వర్షపు నీటిలోనూ విషపు ఆనవాళ్లే | US courts to decide if weedkiller gave groundsman cancer | Sakshi
Sakshi News home page

వర్షపు నీటిలోనూ విషపు ఆనవాళ్లే

Published Sun, Aug 12 2018 4:05 AM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM

US courts to decide if weedkiller gave groundsman cancer - Sakshi

వాషింగ్టన్‌: మోన్‌శాంటో సంస్థ అమెరికాలోని మిస్సోరీ రాష్ట్రంలో 1901లో ప్రారంభమైంది. విత్తనాలు, పురుగు మందులు, ఎరువుల అమ్మకాలతో ఏకంగా రూ.4.28 లక్షల కోట్ల విలువైన సామ్రాజ్యాన్ని సృష్టించుకుంది. ఈ క్రమంలో తమ వ్యవసాయ ఉత్పత్తులు వాడినవారికి కేన్సర్‌ సోకుతుందన్న విషయాన్ని ఉద్దేశపూర్వకంగా తొక్కిపెట్టింది. తాజాగా డ్వేన్‌ జాన్సన్‌ కేసులో మోన్‌శాంటోకు రూ.2,003 కోట్ల భారీ జరిమానా పడటంతో ఈ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది.  

అడ్డదారులు.. తప్పుడు కథనాలు
కేన్సర్‌ కారక గ్లైఫోసేట్‌ ఉన్న ఉత్పత్తుల అమ్మకాలకు  మోన్‌శాంటో తొక్కిన అడ్డదారులు అన్నీ ఇన్నీ కావు. తమ ఉత్పత్తుల అమ్మకాలకు పొగాకు కంపెనీలు అనుసరించే వ్యూహాన్నే మోన్‌శాంటో పాటించింది.  గ్లైఫోసేట్‌ ఉత్పత్తుల వల్ల కేన్సర్‌ సోకుతుందన్న అంశాన్ని విస్మరించేలా ఈ సంస్థ రాజకీయ నేతలు, అధికారులు, నియంత్రణ సంస్థలపై ఒత్తిడి తీసుకొచ్చింది. మోన్‌శాంటో ఉత్పత్తులు సురక్షితమని రైతులు, వినియోగదారులు నమ్మేలా పత్రికలు, జర్నల్స్‌లో అనుకూల కథనాలు రాయించింది.

ఇందుకు లొంగని జర్నలిస్టులు, శాస్త్రవేత్తలను పలు రకాలుగా వేధించింది. వీలైన చోట్ల ప్రలోభాలతో నియంత్రణ సంస్థలను లోబర్చుకుంది. ‘రౌండప్‌’ ‘రేంజర్‌ ప్రో’ కలుపు మొక్కల నాశనుల్లో ఉండే గ్లైఫోసేట్‌ కారణంగా కేన్సర్‌ సోకుతుందని మోన్‌శాంటోకు 1980ల్లోనే తెలుసని శాన్‌ఫ్రాన్సిస్కో జ్యూరీ విచారణ సందర్భంగా బయటపడింది. దీన్ని సరిదిద్దడం కానీ, నిలిపివేయడం కాని చేయని మోన్‌శాంటో.. తమ ఉత్పత్తులు సురక్షితమన్న ప్రచారానికి తెరలేపింది. ఇందులోభాగంగా స్వతంత్ర మీడియా సంస్థల ద్వారా అసలు ఉనికిలోనే లేని వ్యక్తుల పేర్లతో తప్పుడు శాస్త్రీయ కథనాలు రాయించింది.

తమ ఉత్పత్తులను రైతులు, వినియోగదారులు నమ్మేలా ఈ కుట్రలో పర్యావరణ శాఖ అధికారుల్ని సైతం భాగస్వాముల్ని చేసింది. వియత్నాం యుద్ధం సందర్భంగా అమెరికా ప్రయోగించిన ‘ఏజెంట్‌ ఆరేంజ్‌’ అనే రసాయనిక ఆయుధాన్ని కూడా మోన్‌శాంటో మరికొన్ని సంస్థలతో కలసి ఉత్పత్తి చేసిందని అంటారు. అయితే ఈ ఆరోపణల్ని మోన్‌శాంటో గతంలో ఖండించింది. తాజాగా మోన్‌శాంటో తరఫున శాన్‌ఫ్రాన్సిస్కో కోర్టులో కేసును వాదించిన లాయర్‌ జార్జ్‌ లంబర్డీ.. అంతర్జాతీయ పొగాకు   కంపెనీలకు న్యాయవాదిగా వ్యవహరిస్తుండటం గమనార్హం.

గాలి, నీరు, మట్టి అన్నింటా విషమే..
ప్రపంచవ్యాప్తంగా గ్లైఫోసేట్‌ ఉత్పత్తుల వినియోగం ఇటీవలి కాలంలో గణనీయంగా పెరిగిపోయింది. ప్రతిఏటా ప్రపంచవ్యాప్తంగా 82.6 కోట్ల కేజీల గ్లైఫోసేట్‌ ఉత్పత్తులను రైతులు, ఇతర వినియోగదారులు వాడుతున్నారు. కేన్సర్‌ కారక గ్లైఫోసేట్‌ ఇప్పుడు ఎంత సాధారణ విషయంగా మారిపోయిందంటే మనం తినే అన్నం, తాగే నీళ్లలోనూ దీని అవశేషాలు ఉన్నాయి. మట్టితో పాటు గాలి నమూనాలను సేకరించగా వాటిలోనూ ఈ రసాయనం జాడ బయటపడింది. చివరికి వర్షపు నీటిలోనూ ఈ విషపూరిత గ్లైఫోసేట్‌ ఉన్నట్లు తెలుసుకున్న శాస్త్రవేత్తలు విస్తుపోయారు. అంతలా ఈ విషం గాలి, నీరు, నేలను కలుషితం చేసింది. మోన్‌శాంటో ఉత్పత్తుల దుష్పరిణామాలపై స్వతంత్ర సంస్థలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన హెచ్చరికలను ప్రభుత్వాలు పట్టించుకోలేదు. గ్లైఫోసేట్‌ ఉత్పత్తుల్ని ప్రమాదకర జాబితాలో చేర్చలేదు.

దావాకు సిద్ధంగా మరో 4 వేల మంది రైతులు
డ్వేన్‌ జాన్సన్‌ కేసు తీర్పుతో మోన్‌శాంటోకు మరిన్ని ఇబ్బందులు తప్పేలా లేవు. సెయింట్‌ లూయిస్‌లో వచ్చే అక్టోబర్‌లో మోన్‌శాంటో ఉత్పత్తుల దుష్పరిణామాలపై కేసు విచారణకు రానుంది. అలాగే దాదాపు 4,000 మంది అమెరికా రైతులు మోన్‌శాంటో కీటక, కలుపు నాశనుల కారణంగా తమ ఆరోగ్యం దెబ్బతిందని వేర్వేరు కోర్టుల్లో దాఖలుచేసిన కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. తాజాగా ఐఆర్క్‌ నివేదికతో పాటు కాలిఫోర్నియా జ్యూరీ తీర్పు నేపథ్యంలో మోన్‌శాంటో బాధితులకు రూ.లక్షల కోట్ల మేర జరిమానా చెల్లించాల్సి రావచ్చని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. మోన్‌శాంటో ఉత్పత్తుల కారణంగా కేన్సర్‌ సోకినందుకు కాకుండా కేన్సర్‌ సోకుంతుందన్న విషయాన్ని దాచిపెట్టినందుకు కంపెనీని కోర్టులు దోషిగా నిలబెట్టే అవకాశముందని చెబుతున్నారు. 2018, జూన్‌లో మోన్‌శాంటోను జర్మనీ ఎరువుల దిగ్గజం బేయర్‌ దాదాపు రూ.4.28 లక్షల కోట్లకు కొనుగోలు చేసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement