Suresh Chanda
-
రాష్ట్ర చేపగా కొరమీను
-
రాష్ట్ర చేపగా కొరమీను
- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: ‘కొరమీను’ను రాష్ట్ర చేపగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అధికారిక చేపగా కొరమీనుకు గుర్తింపునిచ్చింది. దీన్నే మరేల్ లేదా మురేల్ ఫిష్‌గా పిలుస్తారు. మత్స్యశాఖ పంపిన ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం కొరమీనును అధికారిక చేపగా ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు మత్స్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ చందా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కొరమీను శాస్త్రీయ నామం చన్నా స్ట్రయేటస్. ప్రతి రాష్ట్రానికి ఆ రాష్ట్ర చేపగా ఒక రకాన్ని గుర్తిస్తారు. అలా గుర్తించిన చేపలను కాపాడుకోవడమే కాకుండా వాటి సంతతి అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది. ఆ చేప జన్యువును లక్నోలోని నేషనల్ బ్యూరో ఆఫ్ ఫిష్ జెనెటిక్ రిసోర్సెస్‌లో భద్రపరుస్తారు. రాష్ట్రంలో లభించే వివిధ రకాల చేపల్లో కొరమీనుకు అత్యంత ప్రాధాన్యముంది. చేపల పులుసులో కొరమీను రుచికి మించింది లేదు. అందుకే పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా ఈ చేపలకు డిమాండ్ ఎక్కువ. డిమాండ్ ఎక్కువగా ఉండటంతో రేటు కూడా ఎక్కువే. రాష్ట్రంలో మత్స్యకారులకు లాభాల పంట పండించే చేపగా కొరమీను అందరికీ సుపరిచితమే. -
జర్నలిస్టులందరికీ ఆరోగ్య పథకం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టులు, పదవీ విరమణ జర్నలిస్టులందరికీ ఆరోగ్య పథకాన్ని అమలుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్‌చందా బుధవారం మార్గదర్శకాలు విడుదల చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే నిర్దేశిత జాబితాలోని నెట్వర్క్ ఆసుపత్రులన్నింటిలో ఇన్‌పేషెంట్ వైద్యసేవలు పొందొచ్చు. ఈ పథకాన్ని ‘వర్కింగ్, రిటైర్డ్ జర్నలిస్టుల ఆరోగ్య పథకం’గా పరిగణిస్తారని ప్రభుత్వం పేర్కొంది. జాబితాలో పేర్కొన్న వ్యాధులన్నింటికీ ఏమాత్రం ఆర్థిక పరిమితి లేకుండా నగదురహిత చికిత్సలు పొందొచ్చు. జర్నలిస్టుల నుంచి ఒక్కపైసా తీసుకోకుండా ఈ పథకాన్ని వర్తింపచేస్తారని సర్కారు స్పష్టంచేసింది. తెల్లరేషన్‌కార్డున్న జర్నలిస్టులు ఆరోగ్యశ్రీ పథకంలోనైనా ఉండొచ్చు... లేదా జర్నలిస్టుల ఆరోగ్యపథకంలోనైనా చేరొచ్చు. అయితే రెండింటిలో ఉండటాన్ని అనుమతించరు. మార్గదర్శకాలు ఇవే... * జర్నలిస్టులపై ఆధారపడిన తల్లిదండ్రులకూ ఈ పథకం వర్తిస్తుంది. దత్తత పిల్లలకు, నిరుద్యోగ కూతుళ్లు, పెళ్లికాని వారు లేదా వితంతువులు లేదా విడాకులు తీసుకున్నవారికీ, అలాగే 25 ఏళ్లలోపున్న నిరుద్యోగ కుమారులకూ వర్తిస్తుంది. * వైద్య, సర్జిక ల్ చికిత్సలకు ఇన్‌పేషెంట్ వైద్యం పొందొచ్చు. చికిత్స పూర్తయ్యే వరకు నగదురహిత చికిత్సలు పొందొచ్చు. వైద్య పరీక్షలు, మందులు, డిశ్చార్జ్ అయ్యాక పది రోజుల వరకు మందులు తదితర సదుపాయాలు వర్తిస్తాయి. * నిర్దేశిత ప్యా కేజీ మేరకు ఏడాదిపాటు కన్సల్టేషన్, ఫాలోఅప్ వైద్య సేవలు వంటివి కూడా పొందొచ్చు. * దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఔట్‌పేషెంట్ వైద్య సేవలు అందుతాయి. దానికి ప్రత్యేకంగా మార్గదర్శకాలు విడుదల చేస్తారు. * ఆరోగ్యశ్రీ ట్రస్టు కింద ఉన్న నెట్వర్క్ ఆసుపత్రులన్నీ జర్నలిస్టులకు వైద్య సేవలు అందిస్తాయి. * ప్యాకేజీ ప్రకారం ఆసుపత్రులకు బిల్లులు చెల్లిస్తారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం ప్రకారమే ఇస్తారు. * జర్నలిస్టుల ఆరోగ్య పథకాన్ని ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్టు అమలు చేస్తుంది. సమాచార పౌరసంబంధాలశాఖ నోడల్ ఏజెన్సీగా ఉంటుంది. ఆరోగ్య పథకం కిందికి వచ్చే జర్నలిస్టుల వివరాలన్నింటినీ ఈ శాఖే ఆరోగ్యశ్రీకి అందజేస్తుంది. అనంతరం అక్కడి నుంచే జర్నలిస్టుల ఆరోగ్యకార్డులు జారీ చేస్తారు. కార్డులను ఆరోగ్యశ్రీ ట్రస్టు వెబ్సైట్ నుంచి పొందొచ్చు. ఆధార్ నంబర్ లేదా ఆధార్ ఎన్రోల్మెంట్ నంబరే జర్నలిస్టుల ఆరోగ్య పథకం గుర్తింపు నంబర్‌గా పరిగణిస్తారు. * ఆరు నెలల తర్వాత పథకం అమలుతీరును ప్రభుత్వం సమీక్షిస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రులు ఈ పథకం కింద 60 శాతం మేరకు సేవలు అందించాయా లేదా అన్నదీ సమీక్షిస్తారు. అయితే ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్య సేవలు అని చెబుతున్న ప్రభుత్వం ఈ ‘60 శాతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు’ అనే విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించడం గమనార్హం. -
అంతా మీ కళ్ల ముందే..!
పారదర్శకతకు పెద్దపీట వేసిన వైద్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్‌చందా తన చాంబర్లో సీసీ కెమెరా ఏర్పాటు.. ఇంటర్నెట్తో అనుసంధానం ఎవరిని కలిసినా, ఏం మాట్లాడినా అంతా నిక్షిప్తం ఇంటర్నెట్ ద్వారా ఎక్కడినుంచైనా గమనించొచ్చు హైదరాబాద్: సురేశ్‌చందా.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి. సచివాలయంలోని ‘డి’ బ్లాక్ రెండో అంతస్తులోని ఆయన చాంబర్లోకి ప్రవేశించగానే కొట్టొచ్చినట్లుగా సీసీ కెమెరా కనిపిస్తుంది. ఆయన వద్దకు ఎవరు వెళ్లినా ఆ కెమెరాలో రికార్డయిపోతుంది. అంతేకాదు ఎప్పుడైనా, ఎవరైనా ఆ కెమెరాలోంచి ఆ చాంబర్‌ను పరిశీలించే ఏర్పాటూ ఉంటుంది. ఇది ప్రభుత్వ ఆదేశాలతో ఏర్పాటు చేసిన కెమెరా కాదు. పాలనలో పారదర్శకత కోసం స్వచ్ఛం దంగా సురేశ్‌చందానే ఆ సీసీ కెమెరాను ఏర్పాటు చేయించుకున్నారు. ఒక సీనియర్ ఐఏఎస్ ఇలా తన చాంబర్లోనే సీసీ కెమెరా ఏర్పాటు చేయించుకోవడం చర్చనీయాంశమైంది. సురేశ్‌చందా దీని గురించి చెబుతూ.. ‘‘కేరళ ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారిలో ఒకరు తన చాంబర్లో ఇలాగే సీసీ కెమెరా ఏర్పాటు చేసుకున్నారు. ఆయనే నాకు ఆదర్శం. అవినీతి అక్రమాల నిరోధానికి పారదర్శకత ప్రాణం వంటిది. ప్రజా వ్యవహారాలకు సంబంధించి ఎవరు వచ్చి ఏం మాట్లాడినా రహస్యమంటూ ఏదీ ఉండకూడదనే ఈ ఏర్పాటు..’’ అని చెప్పడం గమనార్హం. ఆయన చాంబర్‌కు వచ్చే వారందరితోనూ ఆయన జరిపే చర్చలు, సమావేశాలు అన్నీ ఆ కెమెరాలో నిక్షిప్తమై ఉంటాయి. ఎవరైనా చూడొచ్చు.. సురేశ్‌చందా ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరా ఐపీ (ఇంటర్నెట్ ప్రొటోకాల్) అడ్రస్ కలిగి ఇంటర్నెట్తో అనుసంధానమై ఉంటుంది. కెమె రా, సంబంధిత సాఫ్ట్వేర్ ధర దాదాపు రూ.7 వేలు. అన్ని కోణాల్లో తిరిగేలా కెమెరా ఏర్పాటు ఉంటుంది. ఆయన చాంబర్లో ఏం జరుగుతుందనే దానిని ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ కలిగి ఉన్నవారు తమ కంప్యూటర్ లేదా సెల్‌ఫోన్ ద్వారా చూడొచ్చు. 24 గంటల పాటు సీసీ కెమెరా దృశ్యాలను నిల్వచేయడానికి ఒక జీబీ సామర్థ్యం ఉంటే సరిపోతుంది. ‘‘ఎనిమిదేళ్లుగా నేను ఎక్కడ పనిచేసినా ఇటువంటి ఏర్పాటు చేసుకునేవాడిని..’’ అని సురేశ్ చందా చెప్పారు. అంతేకాదు తాను నోట్‌ఫైల్ చేసిన ఫైళ్లను కూడా తక్షణమే ఇంటర్నెట్లో పెడుతుంటారు. ‘‘ఆర్టీఐ చట్టం వచ్చాక ఏదీ రహస్యం కాదు. ఎవరు ఎప్పుడు ఏది అడిగినా నిర్ణీత కాలంలో సమాచారం ఇస్తు న్న నేపథ్యంలో ఎవరూ అడగకుండానే సమాచారం అం దరికీ అందుబాటులో ఉంచ డం మరింత పారదర్శకత అవుతుంది..’’ అని చెబుతున్నారాయన. గాంధీ ఆసుపత్రిలో.. హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలోనూ 200 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు సురేశ్‌చందా రంగం సిద్ధం చేశారు. ఆ ఆసుపత్రిని ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఆయన యోచిస్తున్నారు. పారిశుద్ధ్యం, వైద్యుల రాకపోకలు, వైద్య సేవలు సక్రమంగా అందించడం కోసం రూ.30 లక్షలతో ఐపీ కలిగిన 200 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. వీటికోసం రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల సంస్థ ద్వారా టెండర్లు పిలవాల్సిందిగా ఆదేశించారు కూడా. ‘‘అక్కడికి వెళ్లి రోజూ పర్యవేక్షించడం కష్టం. అదే సీసీ కెమెరాలు ఉంటే సచివాలయంలోని నా కంప్యూటర్, మొబైల్ ద్వారా కూడా పర్యవేక్షించవచ్చు. తద్వార ఆస్పత్రిలో వైద్యసేవలు మరింత మెరుగ్గా అందుతాయి..’’ అని సురేశ్‌చందా పేర్కొన్నారు. ఇలా వైద్య ఆరోగ్య శాఖలోని వివిధ విభాగాల్లోనూ, కోఠిలోని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, వైద్యవిద్యా విభాగం వంటి వాటిల్లోనూ సీసీ కెమెరాలు పెట్టే యోచన కూడా ఉన్నట్లు తెలుస్తోంది. -
‘కమీషన్ల కొనుగోళ్ల’పై నివేదిక ఇవ్వండి
‘సాక్షి’ కథనంపై స్పందించిన వైద్య ఆరోగ్యశాఖ సాక్షి, హైదరాబాద్: ఫార్మసిస్ట్‌లు, మందుల సరఫరాదారుల కుమ్మక్కుపై ప్రభుత్వం స్పందిం చింది. ‘కమీషన్ల కొనుగోళ్లు’ శీర్షికతో గురువారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ కథనానికి స్పందించిన వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ చందా మందుల కొనుగోలుకు సంబంధించి రెండేళ్ల నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దీంతో రెండేళ్లుగా ఏ సరఫరాదారునికి ఎంత మోతాదులో ఆర్డర్ ఇచ్చారు, వాటి రేటు ఎంత అనే వివరాలు సేకరించే పనిలో రాష్ట్ర మౌలిక వైద్యసేవలు, సదుపాయాల సంస్థ సిబ్బంది నిమగ్నమయ్యారు. వీటిని పరిశీలించి అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలిసింది. అయితే అమాక్సిక్ క్లావ్‌లిక్ యాసిడ్ అనే దగ్గు మందును తమిళనాడులో కంటే 100 శాతం ఎక్కువ రేటుతో కొనుగోలు చేసినట్టు తేలింది. ఇదిలావుండగా కొద్ది రోజుల్లో 2015-16 సంవత్సరానికి తొలి త్రైమాసికం కొనుగోలు ఆర్డర్లు పెట్టాల్సి ఉంది. అయితే నాలుగేళ్లుగా డెప్యుటేషన్‌పై అక్కడే కొనసాగుతున్న ఫార్మసిస్ట్‌లు కొందరు తొలి త్రైమాసిక ఆర్డర్లు పెట్టేవరకైనా ఇక్కడే ఉండేందుకు యత్నిస్తున్నారు. వారి కోసం కొంతమంది సరఫరాదారులు కూడా పైరవీలు చేస్తున్నట్టు తెలిసింది. సుమారు రూ.40 కోట్లకు ఆర్డర్లు ఉండడంతో భారీగా కమీషన్లు వచ్చే అవకాశం ఉండడంతో వాటిని వదులుకునేందుకు ఎవరూ సిద్ధంగా లేనట్టు తెలుస్తోంది. -
వైద్య అక్రమ బదిలీలపై విచారణ
కమిషనర్‌ను ఆదేశించిన ముఖ్య కార్యదర్శి సురేశ్ చందా సాక్షి, హైదరాబాద్: వైద్య, పారామెడికల్ ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఉన్నా సరెండర్ పేరుతో ట్రాన్స్ఫర్ చేయడంపై వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ చందా విచారణకు ఆదేశించారు. ‘వైద్యశాఖలో అక్రమ బదిలీలు’ శీర్షికన ‘సాక్షి’లో బుధవారం ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. దీనిపై విచారణ చేయాలని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జ్యోతిబుద్ధప్రకాశ్‌ను ఆదేశించినట్లు ఆయన ‘సాక్షి’కి తెలిపారు. ఈ జోన్ పరిధిలో దాదాపు 150 మందిని సరెండర్ చేయించి, వారి నుంచి డబ్బులు తీసుకొని ఇష్టమైన చోటుకు బదిలీలు చేశారు. అలాగే నల్లగొండ జిల్లాలో 50 మందిని అక్రమంగా డిప్యుటేషన్‌పై పంపారు. ఈ విషయంలో లక్షల రూపాయలు చేతులు మారాయి. -
స్వైన్‌ఫ్లూపై భయం వద్దు
వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్‌చందా దగ్గు, జలుబు, ఒళ్లునొప్పులుంటే పరీక్షలు చేయించుకోవాలి సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో స్వైన్‌ఫ్లూ కేసులు, మరణాల సంఖ్య విజృంభిస్తుండటంపట్ల ప్రజలు భయపడనక్కర్లేదని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ చందా సూచించారు. బుధవారం ఆయన సచివాలయంలో విలేకరులతో ప్రత్యేకంగా ఈ అంశంపై మాట్లాడుతూ కేవలం స్వైన్‌ఫ్లూ కారణంగానే మరణాలు సంభవించవని... ఇతరత్రా వ్యాధులున్నవారే వైరస్‌బారినపడి మృతిచెందిన సంఘటనలు ఉన్నాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి లక్ష స్వైన్‌ఫ్లూ కేసుల్లో మరణాల సంఖ్య 20లోపే ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల్లో వెల్లడైందన్నారు. శీతాకాలంలో ఫ్లూ సాధారణమైనదేనని...అయితే సాధారణ ఫ్లూలో ఉన్నట్లే స్వైన్‌ఫ్లూలోనూ దాదాపు అవే లక్షణాలు ఉంటాయని దగ్గు, జలుబు, తలనొప్పి, ఒళ్లు నొప్పులుంటే ఆసుపత్రికి వచ్చి పరీక్షలు చేయించుకోవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో నిర్లక్ష్యం చేయరాదన్నారు. హైదరాబాద్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెన్టివ్ మెడిసిన్ (ఐపీఎం)లో ఆదివారం సహా ఎల్లవేళలా పరీక్షలు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఇతరులకు వైరస్ సోకకుండా ఉండేందుకు స్వైన్‌ఫ్లూ రోగులు మాస్కులు వేసుకోవాలన్నారు. చేతులు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. స్వైన్‌ఫ్లూ ఉన్నవారిని ప్రత్యేక వార్డుల్లో ఉంచి సాధారణ చికిత్స అందిస్తున్నామన్నారు. మూడు, నాలుగు రోజుల్లో స్వైన్‌ఫ్లూ నయం అవుతుందన్నారు. రోగనిరోధకశక్తి తక్కువగా ఉండేవారు వైరస్‌బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని సురేష్ చందా సూచించారు. అయితే స్వైన్‌ఫ్లూ రాకుండా వ్యాక్సిన్ వేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. స్వైన్‌ఫ్లూ వస్తే వారికి చికిత్స చేసేందుకు గాంధీ, ఉస్మానియా, ఛాతీ ఆసుపత్రుల్లో అవసరమైన ప్రత్యేక వార్డులు ఉన్నాయని చెప్పారు. ప్రైవేటు ఆసుపత్రులకు స్వైన్‌ఫ్లూ అనుమానిత కేసులు వస్తే తమ వద్దకే పంపాలని ఆయన ఆదేశించారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ డెరైక్టర్ సాంబశివరావు మాట్లాడుతూ ఆరేళ్ల లోపు, 65 ఏళ్లు పైబడినవారు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ‘కేర్’లో స్వైన్ ఫ్లూ వ్యాక్సినేషన్ సెంటర్ స్వైన్ ఫ్లూ వ్యాక్సినేషన్ సెంటర్‌ను కేర్ ఆసుపత్రి యాజమాన్యం బుధవారం హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్-10 లోని తన అవుట్ పేషెంట్ విభాగంలో ఏర్పాటు చేసింది. స్వైన్ ఫ్లూ తెలంగాణ రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్ శుభాకర్ దీన్ని ప్రారంభించారు. ఈ వ్యాక్సినేషన్ సెంటర్ ప్రజలకు అన్నివేళలా అందుబాటులో ఉంటుందని ఆసుపత్రి డాక్టర్ టీఎల్ఎన్.స్వామి తెలిపారు. నగరంలో మరో ఆరు స్వైన్‌ఫ్లూ కేసులు హైదరాబాద్‌లో స్వైన్‌ఫ్లూ చాప కింది నీరులా విస్తరిస్తోంది. బుధవారం మరో నలుగురికి స్వైన్ ఫ్లూ ఉన్నట్లు తేలింది. వీరిలో నారాయణ గూడకు చెందిన వ్యక్తి(50) ఆదిత్య ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, బంజారాహిల్స్‌కు చెందిన మిహ ళ (54) స్టార్ ఆస్పత్రిలో చేరింది. ఘట్కేసర్లోని వేర్వేరు కుటుంబాలకు చెందిన ఇద్దరు చిన్నారులు చలి జ్వరంతో మంగళవారం గాంధీ ఆస్పత్రిలో చేరారు. వీరి రక్తపు నమూనాలు సేకరించి నిర్ధారణ కోసం ఐపీఎంకు పంపగా, వీరిద్దరికీ హెచ్- 1ఎన్1 పాజిటివ్ వచ్చింది. దీంతో చిన్నారులను గాంధీ చిన్నపిల్లల విభాగంలోని ప్రత్యేక వార్డుకు తరలించి వైద్యసేవలు అందిస్తున్నారు. ఇప్పటికే ఫ్లూతో బాధపడుతూ ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న గర్భిణీ సౌజన్య కోలుకుంటుందని, స్వైన్‌ఫ్లూ మందులు అందుబాటులో ఉన్నాయని ఆస్పత్రి అధికారులు తెలిపారు. కాగా, మరో ఇద్దరు ఇదే లక్షణాలతో బాధపడుతూ బుధవారం ఉస్మానియా ఆస్పత్రిలో చేరినట్లు తెలిసింది. వీరి నుంచి రక్త నమూనాలు సేకరించి నిర్ధారణ కోసం ఐపీఎంకు పంపారు. -
ఇది.. మరచిపోలేని రోజు
కేసీఆర్ ఆశీస్సులతో హెల్త్ యూనివర్సిటీ మంజూరు ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య కేఎంసీలో కాళోజీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సెన్సైస్ కార్యాలయం ప్రారంభం వీసీగా బాధ్యతలు స్వీకరించిన సురేష్‌చందా పోచమ్మమైదాన్ : తన హయూంలో వరంగల్‌కు హెల్త్ యూనివర్సిటీ మంజూరు కావడం మరచిపోలేనని, తన జీవితంలో ఇంతకంటే సంతోషమైన రోజు ఎన్నడూ లేదని డిప్యూటీ సీఎం, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ)లో శనివారం కాళోజీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సెన్సైస్ కార్యాలయూన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ పుట్టిన గడ్డకు, చదివిన కళాశాలకు ఏదో ఒకటి చేయాలనే పట్టుదలతో ముందుకు సాగి... కేసీఆర్‌ను మెప్పించి వరంగల్‌కు హెల్త్ యూనివర్సిటీని మంజూరు చేయించుకోగలిగామన్నారు. హెల్త్ యూనివర్సీటీకి కాళోజీ పేరు పెట్టడం సైతం చాలా సంతోషించదగ్గ విషయమన్నారు. యూనివర్సిటీ అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా కృషిచేద్దామని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ అశీస్సులతో వరంగల్‌కు హెల్త్ యూనివర్సిటీ వచ్చిందంటూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. మన రాజ్యం ఇది ..... మనం అనుకున్నది సాధించకున్నామని, ప్రతిఒక్కరూ సమయపాలన పాటించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని సూచించారు. ఆరోగ్య సేవలను విస్తరించే దిశగా ముందుకు సాగుదామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 30వ తేదీ లోపు హెల్త్ యూనివర్సిటీ వస్తే... మన విద్యార్థులు ఇక్కడే నమోదు చేసుకోవచ్చనే ఉద్దేశంతో కేసీఆర్ ఇంత వేగంగా నిర్ణయం తీసుకున్నారని వివరించారు. మహబూబాబాద్ ఎంపీ అజ్మీర సీతారాం నాయక్ మాట్లాడుతూ వరంగల్ జిల్లాకు ఒక చరిత్ర ఉందని, అందుకే కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వచ్చిందన్నారు. ఉప ముఖ్యమంత్రి రాజయ్య కృషి చేయడం వల్లే సీఎం కేసీఆర్ మంజూరుచేశారని చెప్పారు. హెల్త్ యూనివర్సిటీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. తెలంగాణ వస్తే ఏం వస్తదో అన్నారు కాదా .... ప్రత్యేక రాష్ట్రం రావడం వల్ల వరంగల్‌కు హెల్త్ యూనివర్సిటీ వచ్చిందన్నారు. మన ఆత్మగౌరవం మనకు దక్కింది... మన ఇంటిని మనం పాలించుకునే అవకాశం దక్కిందన్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన విద్యార్థులు ఇతర ప్రాంతాల్లో పీజీ చేసిన తర్వాత వారు గ్రామీణ ప్రాంతాల్లో పని చేయాల్సి ఉంటుందని... ఏపీలో మన తెలంగాణ వారు నాన్‌లోకల్ అవుతున్నారని... ఈ సమస్యను తేల్చాలని సీతారాం నాయక్ కోరారు. వెంటనే డీఎంఈ శ్రీనివాస్ స్పందించి అక్కడ చదివిన విద్యార్థులు ఎన్ఓసీ అందజేస్తే... వెంటనే ఇక్కడ ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో పని చేసేలా ఆర్డర్లు అందజేస్తామన్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ వరంగల్ జిల్లాకు హెల్త్ యూనివర్సిటీ మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఉపముఖ్యమంత్రి రాజయ్య కృషి, పట్టుదలతో వరంగల్‌కు హెల్త్ యూనివర్సిటీ వచ్చిందన్నారు. వరంగల్ జిల్లా అభివృద్ధికి మేధావులు, నిపుణులు సలహాలు ఇవ్వాలని, వాటిని కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి అమలయ్యేలా చూస్తామని పేర్కొన్నారు. కార్యక్రమానికి ముందు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వీసీగా బాధ్యతలు స్వీకరించిన సురేష్ చందాకు ఉప ముఖ్యమంత్రి రాజయ్య, ఎంపీ సీతారాం నాయక్, ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో డెరైక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ సాంబశివరావు, కేఎంసీ ప్రిన్సిపాల్ రమేష్ కుమార్, ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ మనోహర్, ఐఎంఏ ప్రతినిధులు పెసరు విజయచందర్ రెడ్డి, భూమిగారి మోహన్ రావు, ఇన్చార్జ్ డీఎంహెచ్ఓ శ్రీరామ్, డీఐఓ సూర్యప్రకాష్, ఐ ఆస్పత్రి సూపరింటెండెంట్ పాండురంగ జాదవ్, హాస్టల్ వార్డెన్ సీతామహాలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే దోనెపూడి రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. -
పోలీసులకు ‘ఆరోగ్య భద్రత’ యథాతథం
సాక్షి, హైదరాబాద్: పోలీసులు, వారి కుటుంబ సభ్యులకు అమలవుతున్న ఆరోగ్య భద్రత పథకాన్ని యథాతథంగా కొనసాగించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వైద్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ చందా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం రూపొందించిన జాబితాలో పేర్కొన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో పోలీసులు, వారి కుటుంబ సభ్యులు చికిత్స పొందవచ్చునని తెలిపారు. చికిత్స పొందిన పోలీసులు ‘ఆరోగ్య భద్రత’ కార్యదర్శి ఆమోదంతో వైద్య బిల్లులను వైద్య విద్య డెరైక్టర్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుని మెడికల్ రీయింబర్స్మెంట్ పొందవచ్చునని సూచించారు. దీనిపై తెలంగాణ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు గోపిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. -
ఏకపక్ష ధోరణి తగదు
* పీపీఏల రద్దుపై ఏపీని తప్పుపట్టిన సీఈఏ * 65 మెగావాట్లు అదనంగా పొందనున్న ఏపీ సాక్షి, న్యూఢిల్లీ: విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను ఏకపక్షంగా రద్దు చేసుకోవడంపై కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ (సీఈఏ) ఉన్నతస్థాయి కమిటీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని తప్పుబట్టింది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం రూపొందిన తీరు వల్లే ఈ సమస్య వచ్చిందని వ్యాఖ్యానించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య ఉత్పన్నమవుతున్న విద్యుత్ వివాదాలు, సమస్యలను పరిష్కరించేందుకు సీఈఏ ఈ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సీఈఏ చైర్మన్ నీరజా మాథుర్ నేతృత్వంలో ఈ నెల 1న ఆరుగురు సభ్యులతో ఏర్పాటైన ఈ కమిటీ ఆగస్టు 1లోగా తమ నివేదికను సమర్పించాల్సి ఉంది. ఈ కమిటీ తొలి సమావేశం సోమవారం ఢిల్లీలో జరిగింది. దీనికి కమిటీ చైర్మన్, సభ్యులతో పాటు తెలంగాణ ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ చందా, ఏపీ ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా... విభజన చట్టం గందరగోళంగా ఉందని, సమస్య అంతా చట్టంలోని అంశాల వల్లే వచ్చిందని కమిటీ అభిప్రాయపడింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు(పీపీఏ)లను ఏకపక్షంగా రద్దు చే సుకోవడంపై ఏపీ రాష్ట్రాన్ని తప్పుపట్టింది. అలాగే పీపీఏల కోసం డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు 2009, 2010లో చేసుకున్న దరఖాస్తులను పరిష్కరించకుండా అప్పటి ఏపీఈఆర్సీ వ్యవహరించిన తీరు సరిగా లేదని అభిప్రాయపడింది. ఈ సమావేశానికి ఏపీఈఆర్సీ సభ్యుడిని పిలిచినా రానందుకు ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా పీపీఏలను రద్దు చేయడం కుదరదని తెలంగాణ వాదించగా.. రద్దు చేయాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ పేర్కొంది. అయితే పీపీఏల రద్దు పద్ధతి ప్రకారం జరగాలని కమిటీ పేర్కొంది. కాగా, కేంద్ర విద్యుత్తు ప్రాజెక్టుల (సీజీఎస్) ద్వారా సరఫరా అయ్యే విద్యుత్ విషయంలో మాత్రం రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. ఆ విద్యుత్‌లో తమకు అన్యాయం జరిగిందని.. ఆంధ్రప్రదేశ్ వివరించింది. దీనిని తెలంగాణ అంగీకరించడంతో ఏపీకి సీజీఎస్ వాటా 1.77 శాతం పెంచాలని నిర్ణరుుంచారు. దీంతో ఏపీకి 65 మెగావాట్ల మేరకు అదనంగా విద్యుత్ లభించనుంది. -
విద్యుత్ సౌధలో ఉద్యోగుల ఆందోళన
హైదరాబాద్: వేతన సవరణ చేయడానికి ప్రభుత్వం అంగీకరించనందుకు నిరసనగా విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు విద్యుత్ సౌధలో విద్యుత్ ఉద్యోగుల ఆందోళన చేపట్టారు. సమస్యల పరిష్కారానికి యాజమాన్యాలు సానుకూలంగా స్పందించడం లేదని ఉద్యోగులు ఆరోపించారు. ఉద్యోగులు ఆందోళన చేపట్టడంతో యాజమాన్యాల చర్చలు ప్రారంభించారు. ఉద్యోగ సంఘ నాయకులు,. యాజమాన్యాల మధ్య చర్చలకు జెన్కో ఎండీ విజయానంద్, ట్రాన్స్ కో సీఎండీ సురేష్ చందా హాజరయ్యారు. విద్యుత్ సమ్మె సోమవారం కూడా కొనసాగితే ఎన్టీటీపీఎస్ పూర్తిగా మూతపడే అవకాశాలు ఉన్నాయని ఇంజినీర్లు ఆందోళన చెందుతున్నారు. -
చార్జీల పెంపు తప్పదు: ట్రాన్స్‌కో
సాక్షి, హైదరాబాద్: ఆదాయాన్ని మించి వ్యయమవుతోందని, విద్యుత్ చార్జీలను పెంచక తప్పదని ట్రాన్స్‌కో స్పష్టం చేసింది. మౌలిక సదుపాయాల కల్పన వ్యయంలో పెరుగుదల, 2014 ఏప్రిల్ 1 నుంచి వేతన సవరణ చేపట్టాల్సి ఉండటం, పెరిగిన నిర్వహణ ఖర్చులను కారణంగా చూపుతూ.. చార్జీల పెంపు ప్రతిపాదనలను ట్రాన్స్‌కో సీఎండీ సురేష్ చందా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ముందుంచారు. 2014-19 వరకు బహుళ సంవత్సర టారిఫ్‌లో భాగంగా విద్యుత్‌సరఫరా, రాష్ట్ర లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్ఎల్డీసీ) నిర్వహణపై ట్రాన్స్‌కో సమర్పించిన ప్రతిపాదనలపై ఈఆర్సీ మంగళవారం బహిరంగ విచారణను చేపట్టింది. ట్రాన్స్‌కో వాదనను విచారణలో పాల్గొన్న విద్యుత్ రంగ నిపుణులు, రాజకీయ నేతలు, పరిశ్రమల ప్రతినిధులు తీవ్రంగా వ్యతిరేకించారు. వారి వాదనలు.. - ‘రాష్ట్ర విభజన ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్రం కలిసి ఉంటుందా? విడిపోతుందా? తెలియని పరిస్థితి. రాష్ట్రం కలిసి ఉంటుందనే ఆలోచనతో విచారణ జరుపుతున్నారు. విభజన జరిగితే ఎలా అనేది కూడా ఆలోచించాలి. ఇవి 5 సంవత్సరాల చార్జీల ప్రతిపాదనలు కాబట్టి వీటిపై విచారణ ఇప్పుడు వద్దు. ప్రతీ ఏటా డిస్కంలలాగా ట్రాన్స్‌కో కూడా ప్రతిపాదనలు ఇవ్వాలి. విద్యుత్ సరఫరా నష్టాలు 2009-10లో 4.2 శాతమని పేర్కొన్న ట్రాన్స్‌కో 2013-14 నాటికి 3.89 తగ్గిస్తామంది. అయితే, 2014-15లో సరఫరా నష్టాలు 4.15 శాతం ఉంటాయని ఇప్పుడంటోంది. సరఫరా నష్టాలను తగ్గించడంలో ట్రాన్స్‌కో విఫలమైనట్టు దీంతో స్పష్టమౌతోంది’ - విద్యుత్‌రంగ నిపుణుడు వేణుగోపాల్‌రావు - ‘ఈ ప్రతిపాదనలపై ఐదేళ్ల వరకు కాకుండా... విభజన జరిగే వరకూ అనే షరతుతో విచారణ జరపాలి’ - న్యూ డెమోక్రసీ నేత గాదె దివాకర్ - ‘ట్రాన్స్‌కో ప్రతిపాదనల్లో అవకతవకలు కనిపిస్తున్నాయి. ఆడిట్ అకౌంట్లను ప్రజలకు అందుబాటులో ఉంచాలి’ - ఫ్యాప్సీ ప్రతినిధి అనిల్ రెడ్డి - ‘ట్రాన్స్‌కో ప్రతిపాదనలపై డిస్కంలు ఎందుకు అభ్యంతరం చెప్పడం లేదు. ట్రాన్స్‌కో, డిస్కంలు కుమ్మక్కయ్యాయా? సబ్ స్టేషన్లు, విద్యుత్ లైన్ల నిర్మాణంలో పారదర్శకత పాటించడం లేదు’ - విద్యుత్ రంగ నిపుణుడు తిమ్మారెడ్డి