మోన్‌శాంటో వంటి కంపెనీలు రైతుల్ని దోచేస్తున్నాయి
♦ అందుకే రాయల్టీని మేమే నిర్ణయించాం
♦ ప్రభుత్వం తరఫున న్యాయవాది వైద్యనాథన్ హైకోర్టుకు నివేదన
సాక్షి, హైదరాబాద్: మోన్‌శాంటో వంటి కంపెనీలు పత్తి విత్తనాలను అధిక ధరలకు అమ్మి రాష్ట్రంలోని పేద రైతులను దోపిడీ చేస్తున్నాయని తెలంగాణ ప్రభుత్వం బుధవారం హైకోర్టుకు నివేదించింది. అటువంటి కంపెనీల ఆట కట్టించి, రైతులను ఆదుకునేందుకే రాయల్టీ విషయంలో తాము జోక్యం చేసుకున్నామని వివరించింది. అయితే సింగిల్ జడ్జి ఈ విషయాన్ని సానుకూల దృక్పథంతో చూడకుండా రాయల్టీ నిర్ణయంపై తమ ఉత్తర్వుల అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారంది. కాబట్టి ఆ మధ్యంతర ఉత్తర్వుల ఎత్తివేత కోసం ఈ అప్పీల్‌ను దాఖలు చేయాల్సి వచ్చిందని ధర్మాసనానికి నివేదించింది. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని రైతుల సంక్షేమం కోసం తాము తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించేలా ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్థించింది. ఈ వాదనలను మోన్‌శాంటో తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ తోసిపుచ్చారు. మిగిలిన వ్యాపారులకు లబ్ధి చేకూర్చేందుకే ప్రభుత్వం రాయల్టీని తగ్గించిందని తెలిపారు. అంతేకాక విత్తన వ్యాపారులు తమకు వ్యతిరేకంగా ముంబై, హైదరాబాద్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారని వివరించారు.
విచారణ డిసెంబర్ 23కి వాయిదా
ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం, ఇదే వ్యవహారానికి సంబంధించి సింగిల్ జడ్జి వద్ద ఉన్న ఇతర పిటిషన్లను కూడా తమ ముందుంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 23కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మహికో మోన్‌శాంటో బీటీ పత్తి విత్తనాల రాయల్టీని ప్యాకెట్‌కు రూ. 50గా ఖరారు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ మోన్‌శాంటో పిటిషన్ దాఖలు చేయగా, విచారణ జరిపిన సింగిల్ జడ్జి, ప్రభుత్వ ఉత్తర్వులపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ఈ స్టేను తొలగించాలంటూ సర్కార్ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను సైతం ఇటీవల కొట్టేశారు. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాలు చేస్తూ తెలంగాణ సర్కార్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేసింది. దీనిని బుధవారం ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సి.ఎస్.వైద్యనాథన్ వాదనలు వినిపించగా, మోన్‌శాంటో తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదించారు.