత్తనాల్లేవ్‌... నారే ఇస్తాం..
రాయితీ విత్తనాలకు మంగళం పాడిన ప్రభుత్వం నారును పంపిణీ చేయడానికి నిర్ణయించింది. అది కూడా కేవలం టమాట, మిర్చి, వంకాయ రకానికే పరిమితం చేసింది. కేవలం మూడు రకాల నార్లనే ఇస్తామని చెప్పడం రైతులకు మింగుడుపడడం లేదు. కాగా కూరగాయల విత్తనాలపై ఉన్న రాయితీలను రద్దు చేసిన సర్కార్‌.. రైతుబంధు పథకం కింద అందించే పెట్టుబడి సాయంలోనే రైతులు తమకు కావాల్సిన విత్తనాలు కొనుగోలు చేసు కోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే రాయితీ లేదని చెబుతున్నట్లు తెలిసింది.

ప్రభుత్వం నుంచి స్వష్టత రాలేదు
రాయితీ విత్తనాలు అందించే విషయంలో నేటికీ ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు. రైతులు నిత్యం ఆయా డివిజన్లల్లోని మండలాల్లో ఉద్యానశాఖ అధికారులను కలిసి రాయితీ విత్తనాలు కావాలని అడుగుతున్నారు. ప్రస్తుతానికి 20 పైసలకు ఒకటి చొప్పన టమాట, మిర్చి, వంకాయ నారును అందించాలని ఆదేశాలు ఉన్నాయి. రైతులు కొంతమంది కలిసి గచ్చిబౌలి వెళ్లి నారు తెచ్చుకుంటే ట్రాన్స్‌పోర్ట్‌ చార్జీలు ఇస్తాం. పంట కాలనీల పథకం అమలు గగనమే. మరోమారు ఉన్నతా«ధికారుల దృష్టికి తీసుకెళ్తాం.     – సునందారెడ్డి, జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖ అధికారిణి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement