నాన్‌ బీటీ పత్తి రకం ఎ.డి.బి. 542 | Non BT Cotton Seeds ABD 542 | Sakshi
Sakshi News home page

నాన్‌ బీటీ పత్తి రకం ఎ.డి.బి. 542

Published Tue, Jun 25 2019 10:57 AM | Last Updated on Tue, Jun 25 2019 10:57 AM

Non BT Cotton Seeds ABD 542 - Sakshi

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలి నాన్‌ బీటీ పత్తి రకం ఎ.డి.బి. 542ని ఇటీవల ప్రొ. జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం విడుదల చేసింది. ఆదిలాబాద్‌ వ్యవసాయ పరిశోధనా కేంద్రం ఈ సూటి రకాన్ని రూపొందించింది. దీర్ఘకాలిక పంటకాలం కలిగిన బీటీ హైబ్రిడ్లు సైతం గులాబీ రంగు పురుగును తట్టుకోలేకపోతున్న తరుణంలో 6 నెలల్లోపలే పూర్తయ్యే ఎ.డి.బి. 542 వంటి మధ్యస్థ కాలిక రకాన్ని ఎంచుకోవడం ప్రయోజనకరమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

మధ్యస్థ కాలపరిమితి కలిగి అధిక దిగుబడినిచ్చే రకం ఎ.డి.బి. 542. 150–170 రోజుల్లోనే పంటను పూర్తి చేసుకోవడం దీని ప్రత్యేకత. తక్కువ పెట్టుబడితో తేలిక నేలల్లో, బరువైన నల్లరేగడి నేలల్లోనూ వర్షాధారంగా లేదా ఆరుతడి పద్ధతిలోనూ ఖరీఫ్‌లో పండించడానికి అనువైన రకం ఇది.

హెక్టారుకు 3 వేల కిలోల దిగుబడి
 వర్షాధారంగా సాగు చేసినప్పుడు హెక్టారుకు 1500 నుంచి 2500 కిలోల వరకు దిగుబడి వస్తుంది. ఆరుతడి పంటగా సాగు చేసినప్పుడు హెక్టారుకు 3000 కిలోల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉందని విశ్వవిద్యాలయం పత్తి పరిశోధనా విభాగం అధిపతి, ముఖ్య శాస్త్రవేత్త డా. సుదర్శన్‌ ‘సాక్షి సాగుబడి’కి తెలిపారు. కాయ సైజు పెద్దగా ఉండటంతో పత్తి తీత సులభం. కాయలు దగ్గర దగ్గరగా గొలుసు వలె కాయడం ఈ రకం ప్రత్యేకత. పత్తి నాణ్యత బాగుంటుంది. పింజ పొడవు 27 మిల్లీమీటర్లు ఉంటుంది.

బాక్టీరియా తెగులును, టొబాకో స్ట్రిక్‌ వైరస్‌ తెగులును సమర్థవంతంగా తట్టుకుంటుంది. పచ్చదోమ, కాయతొలిచే పురుగులను కొంత వరకు తట్టుకుంటుంది.
బలమైన(నల్లరేగడి) నేలల్లో వరుసల మధ్య 3 అడుగులు, మొక్కల మధ్య 2 అడుగుల (90 సి.ఎం.“ 60 సి.ఎం.) దూరంలో నాటుకోవచ్చు. మధ్యస్థ భూముల్లో వరుసల మధ్య 3 అడుగులు, మొక్కల మధ్య ఒక అడుగు దూరంలో నాటుకోవాలి. తేలిక నేలల్లో వరుసల మధ్య రెండున్నర అడుగులు, మొక్కల మధ్య ఒక అడుగు దూరంలో నాటుకోవాలని డా. సుదర్శన్‌ తెలిపారు. సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో సాగుకు సైతం ఈ సూటిరకం అనువైనదని ఆయన తెలిపారు.

సేంద్రియ సాగుకూ అనువైనది
ఎ.డి.బి. 542 రకం పత్తి మధ్యలో కంది సాళ్లు వేసుకోవచ్చు. 4 లేదా 5 లేదా 6 సాళ్లు పత్తివి విత్తుకొని ఒక సాలులో కంది విత్తుకోవచ్చు. ఈ రకం పత్తి ఆరు నెలల్లో పూర్తవుతుంది కాబట్టి అందుకు తగిన కంది రకాలు విత్తుకోవాలని డా. సుదర్శన్‌ తెలిపారు. తేలిక నేలల్లో అయితే మారుతి, వరంగల్‌ 97 కంది రకాలు, బరువైన (నల్లరేగడి) నేలల్లో అయితే ఆశ కంది రకాన్ని విత్తుకోవాలి. ఈ మూడు కంది రకాలూ ఎండు తెగులును సమర్థవంతంగా తట్టుకొని మంచి దిగుబడినిస్తాయని డా. సుదర్శన్‌(98669 62634) వివరించారు.
ఎ.డి.బి. 542 రకం పత్తి నుంచి విత్తనాలను ౖవేరుచేసి దాచుకొని తర్వాత పంటకాలంలో విత్తనంగా వాడుకోవచ్చు. ఎ.డి.బి. 542 సూటి రకం పత్తి విత్తనాల కోసం రైతులు ఆదిలాబాద్‌లోని వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డా. రాజేంద్రరెడ్డిని 97041 34304 నంబరులో సంప్రదించవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement