మోన్‌శాంటోకు ముకుతాడు | Government snubs Monsanto, caps price of Bt cotton seeds | Sakshi
Sakshi News home page

మోన్‌శాంటోకు ముకుతాడు

Published Wed, Mar 16 2016 2:57 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM

మోన్‌శాంటోకు ముకుతాడు - Sakshi

మోన్‌శాంటోకు ముకుతాడు

- పత్తి విత్తన గుత్తాధిపత్యానికి కేంద్రం చెక్
- బీటీ టెక్నాలజీ ఉన్న ఏ కంపెనీకైనా లెసైన్స్
- కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర కమిటీ
- లెసైన్సింగ్ విధానంపై మార్గదర్శకాల రూపకల్పన
- ఇతర విత్తన కంపెనీలు మార్కెట్‌లోకి వచ్చే వెసులుబాటు
- బీటీ-3 పత్తి వంగడానికి లైన్‌క్లియర్
- బీటీ విత్తన ధరలు తగ్గే అవకాశం.. రైతులకు ప్రయోజనం
- ఇన్నాళ్లూ రాయల్టీ రూపంలో వేల కోట్లు దండుకున్న మోన్‌శాంటో
 
సాక్షి, హైదరాబాద్:
బీటీ పత్తి.. ఇప్పటివరకు ఇది మోన్‌శాంటో సొంతం! బీటీ టెక్నాలజీని అడ్డుపెట్టుకొని ఈ బహుళజాతి సంస్థ ఇన్నేళ్లుగా వేల కోట్లు కొల్లగొట్టింది. అడ్డగోలుగా విత్తన రేట్లు నిర్ణయించి సొమ్ము చేసుకుంది. విత్తనంపై పెత్తనం చలాయిస్తూ ఇతర విత్తన కంపెనీలను తొక్కేసింది. ఈ గుత్తాధిపత్యానికి కేంద్ర ప్రభుత్వం తాజాగా చెక్ పెట్టింది. బీటీ టెక్నాలజీ పరిజ్ఞానం ఉన్న ఇతర కంపెనీలు కూడా పత్తి విత్తన వ్యాపారం చేసుకునేందుకు పచ్చజెండా ఊపింది.

ఈ మేరకు కేంద్రం నియమించిన కమిటీ మార్గదర్శకాలను, లెసైన్సింగ్  విధానాన్ని ఖరారు చేసింది. దీంతో కంపెనీల మధ్య పోటీ ఏర్పడి రైతులకు తక్కువ ధరకే విత్తనాలు లభించే అవకాశం కలగనుంది. 2002 నుంచి కొనసాగుతున్న మోన్‌శాంటో గుత్తాధిపత్యానికీ కళ్లెం పడనుంది.

టెక్నాలజీ ఉంటే చాలు..
2016-17 సంవత్సరానికి బీటీ కాటన్ గరిష్ట విక్రయ ధర, లెసైన్సింగ్ నిర్ధారణకు కేంద్ర వ్యవసాయశాఖ ఇటీవల ఒక కమిటీ ఏర్పాటు చేసింది. కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి(సీడ్) చైర్మన్‌గా ఉన్న ఈ కమిటీలో తెలంగాణ వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసార థి సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ మంగళవారం ఢిల్లీలో సమావేశమైంది. ఇప్పటికే బీటీ పత్తి విత్తన ధరలను త గ్గించిన కమిటీ.. ఈ సమావేశంలో లెసైన్సింగ్‌పై కీలక నిర్ణయం తీసుకుంది. బీటీ టెక్నాలజీ ద్వారా పత్తి విత్తనం తయారు చేసే కంపెనీలకు లెసైన్స్ ఎలా ఇవ్వాలన్న అంశంపై మార్గదర్శకాలు తయారుచేసింది.

బీటీ టెక్నాలజీ కలిగిన కంపెనీలు, విత్తన ఉత్పత్తి సంస్థల మధ్య ఒప్పందం అంశంపైనా నిర్ణయం తీసుకున్నారు. ఈ ఒప్పందం విషయంలో ప్రభుత్వం మధ్యవర్తిగా ఉండనుంది. ఇంతకుముందు బీటీ పత్తి విత్తనాన్ని ఇతర కంపెనీలు తయారు చేసి విక్రయించాలంటే మోన్‌శాంటోకు ముందస్తుగా ఒకేసారి రూ.40 లక్షలు రుసుం చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు రూ.25 లక్షలకు తగ్గించి రెండు వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు కల్పించారు. ప్రస్తుతం బీటీ టెక్నాలజీపై మోన్‌శాంటోకే లెసైన్స్ ఉంది.

దీంతో ఇతర కంపెనీలు ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసినా వాటికి లెసైన్స్ దక్కకుండా అడ్డుకుంది. ఇకపై మోన్‌శాంటో కంపెనీ మాదిరే ఏ కంపెనీకైనా లెసైన్స్ పొందే వీలు కలుగనుంది. ఫలితంగా బీటీ టెక్నాలజీ కలిగిన కంపెనీలు తమ విత్తనాలను మార్కెట్‌లోకి విడుదల చేసుకునే వెసులుబాటు కలుగుతుంది.

తక్కువ ధరకే విత్తనాలు
తాజా మార్గదర్శకాలతో రైతులకు తక్కువ ధరలకు బీటీ విత్తనాలు అందుబాటులోకి వస్తాయని కమిటీ సభ్యులు అభిప్రాయపడుతున్నారు. విత్తన ఉత్పత్తి రైతులకు కూడా గిట్టుబాటు ధర అందేలా మార్గదర్శకాలు రూపొందించారు. రాయల్టీ నిర్ధారణ, వాణిజ్యపరంగా రాయల్టీ ఎన్నాళ్లు ఉండాలన్న దానిపైనా మార్గదర్శకాలు ఖరారు చేశారు. విత్తన కంపెనీలు పరిశోధనకు ప్రాధాన్యం ఇవ్వాలని కమిటీ కోరింది. విత్తన టెక్నాలజీ పునర్‌వ్యవస్థీకరణ లో భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్), వ్యవసాయ విశ్వవిద్యాలయాల భాగస్వామ్యం ఉండాలని సూచించింది.

ఇన్నాళ్లూ మోన్‌శాంటో ఆడిందే ఆట
మోన్‌శాంటో కంపెనీ మహారాష్ట్ర హైబ్రిడ్ కంపెనీ (మైకో)తో కలిసి దేశవ్యాప్తంగా 2002 నుంచి బీటీ-1 పత్తి విత్తన వ్యాపారం చేస్తోంది. ఇతర విత్తన కంపెనీలతో ఒప్పందాలు చేసుకొని మరే ఇతర పత్తి విత్తనాలు మార్కెట్లోకి అడుగుపెట్టకుండా గుత్తాధిపత్యం చెలాయిస్తూ వేల కోట్ల వ్యాపారం చేస్తోంది. బీటీ-1 పత్తి (మోన్ 531 జీన్) విత్తనానికి సంబంధించి మోన్‌శాంటో కంపెనీకి పేటెంట్ హక్కే లేదని, అందువల్ల రాయల్టీ చెల్లించాల్సిన అవసరం లేదని, ఉచితంగానే వాడుకోవచ్చని జాతీయ పత్తి పరిశోధన సంస్థ (సీఐసీఆర్) గతంలోనే తేల్చిచెప్పింది. అయినా ఇప్పటికీ కంపెనీల నుంచి రాయల్టీ వసూలు చేస్తోంది. 2006లో బీటీ-2 పత్తి విత్తనాన్ని మార్కెట్లో ప్రవేశపెట్టి దానికి పేటెంట్ ఉందని చెబుతూ రాయల్టీ నిర్ణయించినా.. ఇప్పటికీ బీటీ-1కు అక్రమంగా రాయల్టీని వసూలు చేస్తుండడం గమనార్హం.

బీటీ-2 ఔట్.. బీటీ-3 ఇన్!
ఇప్పుడు బీటీ-2 పత్తి విత్తనం కూడా పురుగును తట్టుకునే శక్తి కోల్పోయింది. ఫలితంగా దేశవ్యాప్తంగా అనేకచోట్ల పత్తి పంటకు గులాబీ రంగు పురుగు సోకింది. రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు. దీనిపై వివిధ రాష్ట్రాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కర్ణాటక ప్రభుత్వం మోన్‌శాంటో నుంచి రూ.2 వేల కోట్ల పరిహారం కోరుతోంది. ఈ నేపథ్యంలో బీటీ-2కు ప్రత్యామ్నాయంగా దేశంలోని పలు పత్తి కంపెనీలు బీటీ-3 టెక్నాలజీని తీసుకురావాలని నిర్ణయించాయి.

కేంద్రం తాజాగా లెసైన్స్ మార్గదర్శకాలు తయారుచేసినందున బీటీ-3 పత్తి వంగడానికి మార్గం సుగమం అయినట్లేనని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. బీటీ-2 పత్తి విత్తనం విఫలమైందంటూ కేంద్రం కూడా సుప్రీంకోర్టుకు అఫిడవిట్ రూపంలో నివేదించింది. దీంతో దాన్ని నిషేధించి బీటీ-3కి అనుమతి ఇవ్వాలని దేశీయ కంపెనీలు కోరుతున్నాయి.

రాష్ట్రంలో 42.42 లక్షల ఎకరాల్లో బీటీ
దేశంలో అత్యధిక పత్తి సాగు చేసే రాష్ట్రాల్లో తెలంగాణ అత్యంత కీలకం. 2015-16 ఖరీఫ్‌లో రాష్ట్రంలో 88.90 లక్షల ఎకరాల్లో పంటలు సాగైతే అందులో 42.42 లక్షల ఎకరాల్లో పత్తిని సాగు చేశారు. మొత్తం వ్యవసాయ పంటల సాగు విస్తీర్ణంలో దాదాపు సగం వరకు పత్తి ఉండటం గమనార్హం. రాష్ట్రంలో 55.53 లక్షల మంది రైతులుండగా.. వారిలో దాదాపు 25 లక్షల మంది పత్తి సాగు చేశారని అంచనా.

ప్రతి ఏటా సుమారు కోటికిపైగా బీటీ పత్తి విత్తన ప్యాకెట్లు విక్రయిస్తున్నారు. గతేడాది ఒక్కో ప్యాకెట్ కు రూ.930 వసూలు చేశారు. ఈ లెక్కన రాష్ట్రంలో రూ.వెయ్యి కోట్ల బీటీ పత్తి విత్తన వ్యాపారం జరుగుతోంది. 2002-03లో మొత్తం పత్తి సాగు విస్టీర్ణంలో కేవలం ఒక శాతమే బీటీ-1 విత్తనాలను వేయగా.. 2006-07 నాటికి అది కాస్తా 85 శాతానికి చేరింది! బీటీ-2 వచ్చాక 2014-15లో బీటీ-1 విత్తన మార్కెట్ వాటా 4 శాతానికి పడిపోయింది. ప్రస్తుతం బీటీ-2 వాటా 98 శాతంగా ఉంది.

గుత్తాధిపత్యానికి అడ్డువేశాం
ఇప్పటివరకు ప్రభుత్వానికి సంబంధం లేకుండా లెసైన్సింగ్ పద్ధతి ఉండేది. మిగతా కంపెనీలకు లెసైన్స్ రానీయకుండా గుత్తాధిపత్యం కొనసాగింది. కమిటీ తీసుకున్న నిర్ణయంతో మోన్‌శాంటో గుత్తాధిపత్యానికి కాలం చెల్లినట్లే! ఇకపై బీటీ టెక్నాలజీ ఉన్న ఏ కంపెనీ అయినా లెసైన్స్ తీసుకోవచ్చు. టెక్నాలజీ ఒక్కరి వద్దే ఉండటం సరికాదు. అది బదిలీ కావాలి. అందుకు తాజా మార్గదర్శకాలు దోహదం చేస్తాయి. ఇక నుంచి ఒప్పందాలేవైనా ప్రభుత్వ మధ్యవర్తిత్వంలోనే జరగాలని నిర్ణయించాం.
- సి.పార్థసారథి, తెలంగాణ వ్యవసాయశాఖ కార్యదర్శి

విత్తన ధరలు తగ్గుతాయి
బీటీ పత్తి విత్తన కంపెనీలకు ఎలా లెసైన్స్ ఇవ్వాలన్న అంశంపై కేంద్ర కమిటీ తయారుచేసిన ముసాయిదా మార్గదర్శకాల వల్ల ఇక నుంచి అన్ని బీటీ కంపెనీలకూ లెసైన్స్ పొందే అవకాశం ఉంటుంది. ఫలితంగా భవిష్యత్తులో విత్తన ధర లు తగ్గనున్నాయి.
- కేశవులు, తెలంగాణ విత్తన ధ్రువీకరణ సంస్థ

బీటీ-3కి మార్గం సుగమం
కేంద్రం తాజాగా మార్గదర్శకాలు అమల్లోకి వస్తే మోన్‌శాంటో గుత్తాధిపత్యానికి కాలం చెల్లుతుంది. బీటీ టెక్నాలజీ ఉన్న ఏ కంపెనీ అయినా తన ైనె పుణ్యాన్ని బట్టి నిబంధనల ప్రకారం లెసైన్స్ పొందవచ్చు. బీటీ-3 విత్తనానికి మార్గం సుగమమవుతుంది. రైతులకు ప్రయోజనం కలుగుతుంది.
- నర్సింహారెడ్డి, వ్యవసాయరంగ నిపుణులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement