Monsanto
-
కార్పొరేట్ల లాభాలకే విత్తన చట్టం!
కేంద్ర ప్రభుత్వం విత్తన చట్టం 2019 ముసాయిదాను విడుదల చేస్తూ నవంబర్ 15 నాటికి సూచనలు, సలహాలు, సవరణలు పంపాలని వెబ్సైట్లో పెట్టారు. చిత్తశుద్ధిలేని ప్రభుత్వం విత్తన బిల్లు తేవడానికి 2004 నుండి మల్లగుల్లాలు పడుతూనే వుంది. విత్తన కార్పొరేట్లకు లొంగి ప్రభుత్వాలు విత్తన చట్టం చేయడానికి ముందుకు రావడం లేదు. ఇదే సందర్భంలో దేశీయ పరిశోధనల వల్ల విత్తనోత్పత్తి భాగా పెరిగింది. 1995లో దేశంలో ప్రవేశపెట్టిన సరళీకృత వ్యవసాయ విధానాల వల్ల, డబ్ల్యూటీఓ షరతులు అమలు జరపడం వల్ల విదేశీ బహుళజాతి సంస్థలు తమ టెక్నాలజీతో వచ్చి ఇక్కడ విత్తనం ఉత్పత్తి చేయడమే కాక రైతులు వాణిజ్య పరంగా సాగుచేయడానికి విత్తనాలను అమ్ముతున్నారు. ప్రస్తుతం మోన్శాంటో, డూపాయింట్, సింజెంటా, కార్గిల్ లాంటి కంపెనీలు భారతదేశంలో 20 శాతం విత్తనాలు అమ్ముతున్నాయి. లాభాలు ఆశిస్తున్న బహుళజాతి కంపెనీలు రైతులకు నాణ్యతలేని విత్తనాలను, కల్తీ విత్తనాలను సరఫరా చేసి వేల కోట్లు లాభాలార్జిస్తున్నారు. ఏటా ఉభయ తెలుగు రాష్ట్రాలలో 5.6 లక్షల ఎకరాలలో పంటలు దెబ్బతింటున్నాయి. దీనిపై రైతు సంఘాలు పెద్దఎత్తున ఆందోళన చేసి, మారిన పరిస్థితులకు అనుగుణంగా విత్తన చట్టం తేవాలని కోరారు. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం విత్తన ముసాయిదా చట్టం తెచ్చింది. దానికి రైతులు, రైతు సంఘాలు, లా కమిషన్ చేసిన సూచనలను జతపరిచి బిల్లుగా రూపొందించి పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఆమోదం పొందకుండా బహుళజాతి సంస్థలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, ఆమోదాన్ని నిలిపివేశారు. ఆ తర్వాత రైతుల ఆందోళన ఫలితంగా 2010లో మరొకసారి సవరణలతో పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. మళ్లీ అదే ఒత్తిడి రావడంతో బిల్లును ఆమోదానికి పెట్టలేదు. రాజ్యాంగంరీత్యా విత్తన చట్టం రాష్ట్ర ప్రభుత్వాలు తేవాలి. కానీ కేంద్రం రాష్ట్రాలపై ఒత్తిడి తెచ్చి వారు చేయకుండా తానే చేస్తానని అన్ని రాష్ట్రాలను ఆదేశిస్తూ లేఖలు రాసింది. అయినప్పటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతు సంఘం ఆందోళన ఫలితంగా 2012లో శాసనసభలో బిల్లును ప్రవేశపెట్టింది. తరువాత కేంద్రం ఒత్తడితో రాష్ట్రం బిల్లును ఉపసంహరించుకుంది. 2015లో టీఆర్ఎస్ ప్రభుత్వం ముసాయిదాను చర్చల కోసం సూచనలు చేయాలని విడుదల చేసింది. కానీ శాసనసభలో నేటికి పెట్టలేదు. తిరిగి 2019 విత్తన ముసాయిదాలో కార్పొరేట్లకు స్వేచ్ఛ కల్పిస్తూ, రైతులు నష్టపోయిన ఎడల వినియోగదారుల కోర్టుకు వెళ్లమని బిల్లులో పెట్టింది. గత పదేళ్లలో వరంగల్, గుంటూరు వినియోగదారుల కోర్టుల్లో వేలాది కేసులు వేయడం జరిగింది. 80 శాతం కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. తీర్పు వచ్చిన 20 శాతం కేసులపై కంపెనీలు హైకోర్టులో అప్పీల్ చేశాయి. మొత్తంపై కంపెనీలు పరిహారం నుంచి తప్పించుకున్నాయి. కోరలు తీసిన ఈ బిల్లు రైతులకు ఏమాత్రం ఉపయోగపడదు. బహుళజాతి సంస్థలకు లాభాలు తెవడానికి మరోవైపున రైతులకు బిల్లు తెచ్చామని చెప్పుకోవడానికి ఉభయతారకంగా ఈ బిల్లు తెచ్చారు. వ్యాసకర్త సారంపల్లి మల్లారెడ్డి, అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షులు, మొబైల్ : 94900 98666 -
వర్షపు నీటిలోనూ విషపు ఆనవాళ్లే
వాషింగ్టన్: మోన్శాంటో సంస్థ అమెరికాలోని మిస్సోరీ రాష్ట్రంలో 1901లో ప్రారంభమైంది. విత్తనాలు, పురుగు మందులు, ఎరువుల అమ్మకాలతో ఏకంగా రూ.4.28 లక్షల కోట్ల విలువైన సామ్రాజ్యాన్ని సృష్టించుకుంది. ఈ క్రమంలో తమ వ్యవసాయ ఉత్పత్తులు వాడినవారికి కేన్సర్ సోకుతుందన్న విషయాన్ని ఉద్దేశపూర్వకంగా తొక్కిపెట్టింది. తాజాగా డ్వేన్ జాన్సన్ కేసులో మోన్శాంటోకు రూ.2,003 కోట్ల భారీ జరిమానా పడటంతో ఈ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. అడ్డదారులు.. తప్పుడు కథనాలు కేన్సర్ కారక గ్లైఫోసేట్ ఉన్న ఉత్పత్తుల అమ్మకాలకు మోన్శాంటో తొక్కిన అడ్డదారులు అన్నీ ఇన్నీ కావు. తమ ఉత్పత్తుల అమ్మకాలకు పొగాకు కంపెనీలు అనుసరించే వ్యూహాన్నే మోన్శాంటో పాటించింది. గ్లైఫోసేట్ ఉత్పత్తుల వల్ల కేన్సర్ సోకుతుందన్న అంశాన్ని విస్మరించేలా ఈ సంస్థ రాజకీయ నేతలు, అధికారులు, నియంత్రణ సంస్థలపై ఒత్తిడి తీసుకొచ్చింది. మోన్శాంటో ఉత్పత్తులు సురక్షితమని రైతులు, వినియోగదారులు నమ్మేలా పత్రికలు, జర్నల్స్‌లో అనుకూల కథనాలు రాయించింది. ఇందుకు లొంగని జర్నలిస్టులు, శాస్త్రవేత్తలను పలు రకాలుగా వేధించింది. వీలైన చోట్ల ప్రలోభాలతో నియంత్రణ సంస్థలను లోబర్చుకుంది. ‘రౌండప్’ ‘రేంజర్ ప్రో’ కలుపు మొక్కల నాశనుల్లో ఉండే గ్లైఫోసేట్ కారణంగా కేన్సర్ సోకుతుందని మోన్శాంటోకు 1980ల్లోనే తెలుసని శాన్ఫ్రాన్సిస్కో జ్యూరీ విచారణ సందర్భంగా బయటపడింది. దీన్ని సరిదిద్దడం కానీ, నిలిపివేయడం కాని చేయని మోన్శాంటో.. తమ ఉత్పత్తులు సురక్షితమన్న ప్రచారానికి తెరలేపింది. ఇందులోభాగంగా స్వతంత్ర మీడియా సంస్థల ద్వారా అసలు ఉనికిలోనే లేని వ్యక్తుల పేర్లతో తప్పుడు శాస్త్రీయ కథనాలు రాయించింది. తమ ఉత్పత్తులను రైతులు, వినియోగదారులు నమ్మేలా ఈ కుట్రలో పర్యావరణ శాఖ అధికారుల్ని సైతం భాగస్వాముల్ని చేసింది. వియత్నాం యుద్ధం సందర్భంగా అమెరికా ప్రయోగించిన ‘ఏజెంట్ ఆరేంజ్’ అనే రసాయనిక ఆయుధాన్ని కూడా మోన్శాంటో మరికొన్ని సంస్థలతో కలసి ఉత్పత్తి చేసిందని అంటారు. అయితే ఈ ఆరోపణల్ని మోన్శాంటో గతంలో ఖండించింది. తాజాగా మోన్శాంటో తరఫున శాన్ఫ్రాన్సిస్కో కోర్టులో కేసును వాదించిన లాయర్ జార్జ్ లంబర్డీ.. అంతర్జాతీయ పొగాకు కంపెనీలకు న్యాయవాదిగా వ్యవహరిస్తుండటం గమనార్హం. గాలి, నీరు, మట్టి అన్నింటా విషమే.. ప్రపంచవ్యాప్తంగా గ్లైఫోసేట్ ఉత్పత్తుల వినియోగం ఇటీవలి కాలంలో గణనీయంగా పెరిగిపోయింది. ప్రతిఏటా ప్రపంచవ్యాప్తంగా 82.6 కోట్ల కేజీల గ్లైఫోసేట్ ఉత్పత్తులను రైతులు, ఇతర వినియోగదారులు వాడుతున్నారు. కేన్సర్ కారక గ్లైఫోసేట్ ఇప్పుడు ఎంత సాధారణ విషయంగా మారిపోయిందంటే మనం తినే అన్నం, తాగే నీళ్లలోనూ దీని అవశేషాలు ఉన్నాయి. మట్టితో పాటు గాలి నమూనాలను సేకరించగా వాటిలోనూ ఈ రసాయనం జాడ బయటపడింది. చివరికి వర్షపు నీటిలోనూ ఈ విషపూరిత గ్లైఫోసేట్ ఉన్నట్లు తెలుసుకున్న శాస్త్రవేత్తలు విస్తుపోయారు. అంతలా ఈ విషం గాలి, నీరు, నేలను కలుషితం చేసింది. మోన్శాంటో ఉత్పత్తుల దుష్పరిణామాలపై స్వతంత్ర సంస్థలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన హెచ్చరికలను ప్రభుత్వాలు పట్టించుకోలేదు. గ్లైఫోసేట్ ఉత్పత్తుల్ని ప్రమాదకర జాబితాలో చేర్చలేదు. దావాకు సిద్ధంగా మరో 4 వేల మంది రైతులు డ్వేన్ జాన్సన్ కేసు తీర్పుతో మోన్శాంటోకు మరిన్ని ఇబ్బందులు తప్పేలా లేవు. సెయింట్ లూయిస్‌లో వచ్చే అక్టోబర్‌లో మోన్శాంటో ఉత్పత్తుల దుష్పరిణామాలపై కేసు విచారణకు రానుంది. అలాగే దాదాపు 4,000 మంది అమెరికా రైతులు మోన్శాంటో కీటక, కలుపు నాశనుల కారణంగా తమ ఆరోగ్యం దెబ్బతిందని వేర్వేరు కోర్టుల్లో దాఖలుచేసిన కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. తాజాగా ఐఆర్క్ నివేదికతో పాటు కాలిఫోర్నియా జ్యూరీ తీర్పు నేపథ్యంలో మోన్శాంటో బాధితులకు రూ.లక్షల కోట్ల మేర జరిమానా చెల్లించాల్సి రావచ్చని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. మోన్శాంటో ఉత్పత్తుల కారణంగా కేన్సర్ సోకినందుకు కాకుండా కేన్సర్ సోకుంతుందన్న విషయాన్ని దాచిపెట్టినందుకు కంపెనీని కోర్టులు దోషిగా నిలబెట్టే అవకాశముందని చెబుతున్నారు. 2018, జూన్‌లో మోన్శాంటోను జర్మనీ ఎరువుల దిగ్గజం బేయర్ దాదాపు రూ.4.28 లక్షల కోట్లకు కొనుగోలు చేసింది. -
2,000 కోట్ల భారీ జరిమానా
శాన్ఫ్రాన్సిస్కో: బహుళజాతి విత్తన, పురుగుమందుల కంపెనీ మోన్శాంటోకు అమెరికాలోని ఓ న్యాయస్థానం షాకిచ్చింది. తమ ఉత్పత్తుల్ని వాడితే కేన్సర్ సోకుతుందన్న విషయాన్ని దాచిపెట్టి ఓ వ్యక్తి కేన్సర్ బారిన పడేందుకు కారణమైనందుకు ఏకంగా రూ.2,003 కోట్ల(29 కోట్ల డాలర్లు) భారీ జరిమానా విధించింది. ఈ మేరకు శాన్ఫ్రాన్సిస్కోలోని ఓ కోర్టు జ్యూరీ తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై అప్పీల్‌కు వెళతామని మోన్శాంటో ప్రతినిధులు తెలిపారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంటున్న డ్వేన్ జాన్సన్(46) బెనికాలో ఓ పాఠశాలలో గ్రౌండ్‌మెన్‌గా పనిచేసేవారు. విధుల్లో భాగంగా స్కూల్ ప్రాంగణం, మైదానంలో కలుపుమొక్కలు పెరగకుండా మోన్శాంటో తయారుచేసిన ‘రౌండర్’ మందును స్ప్రే చేసేవారు. ఈ కలుపుమొక్కల నాశినిలో ప్రధానంగా ఉండే గ్లైఫోసేట్ అనే రసాయనం వల్ల కేన్సర్ సోకుతుంది. ఈ విషయం సంస్థాగత పరీక్షల్లో వెల్లడైనా మోన్శాంటో బయటకు చెప్పలేదు. రౌండప్ కలుపు నాశినిని తరచుగా వాడటంతో తెల్ల రక్తకణాలకు వచ్చే అరుదైన నాన్‌హడ్జ్‌కిన్స్ లింఫోమా అనే కేన్సర్ సోకినట్లు జాన్సన్‌కు 2014లో తెలిసింది. చికిత్స చేసినా జాన్సన్ బతికే అవకాశాలు చాలా తక్కువని వైద్యులు తేల్చారు. మరుసటి ఏడాది ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ కేన్సర్(ఐఆర్క్) పరిశోధనలో సంచలన విషయం బయటపడింది. మోన్శాంటో తయారుచేస్తున్న కలుపుమొక్కల నాశనులు రౌండప్, రేంజ్ ప్రోలో కేన్సర్ కారక గ్లైఫోసేట్ అనే ప్రమాదకర రసాయనం ఉందని ఐఆర్క్ తేల్చింది. ఈ విషయాన్ని కస్టమర్లకు మోన్శాంటో తెలపలేదంది. కాలిఫోర్నియాలో కేసు దాఖలు.. మోన్శాంటో కలుపు మందులపై వినియోగదారుల్ని హెచ్చరించకపోవడంతో కాలిఫోర్నియాలోని కోర్టులో కేసు దాఖలైంది. మోన్శాంటో తయారుచేసిన రౌండప్ కారణంగా జాన్సన్‌కు కేన్సర్ సోకిందని ఆయన లాయరు వాదించారు. తమ ఉత్పత్తులు సురక్షితమైనవని మోన్శాంటో ప్రతినిధులు కోర్టులు తెలిపారు. దాదాపు 8 వారాల పాటు ఇరుపక్షాల వాదనలు విన్న జ్యూరీ.. ఐఆర్క్ నివేదికనూ అధ్యయనం చేసింది. చివరగా కేన్సర్ కారక గ్లైఫోసేట్ గురించి మోన్శాంటో వినియోగదారుల్ని హెచ్చరించలేదని న్యాయస్థానం అభిప్రాయపడింది. జాన్సన్‌కు నయంకాని కేన్సర్ సోకేందుకు కారణమైనందున ఆయనకు పరిహారంగా రూ.1,727 కోట్లు, ఇతర ఖర్చుల కింద మరో రూ.276 కోట్లు, మొత్తంగా రూ.2,003 కోట్లు(29 కోట్ల డాలర్లు) చెల్లించాలని మోన్శాంటోను ఆదేశించింది. జాన్సన్ ఆరోగ్యస్థితిపై జ్యూరీ సానుభూతి వ్యక్తం చేసింది. కోర్టు తీర్పుతో జాన్సన్ కన్నీటిపర్యంతమయ్యారు. తీర్పు ఇచ్చిన జ్యూరీలోని సభ్యులందరికీ జాన్సన్ ధన్యవాదాలు తెలిపారు. కాగా కోర్టు తీర్పుపై తాము అప్పీల్‌కు వెళతామని మోన్శాంటో కంపెనీ ఉపాధ్యక్షుడు స్కాట్ పాట్రిడ్జ్ చెప్పారు. డ్వేన్ జాన్సన్ -
మోన్శాంటో కొనుగోలును పూర్తి చేసిన బేయర్
న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన ప్రముఖ ఔషధ, రసాయనాల కంపెనీ బేయర్, విత్తన రంగంలో అంతర్జాతీయంగా ప్రముఖ కంపెనీ అయిన మోన్శాంటో కొనుగోలును పూర్తిచేసినట్టు ప్రకటించింది. 63 బిలియన్ డాలర్లతో అమెరికాకు చెందిన మోన్శాంటోను కొనుగోలు చేసేందుకు 2016 సెప్టెంబర్‌లో బేయర్ డీల్ కుదుర్చుకున్న విషయం తెలిసిందే. అమెరికా, భారత్ సహా ఈ కంపెనీల కార్యకలాలు నడుస్తున్న దేశాల్లోని అన్ని నియంత్రణ సంస్థల అనుమతులు రావడంతో గురువారం నాడు కొనుగోలు పూర్తయినట్టు బేయర్ ప్రకటన చేసింది. బేయర్, మోన్శాంటో ఈ రెండు మన దేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలే. బేయర్ సస్యరక్షణ ఉత్పత్తులను, ఔషధాలను మన దేశంలో వేర్వేరు విభాగాల ద్వారా మార్కెట్ చేస్తోంది. ఇందులో ఒక కంపెనీ బేయర్ క్రాప్ సైన్సెస్ లిమిటెడ్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన సంస్థ. మోన్శాంటో బీటీ విత్తనాలను విక్రయిస్తోంది. -
బేయర్–మోన్శాంటో డీల్‌కు సీసీఐ గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన మోన్శాంటో కంపెనీని 66 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయాలన్న జర్మనీ సంస్థ బేయర్ ప్రతిపాదనకు కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (మార్కెట్లో పారదర్శకమైన పోటీ ఉండేలా చూసే సంస్థ) కొన్ని సవరణలకు లోబడి ఆమోదం తెలియజేసింది. పెట్టుబడుల ఉపసంహరణ తదితర చర్యల్ని బేయర్ తీసుకోవాల్సి ఉంటుందని సీసీఐ వర్గాలు తెలిపాయి. మోన్శాంటోను కొనుగోలు చేయనున్నట్టు 2016 సెప్టెంబర్‌లోనే బేయర్ ప్రకటించింది. చాలా దేశాల్లో మోన్శాంటో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. కనుక భారత్ సహా 30 దేశాల్లో ఈ డీల్‌కు పలు నియంత్రణ సంస్థల ఆమోదం లభించాల్సి ఉంటుంది. గడిచిన కొన్ని త్రైమాసికాలుగా జన్యుమార్పిడి పంటల సాగు విషయంలో తీవ్ర వ్యతిరేకతను మోన్శాంటో ఎదుర్కొంటుండగా, ఈ డీల్‌కు సీసీఐ ఆమోదం లభించడం ప్రాధాన్యం సంతరించుకుంది. మోన్శాంటోను అంతర్జాతీయంగా సొంతం చేసుకునే క్రమంలో సీసీఐ ఆమోదం ఓ మైలురాయిగా బేయర్ పేర్కొంది. రెండు భిన్నమైన కంపెనీల కలయిక వల్ల పరస్పర ప్రయోజనం ఉంటుందని అభిప్రాయం తెలిపింది. విత్తనాల రంగంలో మోన్శాంటో అంతర్జాతీయ అగ్రగామి కంపెనీగా ఉండగా, పెస్టిసైడ్స్ విభాగంలో బేయర్ దిగ్గజ కంపెనీ. ఈ రెండు కంపెనీలు భారత్‌లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. బేయర్ ఇండియా వార్షిక టర్నోవర్ 2017లో రూ.4,700 కోట్లుగా ఉంది. ఈ రెండింటి విలీనం కారణంగా దేశీయంగా ఈ రంగంలో పోటీకి విఘాతం కలుగుతుందా అన్న దానిపై సీసీఐ ఈ ఏడాది జనవరిలోనే ప్రజాభిప్రాయాల్ని స్వీకరించింది. అంతిమంగా ఆమోదం తెలియజేసింది. -
మోన్శాంటో... బేయర్లో విలీనం
రెండు సంస్థల మధ్య కుదిరిన డీల్ 66 బిలియన్ డాలర్లు చెల్లించనున్న బేయర్ బెర్లిన్/న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన బహుళజాతి ఫార్మా, కెమికల్స్ కంపెనీ బేయర్ ఏజీ, అమెరికాకు చెందిన బయోటెక్ అగ్రగామి కంపెనీ మోన్శాంటో మధ్య ఎట్టకేలకు డీల్ సెట్ అయింది. ప్రపంచంలోనే అతిపెద్ద నగదు ఒప్పందం వీటి మధ్య కుదిరింది. 66 బిలియన్ డాలర్లను నగదు రూపంలో చెల్లించి మోన్శాంటోను కొనుగోలు చేసేందుకు బేయర్ ఏజీ ముందుకు వచ్చింది. రెండు కంపెనీల బోర్డులు తాజా ఒప్పందానికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. ఈ రెండు సంస్థల కలయికతో ప్రపంచంలోనే అతిపెద్ద విత్తన, పురుగుమందుల కంపెనీ అవతరిస్తుంది. బేయర్ ఏజీ, మోన్శాంటో అనుబంధ కంపెనీలైన బేయర్ క్రాప్‌సెన్సైస్, మోన్శాంటో ఇండియా దేశీయంగానూ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. మోన్శాంటోకు మహికో కంపెనీతోనూ భాగస్వామ్యం ఉంది. విలీన ఒప్పందంపై సంతకాలు చేసినట్టు మోన్శాంటో, బేయర్ బుధవారం ప్రకటించాయి. ఈ ఒప్పందం ప్రకారం మోన్శాంటో వాటాదారులకు ప్రతి షేరుకు 128 డాలర్లను బేయర్ చెల్లించనుంది. 2017 చివరి నాటికి కొనుగోలు పూర్తవుతుందని భావిస్తున్నట్టు ఇరు సంస్థలు వెల్లడించాయి. మోన్శాంటో కొనుగోలుకు బేయర్ ఈ ఏడాది మే నెలలోనే ప్రతిపాదన చేసింది. మే 9న మోన్శాంటో షేరు ధరతో పోలిస్తే ప్రస్తుతం చెల్లించనున్న 128 డాలర్లు 44 శాతం అధికం కావడం గమనార్హం. ఈ డీల్‌కు రెండు దేశాల్లోని నియంత్రణ సంస్థల ఆమోదం తప్పనిసరి. ఆమోదం రాకుంటే బ్రేక్ అప్ ఫీజు కింద 2 బిలియన్ డాలర్లను బేయర్ చెల్లించాల్సి ఉంటుంది. -
మాన్‌శాంటో లేటెస్ట్ పత్తి విత్తనాలు ఇక రానట్లేనా!
న్యూఢిల్లీ: తదుపరి తరం జన్యుమార్పిడి పత్తి విత్తనాలను భారత దేశంలో ప్రవేశపెట్టేందుకు అనుమతించాల్సిందిగా కోరుతూ దాఖలు చేసుకున్న దరఖాస్తును అమెరికాకు చెందిన బహుళజాతి కంపెనీ మాన్‌శాంటో హఠాత్తుగా ఉపసంహరించుకుంది. ఈ విషయంలో కంపెనీకి, భారత ప్రభుత్వానికి సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న వివాదానికి ప్రస్తుతానికి తెరపడినట్లే. మాన్‌శాంటో తదుపరి తరం పత్తి విత్తనాలను దేశంలోకి అనుమతించాలంటే ఆ జన్యుమార్పిడి విత్తనానికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని స్థానిక పత్తి విత్తన కంపెనీలతో పంచుకోవాలంటూ భారత ప్రభుత్వం షరతు విధించడం వల్ల ఇంతకాలం కంపెనీకి, భారత ప్రభుత్వానకి మధ్య వివాదం కొససాగింది. ఇప్పుడు ఊహించని విధంగా తాము అనుమతి కోరుతూ పెట్టుకున్న దరఖాస్తును ఉపసంహరించుకుంటున్నామని తెలియజేస్తూ మాన్‌శాంటో భారత భాగస్వామి అయిన మహారాష్ట్ర హైబ్రీడ్ సీడ్స్ కంపెనీ లిమిటెడ్ కేంద్రానికి లేఖ రాసింది. ‘బోల్‌గార్డ్-2 రౌండప్ రెడీ ఫ్లెక్స్’ టెక్నాలజీకి సంబంధించిన కొత్త విత్తనాలను ప్రవేశపెట్టేందుకు ఇంతకాలం చేసిన ప్రయత్నాలన్నీ ఈ దరఖాస్తు ఉపసంహరణతో మట్టిలో కలసినట్లే. భారత మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ సరికొత్త విత్తనాల అభివృద్ధి కోసం పెట్టిన పెట్టుబడులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. విదేశీ పెట్టుబడులను భారీ ఎత్తున ఆకర్షించాలనుకుంటున్న నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారత ప్రభుత్వానికి కూడా ఇది నష్టం కలిగిస్తుందని, ఎలాంటి పరిస్థితులైన తట్టుకునే వీలున్న ఈ కొత్త విత్తనాలు రైతులకు అందుబాటులోకి రాకపోవడం వల్ల వారు కూడా నష్టపోయినట్లేనని మార్కెట్ శక్తులు వ్యాఖ్యానిస్తున్నాయి. పైగా ఇది మేధో సంపన్న హక్కుల పరిరక్షణ ఉల్లంఘన అంశాన్ని కూడా లేవనెత్తవచ్చని ఆ శక్తులు అభిప్రాయపడుతున్నాయి. వ్యాపార రంగంలో ఏర్పడిన అనిశ్చిత పరిస్థితుల దృష్ట్యా తాము దరఖాస్తును ఉపసంహరించుకోవాల్సి వచ్చిందేతప్పా, ఇప్పటికే భారత్‌లో తాము కొనసాగిస్తున్న జన్యుమార్పిడి పత్తి విత్తనాల లావా దేవీలపై ఇది ఎలాంటి ప్రభావం చూపదని మాన్‌శాంటో అధికార ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. భారత పర్యావరణ శాఖ మంత్రి మాత్రం ఈ అంశంపై మాట్లాడేందుకు మీడియాకు అందుబాటులోకి రాలేదు. ఈ విషయంలో మళ్లీ మాన్‌శాంటో ప్రతినిధులతో చర్చలు జరిపే అవకాశం ఉందా? అన్న అంశంపై సమాధానం ఇచ్చేందుకు అధికారులు కూడా సిద్ధంగా లేరు. మాన్శాంటోకు చెందిన బోల్‌గార్డ్-1 టెక్నాలజీ జన్యు మార్పిడి పత్తి విత్తనాలను భారత ప్రభుత్వం 2002లో మొదటి సారి అనుమతించింది. ఆ తర్వాత బోల్‌గార్డ్-2 టెక్నాలజీకి చెందిన విత్తనాలను 2006లో అనుమతించింది. -
బేయర్ కు మోన్ శాంటో ఝలక్
జర్మనీ ఔషధ తయారీ దిగ్గజ సంస్థ బేయర్ కు అమెరికా సీడ్స్ కంపెనీ మోన్ శాంటో ఝలక్ ఇచ్చింది. బేయర్ ప్రకటించిన 6200 కోట్ల డాలర్ల కొనుగోలు ఆఫర్ ను తిరస్కరించింది. ఈ ఆఫర్ కంపెనీ విలువలకు చాలా తక్కువగా ఉందని మోన్ శాంటో ప్రకటించింది. అయితే ఈ విలీనంపై మరిన్ని చర్చలు జరుపుతామని మోన్ శాంటో తెలిపింది. గతకొంతకాలంగా జరిపిన చర్చల అనంతరం బేయర్ ఈ ఆఫర్ ను మోన్ శాంటోకు ప్రకటించింది. ఈ ఆఫర్ కంపెనీ విలువలకు చాలా తక్కువగా ఉందని మోన్ శాంటో చైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ హంగ్ గ్రాంట్ మంగళవారం తెలిపారు. ఈ ఫైనాన్స్ డీల్ పై కానీ, రెగ్యులేటరీ సవాళ్లను ఎదుర్కోవటంపై కానీ సరియైన హామీని బేయర్ ఇవ్వలేదని పేర్కొన్నారు. బేయర్ ప్రతిపాదన అసంపూర్తిగా, ఆర్థికంగా తగినవిధంగా లేదని మోన్ శాంటో బోర్డు ఏకగ్రీవంగా అంగీకరించిందని ఆయన తెలిపారు. కానీ ఈ రెండు కంపెనీల మధ్య చర్చలు కొనసాగించడానికి మోన్ శాంటో షేర్ ఓనర్స్ ఆసక్తి చూపినట్టు కంపెనీ ఓ ప్రకటనను మంగళవారం విడుదల చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద సీడ్స్, వ్యవసాయ పురుగుమందులు, జెనరిక్ గా పంటలను ఎప్పడికప్పుడూ మార్చగల సామర్థ్యం గల కంపెనీగా ఆవిర్భవించడానికి మోన్ శాంటోకు బేయర్ ఈ అతిపెద్ద టేకోవర్ ఆఫర్ ను ప్రకటించింది. ఈ ఆఫర్ ను మోన్ శాంటో తిరస్కరించడంతో, బేయర్ ఈ బిడ్ విలువను మరింత పెంచుతుందా అనేది మార్కెట్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే బేయర్ ఈ ఆఫర్ తో మోన్ శాంటో షేర్లు బలపడ్డాయి. మంగళవారం మధ్యాహ్నం అంతర్జాతీయ ట్రేడింగ్ లో మోన్ శాంటో షేర్లు 1.7శాతం పెరిగి, 107.77 డాలర్లుగా నమోదయ్యాయి. కానీ ఈ ఆఫర్ ప్రకటించినప్పటి నుంచి బేయర్ షేర్లు పతనమవుతూ వస్తున్నాయి. మోన్ శాంటో ఆ ఆఫర్ ను తిరస్కరించినట్టు మార్కెట్లోకి వార్త పొక్కడంతోనే బేయర్లు షేర్లు పునఃస్థానానికి వస్తున్నాయి. -
బేయర్ చేతికి మోన్ శాంటో...!
ఫ్ర్యాంక్ఫర్ట్ : జర్మనీ ఔషధ తయారీ దిగ్గజ సంస్థ బేయర్, అమెరికాకు చెందిన సీడ్స్ కంపెనీ మోన్ శాంటో కొనుగోలుకు సిద్ధమైంది. ఒక్క షేరుకు 122 డాలర్ల నగదు చొప్పున లేదా మొత్తం 6200 కోట్ల డాలర్ల కొనుగోలు ఆఫర్ ను మోన్ శాంటోకు బేయర్ ప్రకటించింది. ఈ డీల్ తో ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీ బేయర్ రూపొందనుంది. ఈ ఆఫర్ మే 9న మోనోశాంటో షేర్ల ముగింపు ధరకు 37 శాతం ప్రీమియమని బేయర్ తెలిపింది. బేయర్ నుంచి ఈ టేకోవర్ ఆఫర్ ను తాము ఊహించలేదని గతవారం మోన్ శాంటో ప్రకటించింది. ఈ టేకోవర్ ఆఫర్ పై గతకొంతకాలంగా బేయర్ కు, మోనోశాంటోకు మధ్య చర్చలు జరుగుతున్నాయి. పన్నులు, వడ్డీలు, తరుగుదలన్నీ తీసివేయగా ఉన్న మోన్ శాంటో 12 నెలల రాబడులకు 15.8 సార్లు ఎక్కువగా బేయర్ ఈ ఆఫర్ ప్రకటించింది. డెట్, ఈక్విటీ రెండింటిలోనూ ఈ ఫైనాన్సియల్ డీల్ ను కుదుర్చుకోనున్నామని బేయర్ తెలిపింది. -
మోన్శాంటోకు కళ్లెం
వ్యాపారంలోకి దిగే ఏ సంస్థ అయినా లాభార్జనే ధ్యేయంగా పనిచేస్తుంది. అందులో వింతేమీ లేదు. కానీ అలాంటి లాభార్జన కోసం అడ్డదారులు తొక్కకూడదు. బీటీ పత్తి విత్తనాల అమ్మకంలో గుత్తాధిపత్యాన్ని చలాయిస్తున్న బహుళజాతి దిగ్గజం మోన్శాంటో దశాబ్దాలుగా ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నది. ఇష్టం వచ్చిన ధర నిర్ణయించి రైతుల్ని నిలువుదోపిడీ చేస్తూ వేల కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నది. ఈ నేపథ్యంలో బీటీ పరిజ్ఞానం ఉన్న ఇతర కంపెనీలు సైతం బీటీ పత్తి విత్తనాల వ్యాపారాన్ని చేసుకునేందుకు అనుమతించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం హర్షించదగింది. ఈ నిర్ణయం పర్యవసానంగా మోన్శాంటోతోపాటు అనేక సంస్థలు బీటీ పత్తి విత్తనాలను ఉత్పత్తి చేస్తాయి గనుక వాటి మధ్య పోటీ పెరిగి విత్తనాల ధరలు తగ్గుముఖం పడతాయి. ఫలితంగా ఆమేరకు సాగు ఖర్చు తగ్గి రైతుకు ఊపిరి పీల్చుకునే వీలు కలుగుతుంది. మోన్శాంటో సంస్థ తీరుతెన్నులు మొదటినుంచీ సరిగా లేవు. అమెరికాలో ప్రభుత్వ విధానాలనే శాసించేంతగా ఎదిగిన ఈ సంస్థ ఇక్కడ సైతం తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంది. పరిశోధనల చాటున ప్రస్థానాన్ని ప్రారంభించి, కొత్త టెక్నాలజీని చూపి పేద రైతుల ఆశలతో ఆడుకుని వారిని పీల్చిపిప్పి చేయడం మొదలెట్టింది. చట్టాలంటే లెక్కలేదు. నిబంధనలంటే గౌరవం లేదు. ఆ సంస్థ 1995లో మన దేశంలోకి తొలిసారి జన్యుపరివర్తిత పత్తి వంగడాన్ని తీసుకొచ్చిన ప్పుడు అందుకవసరమైన అనుమతులే లేవు. నిబంధనల ప్రకారం జన్యు పరివర్తిత వ్యవహారాల మదింపు కమిటీ(జీఈఏసీ) అంగీకరించాకే బీటీ విత్తనాలను వినియో గించాల్సి ఉండగా...దాన్ని బేఖాతరు చేసి దాదాపు తొమ్మిది రాష్ట్రాల్లోని 40 ప్రాంతాల్లో ఆ సంస్థ బీటీ పత్తి విత్తనాల సాగును ప్రయోగాత్మకంగా మొదలెట్టింది. 1986 నాటి పర్యావరణ పరిరక్షణ చట్టం నిబంధనలకు ఇది విరుద్ధం. అంతేకాదు అలాంటి సాగు చేసిన పంటపొలాల్లో కనీసం ఏడాదిపాటు ఏ పంటా వేయ కూడదని 1994 నాటి జీవ పరిరక్షణ మార్గదర్శకాలు చెబుతున్నాయి. వాటిని సైతం ఉల్లంఘించి ఆ పొలాల్లో వెంటనే ఇతర పంటలు వేశారు. అసలు మన దేశంలోని చట్టాలు విత్తనాలపై పేటెంట్లను అంగీకరించవు. కానీ ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ)ను అడ్డుపెట్టుకునీ, అమెరికా ప్రభుత్వం ద్వారా ఒత్తిడి తెచ్చీ ఈ స్థితిని మార్చడానికి చాన్నాళ్లుగా అది చేయని ప్రయత్నమంటూ లేదు. అడుగడుగునా ఇక్కడి చట్టాలనూ, నిబంధనలనూ ఉల్లంఘిస్తూ ఇన్ని దశాబ్దాలుగా తన పబ్బం గడుపుకుంటున్న మోన్శాంటో విషయంలో ప్రభుత్వాలన్నీ కళ్లు మూసుకున్నాయి. చూసీచూడనట్టు వదిలేశాయి. మోన్శాంటో సంస్థ ధనదాహానికి కళ్లెం వేసిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కుతుంది. 2006నాటికి 450 గ్రాముల పత్తి విత్తనాల ధరను రూ. 1,850 చొప్పున అమ్ముతున్న మోన్శాంటోపై ఆయన ప్రభుత్వం గుత్తాధిపత్య నియంత్రణ కమిషన్(ఎంఆర్టీపీసీ)కు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు వరకూ వెళ్లి మోన్శాంటోపై పోరాడింది. అమెరికాలో రైతుల నుంచి వసూలు చేసే విత్తన ధరలతో పోలిస్తే ఇక్కడి రైతులనుంచి అది దాదాపు తొమ్మిది రెట్లు అధికంగా వసూలు చేస్తున్నదని వివరించింది. దీంతోపాటు కిలో దాదాపు రూ. 9 కే లభించే దేశవాళీ విత్తనాలను అది కొరగాకుండా చేస్తున్నదని పేర్కొంది. పరిశోధన, అభివృద్ధి వ్యయం వల్లనే ఆ ధరను నిర్ణయించాల్సి వచ్చిందన్న మోన్శాంటో వాదనను గణాంకాలతో తిప్పికొట్టింది. పర్యవసానంగా 2008లో బీటీ పత్తి విత్తనాల ప్యాకెట్ ధర రూ. 650కి లభ్యంకావడం మొదలైంది. వైఎస్ ప్రభుత్వం సాధించిన ఈ విజయాన్ని చూశాక గుజరాత్లో ఆనాటి నరేంద్ర మోదీ ప్రభుత్వం, మరికొన్ని ఇతర రాష్ట్రాలూ మోన్శాంటో మెడలు వంచాయి. వాస్తవానికి మోన్శాంటో ఉత్పత్తి చేస్తున్న బీటీ విత్తనాలు అది ప్రచారం చేస్తున్నట్టుగా పురుగును తట్టుకునే శక్తితో లేవు. బీటీ-2 పత్తి విత్తనం వాడిన పంటకు గులాబి రంగు పురుగు సోకడంతో రైతులు దేశవ్యాప్తంగా భారీయెత్తున నష్టపోయారు. తాము తయారుచేసిన విత్తనాలు అన్ని రకాల చీడలనూ, వాతా వరణ పరిస్థితులనూ తట్టుకుంటాయని మోతెక్కించడం తప్ప తీరా అందుకు భిన్నమైన ఫలితాలొచ్చినప్పుడు మోన్శాంటో బాధ్యత స్వీకరించి రైతులకు నష్ట పరిహారం ఇచ్చేందుకు సిద్ధపడటం లేదు. ఇందువల్ల లక్షలాదిమంది పత్తి రైతులు భారీగా నష్టాలు చవిచూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ సంస్థ గుత్తాధిపత్యాన్ని బద్దలు కొట్టేందుకు అనువుగా బీటీ టెక్నాలజీ ఉన్న ఏ కంపెనీ అయినా ఆ మాదిరి విత్తనాల ఉత్పత్తికి లెసైన్స్ తీసుకునేందుకు వీలు కల్పించడం రైతును రక్షించే చర్య. మొత్తానికి మోన్శాంటోను దారికి తీసుకురావడానికి ఇన్నేళ్లు పట్టింది. బహుళజాతి సంస్థల సేవలో తరించే ప్రభుత్వాలవల్లే వాటి ఆటలు సాగుతున్నాయి. ఉత్పత్తి ఖర్చుకు ఎన్నో రెట్లు అధికంగా వసూలు చేసే ఈ బాపతు సంస్థలను అదుపు చేయకపోగా, వాటికి మేలు చేయడం కోసం 2003లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా విత్తనాభివృద్ధి సంస్థనే ఎత్తేయాలని చూసింది. మోన్శాంటో విషయంలో మంచి నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం బక్క రైతును బాధిస్తున్న ఇతర సమస్యలపై కూడా దృష్టి సారించాలి. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల ధరలు ఆకాశాన్నంటడంవల్ల సాగు వ్యయం ఎన్నో రెట్లు పెరిగిపోయింది. దానికితోడు ప్రకృతి వైపరీత్యాలు మరింత కుంగ దీస్తున్నాయి. మెజారిటీ రైతులకు బ్యాంకుల్లో అప్పు పుట్టడం లేదు. వీటన్నిటి ఫలితంగా రైతులు రుణాల ఊబిలో కూరుకు పోతున్నారు. చావు తప్ప మార్గం లేదనుకుంటున్నారు. మొన్నటి బడ్జెట్లో కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ హామీ ఇచ్చినట్టుగా వచ్చే అయిదేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు కావాలంటే ఈ సమస్యల పరిష్కారం తప్పనిసరి. -
మోన్శాంటోకు ముకుతాడు
- పత్తి విత్తన గుత్తాధిపత్యానికి కేంద్రం చెక్ - బీటీ టెక్నాలజీ ఉన్న ఏ కంపెనీకైనా లెసైన్స్ - కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర కమిటీ - లెసైన్సింగ్ విధానంపై మార్గదర్శకాల రూపకల్పన - ఇతర విత్తన కంపెనీలు మార్కెట్లోకి వచ్చే వెసులుబాటు - బీటీ-3 పత్తి వంగడానికి లైన్‌క్లియర్ - బీటీ విత్తన ధరలు తగ్గే అవకాశం.. రైతులకు ప్రయోజనం - ఇన్నాళ్లూ రాయల్టీ రూపంలో వేల కోట్లు దండుకున్న మోన్శాంటో సాక్షి, హైదరాబాద్: బీటీ పత్తి.. ఇప్పటివరకు ఇది మోన్శాంటో సొంతం! బీటీ టెక్నాలజీని అడ్డుపెట్టుకొని ఈ బహుళజాతి సంస్థ ఇన్నేళ్లుగా వేల కోట్లు కొల్లగొట్టింది. అడ్డగోలుగా విత్తన రేట్లు నిర్ణయించి సొమ్ము చేసుకుంది. విత్తనంపై పెత్తనం చలాయిస్తూ ఇతర విత్తన కంపెనీలను తొక్కేసింది. ఈ గుత్తాధిపత్యానికి కేంద్ర ప్రభుత్వం తాజాగా చెక్ పెట్టింది. బీటీ టెక్నాలజీ పరిజ్ఞానం ఉన్న ఇతర కంపెనీలు కూడా పత్తి విత్తన వ్యాపారం చేసుకునేందుకు పచ్చజెండా ఊపింది. ఈ మేరకు కేంద్రం నియమించిన కమిటీ మార్గదర్శకాలను, లెసైన్సింగ్ విధానాన్ని ఖరారు చేసింది. దీంతో కంపెనీల మధ్య పోటీ ఏర్పడి రైతులకు తక్కువ ధరకే విత్తనాలు లభించే అవకాశం కలగనుంది. 2002 నుంచి కొనసాగుతున్న మోన్శాంటో గుత్తాధిపత్యానికీ కళ్లెం పడనుంది. టెక్నాలజీ ఉంటే చాలు.. 2016-17 సంవత్సరానికి బీటీ కాటన్ గరిష్ట విక్రయ ధర, లెసైన్సింగ్ నిర్ధారణకు కేంద్ర వ్యవసాయశాఖ ఇటీవల ఒక కమిటీ ఏర్పాటు చేసింది. కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి(సీడ్) చైర్మన్‌గా ఉన్న ఈ కమిటీలో తెలంగాణ వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసార థి సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ మంగళవారం ఢిల్లీలో సమావేశమైంది. ఇప్పటికే బీటీ పత్తి విత్తన ధరలను త గ్గించిన కమిటీ.. ఈ సమావేశంలో లెసైన్సింగ్పై కీలక నిర్ణయం తీసుకుంది. బీటీ టెక్నాలజీ ద్వారా పత్తి విత్తనం తయారు చేసే కంపెనీలకు లెసైన్స్ ఎలా ఇవ్వాలన్న అంశంపై మార్గదర్శకాలు తయారుచేసింది. బీటీ టెక్నాలజీ కలిగిన కంపెనీలు, విత్తన ఉత్పత్తి సంస్థల మధ్య ఒప్పందం అంశంపైనా నిర్ణయం తీసుకున్నారు. ఈ ఒప్పందం విషయంలో ప్రభుత్వం మధ్యవర్తిగా ఉండనుంది. ఇంతకుముందు బీటీ పత్తి విత్తనాన్ని ఇతర కంపెనీలు తయారు చేసి విక్రయించాలంటే మోన్శాంటోకు ముందస్తుగా ఒకేసారి రూ.40 లక్షలు రుసుం చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు రూ.25 లక్షలకు తగ్గించి రెండు వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు కల్పించారు. ప్రస్తుతం బీటీ టెక్నాలజీపై మోన్శాంటోకే లెసైన్స్ ఉంది. దీంతో ఇతర కంపెనీలు ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసినా వాటికి లెసైన్స్ దక్కకుండా అడ్డుకుంది. ఇకపై మోన్శాంటో కంపెనీ మాదిరే ఏ కంపెనీకైనా లెసైన్స్ పొందే వీలు కలుగనుంది. ఫలితంగా బీటీ టెక్నాలజీ కలిగిన కంపెనీలు తమ విత్తనాలను మార్కెట్లోకి విడుదల చేసుకునే వెసులుబాటు కలుగుతుంది. తక్కువ ధరకే విత్తనాలు తాజా మార్గదర్శకాలతో రైతులకు తక్కువ ధరలకు బీటీ విత్తనాలు అందుబాటులోకి వస్తాయని కమిటీ సభ్యులు అభిప్రాయపడుతున్నారు. విత్తన ఉత్పత్తి రైతులకు కూడా గిట్టుబాటు ధర అందేలా మార్గదర్శకాలు రూపొందించారు. రాయల్టీ నిర్ధారణ, వాణిజ్యపరంగా రాయల్టీ ఎన్నాళ్లు ఉండాలన్న దానిపైనా మార్గదర్శకాలు ఖరారు చేశారు. విత్తన కంపెనీలు పరిశోధనకు ప్రాధాన్యం ఇవ్వాలని కమిటీ కోరింది. విత్తన టెక్నాలజీ పునర్వ్యవస్థీకరణ లో భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్), వ్యవసాయ విశ్వవిద్యాలయాల భాగస్వామ్యం ఉండాలని సూచించింది. ఇన్నాళ్లూ మోన్శాంటో ఆడిందే ఆట మోన్శాంటో కంపెనీ మహారాష్ట్ర హైబ్రిడ్ కంపెనీ (మైకో)తో కలిసి దేశవ్యాప్తంగా 2002 నుంచి బీటీ-1 పత్తి విత్తన వ్యాపారం చేస్తోంది. ఇతర విత్తన కంపెనీలతో ఒప్పందాలు చేసుకొని మరే ఇతర పత్తి విత్తనాలు మార్కెట్లోకి అడుగుపెట్టకుండా గుత్తాధిపత్యం చెలాయిస్తూ వేల కోట్ల వ్యాపారం చేస్తోంది. బీటీ-1 పత్తి (మోన్ 531 జీన్) విత్తనానికి సంబంధించి మోన్శాంటో కంపెనీకి పేటెంట్ హక్కే లేదని, అందువల్ల రాయల్టీ చెల్లించాల్సిన అవసరం లేదని, ఉచితంగానే వాడుకోవచ్చని జాతీయ పత్తి పరిశోధన సంస్థ (సీఐసీఆర్) గతంలోనే తేల్చిచెప్పింది. అయినా ఇప్పటికీ కంపెనీల నుంచి రాయల్టీ వసూలు చేస్తోంది. 2006లో బీటీ-2 పత్తి విత్తనాన్ని మార్కెట్లో ప్రవేశపెట్టి దానికి పేటెంట్ ఉందని చెబుతూ రాయల్టీ నిర్ణయించినా.. ఇప్పటికీ బీటీ-1కు అక్రమంగా రాయల్టీని వసూలు చేస్తుండడం గమనార్హం. బీటీ-2 ఔట్.. బీటీ-3 ఇన్! ఇప్పుడు బీటీ-2 పత్తి విత్తనం కూడా పురుగును తట్టుకునే శక్తి కోల్పోయింది. ఫలితంగా దేశవ్యాప్తంగా అనేకచోట్ల పత్తి పంటకు గులాబీ రంగు పురుగు సోకింది. రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు. దీనిపై వివిధ రాష్ట్రాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కర్ణాటక ప్రభుత్వం మోన్శాంటో నుంచి రూ.2 వేల కోట్ల పరిహారం కోరుతోంది. ఈ నేపథ్యంలో బీటీ-2కు ప్రత్యామ్నాయంగా దేశంలోని పలు పత్తి కంపెనీలు బీటీ-3 టెక్నాలజీని తీసుకురావాలని నిర్ణయించాయి. కేంద్రం తాజాగా లెసైన్స్ మార్గదర్శకాలు తయారుచేసినందున బీటీ-3 పత్తి వంగడానికి మార్గం సుగమం అయినట్లేనని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. బీటీ-2 పత్తి విత్తనం విఫలమైందంటూ కేంద్రం కూడా సుప్రీంకోర్టుకు అఫిడవిట్ రూపంలో నివేదించింది. దీంతో దాన్ని నిషేధించి బీటీ-3కి అనుమతి ఇవ్వాలని దేశీయ కంపెనీలు కోరుతున్నాయి. రాష్ట్రంలో 42.42 లక్షల ఎకరాల్లో బీటీ దేశంలో అత్యధిక పత్తి సాగు చేసే రాష్ట్రాల్లో తెలంగాణ అత్యంత కీలకం. 2015-16 ఖరీఫ్‌లో రాష్ట్రంలో 88.90 లక్షల ఎకరాల్లో పంటలు సాగైతే అందులో 42.42 లక్షల ఎకరాల్లో పత్తిని సాగు చేశారు. మొత్తం వ్యవసాయ పంటల సాగు విస్తీర్ణంలో దాదాపు సగం వరకు పత్తి ఉండటం గమనార్హం. రాష్ట్రంలో 55.53 లక్షల మంది రైతులుండగా.. వారిలో దాదాపు 25 లక్షల మంది పత్తి సాగు చేశారని అంచనా. ప్రతి ఏటా సుమారు కోటికిపైగా బీటీ పత్తి విత్తన ప్యాకెట్లు విక్రయిస్తున్నారు. గతేడాది ఒక్కో ప్యాకెట్ కు రూ.930 వసూలు చేశారు. ఈ లెక్కన రాష్ట్రంలో రూ.వెయ్యి కోట్ల బీటీ పత్తి విత్తన వ్యాపారం జరుగుతోంది. 2002-03లో మొత్తం పత్తి సాగు విస్టీర్ణంలో కేవలం ఒక శాతమే బీటీ-1 విత్తనాలను వేయగా.. 2006-07 నాటికి అది కాస్తా 85 శాతానికి చేరింది! బీటీ-2 వచ్చాక 2014-15లో బీటీ-1 విత్తన మార్కెట్ వాటా 4 శాతానికి పడిపోయింది. ప్రస్తుతం బీటీ-2 వాటా 98 శాతంగా ఉంది. గుత్తాధిపత్యానికి అడ్డువేశాం ఇప్పటివరకు ప్రభుత్వానికి సంబంధం లేకుండా లెసైన్సింగ్ పద్ధతి ఉండేది. మిగతా కంపెనీలకు లెసైన్స్ రానీయకుండా గుత్తాధిపత్యం కొనసాగింది. కమిటీ తీసుకున్న నిర్ణయంతో మోన్శాంటో గుత్తాధిపత్యానికి కాలం చెల్లినట్లే! ఇకపై బీటీ టెక్నాలజీ ఉన్న ఏ కంపెనీ అయినా లెసైన్స్ తీసుకోవచ్చు. టెక్నాలజీ ఒక్కరి వద్దే ఉండటం సరికాదు. అది బదిలీ కావాలి. అందుకు తాజా మార్గదర్శకాలు దోహదం చేస్తాయి. ఇక నుంచి ఒప్పందాలేవైనా ప్రభుత్వ మధ్యవర్తిత్వంలోనే జరగాలని నిర్ణయించాం. - సి.పార్థసారథి, తెలంగాణ వ్యవసాయశాఖ కార్యదర్శి విత్తన ధరలు తగ్గుతాయి బీటీ పత్తి విత్తన కంపెనీలకు ఎలా లెసైన్స్ ఇవ్వాలన్న అంశంపై కేంద్ర కమిటీ తయారుచేసిన ముసాయిదా మార్గదర్శకాల వల్ల ఇక నుంచి అన్ని బీటీ కంపెనీలకూ లెసైన్స్ పొందే అవకాశం ఉంటుంది. ఫలితంగా భవిష్యత్తులో విత్తన ధర లు తగ్గనున్నాయి. - కేశవులు, తెలంగాణ విత్తన ధ్రువీకరణ సంస్థ బీటీ-3కి మార్గం సుగమం కేంద్రం తాజాగా మార్గదర్శకాలు అమల్లోకి వస్తే మోన్శాంటో గుత్తాధిపత్యానికి కాలం చెల్లుతుంది. బీటీ టెక్నాలజీ ఉన్న ఏ కంపెనీ అయినా తన ైనె పుణ్యాన్ని బట్టి నిబంధనల ప్రకారం లెసైన్స్ పొందవచ్చు. బీటీ-3 విత్తనానికి మార్గం సుగమమవుతుంది. రైతులకు ప్రయోజనం కలుగుతుంది. - నర్సింహారెడ్డి, వ్యవసాయరంగ నిపుణులు -
విత్తనంపై పెత్తనానికి చెల్లు!
♦ బీటీ-2 పత్తి విత్తనానికి ప్రత్యామ్నాయంగా బీటీ-3 ♦ దేశీయంగా కొత్త వంగడం రెడీ.. బీటీ-2 ధరలో సగమే ♦ రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు కంపెనీల ఏర్పాట్లు ♦ బీటీ-3 వస్తే మోన్శాంటో గుత్తాధిపత్యానికి చెక్! సాక్షి, హైదరాబాద్: పత్తి విత్తన వ్యాపారంలో మోన్శాంటో గుత్తాధిపత్యానికి తెరదించే రోజు లొచ్చాయి! మోన్శాంటో బీటీ-2 పత్తి విత్తనానికి ప్రత్యామ్నాయంగా దేశీయంగా బీటీ-3 పేరుతో కొత్త వంగడం సిద్ధమైంది. దేశీయంగా అనేక కంపెనీలు బీటీ-3 విత్తనాన్ని రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. కేంద్రం అనుమతిస్తే రెండేళ్లలోనే ఈ సరికొత్త పత్తి విత్తనాన్ని రైతుల ముందుకు తీసుకొస్తామని జాతీయ విత్తన సంఘం చెబుతోంది. బీటీ-2 విత్తన ధరలో దాదాపు సగానికే దీన్ని అందిస్తామని పేర్కొంటోంది. జన్యువును ప్రవేశపెట్టే ప్రక్రియ పూర్తి 2006 వరకు దేశంలో బీటీ-1 పత్తి విత్తనం హవా కొనసాగింది. అయితే బీటీ-1లో ఒకే జన్యువు ఉండటంతో అది పురుగును తట్టుకునే శక్తిని కోల్పోయింది. దీంతో 2006లో బీటీ-2ను ప్రవేశపెట్టారు. అందులో రెండు జన్యువులు ఉండడంతో పురుగును తట్టుకునే శక్తి వచ్చింది. అయితే గతేడాది నుంచి బీటీ-2 పత్తి విత్తనానికి కూడా పురుగులు ఆశించాయి. దేశవ్యాప్తంగా అనేకచోట్ల గులాబీ రంగు పురుగు ఏర్పడింది. అనేకచోట్ల కాయ, పూత సరిగా లేక దిగుబడి పడిపోయింది. ఫలితంగా దేశవ్యాప్తంగా 30 శాతం దిగుబడి తగ్గింది. ఈ నేపథ్యంలో బీటీ-2కు ప్రత్యామ్నాయంగా జాతీయ విత్తన కంపెనీలు ‘స్వర్ణభారత్ కన్సార్షియం’గా ఏర్పడి బీటీ-3 కొత్త వంగడాన్ని ప్రయోగశాలలో సిద్ధం చేశాయి. ఇప్పటివరకు ‘ఈసీ’ అనే జన్యువును పత్తి మొక్కలోకి ప్రవేశపెట్టే ప్రక్రియ పూర్తయింది. బీటీ టెక్నాలజీని హైబ్రీడ్‌గా మార్చి తర్వాత బీటీ-3 పత్తి వంగడం తయారు చేయాల్సి ఉంది. ఇప్పటివరకు మోన్శాంటో గుత్తాధిపత్యం కారణంగా పత్తి విత్తనంలో జన్యువును ప్రవేశపెట్టలేకపోయామని చెబుతున్నారు. కొత్త వంగడానికి గులాబీ రంగు పురుగును తట్టుకునే శక్తి ఉందని తేలిందంటున్నారు. మోన్శాంటో అడ్డు తొలగించిన సీసీఐ గతనెలలో కాంపిటీషన్ క మిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) మోన్శాంటో గుత్తాధిపత్యానికి వ్యతిరేకంగా ఆదేశాలిచ్చింది. మోన్శాంటోకు బీటీ టెక్నాలజీపై గుత్తాధిపత్యం లేదని, దేశీయ పత్తి విత్తన కంపెనీలు బీటీ టెక్నాలజీని వాడుకోవచ్చని స్పష్టం చేసింది. దీంతో బీటీ టెక్నాలజీతో తయారైన బీటీ-3కి అడ్డంకులు తొలగినట్లేనని, కేంద్రం అనుమతిస్తే రెండేళ్లలో గులాబీ రంగు పురుగును తట్టుకునే శక్తి ఉన్న వంగడాన్ని రైతులకు చేరుస్తామని విత్తన కంపెనీలు చెబుతున్నాయి. బీటీ-2 పత్తి విత్తనం విఫలమైందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అఫిడవిట్ రూపంలో ఇప్పటికే నివేదించినందున దాన్ని నిషేధించి బీటీ-3కి అనుమతి ఇవ్వాలని దేశీయ కంపెనీలు కోరుతున్నాయి. మరోవైపు స్థానికంగా బీటీయేతర విత్తనాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని కొందరు వ్యవసాయ రంగ నిపుణులు కోరుతున్నారు. మోన్శాంటో పని అయిపోయినట్లేనా? బీటీ-3 పత్తి వంగడం రైతుల వద్దకు చేరితే మోన్శాంటోకు కాలం చెల్లినట్లేనని వ్యవసాయ రంగ నిపుణులు అంటున్నారు. ఇప్పటివరకు మోన్శాంటో కంపెనీ మహారాష్ట్ర హైబ్రిడ్ కంపెనీ(మైకో)తో కలిసి దేశవ్యాప్తంగా 2002 నుంచి బీటీ-1 పత్తి విత్తన వ్యాపారం చేస్తోంది. ఇతర విత్తన కంపెనీలతో ఒప్పందాలు చేసుకొని ఏ ఇతర పత్తి విత్తనాలు మార్కెట్లోకి అడుగుపెట్టకుండా చూస్తోంది. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో కేవలం రాయల్టీ ద్వారానే దాదాపు రూ.6 వేల కోట్లు కొల్లగొట్టిందని జాతీయ విత్తన సంఘం ప్రతినిధులు అంటున్నారు. బీటీ-1 పత్తి (మోన్ 531 జీన్) విత్తనానికి సంబంధించి మోన్శాంటోకు పేటెంట్ హక్కు లేదని, రాయల్టీ చెల్లించాల్సిన అవసరం లేదని, ఉచితంగానే వాడుకోవచ్చని జాతీయ పత్తి పరిశోధన సంస్థ (సీఐసీఆర్) తేల్చి చెప్పింది. కానీ దేశీయ విత్తన తయారీదారులు కోట్ల రూపాయల రాయల్టీని మోన్శాంటోకు చెల్లిస్తూనే ఉన్నారు. ఆ సొమ్మును రైతు నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. 2006 నుంచి బీటీ-2 పత్తి విత్తనాన్ని మార్కెట్లో ప్రవేశపెట్టిన మోన్శాంటో.. దానికి పేటెంట్ ఉందని చెబుతూ రాయల్టీ నిర్ణయించింది. అయినా ఇప్పటికీ బీటీ-1కు అక్రమంగా రాయల్టీని వసూలు చేస్తోంది. -
మోన్శాంటో వంటి కంపెనీలు రైతుల్ని దోచేస్తున్నాయి
♦ అందుకే రాయల్టీని మేమే నిర్ణయించాం ♦ ప్రభుత్వం తరఫున న్యాయవాది వైద్యనాథన్ హైకోర్టుకు నివేదన సాక్షి, హైదరాబాద్: మోన్శాంటో వంటి కంపెనీలు పత్తి విత్తనాలను అధిక ధరలకు అమ్మి రాష్ట్రంలోని పేద రైతులను దోపిడీ చేస్తున్నాయని తెలంగాణ ప్రభుత్వం బుధవారం హైకోర్టుకు నివేదించింది. అటువంటి కంపెనీల ఆట కట్టించి, రైతులను ఆదుకునేందుకే రాయల్టీ విషయంలో తాము జోక్యం చేసుకున్నామని వివరించింది. అయితే సింగిల్ జడ్జి ఈ విషయాన్ని సానుకూల దృక్పథంతో చూడకుండా రాయల్టీ నిర్ణయంపై తమ ఉత్తర్వుల అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారంది. కాబట్టి ఆ మధ్యంతర ఉత్తర్వుల ఎత్తివేత కోసం ఈ అప్పీల్‌ను దాఖలు చేయాల్సి వచ్చిందని ధర్మాసనానికి నివేదించింది. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని రైతుల సంక్షేమం కోసం తాము తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించేలా ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్థించింది. ఈ వాదనలను మోన్శాంటో తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ తోసిపుచ్చారు. మిగిలిన వ్యాపారులకు లబ్ధి చేకూర్చేందుకే ప్రభుత్వం రాయల్టీని తగ్గించిందని తెలిపారు. అంతేకాక విత్తన వ్యాపారులు తమకు వ్యతిరేకంగా ముంబై, హైదరాబాద్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారని వివరించారు. విచారణ డిసెంబర్ 23కి వాయిదా ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం, ఇదే వ్యవహారానికి సంబంధించి సింగిల్ జడ్జి వద్ద ఉన్న ఇతర పిటిషన్లను కూడా తమ ముందుంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 23కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మహికో మోన్శాంటో బీటీ పత్తి విత్తనాల రాయల్టీని ప్యాకెట్‌కు రూ. 50గా ఖరారు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ మోన్శాంటో పిటిషన్ దాఖలు చేయగా, విచారణ జరిపిన సింగిల్ జడ్జి, ప్రభుత్వ ఉత్తర్వులపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ఈ స్టేను తొలగించాలంటూ సర్కార్ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను సైతం ఇటీవల కొట్టేశారు. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాలు చేస్తూ తెలంగాణ సర్కార్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేసింది. దీనిని బుధవారం ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సి.ఎస్.వైద్యనాథన్ వాదనలు వినిపించగా, మోన్శాంటో తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదించారు. -
‘మోన్శాంటో’ను తరిమి కొట్టండి
స్వచ్ఛంద సంస్థలు, రైతు సంఘాల డిమాండ్ సాక్షి, హైదరాబాద్: దేశ ఆహార స్వావలంబనకు ముప్పుగా పరిణమిస్తున్న బహుళ జాతి విత్తన సంస్థ ‘మోన్‌శాం టో’ను తరిమికొట్టాలని పలు స్వచ్ఛంద సంస్థలు, రైతు సం ఘాల ప్రతినిధులు పిలుపునిచ్చారు. జన్యుమార్పిడి పంటలపై క్షేత్రస్థాయి పరిశోధనలను నిషేధించాలని డిమాండ్ చేశారు. తమ వ్యాపారాన్ని విస్తరించుకునే క్రమంలో మోన్శాంటో సంస్థ ఎంతటి అనైతిక పద్ధతులకైనా పాల్పడుతోందని విమర్శించారు. ఈ మేరకు స్థానిక సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బుధవారం జరిగిన సదస్సులో పలు సంఘాల ప్రతినిధులు ప్రసంగించారు. ప్రభుత్వ రంగ సంస్థలు, యూనివర్సిటీల్లోని శాస్త్రవేత్తలు మోన్శాంటోకు వ్యతిరేకంగా నిలవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు కోదండ రెడ్డి, రైతు స్వరాజ్యవేదిక నేత విస్సా కిరణ్ కుమార్, ‘చేతన’ నరసింహా రెడ్డి, డాక్టర్ అరిబండి ప్రసాదరావు, ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త గంటా సత్యనారాయణ రెడ్డి, సీపీఐ రైతు సంఘం నేత రామకృష్ణ, భారతీయ కిసాన్ సంఘ్ నేత శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.