the World Health Organization
-
వైరస్ వార్తతో ఉలిక్కిపడ్డ అంబర్‌పేట
వైరస్ వార్తలతో అంబర్‌పేట ప్రజలు ఉలిక్కిపడ్డారు. తమ ప్రాంతంలో వైరస్ ఉనికి కనిపించిందనే వార్తపై అంతా ఆరా తీయడం కనిపించింది. అంబర్‌పేట నాలాలో పోలియో వైరస్‌ను గుర్తించినట్లు ప్రపంచ అరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ప్రకటించడంతో స్థానికంగా సోమవారం చర్చనీయాంశం అయింది. వైరస్ తమ ప్రాంతంలో వెలుగులోకి వచ్చిందా అంటూ కొంత మంది అధికారులను ఆరా తీశారు. అంబర్‌పేట నియోజకవర్గం నుంచి ప్రధానంగా మూడు నాలాలు ప్రవహిస్తాయి. హుస్సేన్‌సాగర్, మోయిన్చెరువు, ఉప్పల్నాలాలు జనావాసాల మధ్య నుంచి వెళతాయి. ఇవే కాకుండా అంబర్‌పేట నియోజకవర్గం మెజార్జీ ప్రాంతాలకు అనుకొని మూసీ కూడా ప్రవహిస్తుంది. డబ్ల్యూహెచ్‌వో అంబర్‌పేటలోని ఏ ప్రాంతంలో నమూనాలు సేకరించిందో తెలియజేయనప్పటికి అంబర్‌పేట పేరు రావడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. నియోజకవర్గంలోని వివిధ బస్తీలు, కాలనీల్లో తరచూ నీరు కలుషిత మవుతుంటుంది. ఇప్పుడు పోలియో వైరస్ ఉందని తెలియడంతో కలుషిత నీరుపై అప్రమత్తంగా అధికారులు వ్యవహరించాలని పలువురు కోరుతున్నారు. పెద్ద పెద్ద నాలాలకు, తాగు నీటి సరఫరాకు సంబంధం లేదు... ప్రజలు భయపడాల్సిన పని కూడా లేదని జలమండలి జనరల్ మేనేజర్ రాం చంద్రారెడ్డి తెలిపారు. హుస్సేన్ సాగర్‌లో కలిసే కూకట్పల్లి నాలాను మారియేట్ హోటల్ వద్ద దారి మళ్లించి నేరుగా అంబర్‌పేట మీదుగా మూసీ నదిలో కలుపుతున్నామన్నారు. కెమికల్స్ కలిసిన మురుగు నీటిలో బహుశా వెలుగు చూసి వుండవచ్చు. తమకు ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదని వివరణ ఇచ్చారు. -
నీటికి కటకట
‘కూటి కోసం కోటి తిప్పలు’ అన్నారు పెద్దలు. ఇప్పుడు ‘నీటి కోసమూ కోటి తిప్పలు’ పడుతున్నారు సామాన్యులు. ప్రచండ భానుడు నిప్పులు కక్కుతుండటంతో జిల్లాలో భూగర్భ జలాలు గణనీయంగా అడుగంటారుు. గతేడాదితో పోల్చితే బావులు, బోర్లలో నీటిమట్టాలు పడిపోయూరుు. దీంతో తెల్లారింది మొదలు పల్లె ప్రజలు బిందెలు చేతపట్టి, వ్యవసాయ బావుల వద్దకు పరుగులు తీయూల్సిన దుస్థితి నెలకొంది. ఇక పట్టణాల్లో జ(న)ల ఘోషను వినే నాథుడే లేకుండాపోయూడు. ఇప్పటికైనా పాలకులు మేల్కొని కనీస అవసరంగా చెప్పుకునే నీటి కొరతతో జనం ఎదుర్కొంటున్న కష్టాలను తీర్చే దిశగా అడుగులేయూలి. - నర్సంపేట నర్సంపేట నియోజకవర్గంలో 3 లక్షల జనాభా ఉంది. ఒక్కొక్కరికి సగటున రోజుకు 3.5 లీటర్ల నీటిని సరఫరా చేయూలని ప్రపంచ ఆరో గ్య సంస్థ(డబ్ల్యుహెచ్ఓ) అంటోంది. కానీ ఒక్కొక్కరికి కనీసం రోజువారీగా లీటరు నీటిని కూడా సరఫరా చేయడం లేదు. కనీస అవసరమైన తా గునీటి సరఫరాపై పాలకులకు ఉన్న నిర్లక్ష్యానికి ఇదొక నిదర్శనం. నీటి కటకటను తీర్చే దిశగా ఇప్పటికైనా కృషిచేయాల్సిన అవసరముంది. డీ ఫ్లోరైడ్ ప్రాజెక్టుకు నిధులేవీ ? ఖానాపురం మండలం అశోక్‌నగర్ శివారులో 2004 సంవత్సరంలో రూ.3.74 కోట్లు వెచ్చించి డీ ఫ్లోరైడ్ ప్రాజెక్టును నిర్మించారు. నర్సంపేట డివిజన్లోని 132 గ్రామాలు, శివారు ప్రాంతాల ప్రజలకు ఫ్లోరైడ్ రహిత నీటిని అందించాలనే సంకల్పంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు పడకేసింది. గతేడాది మార్చి 1న ఇది మూతపడింది. దీంతో శివారు గ్రామాల ప్రజలు ఉదయం లేచింది మొదలు నీటి కోసం చేదబావుల వద్దకు పరుగుతు తీయూల్సి వస్తోంది. ఈ ఏడాది 14వ ఆర్థిక సంఘం నుంచి జిల్లా పరిషత్‌కు నిధులు మంజూరవకపోవడంతో ప్రాజెక్టు నిర్వహణ పడకేసింది. ఏటా రూ.1.50 కోట్లు ఢీ ఫ్లోరైడ్ ప్రాజెక్టు నిరంతరాయంగా పనిచేసి, ప్రజల దాహార్తిని తీరుస్తుంది. మూడేళ్లుగా మూలనపడ్డ ఫిల్టర్ బెడ్లు రెండు రోజులకోసారి నీళ్లు సరఫరా అవుతుండటంతో నర్సంపేటవాసులు నానా అవస్థలు పడుతున్నారు. పట్టణంలోని ద్వారకాపేట ఫిల్టర్‌బెడ్ నుంచి పాఖాల వాగుకు చెందిన నీటిని ఫిల్టర్ చేయుకుండా నేరుగా సరఫరా చేస్తున్నారు. దీంతో అవి తాగేందుకు వినియోగించేలా లేవు. స్థానికంగా ఉన్న 20 వార్డుల్లో 36,241 జనాభా ఉండగా, ఆ మేరకు నీటి సరఫరా లేదు. నీటిని శుద్ధి చేసే 4 ఫిల్టర్ బెడ్లు ఉన్నా.. గత మూడేళ్లుగా అవి నిరుపయోగంగా మిగిలిపోయూరుు. వాటిని వినియోగంలోకి తెచ్చేందుకు చొరవ చూపినవారే లేకపోవడం గమనార్హం. దీనిపై ప్రజలు నిలదీయూల్సిన అవసరముంది. ప్రభుత్వం రూ.50 లక్షలు వెచ్చిస్తే ఫిల్టర్‌బెడ్ ఉపయోగంలోకి వచ్చే అవకాశాలు ఉంటారుు. అడుగంటిన భూగర్భ జలాలు వర్షాభావ పరిస్థితులు, వేసవి తీవ్రత వెరసి నర్సంపేట డివిజన్లోని జ లాశయూల్లో నీటిమట్టాలు అడుగంటుతున్నారుు. ఇంకా ఏప్రిల్ రాకముందే ఇటువంటి పరిస్థితి ఉంటే.. మే నాటికి ఎలా ఉంటుందోనని ప్రజానీకం కలవరపడుతున్నారు. ఈవిషయూన్ని ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ పట్టించుకోవడం లేదు. ఏజెన్సీ, మెట్ట ప్రాంతాల్లో పరిస్థితి మరింత దయునీయుంగా ఉంది. నర్సంపేట నియోజకవర్గంలో గతేడాది(2015) ఫిబ్రవరిలో 7.34 ఎంహెచ్జీఎల్ సరాసరి భూగర్భజల మట్టం ఉండగా.. అది కాస్తా 2015 మే నాటికి 7.72 ఎంహెచ్‌జీఎల్‌కు పెరిగింది. ఆ తర్వాతి నుంచి వర్షాభావ పరిస్థితులు చుట్టుముట్టడంతో ఈ ఏడాది జనవరి నాటికి నియోజకవర్గంలో సరాసరి నీటిమట్టం 6.53 ఎంహెచ్‌జీఎల్‌కు పడిపోవడం గమనార్హం. రూ.2 కోట్లతో సమస్య తీరుతుందిలా.. నియోజకవర్గ ప్రజల నీటి కష్టాలు తీరాలంటే రూ.2 కోట్లను ప్రభుత్వం వెచ్చించాలి. అశోక్‌నగర్‌లోని ఢీఫ్లోరైడ్ ప్రాజెక్ట్ నిర్వహణకు రూ.1.50 కోట్లు, ద్వారకాపేట సమీపంలోని 4 ఫిల్టర్బెడ్లను వినియోగంలోకి తెచ్చేందుకు రూ.50 లక్షలను మంజూరు చేయూలి. ఆ దిశగా స్థానిక ప్రజాప్రతినిధులు ఐకమత్యంతో అధికారులపై ఒత్తిడి పెంచాల్సిన అవసరముంది. ఖానాపురం వుండల కేంద్రంలోని ఫిల్టర్‌బెడ్‌ను కూడా ఉపయోగంలోకి తీసుకొచ్చేందుకు ప్రత్యేక నిధులు కేటారుుంచాల్సిన అవసరం ఉంది. వాటర్ క్యాన్ రూ.15 గత్యంతరం లేక ప్రజలు వాటర్ క్యాన్లు కొని దాహార్తిని తీర్చుకుంటున్నారు. దీంతో నియోజకవర్గంలోని 165 నీటిప్లాంట్ల వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లుతోంది. గతంలో 25 లీటర్ల నీటి క్యాన్ రూ.5 నుంచి రూ.8 ధర పలికేది. నీటిఎద్దడి నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను ఆసరాగా చేసుకొని వ్యాపారులు క్యాన్ ధరను అమాంతం రూ.15కు పెంచేశారు. నిబంధనలను తుంగలో తొక్కి నీళ్ల బేరం చేస్తున్న పలు నీటిప్లాంట్లను అధికారులు తనిఖీ చేసిన దాఖలాలూ పెద్దగా లేవు. దీంతో వాళ్లు యథేచ్ఛగా దందా కొనసాగిస్తున్నారు. నిధులు అందితేనే ‘ప్రాజెక్ట్’ నిర్వహణ నర్సంపేట నియోజకవర్గంలోని 132 గ్రావూలకు తాగునీరు అందించేందుకు అశోక్‌నగర్‌లోని ఢీ ఫ్లోరైడ్ ప్రాజెక్టులో నీళ్లు సరిపోనూ ఉన్నారుు. కానీ ఈ ఏడాది ప్రాజెక్టుకు జిల్లా పరిషత్ నుంచి నిధులు అందలేదు. దీంతో దాని నిర్వహణ పడకేసింది. ఫలితంగా దీనిలో పనిచేసే 31 వుంది ఆపరేటర్లకు గత 9 నెలలుగా జీతాలు అందలేదు. రూ.1.50 కోట్లు కేటారుుస్తే ప్రాజెక్ట్ నిర్వహణ కొనసాగుతుంది. దీనిపై ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తాం. - వెంకట్రాం రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ డీఈ, నర్సంపేట -
చేతులు శుభ్రంగా ఉంటే 80 శాతం రోగాలు రావు!
తిక్క లెక్క కొందరిలో ఆత్మారాముడు చాలా చురుగ్గా ఉంటాడు. ఎప్పుడూ చూసినా ఏదో ఒకటి కడుపులో పడేస్తూ ఉంటే కానీ, స్థిమితంగా ఉండలేరు వారు. అయితే ఆకలి వేస్తోంది కదా అని, చేతులు కూడా కడుక్కోకుండా ఆవురావురుమని తినేస్తే మాత్రం చేజేతులా ఆరోగ్యానికి ముప్పు తెచ్చుకున్నట్లేనంటున్నారు పరిశోధకులు. అసలు జలుబు సహా పలు ప్రమాదకరమైన వ్యాధులు చేతులు శుభ్రం చేసుకోకుండా తినడం వల్లే వస్తాయట. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం అరచేతుల్లో ఎక్కువ తేమ ఉండడంతోపాటు కొన్ని లక్షల సూక్ష్మజీవులు ఇమిడి ఉంటాయి. ఆ చేతులతోనే తినేయడం వల్ల అనేకరకాలైన రోగాలను చేతులారా ఆహ్వానించినట్టే. కాబట్టి ఏ పనీ చేయకుండా ఖాళీగా ఉన్నా.. తరచు చేతులు శుభ్రం చేసుకుంటూ ఉండడం మంచిదని, అలా చేయడం వల్ల దాదాపు 80 శాతం రోగాలు రాకుండా ఉంటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) పేర్కొంటోంది. -
ఆ ‘ఐదు’ వ్యాధులిక దూరం.
- రేపు పెంటావలెంట్ టీకా ప్రారంభం - ప్రాణాంతక వ్యాధుల నుంచి సంరక్షణ - తిరుపతిలో సీఎంచే పిల్లలకు టీకాలు చిత్తూరు (అర్బన్): హిమోఫిలస్ ఇన్ప్లూయెంజా టైప్ బీ (హిబ్) .. ప్రపంచవ్యాప్తంగా ఐదేళ్లలోపు చిన్నారులను బలిగొంటున్న ప్రాణాంతక వ్యాధి. దీనిబారిన పడి ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు 3.7లక్షల మంది చనిపోతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల పేర్కొంది. మృతుల్లో సుమారు 20 శాతం మంది మనదేశానికి చెందిన వారే. మరికొంతమంది పిల్లలు శాశ్వత పక్షవాతం, చెవుడు, మెదడు వ్యాధులతో బాధపడుతున్నారు. ఇలాంటి చిన్నారులకు ఆరోగ్య భరోసా కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పెంటావలెంట్ను ప్రవేశపెట్టింది. ప్రాణాంతకమైన ఐదు వ్యాధులను నియంత్రించే శక్తి ఇందులో ఉంది. మన జిల్లాలోనూ పిల్లలకు ఈ టీకా వేసేందుకు వైద్య, ఆరోగ్యశాఖ ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఈ నెల 7న సీఎం చేతులమీదుగా పెంటావలెంట్ను రాష్ట్రంలోనే మొదటి సారిగా జిల్లాలో ప్రారంభిస్తారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి యూనివర్సిటీలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో పెంటావలెంట్ టీకాను చిన్నారులకు వేయనున్నారు. పిల్లల్లో రోగనిరోధక శక్తిలో భాగంగా ప్రస్తుతం వైద్యశాఖాధికారులు అందిస్తున్న టీకాలు ఏదో ఒక వ్యాధిని నియంత్రించేందుకు మాత్రమే ఉపయోగపడుతున్నాయి. దీంతో ఏ వ్యాధికి అనుగుణంగా ఆ టీకా వేస్తున్నారు. ఆరునెలల శిశువుకే ఆరు నుంచి ఏడు టీకాలు ఇవ్వాల్సిన పరిస్థితి. ఫలితంగా శిశువు శరీరం ఇబ్బందులకు గురవడంతో పాటు టీకాలు వేసే సమయంలో సమస్యలు ఎదురవుతున్నాయి. వీటిన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఐదు ప్రాణాంతర వ్యాధుల నుంచి రక్షణ ఇచ్చేలా ఒకే ఒక పెంటావలెంట్ను అందుబాటులోకి తెచ్చింది. పెంటా అంటే ఐదు. వలెంట్ అంటే టీకా అని అర్థం. కంఠసర్పి (డిఫ్తీరియా), కోరింత దగ్గు, ధనుర్వాతం(టెటనస్), హెపటైటీస్ -బి,హిమోఫిలస్ ఇన్‌ఫ్లూయెంజా టైప్ బీ (హిబ్) అనే ఐదు రకాల ప్రాణాంతక వ్యాధులను పెంటావలెంట్ నియంత్రిస్తుంది. శిశువు పుట్టిన ఆరు వారాలకు ఈ పెంటావలెంట్ టీకా వేస్తారు. 10, 14వ వారాల్లోగా సైతం ఈ టీకా వేస్తారు. టీకా వల్ల కలిగే ప్రయోజనాలు, పాటించాల్సిన చర్యలపై డీఎంహెచ్‌వో కోటీశ్వరి జిల్లాలోని వైద్యాధికారులకు, సిబ్బందికి దాదాపు రెండు నెలల పాటు శిక్షణ ఇచ్చారు. -
కలుపు మందుతో కేన్సర్ !
గ్లైఫొసేట్.. ఇది అత్యంత ప్రభావశీలి అయిన కలుపు మందు. ప్రపంచంలో వాడుకలో ఉన్న కలుపునాశిని రసాయనాల్లోకెల్లా అగ్రగామి. దీన్ని వాడని దేశం లేదు. ఇది మన దేశంలోనూ విరివిగా వాడుతున్న కలుపు మందు కూడా. ఇది సురక్షితమైన కలుపు మందుగా పరిగణించబడినది. ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని కేన్సర్ కారకంగా గుర్తించడంతో ప్రపంచవ్యాప్తంగా కలకలం మొదలైంది. నెదర్లాండ్స్ దీనిపై వెంటనే నిషేధం విధించింది. మరికొన్ని దేశాలు ఇదే బాటను అనుసరించే దిశగా పయనిస్తున్నాయంటున్నారు డాక్టర్ గున్నంరెడ్డి శ్యామసుందర్ రెడ్డి. వ్యవసాయంలో కూలీల కొరత ముంచుకొస్తున్నకొద్దీ గ్లైఫొసేట్ గడ్డి మందు వాడకం బాగా పెరిగింది. గ్లైఫొసేట్ అంతర్వాహక చర్య కలిగిన ప్రభావశీలమైన కలుపు నాశక రసాయనం. ఈ కలుపు మందు చెట్టు మీద పడిన వెంటనే మొక్కల శిఖర భాగాలకు.. అంటే నేలలోని పీచు వేళ్ల నుంచి, చిటారు కొమ్మల చిగుళ్ల దాకా చేరుతుంది. చెట్టుకు అత్యంత ఆవశ్యకమైన అమైనో ఆమ్లాల తయారీని అడ్డుకొని కొన్ని రోజులకు పూర్తిగా చంపేస్తుంది. గ్లైఫొసేట్.. మోన్శాంటో ఉత్పత్తి 1974లో మోన్శాంటో కంపెనీ రౌండప్ అనే పేరుతో మార్కెట్లోకి విడుదల చేసిన నాటి నుంచి, గత నాలుగు దశాబ్దాలుగా దీని వాడకం ప్రపంచవ్యాప్తంగా అప్రతిహతంగా పెరుగుతూ వచ్చింది. దశాబ్దం క్రితం దీనిపై పేటెంట్కూ కాలం చెల్లింది. అప్పటి నుంచి చాలా కంపెనీలు గ్లైఫొసేట్‌ను తయారు చేసి, విరివిగా మార్కెట్ చేస్తున్నాయి. అత్యంత సురక్షితమైనదిగా పరిగణింపబడిన ఈ కలుపు నాశిని మీద మోన్శాంటో ‘రౌండప్-రెడీ’ పేరుతో జన్యుమార్పిడి పంటలను తయారు చేస్తోంది. ఇప్పటికే అమెరికా తదితర దేశాలలో ‘రౌండప్-రెడీ’ మొక్కజొన్న, సోయా చిక్కుడు, పత్తి వంగడాలు విస్తారంగా సాగువుతున్నాయి. ఈ పంటల్లో గ్లైఫొసేట్‌ను విధిగా వాడవలసి ఉంటుంది. కేన్సర్ కారకం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) తాజాగా గ్లైఫొసేట్‌ను కేన్సర్ కారకంగా పరిగణించి, ప్రమాదకర రసాయనాల జాబితాలో చేర్చింది. అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ)కి చెందిన డా. యాంటోనీ శాంసెల్, డా. స్టీఫెన్ సెనెఫ్లు గ్లైఫొసేట్ మానవ శరీరానికి పరోక్షంగా, దీర్ఘకాలంలో ప్రాణాంతకమైనదిగా నిరూపించారు. గ్లైఫొసేట్ నిలువరించే ఈపీఎస్పీ సింథేస్ అనే ఎంజైమ్ మనుషుల్లోను, జంతువుల్లోనూ ఉండదు కనుక ఇది మనుషులకు ఏ విధంగానూ హానికరంగా కాదని, దీన్ని నిరూపించడానికి మోన్శాంటో ప్రతినిధులు రౌండప్‌ను తాగి చూపించిన సందర్భాలు అనేకం. కానీ, మొక్కలకు, సూక్ష్మజీవులకు ఈ ఎంజైమ్ అత్యంత ఆవశ్యకమైనది. ఉపయుక్త సూక్ష్మజీవులకు తీవ్రహాని గ్లైఫొసేట్ అవశేషాలున్న ఆహారాన్ని తినడం వల్ల మానవ జీర్ణవ్యవస్థతో ముడిపడి ఉన్న కోటానుకోట్ల ఉపయుక్త సూక్ష్మజీవులు నాశనమవుతాయని ఎంఐటీ శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ సూక్ష్మజీవులు మనం తినే ఆహారాన్ని జీర్ణం చేయడంలోను, జీర్ణమైన ఆహారాన్ని శరీరం గ్రహించడంలోను, ఆహారంలోని విషకారకాలను నిర్మూలించడంలోను, వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలోను ప్రముఖపాత్రను పోషిస్తాయి. ఈ సూక్ష్మజీవులు జీర్ణవ్యవస్థలో నశించడం వల్ల స్వయం ఛేదక వ్యాధులు(ఆటో ఇమ్యూన్ డిసీజెస్) ప్రేరేపితమవుతాయి. స్వయం ఛేదకం అంటే.. దేహాన్ని పరిరక్షించాల్సిన తెల్ల రక్త కణాలు విచక్షణ కోల్పోయి.. తన సొంత కణజాలంపైనే దాడి చేసి నష్టపరుస్తాయి. తత్ఫలితంగా కడుపులో మంట, పేగుల్లో పుండ్లు, ఊబకాయం, మధుమేహం, హృద్రోగాలు, వంధ్యత్వం, కేన్సర్, ఆటిజం, అల్జీమర్స్, డిప్రెషన్ వంటి ఎన్నో రోగాలకు గ్లైఫొసేట్ పరోక్షంగా కారణభూతమవుతోందని ఎంఐటీ శాస్త్రవేత్తలు సూత్రీకరించారు. అమెరికా వంటి దేశాల్లో గోధుమ పంటను సులభంగా యంత్రాలతో నూర్పిడి చేయడానికి కోతకు కొద్ది రోజుల ముందు గ్లైఫొసేట్‌ను పిచికారీ చేస్తుంటారు. అదేవిధంగా పత్తి పంటలో కూడా యంత్రాలతో పత్తి తీతకు ముందు ఆకును రాల్చడానికి గ్లైఫొసేట్‌ను పిచికారీ చేస్తారు. తత్ఫలితంగా గోధుమ ఉత్పత్తులు శరీరంలోని ఉపయుక్త సూక్ష్మజీవులకు ఏవిధంగా హానికలిగిస్తాయో, గ్లైఫొసేట్ అవశేషాలున్న నూలు వస్త్రాలు కూడా చర్మానికి మేలుచేసే సూక్ష్మజీవులకు కూడా అదేవిధంగా హాని చేస్తాయి. రైతుల ఉసురు తీస్తున్న గ్లైఫొసేట్ భారతదేశం, మధ్య అమెరికా, శ్రీలంకలలో అంతుపట్టని కిడ్నీ వ్యాధుల బారిన పడి వేల మంది రైతులు మరణిస్తున్నారు. శ్రీలంక శాస్త్రవేత్త డా. చన్న జయంసుమన పరిశోధనల్లో తేలిన విషయమేమిటంటే.. అంతుపట్టని కిడ్నీ వ్యాధి ప్రబలంగా ఉన్న ప్రదేశాల్లోని బావుల్లో నీటిలో గ్లైఫొసేట్, భారలోహాలు అధిక మోతాదులో ఉన్నాయి. గ్లైఫొసేట్, భారలోహాలతో కలిసి కిడ్నీలను నాశనం చేయగలదని సూత్రీకరించారు. ఖచ్చితంగా నిర్థారణ కాకున్నా ముందుజాగ్రత్త చర్యగా శ్రీలంక, ఎల్‌సాల్విడార్ దేశాలు గత సంవత్సరం గ్లైఫొసేట్‌ను నిషేధించాయి. శ్రీకాకుళంలోని ఉద్ధానం పరిసరాల్లో 2007 నుంచి ఇప్పటి వరకు 1500 మందికి పైగా అంతుపట్టని కిడ్నీ వ్యాధులతో మరణించారు. కిం కర్తవ్యం? మన రైతులు ఉద్యాన పంటల్లో గ్లైఫొసేట్ కలుపు మందును విరివిగా వాడుతున్నారు. మన పంట పొలాల్లోని సూక్ష్మజీవరాశులు దుంపనాశనమై పోతున్నాయి. గ్లైఫొసేట్ పిచికారీ చేసేటప్పుడు వెలువడే తుంపరలు చెట్లు, మొక్కల ఆకులపై పడి వేల ఎకరాల్లో ఉద్యాన తోటలు క్రమక్రమంగా క్షీణించి ఎండిపోతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లైఫొసేట్ కేన్సర్ కారకమని ప్రకటించిన నేపథ్యంలో.. నెదర్లాండ్స్ యుద్ధప్రాతిపదికన గ్లైఫొసేట్‌పై నిషేధం విధించింది. ఫ్రాన్స్ తదితర ఐరోపా దేశాలు నిషేధానికి సన్నద్ధమవుతున్నాయి. మన దేశం కూడా దీనిపై అధ్యయనాలు విస్తృత పరచి, వాస్తవాలను రైతులు, ప్రజలముందుంచాలి. ఈ బాధ్యత మన వ్యవసాయ శాస్త్రవేత్తలు, వైద్యనిపుణుల భుజస్కందాలపై ఉంది. ప్రభుత్వం నిష్పక్షపాతంగా విధానపరమైన నిర్ణయం తీసుకొని, చిత్తశుద్ధితో అమలుపరచాలి. (వ్యాసకర్త వ్యవసాయ నిపుణుడు. ఐఐఐటీ, హైదరాబాద్ shyam.reddy@iiit.ac.in) -
మీ ఇల్లు శుభ్రమేనా..!
‘ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు’ అనే సామెత గాలి కాలుష్యం విషయంలో కూడా నిజమైంది. అవును.. పిల్లలు ఎక్కువగా బయట తిరగడం వల్ల కలుషితమైన గాలి పీల్చి అనారోగ్యం పాలవుతారనే విషయం మనందరికీ తెలుసు. కానీ ఇంట్లో, స్కూల్లో ఉండే దుమ్ము ధూళి కూడా వారి వ్యాధులకు కారణభూతాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సర్వేలో తేలింది. ఢిల్లీలోని 5 ప్రముఖ పాఠశాలల్లో ‘గ్రీన్‌పీస్’ సంస్థ చేపట్టిన సర్వేలో తరగతి గదుల్లో, కారిడార్లలో ఉన్న గాలి, బయటి పరిసరాల్లో గాలి కంటే ఎక్కువ ప్రమాదకరంగా ఉందని తెలిసింది. దీన్ని పీల్చడం వల్ల పిల్లలు బ్రాంకైటిస్ వంటి శ్వాసకోశ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారని స్పష్టమైంది. ఈ ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ (అంతర్గత గాలి కాలుష్యం)ను మొగ్గలోనే తుంచి వేయకపోతే భవిష్యత్తులో మరిన్ని సమస్యలు చవిచూడాల్సి వస్తుందని సర్వే హెచ్చరిస్తోంది. ప్రభావం చూపిస్తుందిలా.. ఈ కాలుష్యం స్థాయి తక్కువగానే ఉన్నా, ఎక్కువ మోతాదులో పీల్చడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. పెద్దవారితో పోలిస్తే పిల్లల్లో శ్వాసక్రియా రేటు ఎక్కువ. దీంతో కలుషిత వాయువులను ఎక్కువ మోతాదులో లోనికి ప్రవేశిస్తాయి. అలాగే వాయునాళాలు కూడా అభివృద్ధి చెందే దశలో ఉండటంతో వాటికి ప్రమాదం వాటిల్లే అవకాశం ఎక్కువ. కలుషిత వాయువులను పీల్చడం వల్ల కలిగే పరిణామాలు ప్రస్తుతం కనిపించకపోయినా, వ్యాధినిరోధక శక్తి సన్నగిల్లినపుడు విరుచుకుపడే ప్రమాదం ఉంది. జాగ్రత్తలివిగో... ఇంటికి వెంటిలేషన్ సరిగా ఉండేలా చూసుకోవాలి. ఇంట్లోకి పొగ, దుమ్ము రాకుండా చూడాలి. వేసవిలో ఎయిర్ కండిషనర్లు ఎక్కువసేపు వాడకూడదు. ఓ గదిలో ఉన్న గాలినే కండిషనర్ తిప్పి తిప్పి పంపిస్తుంది. ఈ గాలిలో కార్బన్డయాక్సైడ్ స్థాయి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు మంచి నాణ్యత ఉన్న ఫ్యూరిఫయర్‌ను అమర్చడం ద్వారా ఈ సమస్య నుంచి గట్టెక్కవచ్చు. పొగ ఎక్కువగా వెలువడే ప్రాంతాల్లో, ఎక్కువ తేమ ఉన్న చోట్లలో చిన్నారులకు శ్వాస తీసుకోవడంలో ఏదైనా ఇబ్బంది కలుగుతోందా అనే విషయాన్ని కనుక్కోండి. వీలైనన్నీ ఎక్కువ ద్రవ పదార్థాలు ఇవ్వండి. (ముఖ్యంగా వేసవిలో) ఎప్పటికప్పుడు ఇంటిని పరిశుభ్రంగా ఉండేలా చూసుకోండి. ఇవి పాటించడం వల్ల శ్వాసకోశ వ్యాధుల బారినుంచి పిల్లలను రక్షించవచ్చు. సో.. ఇప్పటికైనా బయటి వాతావరణాన్ని నిందించే ముందు ఒక్కసారి మీ ఇంటిని, పరిసరాలను శుభ్రం చేసుకోండి. - డాక్టర్ ఇందు ఖోస్లా, పిల్లల వైద్యనిపుణురాలు, ముంబై -
స్వైన్‌ఫ్లూపై భయం వద్దు
వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్‌చందా దగ్గు, జలుబు, ఒళ్లునొప్పులుంటే పరీక్షలు చేయించుకోవాలి సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో స్వైన్‌ఫ్లూ కేసులు, మరణాల సంఖ్య విజృంభిస్తుండటంపట్ల ప్రజలు భయపడనక్కర్లేదని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ చందా సూచించారు. బుధవారం ఆయన సచివాలయంలో విలేకరులతో ప్రత్యేకంగా ఈ అంశంపై మాట్లాడుతూ కేవలం స్వైన్‌ఫ్లూ కారణంగానే మరణాలు సంభవించవని... ఇతరత్రా వ్యాధులున్నవారే వైరస్‌బారినపడి మృతిచెందిన సంఘటనలు ఉన్నాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి లక్ష స్వైన్‌ఫ్లూ కేసుల్లో మరణాల సంఖ్య 20లోపే ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల్లో వెల్లడైందన్నారు. శీతాకాలంలో ఫ్లూ సాధారణమైనదేనని...అయితే సాధారణ ఫ్లూలో ఉన్నట్లే స్వైన్‌ఫ్లూలోనూ దాదాపు అవే లక్షణాలు ఉంటాయని దగ్గు, జలుబు, తలనొప్పి, ఒళ్లు నొప్పులుంటే ఆసుపత్రికి వచ్చి పరీక్షలు చేయించుకోవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో నిర్లక్ష్యం చేయరాదన్నారు. హైదరాబాద్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెన్టివ్ మెడిసిన్ (ఐపీఎం)లో ఆదివారం సహా ఎల్లవేళలా పరీక్షలు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఇతరులకు వైరస్ సోకకుండా ఉండేందుకు స్వైన్‌ఫ్లూ రోగులు మాస్కులు వేసుకోవాలన్నారు. చేతులు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. స్వైన్‌ఫ్లూ ఉన్నవారిని ప్రత్యేక వార్డుల్లో ఉంచి సాధారణ చికిత్స అందిస్తున్నామన్నారు. మూడు, నాలుగు రోజుల్లో స్వైన్‌ఫ్లూ నయం అవుతుందన్నారు. రోగనిరోధకశక్తి తక్కువగా ఉండేవారు వైరస్‌బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని సురేష్ చందా సూచించారు. అయితే స్వైన్‌ఫ్లూ రాకుండా వ్యాక్సిన్ వేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. స్వైన్‌ఫ్లూ వస్తే వారికి చికిత్స చేసేందుకు గాంధీ, ఉస్మానియా, ఛాతీ ఆసుపత్రుల్లో అవసరమైన ప్రత్యేక వార్డులు ఉన్నాయని చెప్పారు. ప్రైవేటు ఆసుపత్రులకు స్వైన్‌ఫ్లూ అనుమానిత కేసులు వస్తే తమ వద్దకే పంపాలని ఆయన ఆదేశించారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ డెరైక్టర్ సాంబశివరావు మాట్లాడుతూ ఆరేళ్ల లోపు, 65 ఏళ్లు పైబడినవారు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ‘కేర్’లో స్వైన్ ఫ్లూ వ్యాక్సినేషన్ సెంటర్ స్వైన్ ఫ్లూ వ్యాక్సినేషన్ సెంటర్‌ను కేర్ ఆసుపత్రి యాజమాన్యం బుధవారం హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్-10 లోని తన అవుట్ పేషెంట్ విభాగంలో ఏర్పాటు చేసింది. స్వైన్ ఫ్లూ తెలంగాణ రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్ శుభాకర్ దీన్ని ప్రారంభించారు. ఈ వ్యాక్సినేషన్ సెంటర్ ప్రజలకు అన్నివేళలా అందుబాటులో ఉంటుందని ఆసుపత్రి డాక్టర్ టీఎల్ఎన్.స్వామి తెలిపారు. నగరంలో మరో ఆరు స్వైన్‌ఫ్లూ కేసులు హైదరాబాద్‌లో స్వైన్‌ఫ్లూ చాప కింది నీరులా విస్తరిస్తోంది. బుధవారం మరో నలుగురికి స్వైన్ ఫ్లూ ఉన్నట్లు తేలింది. వీరిలో నారాయణ గూడకు చెందిన వ్యక్తి(50) ఆదిత్య ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, బంజారాహిల్స్‌కు చెందిన మిహ ళ (54) స్టార్ ఆస్పత్రిలో చేరింది. ఘట్కేసర్లోని వేర్వేరు కుటుంబాలకు చెందిన ఇద్దరు చిన్నారులు చలి జ్వరంతో మంగళవారం గాంధీ ఆస్పత్రిలో చేరారు. వీరి రక్తపు నమూనాలు సేకరించి నిర్ధారణ కోసం ఐపీఎంకు పంపగా, వీరిద్దరికీ హెచ్- 1ఎన్1 పాజిటివ్ వచ్చింది. దీంతో చిన్నారులను గాంధీ చిన్నపిల్లల విభాగంలోని ప్రత్యేక వార్డుకు తరలించి వైద్యసేవలు అందిస్తున్నారు. ఇప్పటికే ఫ్లూతో బాధపడుతూ ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న గర్భిణీ సౌజన్య కోలుకుంటుందని, స్వైన్‌ఫ్లూ మందులు అందుబాటులో ఉన్నాయని ఆస్పత్రి అధికారులు తెలిపారు. కాగా, మరో ఇద్దరు ఇదే లక్షణాలతో బాధపడుతూ బుధవారం ఉస్మానియా ఆస్పత్రిలో చేరినట్లు తెలిసింది. వీరి నుంచి రక్త నమూనాలు సేకరించి నిర్ధారణ కోసం ఐపీఎంకు పంపారు. -
ఎల్లలెరుగని ఎబోలా!
ఆమధ్య పశ్చిమ ఆఫ్రికాలో బయటపడి అందరినీ భీతావహుల్ని చేస్తున్న ఎబోలా వ్యాధి అడ్డూ ఆపూ లేకుండా విస్తరిస్తున్నది. ఇప్పటికి 10,141 కేసులు నమోదుకాగా అందులో 4,922 మంది మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకటించింది. నమోదుకాని కేసుల సంఖ్య అంతకు ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుందంటున్నారు. ప్రధానంగా గినియా, లైబీరియా, సియెర్రా లియోన్ దేశాలు ఈ వ్యాధితో అల్లాడుతున్నాయి. నిర్ధారిత వ్యాక్సిన్ ఏదీ అందుబాటులో లేని ప్రస్తుత స్థితే కొనసాగితే డిసెంబర్‌కల్లా మరో 10,000మంది ఈ వ్యాధి బారిన పడే అవకాశమున్నదని నిపుణులు చెబుతున్న మాట. అంతేకాదు, ఇది యూరప్, అమెరికా, ఇతర దేశాలకు కూడా విస్తరించవచ్చునని వారు అంచనావేస్తున్నారు. యేల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు, లైబీరియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు వెల్లడిస్తున్న అంచనాలు ఇంతకన్నా భయంగొలిపేవిగా ఉన్నాయి. డిసెంబర్ మధ్యకల్లా ఒక్క లైబీరియాలోనే 90,000 మంది మరణించే ప్రమాదమున్నదని వారు చెబుతున్నారు. వ్యాధి పుట్టి విస్తరిస్తున్నది ఇప్పటికైతే మారుమూలనున్న నిరుపేద దేశాల్లో గనుక సంపన్న దేశాలు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నాయని, మాటలు చెప్పినంత స్థాయిలో వాటి చేతలు ఉండటం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వ్యాధిని అరికట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడానికి వంద కోట్ల డాలర్లు (సుమారు రూ. 6,000 కోట్లు) అవసరమవుతాయని ఐక్యరాజ్యసమితి వేసిన అంచనాలో ఇంతవరకూ నాలుగో వంతు కూడా సమకూరలేదంటే ఈ ఆరోపణల్లో వాస్తవమున్నదని అనుకోవాల్సి వస్తున్నది. ఒకపక్క ఉగ్రవాదంపై పోరాటమంటూ వేలకోట్ల డాలర్లు మంచినీళ్ల ప్రాయంగా ఖర్చుచేస్తున్న పాశ్చాత్య దేశాలు అంతకు మించి ఎన్నోరెట్లు ప్రమాదకరమైన ఎబోలాను విస్మరించడం ఆందోళనకరం. డబ్ల్యూహెచ్ఓ ‘గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ’గా ప్రకటించిన వ్యాధి విషయంలోనే ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం క్షంతవ్యంకాని నేరం. ప్రపంచీకరణ పెరిగిన ప్రస్తుత తరుణంలో ఏ దేశమూ వ్యాధిబారిన పడకుండా... కనీసం దాని ప్రభావమైనా పడకుండా సురక్షితంగా ఉండే అవకాశం లేదు. వ్యాపారం కోసం, బతుకుదెరువు కోసం ఎంతదూరమైనా, ఎక్కడికైనా వెళ్తున్న ప్రస్తుత తరుణంలో ఎబోలా వ్యాధి విస్తరణకు హద్దులుండవు. భిన్న రంగాలపై అది కలగజేసే ప్రభావమూ ఎక్కువగానే ఉంటుంది. వ్యాధిగ్రస్త దేశాల్లో దేశీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ) క్షీణ దశలో ఉన్నదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ దేశాల్లో ఆర్థిక వనరులన్నీ ఎబోలా వ్యాధి వ్యాప్తిని అరికట్టడానికి కేంద్రీకరించాల్సివస్తున్నది. అంతేకాదు, సామాన్యులు ఈ వ్యాధిబారిన పడటంవల్ల వారు వేతనాలు కోల్పోవడమే కాదు... ఉత్పాదకత మందగిస్తున్నది. కాఫీ, కోకో, పామాయిల్, రబ్బర్ వంటి ఎగుమతులు గణనీయంగా పడిపోయాయి. నిర్మాణ రంగమైతే పూర్తిగా పడకేసింది. పర్యాటకరంగంపైనే ప్రధానంగా ఆధారపడే దేశాలకు ఈ వ్యాధి వ్యాప్తి శాపంలా మారింది. ఇది కేవలం వ్యాధిగ్రస్త దేశాలకు మాత్రమే పరిమితమయ్యే ఇబ్బంది కాదు. ఆ దేశాలతో ఆర్థికబంధం ఉండే దేశాలన్నిటికీ దీని సెగ తగులుతుంది. వ్యాధిని అరికట్టడానికి చురుగ్గా చర్యలు తీసుకోనట్టయితే విపత్కర పరిణామాలు ఏర్పడటం ఖాయమని ప్రపంచబ్యాంకు తాజాగా హెచ్చరిస్తున్నది. ఇంతటి ప్రాణాంతక వ్యాధి విషయంలో సంపన్న దేశాల నిరాసక్తత కేవలం ఆర్థిక సాయం విషయంలో మాత్రమే కాదు...ఇతరత్రా కూడా కనిపిస్తున్నది. 1976లో ఈ వ్యాధి తొలిసారి బయటపడినప్పుడు అమెరికా, కెనడా వంటి దేశాల్లో పరిశోధనలపై దృష్టిపడింది. ఆ రంగంలో కృషిచేసిన శాస్త్రవేత్తలు దశాబ్దంక్రితం ఎబోలాకు ఔషధాన్ని కనుగొన్నామని, దాన్ని వానరాలపై ప్రయోగించి చూశాక అది వంద శాతం వ్యాధి కారక వైరస్‌ను అరికట్టగలదని తేలిందని ప్రకటించారు. కానీ, అటు తర్వాత దానికి సంబంధించి ఎలాంటి ప్రగతీ లేదు. వ్యాధిపై పరిశోధనకయ్యే వ్యయం కంటే మనుషులపై ఔషధాన్ని ప్రయోగించడానికి, అనంతరం దాన్ని ఉత్పత్తి చేయడానికి అనేక రె ట్లు ఎక్కువ ఖర్చవుతుంది. లాభార్జనే ధ్యేయంగా పనిచేసే వ్యాపార సంస్థలు...వ్యాధి ఆచూకీ కనిపించని పరిస్థితుల్లో ఆ ఔషధంపై భారీయెత్తున ఖర్చుచేయడానికి సుముఖంగా ఉండవు. కనుకనే ప్రాణాంతక ఎబోలా తిరిగి తలెత్తిన సమయానికి ఔషధమే లేకుండా పోయింది. మూడు దేశాల్లోనూ ఆ ఔషధాన్ని వ్యాధిగ్రస్తులపై ప్రయోగించి చూడటానికి ఇంకో నెలన్నర సమయం పడుతుందని, అటు తర్వాత వచ్చే ఏడాది జూన్‌కల్లా అందరికీ అందుబాటులోకి తీసుకురావడం సాధ్యమవుతుందని డబ్ల్యూహెచ్ఓ చెబుతున్నది. అయితే, ఈ వ్యాధి విషయంలో కేవలం అల్లోపతి వైద్య విధానంలో మాత్రమేకాక ఇతరత్రా మార్గాల్లో అరికట్టడానికి వీలుంటుందేమో చూడాల్సిన బాధ్యత డబ్ల్యూహెచ్ఓపై ఉన్నది. ఔషధం అందుబాటులోకి రావడానికి ఏడెనిమిది నెలల సమయం పడుతుందని ఆ సంస్థ చెబుతున్నది గనుక ఇది అవసరం. ఎబోలా వ్యాధిని అరికట్టడానికి నిర్దిష్టమైన ఔషధం లేదు గనుక ఆ వ్యాధిగ్రస్తుల్లో కనబడుతున్న భిన్న లక్షణాలకు వేర్వేరు మందులు అందజేస్తున్నారు. ఆ వరసలోనే ఇతరత్రా వైద్య విధానాలను అనుసరించడంలో తప్పేమీలేదు. గతంలో మెదడువాపు వ్యాధి, డెంగ్యూ, చికున్గున్యావంటివి తలెత్తినప్పుడు హోమియో ఔషధాలను ఉపయోగించి మంచి ఫలితాలు రాబట్టిన సందర్భాలున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ కోణం నుంచి ఎందుకు ఆలోచించలేకపోతున్నదో అర్ధంకాని విషయం. ఎబోలా వైరస్‌కంటే దాన్ని అరికట్టడంలో ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యం, ప్రత్యామ్నాయ వ్యూహాలను రూపొందించలేని అశక్తత భయంకరమైనవి. ముందు వీటినుంచి విముక్తి సాధిస్తేనే ప్రాణాంతక ఎబోలావంటివి పలాయనం చిత్తగిస్తాయి. -
ఎనర్జీ డ్రింకులు..శక్తిని హరించి వేస్తున్నాయ్..!
‘ఎనర్జీ డ్రింకులు ఉన్నఫళంగా మీకు ఎనలేని ఓపికను, శక్తిని ఇస్తాయనేది ఒట్టిమాటే.. అవి మీకు సహజసిద్ధంగా ఉన్న శక్తిని కూడా హరించి వేస్తాయి’ అంటున్నారు హెల్త్ ఫుడ్ మ్యానుఫాక్చరర్స్ (హెచ్ఎఫ్ఎమ్ఏ) వారు. యూరప్‌కు చెందిన ఈ సంస్థ పరిశోధకులు మార్కెట్లో లభ్యమవుతున్న వివిధ ఎనర్జీ డ్రింకులు, వాటిలోని పదార్థాల గురించి పరిశీలించి ఈ విషయాన్ని తేల్చారు. ఎనర్జీ డ్రింకుల్లోని కంటెంట్‌ను బట్టి అవి శక్తిని ఇవ్వడం మాట ఎలా ఉన్నా... మనిషిని నిస్తేజపరచడం మాత్రం ఖాయమని వారు పేర్కొన్నారు. దీనికి సంబంధించి శాస్త్రీయమైన వివరణ కూడా ఇచ్చారు. ఒక మనిషి శారీరక అవసరాలకు రోజుకు 50 గ్రాముల చక్కెర సరిపోతుందని ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్‌వో) గణాంకాలు చెబుతాయి. అయితే ఒక ఎనర్జీ డ్రింక్‌లోనే దాదాపు 52 గ్రాముల చక్కెర ఉంటుంది! యుక్తవయసులోని మనిషికి రోజుకు 400 మిల్లీగ్రాముల కెఫీన్ తీసుకోవడమే ఎక్కువ. 500 మిల్లీగ్రాముల ఎనర్జీ డ్రింక్ క్యాన్‌లో దాదాపు 160 ఎమ్జీ కెఫిన్ ఉంటుంది. యూనివర్సిటీ ఆఫ్ మిషిగాన్ పరిశోధనల ప్రకారం ఎనర్జీ డ్రింకులకు అలవాటుపడ్డ యువత తదుపరి దశలో ఆల్కహాల్‌పై ఆసక్తిచూపే అవకాశం ఉందని తేలింది. ఎనర్జీ డ్రింకులు యువతను ఆవిధంగా ప్రేరేపిస్తాయని ఆ వర్సిటీ అధ్యయనకర్తలు పేర్కొన్నారు. ఎనర్జీ డ్రింకులను అతిగా సేవించడం వల్ల శరీరంలో ఐరన్ లోపం సంభవిస్తుంది. ఐరన్‌లోపం వల్ల మనిషి చాలా త్వరగా అలసి పోవడంతో పాటు రకరకాల దుష్పరిణామాలు ఉంటాయి. ఇవీ... ఎనర్జీ డ్రింకులను తీసుకోవడం వల్ల శరీరంపై పడే ప్రభావాలు. వీటిని బట్టి చూసుకొంటే ఎనర్జీ డ్రింకులు సేవించడం వల్ల ఎంత నష్టం జరుగుతుందో సులభంగా అర్థం అవుతుంది. -
ఎబోలాతో ఉత్తరాఫ్రికా ఆర్థిక వ్యవస్థ కుదేలు
మొన్రోవియా(లైబీరియా): ఉత్తరాఫ్రికాను వణికిస్తున్న ప్రాణాంతక అంటువ్యాధి ఎబోలా అక్కడి లైబీరియా, సియోర్రాలిన్, గినియా తదితర దేశాల ఆర్థిక వ్యవస్థలనూ తీవ్రంగా దెబ్బతీస్తోంది. చెమట, రక్తం తదితర శరీర ద్రవాల ద్వారా వ్యాపించే ఈ వ్యాధి కార్మికులకు సోకుతుందనే భయంతో పలు కంపెనీలను మూసేస్తున్నారు. గనులు కూడా మూతపడుతున్నాయి. కూలీలు పొలాలకు వెళ్లకపోవడంతో పంటలు పొలాల్లోనే నాశనమవుతున్నాయి. కాగా, సియెర్రా లియోన్‌లోని ఒక బ్రిటిష్ ఆరోగ్య కార్యకర్తకు, ప్రపంచ ఆరోగ్య సంస్థ వైద్యనిపుణుడికి ఎబోలా సోకింది. -
ఎబోలా మృతులు 1,229
జెనీవా: పశ్చిమాఫ్రికాలోని గినియా, లైబీరియా, సియార్రా లియోన్, నైజీరియా దేశాల్లో ప్రబలిన భయానకమైన ఎబోలా వైరస్ కారణంగా మరణించినవారి సంఖ్య 1,229కి చేరినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ మంగళవారం తెలిపింది. ఈనెల 14, 16 తేదీల మధ్యనే 84 మంది ఎబోలాతో మరణించారని పేర్కొంది. గత ఏడాది డిసెంబర్నుంచి ఇప్పటివరకూ 2,240 కేసులు నమోదయ్యాయని, పశ్చిమాఫ్రికాలోని గినియా లో తొలుత మొదలైన ఎబోలా వైరస్ మిగతా దేశాలకు వ్యాపించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరించింది. ఎబోలాతో అస్వస్థులైనవారిని ప్రత్యేక ఏర్పాట్లతో ఆసుపత్రుల్లో చేర్చారు, వారి ప్రయాణాలపై కఠినమైన ఆంక్షలు విధించారు. కాగా, ఎబోలాతో దెబ్బతిన్న ప్రాంతాల్లో పదిలక్షలమంది బాధితులకు 3నెలలపాటు ఆహార పంపిణీకోసం సన్నాహాలు చేస్తున్నట్టు ఐరాస తెలిపింది. -
‘ఎబోలా’ తగ్గేలా లేదు: డబ్ల్యూహెచ్‌వో
న్యూయార్క్: పశ్చిమ ఆఫ్రికాలో దాదాపు 10 లక్షల మందిపై ప్రభావం చూపుతున్న ప్రాణాంతక ఎబోలా వైరస్ ఇప్పట్లో తగ్గేలా కనిపించట్లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆందోళన వ్యక్తం చేసింది. దీనికి అడ్డుకట్ట వేయకపోతే ఇదో మానవ సంక్షోభంగా మారే ప్రమాదముందని హెచ్చరించింది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అసాధారణ చర్యలు అవసరమని పేర్కొంది. మరోవైపు ఈ వైరస్‌కు పరిశోధనల స్థాయిలో ఉన్న జెడ్-మ్యాప్ అనే ఔషధం శాంపిల్ డోస్‌లను అమెరికాకు చెందిన ఓ కంపెనీ లైబీరియాకు పంపినట్లు మీడియా పేర్కొంది. -
ఉప్పు.. ఉసురు తీస్తోంది!
ఉప్పు అధికంగా వాడటం వల్లే ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు 16 లక్షల మంది గుండెజబ్బుల బారిన పడి చనిపోతున్నారట. ఒక్కొక్కరు రోజుకు 2 గ్రాములుకంటే ఎక్కువ ఉప్పు వాడొద్దంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంతకుముందే సిఫారసు చేసింది. అయితే ఇంతకుమించి ఎక్కువ ఉప్పు వాడితే కలిగే ప్రభావాలపై 187 దేశాల్లో అధ్యయనం చేసిన టఫ్ట్స్ యూనివర్సిటీ పరిశోధకులు ఏకంగా లక్షలాది మంది రక్తపోటు బారినపడుతున్నారని, తద్వారా గుండెజబ్బుల ప్రమాదం పెరిగి మరణిస్తున్నారని వెల్లడించారు. గుండెజబ్బుతో చనిపోతున్న ప్రతి 10 మందిలో ఒకరి మరణానికి పరోక్షంగా ఉప్పే కారణమని, అందువల్ల దీని విషయంలో అతి జాగ్రత్తగా కాకుండా.. కాస్త జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. -
రక్తదానం = ప్రాణదానం
జూన్ 14పపంచ రక్తదాతల దినం రక్తం శరీరంలోని ప్రతి కణంతో అనుక్షణం అనుసంధానమై ఉండే కీలక అంశం. ఓ వ్యక్తి జీవంతో మనుగడ సాగించాలంటే కావాల్సిన అత్యంత ప్రధానమైన ద్రవం. ఒక కణంలోని జీవక్రియలన్నీ సక్రమంగా సాగడానికి అవసరమైన ఆక్సిజన్‌నూ, ఆహారాన్ని, పోషకాలనూ అందించే వాహకం. అలాగే జీవక్రియల తర్వాత అక్కడ వెలువడిన వ్యర్థాలను తిరిగి మోసుకుని, వాటిని శుభ్రపరిచే యంత్రాంగాల వద్దకు చేరవేసే మాధ్యం. శరీరంలోని ఏ చిన్న కణానికైనా దాని సరఫరా ఆగిపోతే... ఇక ఆ కణం క్రమంగా చచ్చిపోతుంది. అది మామూలు చిన్న కణమైనా... లేదా అత్యంత కీలకమైన గుండె కండరమైనా సరే. అందుకే ఇంతటి ప్రధానమైన, కీలకమైన, అవసరమైన ఆ ఎర్రటి ద్రవం... నిత్యం ఒక క్రమపద్ధతిలో మన రక్తనాళాల్లో పారుతూ జీవాన్ని పండిస్తూ ఉంటుంది. ఎవరికైనా ఏదైనా కొద్దిపాటి ప్రమాదం జరిగినప్పుడు రక్తం వృథా పోకుండా ఆపేసుకోడానికి శరీరానికి ఒక స్వయం నియంత్రిత యంత్రాంగం ఉంటుంది. కానీ పెద్ద ప్రమాదం జరిగి అదే పనిగా రక్తం ప్రవహిస్తూ పోతుంటే... దాన్ని భర్తీ చేయడం అవసరం. అలా భర్తీ చేసేందుకు దాతలు రక్తాన్ని ఇవ్వడమూ అవసరం. అలా భర్తీ చేయాల్సిన ప్రాధాన్యాన్ని వివరించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆధ్వర్యంలో ప్రతి ఏడాదీ జూన్ 14ను ‘స్వచ్ఛంద రక్తదాతల దినం’ గా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది నినాదం తల్లుల కోసం... ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రక్తదాతల దినాన ప్రతి ఏడాదీ ఆ సంస్థ ఒక నినాదం లాంటి అంశంతో ప్రపంచ ప్రజలకు ఒక పిలుపునూ, సందేశాన్ని అందిస్తుంటుంది. ఈ ఏడాది నినాదం ‘‘తల్లుల ప్రాణరక్షణ కోసం సురక్షితమైన రక్తం’’ (సేఫ్ బ్లడ్ ఫర్ సేవింగ్ మదర్స్). ప్రసవం ఒక అద్భుతమైన ప్రక్రియ. మరో జీవికి ప్రాణాన్నిచ్చే ఈ సమయంలో కాబోయే తల్లి అనివార్యంగా ఎంతో కొంత రక్తాన్ని చిందిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఇలా రక్తస్రావం కారణంగా ప్రసవించే తల్లులు 800 మంది తమ ప్రాణాలు కోల్పోతున్నారని అంచనా. మరికొందరు ఇలాంటి తీవ్రమైన రక్తస్రావం వల్ల దీర్ఘకాలిక వైకల్యాలతో జబ్బులతో బాధపడుతున్నారు. ఈ మరణాలనూ, ఇలాంటి ప్రమాదాలను తగ్గించే ఉద్దేశంతో ఈ ఏడాది డబ్ల్యూహెచ్ఓ ఈ థీమ్‌తో ముందుకు వచ్చింది. ఈ నినాదాన్ని అన్ని దిశలా వ్యాపింపజేసి ప్రజలను చైతన్యపరచి కాబోయే తల్లులకు సురక్షితమైన రక్తం అందేలా ప్రజలందరిలోనూ అవగాహన పెంచడమే డబ్ల్యూహెచ్ఓ లక్ష్యం. గాయపడినప్పుడు రక్తస్రావం ఆగడానికి ఏం జరుగుతుంది? శరీరంలోని ఏ భాగంలోనైనా రక్తనాళం తెగి రక్తస్రావం జరుగుతుంటే వెంటనే ప్లేట్లెట్స్ అనే ప్రత్యేక కణాలు రక్తాన్ని గడ్డకట్టించే దిశగా తమ బాధ్యతలను ముమ్మరం చేస్తాయి. ఇవి... రక్తాన్ని గడ్డకట్టించడానికి ఉపయోగపడే మరికొన్ని ప్రోటీన్ల సహాయంతో గాయం అయిన ప్రదేశంలో ఒక వలలాంటి దాన్ని అల్లడానికి ఉపక్రమిస్తాయి. రక్తంలోని ప్రోథ్రాంబిన్ అనే పదార్థం ఇతర గడ్డకట్టించే అంశాల (క్లాటింగ్ ఫ్యాక్టర్ల)తో పాటు క్యాల్షియం ఆయాన్లూ, ఫాస్ఫోలైపిడ్స్ అనే కొవ్వు పదార్థాలతో కలిసి థ్రాంబిన్ అనే పదార్థంగా రూపొందుతుంది. అది రక్తంలోని గడ్డ కట్టించే పదమూడు ఫ్యాక్టర్లలో కలిసి ఫైబ్రినోజెన్గానూ, చివరకు ఫైబ్రిన్గానూ మారుతుంది. ఈ ఫైబ్రిన్ అనే పదార్థం పొరలు పొరలుగా ఉంటుంది. ఈ పొరలన్నీ వలలాగా రూపొంది రక్తాన్ని గడ్డలా మారేలా చేస్తాయి. దాంతో ద్రవరూపంలో ఉండే రక్తం కాస్తా ఘనరూపంలోకి మారిపోవడంతో స్రవించడం ఆగిపోతుంది. ఈ ప్రక్రియనే క్లాటింగ్ లేదా రక్తం గడ్డకట్టడం అంటారు. దెబ్బ తగిలి రక్తస్రావం జరుగుతున్నప్పుడు జీవి మనుగడ సాగించేందుకు ప్రకృతి చేసిన ఏర్పాటిది. ఈ ఏర్పాటు వల్ల రక్తం వృథా పోకుండా ఆగుతుంది. దాంతో ప్రాణాలు నిలబడతాయి. ఏదైనా కారణాలతో ఏ దశలోనైనా లోపాల వల్ల ఈ మొత్తం రక్తం గడ్డ కట్టే ప్రక్రియలో ఎక్కడ అవాంతరం వచ్చినా ‘క్లాటింగ్’ ప్రక్రియ సరిగా జరగక ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉంది. ఒకవేళ ఈ క్లాటింగ్ పని జరిగే సరికే శరీరానికి అవసరమైన దానికంటే రక్తం పరిమాణం తగ్గితే ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉంది. అందుకే రక్తస్రావం అయిన సందర్భాల్లో బయటి నుంచి దాతలు ఇచ్చిన రక్తాన్ని ఎక్కిస్తారు. డిమాండుకు సరిపోయే రక్తం ఉందా...? ఒక్కోసారి ప్రత్యేకమైన సందర్భాల్లో మన వద్ద ప్రజలు చాలా మానవీయంగా వ్యవహరిస్తారు. ఉదాహరణకు గత ఏడాది హైదరాబాద్‌లోని దిల్సుఖ్నగర్ పేలుళ్ల సమయంలో క్షతగాత్రులకు రక్తం అవసరమవుతుందని భావించి, స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరివిగా రక్తదానం చేశారు. ఒక దశలో రోగులకు సరిపోయే రక్తం కంటే ఎక్కువగానే సేకరణ జరిగిందనీ, దాతలు ఇక దశలవారీగా రావాలంటూ బ్లడ్‌బ్యాంకులు పేర్కొన్నాయి. అంటే ఆ దశలో మానవీయత వెల్లివిరిసిన కారణంగా రక్త సేకరణ ఎక్కువగా జరిగిందన్నమాట. కానీ చాలా సందర్భాల్లో అవసరమైనంత రక్తం ఉండదు. అంటే డిమాండ్‌కంటే సప్లై చాలా తక్కువగా ఉంటుందన్నమాట. అందుకే ఏదైనా ఒక ఆఫీసు నుంచి గానీ లేదా ప్రత్యేకమైన సందర్భాన్ని పురస్కరించుకుని ఒక కార్యాలయంలోని ఔత్సాహికులుగానీ రక్తాన్ని దానం చేయదలచుకుంటే అందరూ ఒకేసారి రక్తదానం చేయడం కంటే... దశల వారీగా రోజుకు కొంతమంది చొప్పున రక్తదానం చేస్తుండటం మంచిది. దీనివల్ల రక్త సరఫరా మరీ ఎక్కువగా కాకుండానూ, మరీ తగ్గకుండానూ ఉంటుందన్నమాట. మన వద్ద ఆసుపత్రి పడకల సామర్థ్యం (బెడ్ స్ట్రెంగ్త్) ఆధారంగా కూడా రక్తం డిమాండ్‌ను లెక్కవేస్తారు. అంటే ఒక ఆసుపత్రిలోని ఒక్కో పడకకు కనీసం 7 యూనిట్ల రక్తం అవసరమని అంచనా. అయినా ఇప్పటికి దొరుకుతున్నది కేవలం 75 శాతమే. రోడ్డు ప్రమాదాలు, ఇతరత్రా కేసుల్లో 70% మరణాలు కేవలం రక్తం అందకపోవడం వల్లనే సంభవిస్తున్నాయి. మొన్నమొన్నటి వరకూ రక్తం ధర యూనిట్‌కి కేవలం రూ. 850 ఉండేది. కానీ ఇటీవల అది దాదాపు రెట్టింపు అయింది. కొన్ని సమయాల్లో కొన్ని ప్రైవేటు సంస్థలు... డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడుగానీ, ఎదుటివారి అవసరాన్ని ఆసరా చేసుకొని అక్రమంగా వేలకు వేలు కూడా వసూలు చేస్తున్న సందర్భాలు లేకపోలేదు. అందుకే ప్రభుత్వ బ్లడ్‌బ్యాంకులు, మంచి పేరున్న స్వచ్ఛంద సంస్థలకు చెందిన రక్తనిధులకు, అందునా రక్తాన్ని వేర్వేరు కాంపోనెంట్లుగా విడదీయగల సామర్థ్యం ఉన్న రక్తనిధి కేంద్రాలకు (బ్లడ్ బ్యాంకులకు) రక్తదానం చేయాలన్నది నిపుణుల సూచన. ఇలాంటి దాతలు రావాలి ముందుకు... రక్తదాతలు రకరకాలు. డబ్బు కోసం రక్తం దానం చేసేవాళ్లు. వీళ్లు ప్రొఫెషనల్ డోనార్స్. తమ కుటుంబ సభ్యుల్లో ఎవరికో జబ్బు చేయడంతో రక్తం అవసరమవుతుంది. అలాంటప్పుడు తప్పనిసరిగా రక్తం దానం చేసి తమకు అవసరమైన గ్రూపు రక్తాన్ని పొందేవారు. వీరిని డిస్ట్రెస్ డోనార్స్ అంటారు. మన సమాజంలో ఇప్పుడు అవసరం కోసమే రక్తదానం చేసే డిస్ట్రెస్ డోనార్సే ఎక్కువ. అవసరం లేకపోయినా సమాజంపై ఆపేక్షతో ఏ ప్రతిఫలాన్నీ ఆశించకుండా స్వచ్ఛందంగా రక్తదానం చేసేవారిని వాలంటరీ డోనార్స్ అంటారు. వీళ్ల సంఖ్య బాగా తక్కువ. ఆరోగ్యకరమైన రక్తం కోసం ఇలాంటి వాళ్ల సంఖ్యను పెంపొందించేందుకు ఉద్దేశించిందే... జూన్ 14న జరుపుకొనే ఈ ప్రపంచ రక్తదాతల దినోత్సవం. ఎన్నెన్నో అపోహలు రక్తదానం పట్ల ప్రజల్లో ఎన్నెన్నో అపోహలు ఉన్నాయి. రక్తదానం చేస్తే మనిషి బలహీనమైపోతాడన్నది ప్రధానమైన అపోహ. ఇది ఏ మాత్రం నిజం కాదు. వాస్తవానికి ఓ వ్యక్తిలో 5 నుంచి 6 లీటర్ల రక్తం ఉంటుంది. అందులో ఆరోగ్యకరమైన వ్యక్తి నుంచి కేవలం 350 మి.లీ. రక్తం మాత్రమే సేకరిస్తారు. ఇది కేవలం 21 రోజుల్లో పూర్తిగా భర్తీ అవుతుంది. అయినాగానీ ముందుజాగ్రత్త చర్యగా ఓసారి ఓ వ్యక్తి నుంచి రక్తం సేకరిస్తే మరో మూడు నెలల పాటు అతడి నుంచి రక్తం సేకరించరు. అంటే... ఆరోగ్యరకమైన వ్యక్తి ప్రతి 90 రోజులకు ఓ మారు రక్తదానం చేయవచ్చు. వయస్సు 18-60 ఏళ్ల మధ్యనున్న ఆరోగ్యకరమైన వ్యక్తి ఎవరైనా రక్తం ఇవ్వవచ్చు. దీంతో ఎలాంటి బలహీనతా రాదు. ఇప్పుడు కొన్ని అధునాతన ఆసుపత్రుల్లో కేవలం రోగులకు అసవరమైన ప్లేట్లెట్స్ మాత్రమే సేకరిస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో రక్తాన్ని నష్టపోవడమనేది అసలే ఉండదు. ఇలాంటప్పుడు కేవలం మూడు రోజుల వ్యవధిలోనే మరోమారు ప్లేట్లెట్స్ దానం చేయవచ్చు. అంటే కాంపోనెంట్లుగా రక్తాన్ని దానం చేయగల సందర్భాల్లో ఒక వ్యక్తి రక్తదానం చేశాక మళ్లీ మూడు నెలలు ఆగనవసరం లేదు. ఒకవేళ అతడు ప్లేట్లెట్లను మాత్రమే దానం చేస్తే... మళ్లీ నాలుగో రోజు తర్వాత మరోమారు ప్లేట్లెట్స్ దానం చేయగల సామర్థ్యాన్ని సంతరించుకుని, మరో ప్రాణాన్ని కాపాడటానికి అర్హుడవుతాడు. అందుకే రక్తాన్ని కాంపోనెంట్లుగా సేకరించగల చోటే దానం చేయడం చాలామంది ప్రాణాలను కాపాడుతుందని గుర్తుంచుకోండి. ఇవీ రక్షణ చర్యలు రాష్ట్రంలోని బ్లడ్ బ్యాంకులను తరచూ సందర్శించి అక్కడి కోల్డ్ చైన్ పరిస్థితులను పర్యవేక్షిస్తారు. రక్తాన్ని 2 డిగ్రీల నుంచి 8 డిగ్రీల టెంపరేచర్ వద్ద సంరక్షించాలి. రక్తనిధుల్లో ఆ ఉష్ణోగ్రతను కొనసాగిస్తున్నారో లేదో పరీక్షిస్తారు. ఓసారి సేకరించిన రక్తం కేవలం 35 రోజులు మాత్రమే నిల్వ ఉంటుంది. ఆ కాలపరిమితి దాటిన రక్తాన్ని రోగికి అందకుండా తనిఖీలు నిర్వహిస్తుంటారు. కాంపోనెంట్లు... వాటి ఉపయోగాలు... ఎర్రగా ఒకేలా (హోమోజీనియస్‌గా) కనిపించే రక్తంలో అనేక అంశాలు (కాంపోనెంట్లు) ఉంటాయి. అందులో ప్రధానమైనవి... ప్లాస్మా, ఎర్రరక్తకణాలు, తెల్లరక్తకణాలు, ప్లేట్లెట్లు... మొదలైనవి. ఈ కాంపోనెంట్లన్నీ వేర్వేరు విధులను నిర్వహిస్తుంటాయి. ఉదాహరణకు ఒక ఆరోగ్యకరమైన వ్యక్తిలో దాదాపు ఐదు లీటర్ల రక్తం ఉంటే... అందులో రెండున్నర లీటర్లు నీళ్లే. అంటే యాభై శాతం నీరేనన్నమాట. ఇక మిగతా దాంట్లో ప్రధానమైన అంశం (కాంపోనెంట్) ప్లాస్మాయే. దానితో పాటు ఎర్రరక్తకణాలు (ఆర్బీసీ), తెల్లరక్తకణాలు (డబ్ల్యూబీసీ), ప్లేట్లెట్స్ ఉంటాయి. ఆ వేర్వేరు కాంపోనెంట్లలో ఉండే పదార్థాలు, విధుల తీరుతెన్నులివే... ప్లాస్మా: ఇందులో లవణాలు, ప్రోటీన్లు, ఇమ్యూనో గ్లోబ్యులిన్లు ఉంటాయి. ఎర్ర రక్తకణాలు : వీటిలో రక్తాన్ని ఎర్రగా కనిపించేలా చేసే రంగు పదార్థమైన హిమోగ్లోబిన్ ఉంటుంది. అన్ని జీవకణాలకూ ఆక్సిజన్‌ను చేరవేసేందుకు వాహకంగా పనిచేసేది ఈ ఎర్రరక్తకణమే. దాంతో పాటు జీవకణాల్లో వెలువడే వ్యర్థాలు, కాలుష్యాలను బయటకు చేరవేసేది కూడా ఆర్బీసీనే. తెల్ల రక్తకణాలు : మన శరీరాన్ని బయటి నుంచి దాడి చేసే అనేక సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియా, వైరస్ల నుంచి కాపాడే రక్షణ కణాలు ఈ తెల్ల రక్తకణాలే. ఇందులో మళ్లీ ఐదు రకాల కణాలుంటాయి. అవి... న్యూట్రోఫిల్స్ : ఇవి శరీరాన్ని బ్యాక్టీరియా, ఫంగైల నుంచి రక్షిస్తాయి. లింఫోసైట్స్ : ఇవి కొన్ని రకాల వైరస్ల నుంచి, క్యాన్సర్ల నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. మోనోసైట్స్ : చెడిపోయిన కణాలను నిర్మూలించి, ఇన్ఫెక్షన్ కలిగించే సూక్ష్మజీవుల నుంచి ఇవి మన శరీరాన్ని కాపాడతాయి. ఇజినోఫిల్స్ : కొన్ని రకాల పరాన్న జీవుల నుంచి, కొన్ని రకాల క్యాన్సర్ల నుంచి మన శరీరానికి రక్షణ కల్పిస్తాయి. బేసోఫిల్స్ : ఇవి అలర్జీల నుంచి రక్షణ కలిగిస్తాయి. ప్లేట్లెట్స్ : శరీరానికి ఏదైనా గాయం తగిలి, రక్తస్రావం జరుగుతుంటే ఆ సమయంలో రక్తం గడ్డకట్టి, ప్రాణరక్షణ జరిగేలా పనిచేసే కణాలే ఈ ప్లేట్లెట్స్. ఇవి లోపిస్తే అంతర్గత రక్తస్రావం జరగవచ్చు. లేదా గాయం తగిలినప్పుడు ఎంతకీ రక్తం గడ్డకట్టక అలా రక్తస్రావం జరుగుతూ పోయి ప్రాణాపాయం కలగవచ్చు. ఇలా రక్తాన్ని గడ్డకట్టించడం ద్వారా ప్రాణరక్షణ కలిగించే కీలకమైన కణాలే ఈ ప్లేట్లెట్స్. ఒక దానం... మూడు ప్రాణాలు... రక్తదాతల్లో ఒక అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చే రక్తదాతలు తాము రక్తదానం చేసే చోట అడగాల్సిన ప్రశ్న ఒకటుంది. అదే... ‘రక్తాన్ని వివిధ కాంపోనెంట్లుగా (అంశాలుగా) విడదీసే సౌకర్యం మీ బ్లడ్ బ్యాంకులో ఉందా?’’ అని. రక్తదానాన్ని స్వీకరించే చాలా సంస్థలు ఒక దాత నుంచి స్వీకరించే రక్తాన్ని ‘హోల్ బ్లడ్’ అంటారు. అయితే రక్తంలో ప్లాస్మా, ప్లేట్లెట్లు, తెల్ల, ఎర్ర రక్తకణాలు కలసిన ద్రవం... ఇలా చాలా రకాల అంశాలుంటాయి. ఒక హోల్‌బ్లడ్‌ను కనీసం మూడు రకాల కాంపోనెంట్లుగా విడదీయవచ్చు. అప్పుడు ఒకరి రక్తమే కనీసం ముగ్గురి ప్రాణాలు కాపాడుతుంది. ఇంకా మరిన్ని కాంపోనెంట్లుగా విడదీయగల సౌకర్యం ఉంటే ఒకే రక్తం పలువురి ప్రాణాలు కాపాడుతుందన్నమాట! రక్తం ప్రధాన విధులివే! ఆహారం జీర్ణమై అది గ్లూకోజ్‌గా మారాక అన్ని కణాలకూ ఆ ఆహారాన్ని అందించడానికి రక్తం తోడ్పడుతుంది. గ్లూకోజ్‌తో పాటు అమైనోయాసిడ్స్, ఫ్యాటీ యాసిడ్స్నూ కణాలన్నింటికీ అందజేస్తుంది. రక్తం అందజేసిన గ్లూకోజ్తోనే కణాలు తమలో శక్తిని ఉద్భవింపజేసుకునే జీవక్రియలు జరుగుతాయి. దీన్నే మెటబాలిజమ్ అంటారు. ఈ క్రమంలో కార్బన్-డై-ఆక్సైడ్, యూరియా, ల్యాక్టిక్ యాసిడ్ వంటి కొన్ని కాలుష్యాలు, వ్యర్థాలు ఉత్పత్తి అవుతాయి. వాటిని శుభ్రపరిచేందుకు ఉద్దేశించిన మూత్రపిండాల వంటి అవయవాల వద్దకు ఆ వ్యర్థాలను చేరవేసే కార్యక్రమం కూడా రక్తమే చేస్తుంది. రక్తంలోని తెల్లరక్తకణాలు బయటి నుంచి శరీరంలోకి ప్రవేశించే రోగకారక క్రిములతో పోరాడి, మనకు వ్యాధినిరోధకతను కల్పిస్తాయి. ఇంతటి కీలకమైన కార్యకలాపాలన్నీ అనునిత్యం జరగాల్సి ఉంటుంది కాబట్టే... ఏదైనా ప్రమాదం జరిగి రక్తస్రావం అవుతుంటే, దాన్ని అరికట్టడానికి మన శరీరం కృషి చేస్తుంది. అలా రక్తస్రావం మొదలు కాగానే రక్తం చుట్టూ ఒక వల లాంటిది ఏర్పడి రక్తం గడ్డకట్టి, స్రావాన్ని ఆపే పని సమర్థంగా జరుగుతుంది. కాంపోనెంట్లుగా విడదీసిన రక్తంతో ప్రయోజనాలెన్నో! ఒక వ్యక్తి నుంచి మొత్తం రక్తాన్ని (హోల్ బ్లడ్‌ను) సేకరించి ఏదైనా ప్రమాదం జరిగిన వ్యక్తికి పూర్తి రక్తాన్ని ఎక్కిస్తే... అతడికి అవసరం లేని కాంపోనెంట్స్ కూడా అతడి శరీరంలోకి వెళ్లి వృథా అయిపోతాయి. కానీ... ఏ అంశం లోపించిందో నిర్దిష్టంగా రక్తంలోని అదే అంశాన్ని (అదే కాంపోనెంట్‌ను) ఎక్కించే ఆధునిక వసతి సదుపాయాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు... అగ్నిప్రమాదానికి లోనైన ఒక వ్యక్తికి పూర్తి రక్తం కంటే ప్లాస్మా ఎక్కువగా అవసరం. ఇక రక్తహీనత ఎక్కువగా ఉన్న వ్యక్తికి పూర్తి రక్తం కంటే పాకెట్ ఆర్బీసీ ఎక్కువగా అవసరం. అలాగే డెంగ్యూ లాంటి వ్యాధి సోకి ప్లేట్లెట్ల సంఖ్య బాగా తగ్గిన వారికి కేవలం ప్లేట్లెట్లు ఎక్కిస్తే చాలు. ఇలా... రక్తాన్ని వేర్వేరు కాంపోనెంట్లుగా విడదీయగల సామర్థ్యం ఉన్న బ్లడ్‌బ్యాంకుల్లో రక్తదానం చేస్తే అప్పుడు ఒకరి నుంచి సేకరించిన హోల్‌బ్లడ్‌ను వివిధ అవసరాలు ఉన్న రోగులకు ఎక్కించి ఒకరికంటే ఎక్కువ మందికి ఒకే రక్తం ఉపయోగపడేలా చేయవచ్చు. అందుకే రక్తదానం చేయదలచిన దాతలు నేరుగా ఏదైనా బ్లడ్‌బ్యాంకుకు వెళ్లడం కంటే.... రక్తాన్ని వివిధ కాంపోనెంట్లుగా విడదీయగల సామర్థ్యం ఉన్న బ్లడ్‌బ్యాంకులో రక్తదానం చేయడం చాలా మంచిది. సేకరణ ఎక్కడెక్కడ...? దాతల నుంచి రక్తం సేకరణ అన్న ప్రధానమైన కార్యక్రమాన్ని ప్రభుత్వ, వైద్యవిధాన పరిషత్, జిల్లా ఆసుపత్రులు, ఇండియన్ రెడ్‌క్రాస్ సంస్థ (ఐఆర్సీఎస్), లయన్, రోటరీ వంటి సంస్థలు, కొన్ని స్వచ్ఛంద సంస్థలకు చెందిన బ్లడ్‌బ్యాంకులు చేస్తుంటాయి. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వ, ప్రైవేటు, స్వచ్ఛంద సంస్థలవి (2012 నాటి లెక్కల ప్రకారం) 244 కు పైగా బ్లడ్‌బ్యాంకులున్నాయి. రక్తంలోని ఎర్రరక్తకణాలు, తెల్లరక్తకణాలు, ప్లాస్మా, ప్లేట్లెట్స్ వంటి అంశాలను వేర్వేరుగా విడదీసే ‘కాంపోనెంట్ సపరేషన్ యూనిట్లు’ కూడా చాలానే ఉన్నాయి. అయితే ఇలా రక్తంలోని కాంపోనెంట్లను వేటికవి విడదీసే వాటికంటే మొత్తం రక్తాన్ని సేకరించే బ్లడ్‌బ్యాంకులే ఎక్కువ. వాళ్లతోనే ప్రమాదం... రక్తదానంపై సమాజంలో పెద్దగా అవగాహన లేనందున కొందరు దీన్నే వృత్తిగా పెట్టుకుని డబ్బు కోసం రక్తదానం చేస్తుంటారు. వీళ్ల వల్ల కలుషిత రక్తం, వ్యాధులు వ్యాపించి ఉన్న రక్తం, అనారోగ్యకరమైన రక్తం సేకరణ అయ్యేందుకు అవకాశాలు ఎక్కువ. అందుకే ప్రొఫెషనల్ రక్తదాతలను ప్రోత్సహించకూడదు. స్వచ్ఛందంగా సమష్టి ప్రయత్నం రక్తదానం చేయాలనుకున్న వారు మంచి పేరున్న బ్లడ్‌బ్యాంకులు, కాంపోనెంట్లుగా రక్తాన్ని విడదీయగల సౌకర్యాలున ఉన్న రక్తనిధి కేంద్రాల్లో రక్తదానం చేయాలన్నది నిపుణుల మాట. అలాగే లాభాపేక్ష లేకుండా మరో సంస్థ కూడా రక్తదానాన్ని ప్రోత్సహించడానికి ముందుకు వచ్చింది. ఇది ఫ్రెండ్స్, సన్నిహితులు, సహచరులు, బంధువులూ వీళ్లందరినీ రక్తదానానికి ప్రోత్సహిస్తుంది. ఆ సంస్థ పేరే... ‘ఫ్రెండ్స్ టు సపోర్ట్’. దీని వివరాల కోసం www.friendstosupport.org వెబ్‌సైట్‌ను సందర్శించండి. చివరగా... రక్తదానం చేయడం అంటే... మనం ఏమీ కోల్పోకుండానే ఇతరులకు ప్రాణదానం చేయడం అన్నమాట. మనం ఇచ్చిన రక్తం కొద్ది వ్యవధిలోనే భర్తీ అవుతుంది కాబట్టి మనం ప్రత్యేకంగా కోల్పోయేది ఏదీ ఉండదు. ఇక మనం ఏమీ పోగొట్టుకోకుండానే ప్రాణదానం చేస్తున్నామంటే అంతకంటే కావాల్సిందేముంది. అందుకే ఈ ‘బ్లడ్ డోనార్స్ డే’ సందర్భంగా రక్తదానం చేసేందుకు ముందుకు రండి. క్షతగాత్రులూ! రక్తం అవసరమైన ఎందరో రోగుల ప్రాణాలను కాపాడండి. - నిర్వహణ: యాసీన్ - మంజులారెడ్డి 1- ప్రమాద సమయంలో (ట్రామా కేసుల్లో) రోగికి అత్యవసరంగా అవసరమయ్యేది రక్తమే. కాబట్టి రక్తదానం చేస్తే బలహీనతలు కలుగుతాయేమో వంటి అర్థం లేని అపోహలు వీడి నిర్భయంగా రక్తదానం చేయండి. 2- ఏదైనా సంస్థ నుంచి రక్తదానం చేయదలచినప్పుడు అందరూ ఒకేసారి కాకుండా రోజుకు కొందరు చొప్పున వంతుల వారీగా చేయడం రక్తం వృథా కావడాన్ని నివారిస్తుంది. 3- ఈసారి డబ్ల్యూహెచ్ఓ సందేశం - కాబోయే తల్లి రక్షణ కోసం రక్తదానం. అంటే... మీరందించే సహాయం కేవలం తల్లికే కాదు... పరోక్షంగా బిడ్డకూ దక్కుతుందన్న విషయం గుర్తుంచుకోండి.