కలుపు మందుతో కేన్సర్ ! | Combine with the cancer drug | Sakshi
Sakshi News home page

కలుపు మందుతో కేన్సర్ !

Published Wed, Apr 8 2015 10:31 PM | Last Updated on Sun, Sep 3 2017 12:02 AM

కలుపు మందుతో కేన్సర్ !

కలుపు మందుతో కేన్సర్ !

గ్లైఫొసేట్.. ఇది అత్యంత ప్రభావశీలి అయిన కలుపు మందు. ప్రపంచంలో వాడుకలో ఉన్న కలుపునాశిని రసాయనాల్లోకెల్లా అగ్రగామి. దీన్ని వాడని దేశం లేదు. ఇది మన దేశంలోనూ విరివిగా వాడుతున్న కలుపు మందు కూడా. ఇది సురక్షితమైన కలుపు మందుగా పరిగణించబడినది. ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని కేన్సర్ కారకంగా గుర్తించడంతో ప్రపంచవ్యాప్తంగా కలకలం మొదలైంది. నెదర్లాండ్స్ దీనిపై వెంటనే నిషేధం విధించింది. మరికొన్ని దేశాలు ఇదే బాటను అనుసరించే దిశగా పయనిస్తున్నాయంటున్నారు డాక్టర్ గున్నంరెడ్డి శ్యామసుందర్ రెడ్డి.
 
వ్యవసాయంలో కూలీల కొరత ముంచుకొస్తున్నకొద్దీ గ్లైఫొసేట్ గడ్డి మందు వాడకం బాగా పెరిగింది. గ్లైఫొసేట్ అంతర్వాహక చర్య కలిగిన ప్రభావశీలమైన కలుపు నాశక రసాయనం. ఈ కలుపు మందు చెట్టు మీద పడిన వెంటనే మొక్కల శిఖర భాగాలకు.. అంటే నేలలోని పీచు వేళ్ల నుంచి, చిటారు కొమ్మల చిగుళ్ల దాకా చేరుతుంది. చెట్టుకు అత్యంత ఆవశ్యకమైన అమైనో ఆమ్లాల తయారీని అడ్డుకొని కొన్ని రోజులకు పూర్తిగా చంపేస్తుంది.

గ్లైఫొసేట్.. మోన్‌శాంటో ఉత్పత్తి

1974లో మోన్‌శాంటో కంపెనీ రౌండప్ అనే పేరుతో మార్కెట్‌లోకి విడుదల చేసిన నాటి నుంచి, గత నాలుగు దశాబ్దాలుగా దీని వాడకం ప్రపంచవ్యాప్తంగా అప్రతిహతంగా పెరుగుతూ వచ్చింది. దశాబ్దం క్రితం దీనిపై పేటెంట్‌కూ కాలం చెల్లింది. అప్పటి నుంచి చాలా కంపెనీలు గ్లైఫొసేట్‌ను తయారు చేసి, విరివిగా మార్కెట్ చేస్తున్నాయి. అత్యంత సురక్షితమైనదిగా పరిగణింపబడిన ఈ కలుపు నాశిని మీద మోన్‌శాంటో ‘రౌండప్-రెడీ’ పేరుతో జన్యుమార్పిడి పంటలను తయారు చేస్తోంది. ఇప్పటికే అమెరికా తదితర దేశాలలో ‘రౌండప్-రెడీ’ మొక్కజొన్న, సోయా చిక్కుడు, పత్తి వంగడాలు విస్తారంగా సాగువుతున్నాయి. ఈ పంటల్లో గ్లైఫొసేట్‌ను విధిగా వాడవలసి ఉంటుంది.
 
కేన్సర్ కారకం..


ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) తాజాగా గ్లైఫొసేట్‌ను కేన్సర్ కారకంగా పరిగణించి, ప్రమాదకర రసాయనాల జాబితాలో చేర్చింది. అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ)కి చెందిన డా. యాంటోనీ శాంసెల్, డా. స్టీఫెన్ సెనెఫ్‌లు గ్లైఫొసేట్ మానవ శరీరానికి పరోక్షంగా, దీర్ఘకాలంలో ప్రాణాంతకమైనదిగా నిరూపించారు. గ్లైఫొసేట్ నిలువరించే ఈపీఎస్‌పీ సింథేస్ అనే ఎంజైమ్ మనుషుల్లోను, జంతువుల్లోనూ ఉండదు కనుక ఇది మనుషులకు ఏ విధంగానూ హానికరంగా కాదని, దీన్ని నిరూపించడానికి మోన్‌శాంటో ప్రతినిధులు రౌండప్‌ను తాగి చూపించిన సందర్భాలు అనేకం. కానీ, మొక్కలకు, సూక్ష్మజీవులకు ఈ ఎంజైమ్ అత్యంత ఆవశ్యకమైనది.

ఉపయుక్త సూక్ష్మజీవులకు తీవ్రహాని

గ్లైఫొసేట్ అవశేషాలున్న ఆహారాన్ని తినడం వల్ల మానవ జీర్ణవ్యవస్థతో ముడిపడి ఉన్న కోటానుకోట్ల ఉపయుక్త సూక్ష్మజీవులు నాశనమవుతాయని ఎంఐటీ శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ సూక్ష్మజీవులు మనం తినే ఆహారాన్ని జీర్ణం చేయడంలోను, జీర్ణమైన ఆహారాన్ని శరీరం గ్రహించడంలోను, ఆహారంలోని విషకారకాలను నిర్మూలించడంలోను, వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలోను ప్రముఖపాత్రను పోషిస్తాయి. ఈ సూక్ష్మజీవులు జీర్ణవ్యవస్థలో నశించడం వల్ల స్వయం ఛేదక వ్యాధులు(ఆటో ఇమ్యూన్ డిసీజెస్) ప్రేరేపితమవుతాయి. స్వయం ఛేదకం అంటే.. దేహాన్ని పరిరక్షించాల్సిన తెల్ల రక్త కణాలు విచక్షణ కోల్పోయి.. తన సొంత కణజాలంపైనే దాడి చేసి నష్టపరుస్తాయి. తత్ఫలితంగా కడుపులో మంట, పేగుల్లో పుండ్లు, ఊబకాయం, మధుమేహం, హృద్రోగాలు, వంధ్యత్వం, కేన్సర్, ఆటిజం, అల్జీమర్స్, డిప్రెషన్ వంటి ఎన్నో రోగాలకు గ్లైఫొసేట్ పరోక్షంగా కారణభూతమవుతోందని ఎంఐటీ శాస్త్రవేత్తలు సూత్రీకరించారు.

అమెరికా వంటి దేశాల్లో గోధుమ పంటను సులభంగా యంత్రాలతో నూర్పిడి చేయడానికి కోతకు కొద్ది రోజుల ముందు గ్లైఫొసేట్‌ను పిచికారీ చేస్తుంటారు. అదేవిధంగా పత్తి పంటలో కూడా యంత్రాలతో పత్తి తీతకు ముందు ఆకును రాల్చడానికి గ్లైఫొసేట్‌ను పిచికారీ చేస్తారు. తత్ఫలితంగా గోధుమ ఉత్పత్తులు శరీరంలోని ఉపయుక్త సూక్ష్మజీవులకు ఏవిధంగా హానికలిగిస్తాయో, గ్లైఫొసేట్ అవశేషాలున్న నూలు వస్త్రాలు కూడా చర్మానికి మేలుచేసే సూక్ష్మజీవులకు కూడా అదేవిధంగా హాని చేస్తాయి.

రైతుల ఉసురు తీస్తున్న గ్లైఫొసేట్

భారతదేశం, మధ్య అమెరికా, శ్రీలంకలలో అంతుపట్టని కిడ్నీ వ్యాధుల బారిన పడి వేల మంది రైతులు మరణిస్తున్నారు. శ్రీలంక శాస్త్రవేత్త డా. చన్న జయంసుమన పరిశోధనల్లో తేలిన విషయమేమిటంటే.. అంతుపట్టని కిడ్నీ వ్యాధి ప్రబలంగా ఉన్న ప్రదేశాల్లోని బావుల్లో నీటిలో గ్లైఫొసేట్, భారలోహాలు అధిక మోతాదులో ఉన్నాయి. గ్లైఫొసేట్, భారలోహాలతో కలిసి కిడ్నీలను నాశనం చేయగలదని సూత్రీకరించారు. ఖచ్చితంగా నిర్థారణ కాకున్నా ముందుజాగ్రత్త చర్యగా శ్రీలంక, ఎల్‌సాల్విడార్ దేశాలు గత సంవత్సరం గ్లైఫొసేట్‌ను నిషేధించాయి. శ్రీకాకుళంలోని ఉద్ధానం పరిసరాల్లో 2007 నుంచి ఇప్పటి వరకు 1500 మందికి పైగా అంతుపట్టని కిడ్నీ వ్యాధులతో మరణించారు.
 
కిం కర్తవ్యం?


మన రైతులు ఉద్యాన పంటల్లో గ్లైఫొసేట్ కలుపు మందును విరివిగా వాడుతున్నారు. మన పంట పొలాల్లోని సూక్ష్మజీవరాశులు దుంపనాశనమై పోతున్నాయి. గ్లైఫొసేట్ పిచికారీ చేసేటప్పుడు వెలువడే తుంపరలు చెట్లు, మొక్కల ఆకులపై పడి వేల ఎకరాల్లో ఉద్యాన తోటలు క్రమక్రమంగా క్షీణించి ఎండిపోతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లైఫొసేట్ కేన్సర్ కారకమని ప్రకటించిన నేపథ్యంలో.. నెదర్లాండ్స్ యుద్ధప్రాతిపదికన గ్లైఫొసేట్‌పై నిషేధం విధించింది. ఫ్రాన్స్ తదితర ఐరోపా దేశాలు నిషేధానికి సన్నద్ధమవుతున్నాయి. మన దేశం కూడా దీనిపై అధ్యయనాలు విస్తృత పరచి, వాస్తవాలను రైతులు, ప్రజలముందుంచాలి. ఈ బాధ్యత మన వ్యవసాయ శాస్త్రవేత్తలు, వైద్యనిపుణుల భుజస్కందాలపై ఉంది. ప్రభుత్వం నిష్పక్షపాతంగా విధానపరమైన నిర్ణయం తీసుకొని, చిత్తశుద్ధితో అమలుపరచాలి.
 
 (వ్యాసకర్త వ్యవసాయ నిపుణుడు. ఐఐఐటీ, హైదరాబాద్ shyam.reddy@iiit.ac.in)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement