స్వైన్‌ఫ్లూపై భయం వద్దు | No need to afraid about swine flu | Sakshi
Sakshi News home page

స్వైన్‌ఫ్లూపై భయం వద్దు

Published Thu, Jan 8 2015 4:16 AM | Last Updated on Sat, Sep 2 2017 7:21 PM

స్వైన్‌ఫ్లూపై భయం వద్దు

స్వైన్‌ఫ్లూపై భయం వద్దు

వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్‌చందా  
దగ్గు, జలుబు, ఒళ్లునొప్పులుంటే పరీక్షలు చేయించుకోవాలి

 
 సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో స్వైన్‌ఫ్లూ కేసులు, మరణాల సంఖ్య విజృంభిస్తుండటంపట్ల ప్రజలు భయపడనక్కర్లేదని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ చందా సూచించారు. బుధవారం ఆయన సచివాలయంలో విలేకరులతో ప్రత్యేకంగా ఈ అంశంపై మాట్లాడుతూ కేవలం స్వైన్‌ఫ్లూ కారణంగానే మరణాలు సంభవించవని... ఇతరత్రా వ్యాధులున్నవారే వైరస్‌బారినపడి మృతిచెందిన సంఘటనలు ఉన్నాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి లక్ష స్వైన్‌ఫ్లూ కేసుల్లో మరణాల సంఖ్య 20లోపే ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల్లో వెల్లడైందన్నారు. శీతాకాలంలో ఫ్లూ సాధారణమైనదేనని...అయితే సాధారణ ఫ్లూలో ఉన్నట్లే స్వైన్‌ఫ్లూలోనూ దాదాపు అవే లక్షణాలు ఉంటాయని దగ్గు, జలుబు, తలనొప్పి, ఒళ్లు నొప్పులుంటే ఆసుపత్రికి వచ్చి పరీక్షలు చేయించుకోవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో నిర్లక్ష్యం చేయరాదన్నారు. హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెన్టివ్ మెడిసిన్ (ఐపీఎం)లో ఆదివారం సహా ఎల్లవేళలా పరీక్షలు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఇతరులకు వైరస్ సోకకుండా ఉండేందుకు స్వైన్‌ఫ్లూ రోగులు మాస్కులు వేసుకోవాలన్నారు. చేతులు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.
 
  స్వైన్‌ఫ్లూ ఉన్నవారిని ప్రత్యేక వార్డుల్లో ఉంచి సాధారణ చికిత్స అందిస్తున్నామన్నారు. మూడు, నాలుగు రోజుల్లో స్వైన్‌ఫ్లూ నయం అవుతుందన్నారు. రోగనిరోధకశక్తి తక్కువగా ఉండేవారు వైరస్‌బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని సురేష్ చందా సూచించారు. అయితే స్వైన్‌ఫ్లూ రాకుండా వ్యాక్సిన్ వేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. స్వైన్‌ఫ్లూ వస్తే వారికి చికిత్స చేసేందుకు గాంధీ, ఉస్మానియా, ఛాతీ ఆసుపత్రుల్లో అవసరమైన ప్రత్యేక వార్డులు ఉన్నాయని చెప్పారు. ప్రైవేటు ఆసుపత్రులకు స్వైన్‌ఫ్లూ అనుమానిత కేసులు వస్తే తమ వద్దకే పంపాలని ఆయన ఆదేశించారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ డెరైక్టర్ సాంబశివరావు మాట్లాడుతూ ఆరేళ్ల లోపు, 65 ఏళ్లు పైబడినవారు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
 
 ‘కేర్’లో స్వైన్ ఫ్లూ వ్యాక్సినేషన్ సెంటర్
 స్వైన్ ఫ్లూ వ్యాక్సినేషన్ సెంటర్‌ను కేర్ ఆసుపత్రి యాజమాన్యం బుధవారం హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్-10 లోని తన అవుట్ పేషెంట్ విభాగంలో ఏర్పాటు చేసింది. స్వైన్ ఫ్లూ తెలంగాణ రాష్ట్ర  సమన్వయకర్త డాక్టర్ శుభాకర్ దీన్ని ప్రారంభించారు. ఈ వ్యాక్సినేషన్ సెంటర్ ప్రజలకు అన్నివేళలా అందుబాటులో ఉంటుందని ఆసుపత్రి డాక్టర్ టీఎల్‌ఎన్.స్వామి తెలిపారు.
 
 నగరంలో మరో ఆరు స్వైన్‌ఫ్లూ కేసులు
 హైదరాబాద్‌లో స్వైన్‌ఫ్లూ చాప కింది నీరులా విస్తరిస్తోంది. బుధవారం మరో నలుగురికి స్వైన్ ఫ్లూ ఉన్నట్లు తేలింది. వీరిలో నారాయణ గూడకు చెందిన వ్యక్తి(50) ఆదిత్య ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, బంజారాహిల్స్‌కు చెందిన మిహ ళ (54) స్టార్ ఆస్పత్రిలో చేరింది. ఘట్‌కేసర్‌లోని వేర్వేరు కుటుంబాలకు చెందిన ఇద్దరు చిన్నారులు చలి జ్వరంతో మంగళవారం గాంధీ ఆస్పత్రిలో చేరారు.
 
  వీరి రక్తపు నమూనాలు సేకరించి నిర్ధారణ కోసం ఐపీఎంకు పంపగా, వీరిద్దరికీ హెచ్- 1ఎన్1 పాజిటివ్ వచ్చింది. దీంతో చిన్నారులను గాంధీ చిన్నపిల్లల విభాగంలోని ప్రత్యేక వార్డుకు తరలించి వైద్యసేవలు అందిస్తున్నారు. ఇప్పటికే ఫ్లూతో బాధపడుతూ ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న గర్భిణీ సౌజన్య కోలుకుంటుందని, స్వైన్‌ఫ్లూ మందులు అందుబాటులో ఉన్నాయని ఆస్పత్రి అధికారులు తెలిపారు. కాగా, మరో ఇద్దరు ఇదే లక్షణాలతో బాధపడుతూ బుధవారం ఉస్మానియా ఆస్పత్రిలో చేరినట్లు తెలిసింది. వీరి నుంచి రక్త నమూనాలు సేకరించి నిర్ధారణ కోసం ఐపీఎంకు పంపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement